
అన్నదాతలతో పరిహాసం
8
లో
పరిహారం లేదు..
పట్టించుకునే వారూ లేరు
సార్వాలో రెండెకరాల్లో వరి పంట వరదకు కొట్టుకుపోయింది. ఇసుక మేటలు వేశాయి. ఇప్పటి వరకూ పైసా కూడా పరిహారం రాలేదు. ఇసుక మేటలు తొలగించడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. అదీ లేదు. నా పొలానికి ఎదురుగా ఉన్న గొర్రిఖండి కాలువకు గండి కూడా పడింది. దానిని సగం పూడ్చి వదిలేశారు. ఫలితంగా దాళ్వా పంట కూడా సాగు చేసే పరిస్థితి లేకుండా పోయింది.
– పడాల అచ్చారావు (బాబూరావు),
రైతు, గొల్లప్రోలు
పరిహారం ఊసెత్తడం లేదు
ఏలేరు వరదలు, అధిక వర్షాల వల్ల మా పంటలు పోయాయి. అప్పట్లో అధికారులు వచ్చి నష్టం నిర్ధారించారు. ప్రభుత్వానికి నివేదికలు పంపాం.. పరిహారం వస్తుందని చెప్పారు. నెలలు గడుస్తున్నా పరిహారం మాత్రం రాలేదు. ఎవరూ ఆ ఊసెత్తడం లేదు. ఎవరిని అడగాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి మాది.
– ధర్మారపు లక్ష్మీకుమారి,
రైతు, యండపల్లి, కొత్తపల్లి మండలం
వేశామంటున్నారు.. మాకు రాలేదు
మాకు సంబంధించి మూడెకరాల్లో పంట వరదలో కొట్టుకుపోయింది. పంట పూర్తిగా దెబ్బ తిన్నట్లు అధికారులు గుర్తించారు. నష్ట పరిహారం వస్తుందని అప్పట్లో చెప్పారు. తరువాత పరిహారం వేశామని కూ డా అంటున్నారు. కానీ మాకు మాత్రం ఒక్క రూపా యి కూడా పడలేదు. అడుగుతూంటే ఎవరూ సమాఽ దానం చెప్పడం లేదు. అసలు వస్తుందో రాదో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో మేమున్నాం.
– మొగలి అప్పలరాజు, రైతు,
యండపల్లి, కొత్తపల్లి మండలం
పరిహారం గురించి
పట్టించుకోవడం లేదు
పంటలు దెబ్బతిని, తీవ్రంగా నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నష్టపరిహారం వేశారని అధికారులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎవరికి వేశారో, ఎంత వేశారో చెప్పడం లేదు. ఎవరిని అడిగినా రాలేదనే అంటున్నారు. మాకు రాలేదు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేదు.
– దువ్వా జయలక్ష్మి, రైతు,
యండపల్లి, కొత్తపల్లి మండలం
పంట భూమిలో ఇసుక మేటలు
ఇది ఏ నదీ తీరానికి సంబంధించిన ఫొటో అని అనుకుంటే పొరపాటు పడినట్లే.. గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన వరదల కారణంగా పిఠాపురం మండలం రాపర్తి గ్రామం వద్ద ఏలేరు కాలువకు పడిన గండ్లతో పొలాల్లో ఇసుక, మట్టి ఇలా మేటలు వేసింది. ఇలా పొలాల్లో మేటలు వేసిన ఇసుక, మట్టిని తొలగించుకోవడానికి హెక్టారుకు రూ.17 వేల చొప్పున ఇస్తామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ, ఆవిధంగా ఆర్థిక సాయం అందలేదని చాలా మంది రైతులు వాపోతున్నారు.
