
క్రియాశీలకంగా శక్తి బృందాలు
కాకినాడ క్రైం: మహిళల భద్రత, రక్షణకు ఏర్పాటు చేసిన శక్తి బృందాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ పెద్దిరెడ్డి రామచంద్రరావు ఆధ్వర్యాన శక్తి బృందాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. గురువారం సాలిపేట బాలికోన్నత పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ప్రదర్శించారని తెలిపారు. ముగ్గురి నుంచి నలుగురితో శక్తి వారియర్ బృందాలను సిద్ధం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
30, 31 తేదీల్లోనూ
రిజిస్ట్రేషన్ విధులు
కాకినాడ లీగల్: ఈ నెల 30 ఉగాది, 31న రంజాన్ పండగల సెలవులైనప్పటికీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోని అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, ఉద్యోగులు విధులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో డీఐజీ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జిల్లా అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఈ రెండు రోజులూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి క్రయవిక్రయదారులకు అవకాశం కల్పించింది. కాగా, పండగ రెండు రోజులూ పని చేయాలనే ఆదేశాలపై రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.