
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి..
● వైభవంగా రత్నగిరి రాములోరి కల్యాణం
● పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన సత్యదేవుడు, అమ్మవారు
అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకునిగా పూజలందుకుంటున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదివారం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు తిలకిస్తుండగా.. రత్నగిరిపై రామాలయం పక్కన వార్షిక కల్యాణ వేదిక మీద.. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకూ ఈ క్రతువును కన్నుల పండువగా దేవస్థానం అర్చకులు నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని తెల్లవారుజామున 4 గంటలకు పండితులు సీతారాములకు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. వధూవరులైన సీతారాములను ఉదయం 7 గంటలకు వెండి ఆంజనేయ వాహనంపై, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి పల్లకీపై గ్రామంలో ఘనంగా ఊరేగించారు. అనంతరం సీతారాములను, సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా రత్నగిరిపై కల్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదిక మీద ప్రత్యేక సింహాసనంపై సీతారాములను వేద మంత్రోచ్చారణల నడుమ పండితులు వేంచేయించారు. పక్కనే మరో ప్రత్యేక ఆసనంపై సత్యదేవుడు, అమ్మవార్లను వేంచేయించారు. ఉదయం 9.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో సీతారాముల కల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టారు. సీతారాములకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు పట్టువస్త్రాలు, మంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల వంశీకుల విశేషాలతో కూడిన ప్రవరను కల్యాణబ్రహ్మ చామర్తి వేంకటరెడ్డి పంతులు (కన్నబాబు) వివరించారు. అనంతరం పుణ్యాహవాచనం, యజ్ఞోపవీతధారణ, మహాసంకల్పం, యుగఛిత్రాభిషేకం తదితర కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. ఉదయం 11 గంటల సుముహూర్తంలో సీతారాముల శిరస్సులపై అర్చక స్వాములు జీలకర్ర – బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం మాంగల్యసూత్రధారణ, తలంబ్రాల ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామాలయంలోని సీతారాముల మూలవిరాట్టులకు కూడా అర్చకులు తలంబ్రాలు పోశారు. నూతన దంపతులైన సీతారాములకు పండితులు వేదాశీస్సులు అందజేశారు. సీతారాములకు నివేదించిన పానకం, వడపప్పు ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. రాత్రి నవ వధూవరులు సీతారాములకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించారు. కల్యాణోత్సవాన్ని దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యశర్మ, రామాలయం అర్చకులు దేవులపల్లి ప్రసాద్, చిట్టిం వాసు, అర్చకులు దత్తు శర్మ, సుధీర్, పవన్, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్ తదితరులు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓ కొండలరావు పర్యవేక్షించారు. సీతారాముల కల్యాణానంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని అదే వేదికపై మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు స్వామివారి నిత్యకల్యాణ మండపంలో నిర్వహిస్తారు. దీనికి సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అయితే శ్రీరామనవమి నాడు మాత్రం తొలుత సీతారాముల కల్యాణం జరుగుతుంది.

మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి..