గడ్డికి గడ్డుకాలం..! | - | Sakshi
Sakshi News home page

గడ్డికి గడ్డుకాలం..!

Apr 5 2025 12:21 AM | Updated on Apr 5 2025 12:21 AM

గడ్డి

గడ్డికి గడ్డుకాలం..!

పిఠాపురం: ఎండాకాలం వచ్చిదంటే పచ్చిగడ్డి మచ్చుకై నా కనిపించదు. వేసవిలో పశుపోషణ అంతా ఎండుగడ్డి పైనే ఆధారపడి ఉంటుంది. గతంలో ఎండు వరి గడ్డికి లోటు ఉండేది కాదు. కానీ కొన్నేళ్లుగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో ఎండుగడ్డికి తీవ్ర కొరత ఏర్పడుతోంది. దీంతో మూగజీవాలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిని అధిగమించే దిశగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. ఫలితంగా పాడి పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యంత్ర కోతలతో..

కొన్నేళ్లుగా కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు యంత్రాలతో వరి కోతలపై మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు వాతావరణంలో తరచుగా వస్తున్న మార్పులతో పంటను హడావుడిగా ఒబ్బిడి చేసుకునేందుకు యంత్రాలతో కోతలకే రైతులు సిద్ధపడుతున్నారు. కూలీలతో పోలిస్తే యంత్రాలతో కోతల వలన ఖర్చు, సమయం ఆదా అవుతోంది. అయితే, కూలీలతో కోతలు కోయిస్తే పశువులకు అవసరమైన ఎండుగడ్డి పెద్ద మొత్తంలో లభిస్తుంది. అదే యంత్రాలతో కోతలు కోస్తున్న పొలాల్లో ఎండుగడ్డి రావడం లేదు. యంత్రంతో కోతల వలన వరి దుబ్బులో సగానికి పైగా నేల మీదే ఉండిపోతుంది. మిగిలిన సగం యంత్రంలో నలిగిపోయి పశువులు తినడానికి పనికి రాకుండా పోతోంది. అక్కడక్కడ యంత్రాలతో కోసిన గడ్డిని సేకరిస్తున్నప్పటికీ డీజిల్‌ వాసన వస్తూండటంతో ఆ గడ్డిని పశువులు తినడం లేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు చాలా మంది పంట పొలాలను రొయ్యలు, చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. పలుచోట్ల పొలాలు రియల్‌ ఎస్టేట్‌ లే అవుట్లుగా మారిపోతున్నాయి. ఈ కారణాల వలన కూడా పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడుతోంది.

పశుగ్రాస పథకాలు దూరం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కనిష్టంగా 25 సెంట్లు, గరిష్టంగా 2.5 ఎకరాల సొంత భూమి కలిగి ఉన్న రైతులకు పశుగ్రాసం పెంపకానికి చేయూతనిచ్చేవారు. సైలేజ్‌ గడ్డి, టీఎంఆర్‌ దాణా, పశుగ్రాసం పెంచడానికి పచ్చిరొట్ట విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీపై అందిచేవారు. దీంతో వేసవిలో పశుగ్రాసానికి కొరత లేకుండా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పశుగ్రాస పథకాలను పక్కన పెట్టేశారు. దీంతో ఈ ఏడాది రబీ కోతలు మొదలైన తొలి దశలోనే పశుగ్రాసం కొరత రైతులను వెంటాడుతోంది.

పెరిగిన ధరలు

కేవలం కూలీలతో కోతలు కోసిన వరి గడ్డి మాత్రమే పశువులకు పనికి వస్తూండటం.. అది అతి తక్కువగా మాత్రమే అందుబాటులో ఉండటంతో గడ్డి ధరలు భారీగా పెరిగాయి. ట్రాక్టర్‌ ఎండుగడ్డి ధర రూ.12 వేల నుంచి రూ.14 వేలు పలుకుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న రైతులు నేరుగా పొలాల్లోనే వరిగడ్డిని కొనుగోలు చేసి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. దీంతో స్థానికంగా గడ్డికి బాగా డిమాండ్‌ పెరిగింది. ఈ పరిస్థితుల్లో పశువులకు మేత దొరకడం కష్టంగా మారిందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పశువులకు ఇక పచ్చగడ్డి కరువే

యంత్రాలతో వరి కోతలు

ఎండు గడ్డి కొరతతో ఇబ్బందులు

పశుగ్రాస పథకాలను మరచిన ప్రభుత్వం

పశుపోషణ భారంగా

మారిందంటున్న పాడి రైతులు

జిల్లాలో పశువుల వివరాలు

ఆవులు 76,502

గేదెలు 2,82,273

గొర్రెలు 1,01,870

మేకలు 1,41,229

పశువులకు అవసరమయ్యే ఎండుగడ్డి

రోజుకు 2 మెట్రిక్‌ టన్నులు

అప్పుడు అమ్మే వాళ్లం.. ఇప్పుడు కొనాల్సి వస్తోంది

యంత్రాలు వచ్చాక పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గతంలో కోతలు కోసి, కుప్పలుగా వేసే వాళ్లం. దాంతో పశుగ్రాసానికి ఇబ్బందులుండేవి కావు. చాలా గడ్డి అందుబాటులో ఉండేది. ఇతర ప్రాంతాల వాళ్లు ఇక్కడకు వచ్చి ఎండుగడ్డి కొనుక్కునే వారు. కానీ, ఇప్పుడు మా సొంత గేదెలకే గడ్డి లేకుండా పోయింది. ఇతర ప్రాంతాల నుంచి గడ్డి కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో పశువులను పెంచడం మోయలేని భారంగా మారింది. అందుకే చాలామంది పశువులను అమ్ముకుంటున్నారు.

– పెద్దింటి రాజు, రాపర్తి, పిఠాపురం మండలం

ఎండుగడ్డి దొరకడం లేదు

వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రస్తుతం అన్నిచోట్లా యంత్రాలతో కోతలు జరుగుతున్నాయి. దీంతో ఎండుగడ్డి దొరకడం కష్టంగా మారింది. గంతలో మనుషులతో కోతలు జరిగేవి. అప్పుడు ఎండుగడ్డి పుష్కలంగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ వెతికినా ఎండుగడ్డి దొరకడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం ఎండలు ముదరడంతో పచ్చిగడ్డి దొరికే పరిస్థితి లేదు. ఎండుగడ్డి దొరకక పశు పోషణ కష్టంగా మారింది.

– చర్మాకుల కృష్ణ, రాపర్తి, పిఠాపురం మండలం

గడ్డికి గడ్డుకాలం..!1
1/4

గడ్డికి గడ్డుకాలం..!

గడ్డికి గడ్డుకాలం..!2
2/4

గడ్డికి గడ్డుకాలం..!

గడ్డికి గడ్డుకాలం..!3
3/4

గడ్డికి గడ్డుకాలం..!

గడ్డికి గడ్డుకాలం..!4
4/4

గడ్డికి గడ్డుకాలం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement