
గ్రాసిమ్ నుంచి ముడుపుల కోసమే..
పెదపూడి: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో గ్రాసిమ్ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేసి, వారి నుంచి ముడుపులు పొందడమే ధ్యేయంగా అసెంబ్లీ వేదికగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి క్యాన్సర్ ప్రచారం చేశారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. అంతే తప్ప బలభద్రపురం, పరిసర ప్రాంత ప్రజల క్షేమం కోరి కాదని అన్నారు. అనపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే నల్లమిల్లి లేవనెత్తిన క్యాన్సర్ అంశం బలభద్రపురానికి శాపంగా మారిందని ధ్వజమెత్తారు. ఇటీవల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడినట్టుగా క్యాన్సర్‌పై ముందే ప్రైవేటు సంస్థలతో సర్వేలు చేయించి, అప్పుడు అసెంబ్లీలో ప్రస్తావిస్తే బాగుండేదని అన్నారు. అలా కాకుండా బలభద్రపురంలో 200 మందికి పైగా క్యాన్సర్ బాధిత కుటుంబాలను పరామర్శించానంటూ ఎమ్మెల్యే చెప్పారని, దీనిలో నిజం ఎంతుందో ఆయనకే తెలుసని అన్నారు.
తప్పుడు ప్రచారంతో ఊరికి చేటు
అసెంబ్లీలో రామకృష్ణారెడ్డి క్యాన్సర్ అంశాన్ని ప్రస్తావించడం, దానిపై మీడియా అత్యుత్సాహంతో విపరీత ప్రచారం కల్పించడంతో బలభద్రపురం ప్రాంతాన్ని క్యాన్సర్ భూతం కబళించిందేమో అనే స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగిందని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఈ ప్రచారంతో ఆ గ్రామంలోని తమ వారి ఇళ్లకు రావటానికి ఇతర ప్రాంతాల్లోని బంధువులు భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవేళ వచ్చినా కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా భయపడిపోతున్నారన్నారు. అలాగే, ఆ ఊరి వారితో వివాహ సంబంధాలు కలుపుకోవాలన్నా బయటి గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బలభద్రపురంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో సర్వే చేస్తూంటే, వారిని కూడా బెదిరించి విషయాన్ని పక్కతోవ పట్టిస్తూ లేనిది ఉన్నట్లుగా చూపించేందుకు ఎమ్మెల్యే విఫలయత్నం చేశారని మాజీ ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ప్రభుత్వ సర్వేలో జాతీయ సగటు కంటే తక్కువగా బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, సాక్షాత్తూ బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రకటించారని గుర్తు చేశారు. డైవర్షన్ రాజకీయాలకు అలవాటు పడిన ఎమ్మెల్యే నల్లమిల్లి ఇంకా స్వతంత్ర సర్వే అంటూ, అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు.
గ్రాసిమ్ ఇండస్ట్రీ ఏర్పాటు సమయంలో జరిగిన విషయాలన్నీ ప్రజలకు తెలుసునని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి చెప్పారు. 2019 ప్రథమార్ధంలోనే నాటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే కేపీఆర్ సంస్థ నుంచి గ్రాసిమ్ సంస్థకు భూబదలాయింపు చేశారన్నారు. ఆ తర్వాత వెంటనే దొంతమూరులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అప్పటి, ఇప్పటి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారం రోజుల్లో భూబదలాయింపు ఉత్తర్వులు రద్దు చేయిస్తానని చెప్పి, ఆ పని ఎందుకు చేయించలేకపోయారని, దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గ్రాసిమ్ ఇండస్ట్రీ వలన ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే, అధికారంలో ఉన్నందున చిత్తశుద్ధి ఉంటే తగిన చర్యలు తీసుకోవచ్చని సూచించారు. అంతే తప్ప అవగాహన లేకుండా బలభద్రపురానికి, పరిసర ప్రాంతాలకు మాయని మచ్చ తీసుకు రావద్దని హితవు పలికారు. ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని, అంతా మంచి జరుగుతుందని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అన్నారు.
అందుకే అసెంబ్లీ వేదికగా
క్యాన్సర్ ప్రచారం
అనపర్తి ఎమ్మెల్యే అత్యుత్సాహం బలభద్రపురానికి శాపం
వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ధ్వజం