
రత్నగిరిపై వింత పాలన
అధికారుల ఆగ్రహం
దేవస్థానంలో నీటి సమస్య పేరుతో ఏసీ గదులు అద్దెకివ్వడాన్ని నిలిపివేశారంటూ భక్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. విజయవాడలో మంగళవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఉన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏసీ గదులు అద్దెకివ్వాలని ఆదేశించారు. ఇదే విషయమై దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ కూడా ఈఓ సుబ్బారావుకు ఫోన్ చేసి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు తెలియజేయకుండా గదులను అద్దెకివ్వడం నిలిపివేయడమేమిటని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉండగా, కలెక్టర్ల సదస్సు ముగిసిన వెంటనే కలెక్టర్ షణ్మోహన్ గురువారం అన్నవరం దేవస్థానానికి వచ్చే అవకాశం ఉంది. ఏసీ గదులు అద్దెకివ్వకపోవడంతో ఏర్పడిన వివాదంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. పైగా కలెక్టర్ చెప్పినందు వల్లనే గదులు అద్దెకు ఇవ్వడం లేదని అధికారులు చెబుతూండటంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
అన్నవరం: బోడిగుండుకు మోకాలుకు ముడి వేయడమనే సామెత వినే ఉంటారు. అదే చందంగా అన్నవరం దేవస్థానం అధికారులు తీసుకుంటున్న వింత నిర్ణయాలు దేవస్థానం ప్రతిష్టను మరింత మసకబారేలా చేస్తున్నాయి. తాజాగా అధికారులు తీసుకున్న ఓ నిర్ణయం అటు భక్తులను ఇబ్బందులకు గురి చేయగా.. ఇటు దేవస్థానానికి ఆర్థికంగా నష్టాన్ని తీసుకువచ్చాయి.
ఏం జరిగిందంటే..
అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానానికి ప్రధాన నీటి వనరు అయిన పంపా రిజర్వాయర్‌లో నీటి నిల్వలు అడుగంటిన విషయం తెలిసిందే. రిజర్వాయర్‌లో ఉన్న నీటిని పోలవరం కాలువ పనులు, బ్యారేజీ గేట్లు మరమ్మతుల పేరుతో దిగువకు వదిలేశారు. దీనివలన దేవస్థానానికి నీటి సమస్య ఉత్పన్నమవుతుందని, ఏప్రిల్‌లో శ్రీరామ నవమి, మే నెలలో సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు ఇబ్బందులు ఎదురవుతాయని ‘సాక్షి’ ఫిబ్రవరి 10న ‘అడుగంటినది’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై అన్నవరం దేవస్థానం అధికారులు నెల రోజులు ఆలస్యంగా స్పందించారు. పంపా నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయిన తరువాత, ఏలేరు నుంచి నీటిని విడుదల చేయించాలని కోరుతూ కలెక్టర్‌కు ఈఓ వీర్ల సుబ్బారావు మార్చి 11న లేఖ రాశారు. ఈ మేరకు కలెక్టర్ షణ్మోహన్ ఈ నెల 18న అన్నవరం వచ్చి, పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. ఈ నెల 21న ఇరిగేషన్, పోలవరం, దేవస్థానం అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలవరం అక్విడెక్ట్ పనులకు ఆటంకం లేకుండా ఏలేరు నీరు పంపాకు చేరేలా ప్రత్యేకంగా కాలువ, పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన నిధులు తాను విడుదల చేస్తానని తెలిపారు. ఈ మేరకు పోలవరం అధికారులు రూ.22 లక్షలతో ప్రతిపాదనలు సమర్పించారు. దీనికి కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమోదం తెలిపి, ఏప్రిల్ 15 నుంచి పంపాకు ఏలేరు నీరు విడుదల చేసేందుకు వీలుగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అదే సమయంలో దేవస్థానంలో నీటిని పొదుపుగా వాడాలని, అత్యవసర నిర్మాణాలు మినహా మిగిలినవి నిలిపివేయాలని, నీటి వృథాను అరికట్టాలని సూచించారు.
