
దీక్ష ముగిసె.. దువా ఫలించె!
● నేడే ఈద్ ఉల్ ఫిత్ర్ ● చంద్ర దర్శనంతో ముగిసిన ఉపవాసాలు ● సోమవారం ఈద్ నమాజ్ ● ఈద్గాలు, మసీదుల్లో భారీ ఏర్పాట్లు ● ధన, ఆరోగ్యాలకు బీమా జకాత్ ● పేదలూ పండగ చేసుకునేందుకు ఫిత్రా
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పవిత్ర రంజాన్ మాసం నేటితో ముగియనుంది. ఆదివారం సాయంత్రం చంద్ర దర్శనంతో ముస్లింలు ఈద్ నమాజ్‌కు సిద్ధమయ్యారు. సోమవారం ఈద్ ఉల్ ఫితర్ పండగ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు(రోజా), ప్రత్యేక తరావీహ్ నమాజ్, సహర్, ఇఫ్తార్లు, ఖురాన్ పఠనం, దానధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముస్లింలు గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చుక్క నీరు తాగకుండా నిష్ఠతో దీక్షలు పాటించారు. చివరకు చంద్ర దర్శనం కావడంతో పండగ చేసుకోనున్నారు.
ఈద్ నమాజ్‌కు సిద్ధం
ఈదుల్ ఫితర్ నమాజ్ కోసం ఏర్పాట్లు చేశౠరు. ఈద్గాలతో పాటు మసీదుల్లో సౌకర్యాలు కల్పించారు. పండగ రోజు ముస్లింలు ఈద్గాలకు వెళ్లి ఈదుల్ ఫితర్ నమాజ్ చేయడం ఆనవాయితీ. నెల రోజుల తమ ప్రార్థనలు ఫలించాలని, సర్వ మానవాళి సంతోషంగా ఉండాలని కోరుతూ అల్లాహ్‌కు దువా చేస్తారు.
– 2.50 శాతం జకాత్
రంజాన్‌లో దాన ధర్మాలకు అధిక ప్రాధాన్యం ఉంది. ధనికులే కాదు.. పేదలు సైతం ఆనందంగా పండగ చేసుకోవాలన్నదే ఈ మాసం ముఖ్యోద్దేశం. మనిషి ఆరోగ్యం, తాను సంపాదించిన ధనంపై అల్లా నిర్దేశించిన బీమాయే జకాత్, ఫిత్రా దానాలు. 52.5 గ్రాముల వెండి, 75 గ్రాముల బంగారం, అంతకు మించి విలువైన ధన/ఆస్తులు కలిగితే జకాత్‌కు అర్హులు. వాటి వెల లెక్కకట్టి 2.5 శాతం పేదలకు జకాత్ రూపేణా కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రంజాన్‌లో ఇస్తే 70 రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుందనేది ముస్లింల విశ్వాసం.
ఫిత్రా ఇవ్వాల్సిందే..
సాధారణ ముస్లిం రంజాన్ సందర్భంగా 2.6 కిలో గ్రాముల గోధుమలు, వరి(ప్రధాన ఆహార ధాన్యం), సమానమైన డబ్బు పేదలకు దానం చేయడమే ఫిత్రా. దీనిని ఆరోగ్య బీమాగా మత పెద్దలు చెబుతారు. పేదరికంతో పండగకు నోచుకోని నిరుపేద ముస్లింలకు ఫిత్రా దానమివ్వాలి. సద్‌ఖా–ఎ–ఫిత్రాతో ఆరోగ్య బీమాను అల్లాహ్ కల్పిస్తారంటారు. సూత్రప్రాయంగా ఈ ఏడాది మత పెద్దలు రూ.150 ఫిత్రా ఇవ్వాలని సూచించారు. దీనికంటే ఎక్కువ ఇవ్వవచ్చు కానీ తగ్గించరాదు. పండగకు కనీసం ఒకరోజు ముందే ఫిత్రా చెల్లిస్తే పేదలు సైతం పండగ చేసుకునే వీలుంటుంది. అప్పడే పుట్టిన బిడ్డ మొదలు.. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరున ఫిత్రా ఇవ్వాలి.
అల్లా ఇంటి ఆతిథ్యం ఎతెకాఫ్
ఎతెకాఫ్ అల్లా ఇంటి (మసీదు) ఆతిథ్యం వంటిది. రంజాన్‌లో దీనికెంతో ప్రాధాన్యం ఉంది. ఊర్లో ఒక్క వ్యక్తి కూడా ఎతెకాఫ్ ఉండకపోతే, ఆ ఊరిపై అల్లా కరుణా కటాక్షాలు ఉండవని పవిత్ర ఖురాన్ బోధిస్తోంది. ఎతెకాఫ్‌ను రంజాన్ చివరి పది రోజుల్లో పాటించాలి. ప్రాపంచిక జీవితానికి దూరంగా, వీలుపడిన రోజులు (కనీసం 24 గంటలు) మసీదులో అల్లా ధాన్యంలో గడపడమే ఎతెకాఫ్. అన్నింటినీ త్యాగం చేసి ఆధ్యాత్మికతతో ఉండే వానిపై అల్లాహ్ అత్యంత కరుణతో మొర ఆలకిస్తారని మౌల్వీలు అంటున్నారు.
రంజాన్ శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రశాంతి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రంజాన్ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో పీజీఆర్‌ఎస్ రద్దు చేసినట్టు ప్రకటించారు.
సర్వం సిద్ధం
ప్రార్థనలకు ముందు మహా ప్రవక్త మొహమ్మద్(స.అ.వ.) సంప్రదాయ ప్రకారం ఖర్జూరం సేవించి, నూతన వస్త్రాలు ధరించి, అత్తరు రాసుసుని నమాజు కోసం ఈద్గాకు చేరుకుంటారు. అక్కడ ఈద్ నమాజ్ చదివి, అనంతరం పరస్పరం ఈద్ ముబరక్ చెప్పుకొంటారు. అల్లాహ్ నామాన్ని స్మరిస్తూ ఇంటి నుంచి ఈద్దాకు వెళ్లి, నమాజ్ పూర్తయ్యాక వేరే మార్గంలో ఇంటికి చేరుతారు. రంజాన్‌లో సేమియా పాయసం ప్రత్యేకం. బంధు మిత్రులకు ఇరుగు పొరుగువారికి సేమియా పాయసమిచ్చి తమ ఆత్మీయతను పంచుకుంటారు. చిన్న పిల్లలకు ఈద్ కానుకలు బహూకరిస్తారు. సోమవారం రాజమహేంద్రవరంలోని అన్ని మసీదులలో ఈదుల్ ఫిత్ర్‌ని జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజేంద్రనగర్‌లోని ఈద్గాలో ఈదుల్ ఫిత్ర్ నమాజును నిర్వహిస్తారు.