
చీకటి పడితేనే.. సీతారాముల కల్యాణం
పిఠాపురం: ప్రపంచమంతా శ్రీరామ నవమికి శ్రీ సీతారాముల కల్యాణం పగటి పూట నిర్వహిస్తూంటా రు. కానీ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మాత్రం చీకటి పడ్డాకే శ్రీరాముడి కల్యాణం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారంగా స్థానికులు చెబుతున్నారు. చేబ్రోలులోని శ్రీ సీతారామ స్వామి వారి ఆలయం అత్యంత ప్రాచీనమైనది. తన వంశానికి చెందిన దామర సీతాదేవి జ్ఞాపకార్థం పిఠాపురం మహారాజా రావు కుమార మహీపతి గంగాధర రామారావు బహద్దూర్ 1800 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో పిఠాపురం రాజావారి ఆధీనంలో ఉన్న దేవాలయాల్లో ఇదొకటి. ఇక్కడ ధృవమూర్తి కూడా భద్రాచలం సీతారామచంద్రస్వామిని పోలి ఉండటం విశేషం. ప్రతి గ్రామంలో సీతారాముల కల్యాణం పగటి పూట నిర్వహిస్తారు. కానీ ఈ ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు, సీతారామ కల్యాణం రాత్రి వేళ చేస్తూంటారు. పూర్వం పిఠాపురం మహారాజా వారికి తన ఆస్థానంలో ఉన్న అన్ని రామాలయాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీరాముడి కల్యాణాలు తన చేతుల మీదుగా జరిపించడం ఆనవాయితీగా ఉండేది. దీనిలో భాగంగా రాజావారు తొలుత పిఠాపురంలోని ఆలయాలను, తరువాత గొల్లప్రోలు ఆలయాలను సందర్శిస్తూ చివరిగా చేబ్రోలు చేరుకునే సమయానికి చీకటి పడేది. దీంతో ఆయన వచ్చిన తర్వాతనే రాత్రి సీతారాముల కల్యాణం జరిపించేవారు. దీంతో ఇదే ఈ ఆలయంలో ఆనవాయితీగా మారిపోయింది. రాజుల కాలం పోయినప్పటికీ అప్పటి ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రాత్రి 10 గంటల తరువాతే కల్యాణ తంతు ప్రారంభమవుతుంది. కల్యాణోత్సవం పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటుతుంది. అలా శ్రీరామ నవమి నాడు కల్యాణం ప్రారంభమై, అర్ధరాత్రి 12 గంటలు దాటడంతో మరునాడు పూర్తవుతుంది. గ్రామస్తుల సహాయ సహకారాలతో పాంచరాత్ర ఆగమం ప్రకారం ఈ కల్యాణోత్సవాలు చేస్తూంటారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మొదటి రోజు శేష, రెండో రోజు హనుమంత, మూడో రోజు గజ, నాలుగో రోజు పొన్న వాహనాలపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఐదో రోజు రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం శ్రీపుష్ప యాగంతో ఈ కల్యాణోత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకుడు రేజేటి రామానుజాచార్యులు తెలిపారు. ఈ ఏడాది సీతారాముల కల్యాణాన్ని వేలాదిగా తరలి వచ్చిన భక్త జన సందోహం తిలకిస్తూండగా ఆదివారం అర్ధరాత్రి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది.