
కళారంగానికి సీఆర్సీ సేవలు ఎనలేనివి
రావులపాలెం: భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో కళారంగానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, అంతరించి పోతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్‌సీ) కాటన్ కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమని సినీ నటులు తనికెళ్ల భరణి, గౌతంరాజు, గుండు సుదర్శన్, జోగినాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలోని సీఆర్‌సీ కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో 25వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలను ఆదివారం వారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరై సీఆర్‌సీ కళా సేవను కొనియాడారు.
ఈ సందర్భంగా సీఆర్‌సీ ఉగాది పురస్కారాన్ని రామచంద్రపురానికి చెందిన చింతా గిరిబాలకు, సీఆర్‌సీ కాటన్ కళా పురస్కారాన్ని మేకప్ ఆర్టిస్ట్ అడివి శంకరరావుకు అందజేశారు.
కార్యవర్గం ప్రమాణ స్వీకారం:
ఈ సందర్భంగా సీఆర్‌సీ, సీఆర్‌సీ ఓల్డేజ్ హోమ్ నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం జరిగింది. సీఆర్‌సీ అధ్యక్షుడిగా తాడి నాగమోహనరెడ్డి, కార్యదర్శిగా నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, పరిషత్ డైరెక్టర్‌గా కె.సూర్య, ఉపాధ్యక్షుడిగా చిన్నం తేజారెడ్డి, ట్రెజరర్‌గా కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా దండు సూరిబాబురాజు, తొమ్మిది మంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఓల్డేజ్ హోమ్ అధ్యక్షుడిగా వేగేశ్న రామరాజు, ఉపాధ్యక్షుడిగా నందం సత్యనారాయణ, కార్యదర్శిగా గొలుగూరి వెంకటరెడ్డి, జాయింట్ సెక్రటరీగా సీహెచ్ గోపాలకృష్ణ, కోశాధికారిగా నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డి, మరో పది మంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆలోచింపజేసిన నాటికలు
ఉగాది ఆహ్వాన నాటికల పోటీల్లో భాగంగా మొదటి రోజు రెండు నాటికలను ప్రదర్శించారు. తాడేపల్లికి చెందిన అరవింద ఆర్ట్స్ బృందం విడాకులు కావాలి నాటిక ఆకట్టుకుంది. గంగోత్రి సాయి దర్శకత్వం వహించగా, వల్లూరి శివప్రసాద్ రచన ప్రేక్షకులను ఆలోచింపజేసింది. అలాగే గుంటూరుకు చెందిన అమరావతి ఆర్ట్స్ బృందం చిగురు మేఘం నాటిక వేవూరి హరిబాబు దర్శకత్వం, కావూరి సత్యనారాయణ రచనలో ప్రదర్శించారు. సందేశాత్మకంగా సాగిన నాటిక ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.
సినీ నటులు తనికెళ్ల తదితరుల ప్రశంస
అట్టహాసంగా ఉగాది ఆహ్వాన
నాటిక పోటీలు ప్రారంభం

కళారంగానికి సీఆర్సీ సేవలు ఎనలేనివి