ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే బకాయిలు చెల్లించాలి
ఆర్థిక సమస్యలు తక్షణం పరిష్కరించాలి
యూటీఎఫ్ డిమాండ్
రాజమహేంద్రవరంలో పోరుబాట
రాజమహేంద్రవరం సిటీ: విద్యారంగంలో పేరుకుపోతున్న ఆర్థిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తలపెట్టిన పోరుబాటలో భాగంగా రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఆదివారం విద్యా సదస్సు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.30 వేల కోట్లు బకాయిల చెల్లింపులపై సరైన శ్రద్ధ చూపించడం లేదని అన్నారు.
29 శాతం ఐఆర్ ప్రకటించి, 12వ ిపీఆర్‌సీ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు డీఏలు, పీఆర్‌సీ ఎరియర్లు, సరెండర్ లీవులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారో రోడ్ మ్యాప్ తెలియజేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ పోరుబాట ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉనికి కోల్పోతున్నాయన్నారు. భవిష్యత్తులో మోడల్ పాఠశాలల పేరుతో గ్రామాల్లోని చాలా పాఠశాలలను ఎత్తివేసే యోచనతో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామాల్లో కామన్ పాఠశాలలు ఉండాలని, విద్యా రంగానికి జీడీపీలో 6 శాతం నిధులు ఖర్చు చేయాలని ఎన్నో సూచనలు చేసిన కొఠారి కమిషన్ నివేదికను ప్రభుత్వాలు ఆచరించటం లేదన్నారు. ఊరి బడిని బతికించుకోవటానికి ఉపాధ్యాయులంతా నడుం కట్టాలన్నారు. అందుకోసం పిల్లలు, పిల్లల తల్లిదండ్రులతో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
నూతన విద్యావిధానం–2020 అమలు చేస్తూ ప్రభుత్వ విద్యా రంగాన్ని తుంగలోకి తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విద్యారంగ ప్రయోజనాలతో కాకుండా పాలకవర్గ ప్రయోజనాలతో ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నాయని, అందుకే ప్రభుత్వ విద్యారంగం వెనుకబడుతోందని అన్నారు. విద్యారంగానికి నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వ ఉదాశీన వైఖరి ఇలాగే ఉంటే భవిష్యత్తులో వేలాది ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా విధానానికి పాలకులు పెద్దపీట వేయాలన్నారు. పోరాటాల ద్వారా మాత్రమే ఉపాధ్యాయుల హక్కుల సాధన జరుగుతుందన్నారు.
టీచర్లు మార్కిస్టు, కమ్యూనిస్టు భావాలతో ఉన్నప్పుడు మాత్రమే నూతన మానవుల్ని, నూతన సమాజాన్ని తయారు చేయగలరన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భారీ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, ఆర్థిక ప్రలోభాలు ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తోటకూర చక్రవర్తి, అరుణకుమారి, రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీదేవి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఐదు జిల్లాల్లోని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా, రాష్ట్ర బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలపై పోరుబాట