స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
కాకినాడ లీగల్: స్లాట్ బుకింగ్ విధానం ద్వారా కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్ జె.జయలక్ష్మి మాట్లాడుతూ, స్లాట్ బుకింగ్ కోసం కక్షిదారులు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ స్లాట్ బుక్ చేసుకోవాలని అన్నారు. అందులో వివరాలు పొందుపరచి, స్లాట్ బుకింగ్ ఆప్షన్‌కు వెళ్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎంచుకోవాలని తెలిపారు. అనంతరం రిజిస్ట్రేషన్ బుకింగ్ తేదీ, సమయం పచ్చ రంగులో, ముందుగా ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం నమోదు చేసుకున్న తేదీలు, సమయాల వివరాలు ఎరుపు రంగులో కనిపిస్తాయన్నారు. కక్షిదారులు పచ్చరంగులోని తేదీలను ఎంచుకోవాలన్నారు. అనంతరం కక్షిదారు మొబైల్‌కు వన్ టైం పాస్‌వర్డ్ వస్తుందన్నారు. దానిని నిర్ధారించాక స్లాట్ బుక్ అవుతుందని చెప్పారు. ఒకసారి బుక్ చేసుకున్న స్లాట్ మార్చుకోవాలంటే అదనంగా రూ.200 చెల్లించాలని తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా తొలుత రిజిస్ట్రేషన్ అయిన దస్తావేజును సబ్ రిజిస్ట్రార్ ఆర్‌వీ రామారావు సమక్షంలో జయలక్ష్మి అందజేశారు.
తప్పని ఇబ్బందులు
స్లాట్ బుకింగ్‌తో కొంత మంది క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడ్డారు. స్లాట్ బుకింగ్ సమయానికి క్రయవిక్రయదారులు రాకపోవడంతో స్లాట్ బుకింగ్ ముగిసింది. వారికి సాయంత్రం 5.30 తరువాత ఇప్పటి వరకూ ఉన్న ఫ్రేమ్ 2.0 విధానంలో రిజిస్ట్రేషన్ చేశారు. సాయంత్రం 5.30 తరువాత పాత విధానంలో సుమారు 30 దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఉదయం 10.30 నుంచి 5.30 వరకూ స్లాట్ విధానంలో సుమారు 30 దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేశారు. రాత్రి 8 గంటల వరకూ రిజిస్ట్రేషన్లు చేస్తూండటంతో సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది, క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధానం వలన ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.


