
పంజాబ్‌లో వాడపల్లి యువకుడి మృతి
● మృతుడు వైఎస్సార్ సీపీ నేత
సముద్రం కుమారుడు
● స్వగ్రామంలో అంత్యక్రియలు
కొవ్వూరు: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో గల లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న వాడపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఉప సర్పంచ్ లంకదాసు సముద్రం పెద్ద కుమారుడు నాగ వెంకట యశ్వంత్ (23) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అమృత్‌సర్‌లో ఓ పరీక్ష రాసేందుకు ఈ నెల 6వ తేదీన తన స్నేహితుడి కలిసి మోటారుసైకిల్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా కుపర్తల సమీపంలో హైవేపై డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో యశ్వంత్‌తో పాటు అతడి స్నేహితుడు, విజయనగరానికి చెందిన గానా సిద్విక్ వర్మ (23) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అమృత్‌సర్ నుంచి ఢిల్లీ తీసుకెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో మంగళవారం మధ్యాహ్నం యశ్వంత్ స్వగ్రామమైన వాడపల్లి తీసుకొచ్చారు. వాడపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న యశ్వంత్ ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యారు. మద్రాసులో ఉద్యోగం కుడా వచ్చింది. ఈ వారంలోనే ఉద్యోగంలో చేరనున్న సమయంలో మృత్యువాత పడడాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోతున్నారు. ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ (నారాయుడు), మాజీ ఏఎంసీ చైర్మన్ బూరుగుపల్లి వీర్రాఘవులు తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.