● గత సెప్టెంబర్‌లో వెల్లువెత్తిన ఏలేరు
● వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
● రైతులకు రూ.కోట్లలో నష్టం
● నెలలు గడుస్తున్నా అందని పరిహారం
● వరద నీట కొట్టుకుపోయిన
కూటమి నేతల హామీలు
పిఠాపురం: అధిక వర్షాల కారణంగా గత ఏడాది సెప్టెంబర్ నెలలో జిల్లాలోని ఏలేరు, పంపా, సుద్దగెడ్డ, తాండవ నదులకు ఊహకందని రీతిలో వరదలు వచ్చాయి. వరదలు, అధిక వర్షాల కారణంగా జగ్గంపేట, పెద్దాపురం, కిర్లంపూడి, తాళ్లరేవు, సామర్లకోట, పిఠాపురం, తొండంగి, గొల్లప్రోలు, కొత్తపల్లి, తుని తదితర 20 మండలాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వివిధ రకాల పంటలు వరద నీట మునిగి సర్వనాశనమయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రైతులు సుమారు రూ.200 కోట్లకు పైగా నష్టపోయారు. ముఖ్యంగా వేలాది ఎకరాల్లో పచ్చని పంటలకు ఊపిరి పోసే ఏలేరు.. తన ఆయకట్టు భూములపై ప్రతాపం చూపింది. పరీవాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాలకు జలాశయంలోకి ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగింది. దీనిని అంచనా వేసుకుంటూ, జలాశయం నుంచి తగిన స్థాయిలో దిగువకు నీటిని వదలాల్సి ఉండగా.. అధికారులు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీటిని విడిచిపెట్టారు. ఆ రోజుల్లో 10 వేల క్యూసెక్కుల లోపే అదనపు జలాలను విడిచిపెడుతున్నట్లు అధికారులు చెప్పగా.. వాస్తవానికి అంతకు పదింతల మొత్తంలో నీటిని రోజుల తరబడి వదిలేశారని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా ఒక్కసారిగా ఏలేరు జలాలు ఉరకలెత్తి విరుచుకుపడ్డాయి. వేలాది ఎకరాల్లో పంటలు, పరీవాహక ప్రాంతంలోని గ్రామాలు జలమయమయ్యాయి. ఏలేరు నదికి సుమారు 200కు పైగా గండ్లు పడ్డాయి. సుమారు 200 ఎకరాల పంట భూముల్లో ఇసుక, మట్టి మేటలు వేశాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.
అప్పట్లో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రైతులను, వరద బాధితులను పరామర్శించారు. వారిలో మనోధైర్యం నింపి, బాధితులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో హడావుడిగా మొక్కుబడి పర్యటనలు చేశారు. బాధితులకు తక్షణం పరిహారం ఇస్తామంటూ హామీలిచ్చారు. కానీ, ఆ మాటలు పరిహాసంగానే మిగిలాయి. నెలలు గడుస్తున్నా తమకు నష్టపరిహారం అందలేదని వేలాది మంది రైతులు వాపోతున్నారు. పరిహారం ఇచ్చామని చెబుతున్నారు తప్ప ఎంత మందికి ఇచ్చారు, ఎంత ఇచ్చారనే లెక్కలు మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ బహిర్గతం చేయడం లేదు. అటు ప్రభుత్వాధినేతలూ పట్టించుకోవడం మానేశారు. దీంతో పంటలు నష్టపోయి, పరిహారం అందక ఏలేరు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
జిల్లాలో ఏలేరు వరద నష్టాలు ఇలా..
అధికారుల ప్రాథమిక అంచనా
వరద ప్రభావిత మండలాలు 20
ముంపులో చిక్కుకున్న గ్రామాలు 206
నీట మునిగిన పంటల విస్తీర్ణం సుమారు 1,00,000 ఎకరాలు
మట్టి మేటలు వేసిన పొలాలు సుమారు 200 ఎకరాలు
దెబ్బ తిన్న పంటలు వరి, మొక్కజొన్న, పత్తి, మినుము
నష్టపోయిన రైతులు సుమారు 50,000
పంట నష్టం సుమారు రూ.200 కోట్లు
ప్రభుత్వానికి అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం..
నీట మునిగిన పంటల విస్తీర్ణం 75,000 ఎకరాలు
నష్టపోయిన రైతులు 41,796
పంట నష్టం అంచనా రూ.172 కోట్లు
ప్రభుత్వం కుదించిందిలా..
పంట నష్టం 34,812 ఎకరాలు
నష్టపోయిన రైతులు 24,879
ఎకరానికి రూ.10 వేల ఇన్‌పుట్ సబ్సిడీ, ఇసుక మేటలు తొలగించుకోవడానికి హెక్టార్‌కు రూ.17 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అన్నదాతలతో పరిహాసం