వక్ఫ్ చట్ట సవరణలపై నిరసన
కాకినాడ సిటీ: ముస్లిం మైనారిటీల హక్కులను హరిస్తున్న వక్ఫ్ చట్ట సవరణలకు వ్యతిరేకంగా కాకినాడలో బుధవారం ముస్లింలు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ చట్టంను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వక్ఫ్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు–2025ను వ్యతిరేకిస్తూ ముస్లిం వక్ఫ్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మొయిన్‌రోడ్డులోని జమియా మసీద్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వక్ఫ్‌ను కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ షణ్మోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వక్ఫ్‌బోర్డు మాజీ డైరెక్టర్ బషీరుద్దీన్, మాజీ కార్పొరేటర్ తెహర ఖతూన్, జవహర్ అలీ, తాజువుద్దీన్, అబ్దుల్ బషీరుద్దీన్, రెహమాన్, రహీం, కుతుబుద్దీన్, జిలాని దురాని, అబ్దుల్ రజాక్ రిజ్వీ, గౌస్ మొహిద్దీన్ పాల్గొన్నారు. ఆందోళనకారులు మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఎవరో ముస్లిం దాతలు ఎప్పుడో తమ అభీష్టం ప్రకారం ముస్లిం సమాజం కోసం దానం చేసిన ఆస్తులే కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కావన్నారు.
శంఖవరం ఘటనలో
దోషులను శిక్షించాలి
రౌతులపూడి: శంఖవరంలో రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డా.బీఆర్. అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండవేసి అవమాన పరిచిన దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ జిల్లా అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు అంగూరి లక్ష్మీశివకుమారి డిమాండ్ చేశారు. బుధవారం తన స్వగ్రామం ఎ.మల్లవరంలో ఆమె విలేకర్లుతో మాట్లాడుతూ శంఖవరంలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. అణగారిన వర్గాల అభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడిని ఇంత దారుణంగా అవమానించడం అమానుషం అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు ఎక్కడోచోట నిత్యం జరుగుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టకుండా అణగారిన వర్గాల ప్రజలను అణగదొక్కాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సీసీ ఫుటేజీలు బయటపెట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈవీఎం, వీవీప్యాట్
గోదాముకు పటిష్ట భద్రత
కాకినాడ సిటీ: ఈవీఎం, వీవీప్యాట్‌ల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల)కు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ షణ్మోహన్ రెవెన్యూ, ఎన్నికల శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎం, వీవీప్యాట్ గోదామును తనిఖీ చేసి నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎస్.మల్లిబాబు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వీ జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
అన్నవరం భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ
దేవస్థానంలో
రెండో రోజు ఐవీఆర్‌ఎస్ టీం పర్యటన
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవలపై ఎందుకు భక్తుల్లో అసంతృప్తి నెలకొని ఉందనే దానిపై ఇద్దరు ప్రయివేట్ వ్యక్తులతో కూడిన ఐవీఆర్‌ఎస్ బృందం రెండో రోజు బుధవారం కూడా అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ప్రధానంగా అన్నదానం పథకంలో ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా అని భక్తులను ఆ బృందం ప్రశ్నించింది. బాగున్నాయని చాలామంది భక్తులు చెప్పినట్టు సమాచారం. అయితే ఒకరిద్దరు మంచినీరు ఆలస్యమవుతోందని తెలిపారు. నిత్యాన్నదానం హాలు ఫ్లోరింగ్ శుభ్రతపై ఆ బృందం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
వక్ఫ్ చట్ట సవరణలపై నిరసన