చెప్పిందొకటి.. చేసింది మరొకటి
ఏలేరు నీరు పంపాకు వచ్చేంత వరకూ దేవస్థానంలో నీటిని పొదుపుగా వాడాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశిస్తే అధికారులు మరొకలా అర్థం చేసుకున్నారు. కలెక్టరేట్‌లో సమావేశం ముగిసిన అనంతరం ఈఓ వీర్ల సుబ్బారావు దేవస్థానానికి చేరుకున్నారు. సత్రాల్లో ఏసీ గదులు అద్దెకివ్వడం నిలిపివేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయంపై దేవస్థానంలో మైకు ద్వారా ప్రచారం చేశారు. ఈ మేరకు మంగళ, బుధ, గురువారాల్లో ఏసీ గదులు అద్దెకివ్వరని ప్రచారం చేశారు. ఈ నిర్ణయంపై దేవస్థానం సిబ్బంది ఆశ్చర్యపోయారు. నీటి పొదుపునకు, సత్రాల్లో ఏసీ గదులు అద్దెకివ్వకపోవడానికి మధ్య ఉన్న సంబంధమేమిటో అర్థం కాక పలువురు తలలు పట్టుకున్నారు. పైగా ప్రస్తుతం వేసవి కావడంతో ఎక్కువ మంది భక్తులు ఏసీ గదులే అడుగుతున్నారు. దీంతో, నాన్ ఏసీ గదులు తీసుకోవాలని వారికి అధికారులు చెప్పాల్సి వచ్చింది.
వాస్తవానికి ఏసీ గది అయినా, నాన్ ఏసీ గది అయినా బస చేసేవారు ఒకే విధంగా నీటిని వాడతారు. ఏసీ గదుల్లో చెమట పట్టదు. దీనివలన వాటిల్లో బస చేసే వారికి రోజుకు రెండు మూడుసార్లు స్నానాలు చేసే అవసరం ఉండదు. అందువలన ఏసీ గదుల్లో ఉన్నవారే నీటిని తక్కువగా వాడే అవకాశం ఉంది. కానీ దేవస్థానం అధికారులు ఏవిధంగా ఆలోచించి ఏసీ గదులు అద్దెకివ్వరాదనే నిర్ణయం తీసుకున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇదీ నష్టం
దేవస్థానం సత్రాల్లో మొత్తం 500 గదులుండగా వీటిలో 300 ఏసీవి. పర్వదినాల్లో మొత్తం గదులన్నీ అద్దెకిచ్చేస్తారు. అన్ సీజన్‌లో 150 నుంచి 200 గదులు అద్దెకిస్తారు. మిగిలినవి ఖాళీగా ఉంటాయి. శివసదన్ సత్రంలో మొత్తం 135 గదులు ఏసీ. హరిహర సదన్‌లో 135 గదులకు 84 ఏసీవి. ప్రకాష్ సదన్‌లో 64 గదులు ఏసీవి. దేవస్థానంలో ఏసీ గదుల అద్దె రూ.1,000 నుంచి రూ.2 వేల వరకూ ఉంది. ఈఓ ఆదేశాలతో సోమవారం సాయంత్రం నుంచి ఈ సత్రాలన్నింటిలో ఏసీ గదులను అద్దెకివ్వడం నిలిపివేశారు. ఫలితంగా దేవస్థానానికి రూ.లక్ష వరకూ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. మరోవైపు ఏసీ గదుల కోసం వచ్చిన భక్తులు గత్యంతరం లేక కొండ దిగువకు చేరుకున్ని అన్నవరం గ్రామంలోని ప్రైవేటు లాడ్జిలలో ఏసీ గదులు అద్దెకు తీసుకున్నారు. ఇదే అదునుగా వారిని ఆయా లాడ్జీల యజమానులు ఏసీ గదుల అద్దెలను ఒక్కసారిగా రూ.3 వేల నుంచి రూ.5 వేలకు భక్తులను దోచుకున్నారు.
అన్నవరం దేవస్థానం
ఫ నీటి సమస్య సాకుతో
ఏసీ అద్దె గదుల నిలిపివేత
ఫ దేవస్థానానికి రూ.లక్ష నష్టం
ఫ గత్యంతరం లేక కొండ దిగువన
లాడ్జిలలో భక్తుల బస
ఫ ఇదే అదునుగా రేటు పెంచేసి, దోచుకున్న నిర్వాహకులు
ఫ అసౌకర్యంపై భక్తుల ఫిర్యాదు
ఫ దేవదాయ శాఖ కమిషనర్,
కలెక్టర్ సీరియస్
ఫ దీంతో పునరుద్ధరణ

రత్నగిరిపై వింత పాలన

రత్నగిరిపై వింత పాలన