దోపిడీకే ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

దోపిడీకే ప్రాధాన్యం

Apr 9 2025 12:11 AM | Updated on Apr 9 2025 12:11 AM

దోపిడ

దోపిడీకే ప్రాధాన్యం

పిఠాపురం: ప్రైవేటు వ్యాపారులు సిండికేటుగా మారారు. తాము చెప్పిందే ధర అన్నట్టుగా రైతులను దోచుకుంటున్నారు. వేరే దారి లేక వారు అడిగిన ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రబీ సీజన్‌లో ప్రైవేటు ధాన్యం వ్యాపారులు రైతులను నట్టేట ముంచుతున్నా అడిగే నాథుడు కనిపించడం లేదు. ప్రస్తుతం గోదావరి డెల్టా, ఏలేరు పరిధిలో రబీ వరి కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు జోరుగా సాగుతుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక ప్రైవేటు వ్యాపారులదే హవాగా మారింది. దీంతో ఒకపక్క దిగుబడులు ఆశించిన స్థాయిలో లేక, మరోపక్క మద్దతు ధర రాక రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు.

ఒక్క గింజ సేకరిస్తే ఒట్టు

రబీ వరి కోతలు ప్రారంభించి రెండు వారాలైనా ఇంకా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కొలిక్కి రాకపోవడంతో కోసిన ధాన్యాన్ని రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. తాము తప్ప ఎవరూ కొనేవారు లేరన్న సాకుతో ప్రైవేటు వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు అమాంతం తగ్గించేశారు. రబీ కోతల ప్రారంభంలో 75 కేజీల సన్న రకాల ధాన్యం బస్తా రూ.1,450 చెప్పిన వ్యాపారులు కోతలు ముమ్మరం అయ్యాక ఒక్కసారిగా ధరను బస్తాకు రూ.250 చొప్పున తగ్గించేశారు. ప్రస్తుతం 75 కేజీల బస్తాను రూ. 1,200కు మాత్రమే కొంటున్నారు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అమ్ముకుంటున్నారు. దీంతో ఎకరానికి రూ.10 వేల వరకు రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో 30 శాతానికి పైగా కోతలు పూర్తి కాగా సుమారు 1.20 లక్షల టన్నుల ధాన్యం ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం జిల్లాలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, సన్నరకం ధాన్యం 75 కేజీల బస్తా రూ.1,740కి (ఏ గ్రేడ్‌ రకం) కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కాని ఎక్కడా ఒక్క గింజ కూడా కొన్న ఆనవాళ్లు లేవు.

జిల్లాలో రబీ సాగు వివరాలు

రబీ సాగు చేసిన భూములు

1,58,120 ఎకరాలు

సాగు చేసిన రైతులు – 1.45 లక్షల మంది

ఏటా ధాన్యం దిగుబడి – 5.70 లక్షల టన్నులు

గత రెండు వారాలుగా అమ్మిన ధాన్యం –

సుమారు 1.20 లక్షల టన్నులు

రోజూ – 1,500 నుంచి 2,000 టన్నుల

ధాన్యం అమ్మకాలు

సిండికేటుతో పతనమైన ధాన్యం ధర

ప్రారంభంలో బస్తా

రూ.1,450, ప్రస్తుతం రూ.1,200

కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు

వ్యాపారులను ఆశ్రయించిన రైతులు

ధర పతనంతో ఎకరానికి

రూ.10 వేల వరకు నష్టం

వేరే దారి లేక నష్టం వచ్చినా

అమ్ముకుంటున్న రైతులు

అమ్మక తప్పడం లేదు

రోజురోజుకు ధాన్యం ధరలు తగ్గించేస్తున్నారు. ఎందుకని అడిగే వారు లేరు. ఎవరికి వారే ఏదో విధంగా ధాన్యం అమ్ముడైతే చాలు అన్నట్టుగా అమ్మేస్తున్నాం. కోత కోయక ముందు రూ.1,450 అన్నారు. తీరా కోత కోసాక రూ.1,00 అంటున్నారు. అయినప్పటికి అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో పాటు రైతులకు వేరే దారిలేక వ్యాపారులు చెప్పిన ధరకే అమ్మాల్సి వస్తోంది. ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10వేల నష్టం తప్పడం లేదు. ప్రస్తుతం అంతా యంత్రాలతో కోతలు కోస్తుండడం వల్ల అంతా పచ్చి ధాన్యమే ఉంటుంది. ప్రైవేటు వ్యాపారులు పచ్చి ధాన్యం ఎలా ఉన్నది అలా కొంటున్నారు. అందుకే వారు అడిగిన ధరకు అమ్మాల్సి వస్తోంది. అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అయితే ధాన్యం ఎండబెట్టి పూర్తిగా ఆరిన తరువాత ఎగరబోసి ఏవిధమైన తుక్కు లేకుండా చేసి అమ్మితేనే కొంటారు. అందుకే ధర లేక పోయినా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నాం.

– కరణం శ్రీను, రైతు, పిఠాపురం

ఆ నిబంధనలు మా పాలిట శాపాలు

ప్రభుత్వం ఒకవేళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ముందు మేము రైతు సేవా కేంద్రానికి వెళ్లి సమాచారం ఇవ్వాలి. కూపన్‌ తీసుకోవాలి. తరువాత సిబ్బంది వారికి వీలు కుదిరినప్పుడు వచ్చి శాంపిల్స్‌ తీసుకెళతారు. తేమ ఎక్కువగా ఉంది బాగా ఆరబెట్టి తీసుకురండి అంటారు. ఇంతలో ఏ వర్షం అయినా వచ్చిందంటే ఉన్న ధాన్యం కాస్తా తడిసిపోతాయి. దీంతో అంతా నష్టమే మిగులుతుంది. ముఖ్యంగా పచ్చి ధాన్యం ప్రభుత్వం కొనదు. దీనివల్ల ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో వ్యాపారులు వారి ఇష్టానుసారం ధర నిర్ణయించి కొంటున్నారు. మాకు నష్టాలు తప్పడం లేదు. ఆరబెట్టి అమ్ముదామని కళ్లాల్లో ఉంచిన ధాన్యం రెండు రోజుల క్రితం వచ్చిన వానకు తడిసి పోయాయి. దీంతో చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పచ్చి ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేస్తే తప్ప ప్రైవేటు వ్యాపారుల హవా తగ్గదు.

– గంధం కృష్ణ, రైతు, కొత్తపల్లి

దోపిడీకే ప్రాధాన్యం1
1/1

దోపిడీకే ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement