
శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం
అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం చుట్టారు. రత్నగిరిపై రామాలయం వద్ద గురువారం ఉదయం పండితులు పందిరి రాట వేశారు. తొలుత పందిరి రాటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పూలతో అలంకరించి, పూజలు చేశారు. అనంతరం సుస్వర వేద మంత్రోచ్చారణ నడుమ రాట వేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు తదితరులు పందిరి రాటకు పూజలు చేశారు. కార్యక్రమంలో వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, రామాలయ అర్చకుడు దేవులపల్లి వరప్రసాద్, స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితుడు చామర్తి కన్నబాబు, పురోహితుడు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి శ్రీరామ నవమి వేడుకలు
ఈ నెల ఐదో తేదీ నుంచి 13వ తేదీ వరకూ తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవాలను సాక్షాత్తూ సత్యదేవుడు, అమ్మవారు పెళ్లిపెద్దలుగా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు సీతాదేవి, శ్రీరామచంద్రమూర్తిని వధూవరులుగా అలంకరించడంతో శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభమవుతాయి. శ్రీరామ నవమి సందర్భంగా ఆరో తేదీ ఉదయం 10 గంటల నుంచి సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. 7న ప్రత్యేక పూజలు, 8న పండిత సదస్యం, 9, 10 తేదీల్లో సీతారాములకు ప్రత్యేక పూజలు, 11న సీతారాముల వనవిహారోత్సవం, 12న శ్రీచక్రస్నానం, దండియాడింపు నిర్వహిస్తారు. 13వ తేదీ రాత్రి రామాలయంలో నిర్వహించే శ్రీపుష్పయాగంతో కార్యక్రమాలు ముగుస్తాయి.