రైలు నుంచి జారి పడి మహిళ మృతి
సామర్లకోట: ఒడిశాకు చెందిన ఒక యువతి బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ నుంచి గురువారం జారి పడి మృతిచెందిన సంఘటన ఇది. ఏసీ బోగీలో ప్రయాణం చేస్తున్న సుభాష్మిత దాసు (33) జి. మేడపాడు సమీపంలో బోగీ నుంచి పడిపోయింది. దీనిని గమనించిన ప్రయాణికులు వెంటనే రైలు చైన్ లాగారు. డ్రైవర్, గార్డులు రైలు నుంచి మహిళ పడిపోయిన విషయాన్ని సామర్లకోట స్టేషన్ మేనేజరు ఎం.రమేష్‌కు సమాచారం ఇచ్చారు. సుభాష్మిత కొన ఊపిరితో ఉన్న విషయాన్ని తెలుసుకొని వెనుక వస్తున్న సరార్ ఎక్స్‌ప్రెస్‌లో మహిళను ఎక్కించి సామర్లకోట తీసుకురావాలని మేడపాడులోని రైల్వే సిబ్బందికి సూచించారు. ఈ మేరకు స్టేషన్ మేనేజరు 108కు సామర్లకోట రైల్వే స్టేషన్‌కు వచ్చే విధంగా సమాచారం ఇచ్చారు. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో సామర్లకోట చేరిన మహిళను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె థర్డు ఏసీలో ప్రయాణం చేస్తున్నట్లు స్టేషన్ మేనేజరు తెలిపారు. సుభాష్మిత మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని విజయవాడ డీఆర్‌ఎం కార్యాలయం నుంచి సూచనలు వచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment