ఉద్యోగం పేరిట టోకరా!
గ్రీవెన్స్‌ను ఆశ్రయించిన భార్యాభర్తలు
ప్రత్తిపాడు: తమ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేశారని ప్రత్తిపాడు గ్రామానికి చెందిన దంపతులు బొడ్డు గంగరాజు, వరలక్ష్మి ఆరోపించారు. తమ నివాసంలో బుధవారం వారు విలేకరులకు తమ గోడు వెళ్లగక్కారు. వారి వివరాల మేరకు, వీరి కుమారుడు రమేష్‌కుమార్ ఇంటర్మీడియెట్ చదివి, ఖాళీగా ఉన్నాడు. రెండేళ్ల క్రితం అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మండలంలోని పెద్దిపాలెం గ్రామానికి చెందిన గొంప రామకృష్ణ, అతడి భార్య దుర్గాప్రవీణ నమ్మించారు. ఏలూరు పట్టణానికి చెందిన పల్లా ఏసు, సంతోష్‌కుమార్‌కు ఇవ్వాలంటూ వారి వద్ద రూ.4.30 లక్షలు తీసుకున్నారు. పీఈటీ శిక్షణ తీసుకుంటే ఉద్యోగం వెంటనే వస్తుందని చెప్పడంతో, రమేష్‌కుమార్ విజయనగరంలో శిక్షణకు కూడా వెళ్లాడు. అప్పటి నుంచి రామకృష్ణ, దుర్గాప్రవీణ మొఖం చాటేశారు. దీనిపై 2023 జూలై 31న ప్రత్తిపాడు పోలీసులకు గంగరాజు, వరలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ ప్రయోజనం లేకపోయింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇటీవల జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందజేసినట్టు గంగరాజు, వరలక్ష్మి తెలిపారు. వీరి ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం తెలిపారు.