
శత శాతం అక్షరాస్యతకు ఉల్లాస్
కాకినాడ సిటీ: వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అడల్డ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) పథకంపై నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా ఉల్లాస్ పథకాన్ని రూపొందించిందన్నారు. దేశంలో 100 శాతం అక్షరాస్యతను సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఉల్లాస్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉండి చదువు ఆపేసి లేదా చదువుకోని పెద్దలను గుర్తించి అక్షరాస్యతను అందించి వారికి ప్రాథమిక విద్య, డిజిటల్ విద్య, ఆర్థిక విద్యను వలంటీర్ టీచర్ ద్వారా అందించడమే ఉల్లాస్ పథక లక్ష్యమని డీఆర్వో వెంకటరావు అన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను గుర్తించడానికి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, 20 మండలాల్లో 26014 మంది నిరక్షరాస్యులను గుర్తించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, అంగన్‌వాడీ ఆయాలు, హెల్పర్స్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే నైట్ వాచ్‌మెన్‌లు తదితరులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 24వ తేదీ వరకు డీఆర్‌డీఏ, మెప్మా క్లస్టర్ కోఆర్డినేటర్, విలేజ్ ఆర్గనైజేషన్, రిసోర్స్ పర్సన్‌ల ఆధ్వర్యంలో నిరక్ష్యరాసుల సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా గుర్తించిన నిరక్షరాస్యులకు మే 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 18 వరకు ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, జీవన నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యాలు, ప్రాథమిక విద్య, నిరంతర విద్య వంటి అంశాలపై శిక్షణ ఇస్తామని డీఆర్వో వివరించారు. ఈ పథకానికి జిల్లా స్థాయి కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారని చెప్పారు. మండల స్థాయిలో ఎంపీడీవో చైర్మన్‌గా ఇతర సభ్యులు ఉంటారన్నారు. అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా నోడల్ అధికారి వెంకటేశ్వరరావురెడ్డి, డీపీవో వి రవికుమార్, ఐసీడీఎస్ పీడీ కె విజయకుమారి, సమాచార పౌరసంబంధాల శాఖ డిడీ డి నాగార్జున, డీఆర్‌డీఏ ఏపీడీ వి జిలాని, జెడ్పీ ఏవో ఎం బుజ్జిబాబు పాల్గొన్నారు.