
పిఠాపురంలో పారిశుధ్యం అధ్వానం
కలెక్టర్‌కు టీడీపీ నేత వర్మ ఫిర్యాదు
పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇలాకా పిఠాపురంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌కు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన పిఠాపురంలో చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిందట నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ నేత నాగబాబు.. వర్మనుద్దేశించి చేసిన వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య పోరు మరింత ముదిరింది. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఇరు వర్గాలు వాగ్వాదాలకు, బాహాబాహీలకు దిగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు మౌనంగా ఉన్న వర్మ హఠాత్తుగా తెర పైకి వచ్చారు. ప్రజా సమస్యల పరిశీలన పేరుతో పిఠాపురం పట్టణంలోని జగ్గయ్య చెరువు కాలనీలో ఇటీవల పర్యటించారు. అక్కడ పారిశుధ్యం అధ్వానంగా ఉండటం చూసి, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పారిశుధ్యం అధ్వానంగా ఉందని, ప్రజలు రోగాల బారిన పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్‌కు కాకినాడలో ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వంలో అదీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలను అడ్డం పెట్టుకుని కావాలనే వర్మ ఈ ఫిర్యాదు చేశారని జనసేన నేతలు మండిపడుతున్నారు. అయితే, తమ నాయకుడు జూలు విదిల్చారని, ఇక అంతోపంతో తేలుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఉగాది వేడుకలు,
ఇఫ్తార్ విందు పైనా వివాదం
ఇదిలా ఉండగా పిఠాపురంలో ఆదివారం అధికారికంగా నిర్వహించనున్న ఉగాది సంబరాలు, రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమాలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఈ కార్యక్రమాలకు జనసేన క్యాడర్‌కు మాత్రమే ఆహ్వానాలు పంపించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) చైర్మన్ తుమ్మల బాబు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాలకు టీడీపీ నేత వర్మకు గాని, టీడీపీ కేడర్‌కు గాని ఆహ్వానాలు పంపించలేదు. దీనిపై టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా జనసేన, టీడీపీ నేతలతో ఏవిధంగా వ్యవహరించాలో అర్థం కాక బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.