
త్వరలో వినియోగంలోకి..
● రూ.30 లక్షలతో
కొత్త నివేదన శాల నిర్మించిన దాత
● ముచ్చటగా 3 నెలలే అందులో
నివేదనల తయారీ
● తిరిగి ఉపయోగంలోకి తేవాలని
దేవస్థానం నిర్ణయం
అన్నవరం: రత్నగిరిపై సుమారు ఏడాదిన్నర కిందట ప్రారంభించి, కొన్నాళ్లు ఉపయోగించి, తరువాత నిరుపయోగంగా వదిలేసిన కొత్త నివేదన శాలను త్వరలో వినియోగంలోకి తీసుకుని రానున్నారు. వివరాలివీ.. సత్యదేవునికి నివేదనలు, పులిహోర, దద్ధోజనం, చక్కెర పొంగలి వంటి ప్రసాదాలు తయారు చేసేందుకు స్వామివారి ఆలయానికి దిగువన కుడివైపున గతంలో నివేదన శాల ఉండేది. దీనిని భక్తులు వేచియుండేందుకు వీలుగా కంపార్ట్‌మెంట్ తరహాలో క్యూ కాంప్లెక్స్ నిర్మించేందుకు గాను మార్చారు. దీని స్థానంలో మరో నివేదన శాల నిర్మించేందుకు అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ నిర్ణయించారు. రామాలయానికి ఎదురుగా ఉన్న సర్కులర్ మండపం మీద నూతన నివేదన శాల నిర్మించాలని పండితులు సూచించారు. దీనిపై ఈఓ అభ్యర్థన మేరకు తుని పట్టణానికి చెందిన దాత చెక్కా సూర్యనారాయణ (తాతబాబు) రూ.30 లక్షల వ్యయంతో కొత్త నివేదన శాల నిర్మించారు. దీనిని 2023 ఆగస్టు నెలలో దాత చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తరువాత సత్యదేవుని నివేదనలన్నీ ఇక్కడే తయారు చేసేవారు. ఈఓ ఆజాద్ 2023 నవంబర్‌లో బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం దేవదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న కె.రామచంద్ర మోహన్ ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తరువాత నివేదన శాల భూస్పర్శతో ఉండాలని కొంత మంది పండితులు సూచించారు. దీంతో పాత నివేదన శాలలోనే మరలా నివేదనలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు పాత నివేదన శాలకు మార్పులు చేసి, 2023 నవంబర్ నుంచి అందులోనే నివేదనలు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త నివేదన శాల నిరుపయోగంగా మారింది. దీనిపై దాత తాతబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ‘సాక్షి’ ఫిబ్రవరి 21న ‘దాతల ఆశయాలకు తూట్లు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు స్పందించారు. భక్తులకు పంపిణీ చేసే పులిహోర, దద్ధోజనం, చక్కెర పొంగలి వంటివి కొత్త నివేదన శాలలో తయారు చేయాలని ఆదేశించారు. వాటి తయారీకి అవసరమైన పాత్రలు, కుక్ నియామకం వంటి అంశాల్లో కొంత జాప్యం జరిగింది. గత నెల 28న నిర్వహించిన హుండీల ఆదాయం లెక్కింపు సందర్భంగా కొత్త నివేదన శాల వినియోగంపై సంబంధిత అధికారులను చైర్మన్, ఈఓ మరోసారి ఆదేశించారు. అవసరమైన వంట పాత్రలు కొనుగోలు చేయాలని సూచించారు. పాత నివేదన శాలలో పని చేస్తున్న వంట సహాయకురాలితో కొత్త నివేదన శాలలో పులిహోర తదితర ప్రసాదాలు తయారు చేయించాలని నిర్ణయించారు. వారం, పది రోజుల్లో కొత్త నివేదన శాలను వినియోగంలోకి తెస్తామని ఆలయ ఏఈఓ కొండలరావు తెలిపారు.