రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలు
● భర్త పరిస్థితి విషమం
● మోటారు బైక్‌ను ఢీ కొన్న కారు
● కారు డ్రైవ్ చేసిన మైనర్లు
సామర్లకోట: మైనర్లు కారు డ్రైవింగ్ చేయడంతో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటారు సైకిల్‌పై వెళుతున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడిన ఘటన ఇది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వేట్లపాలెం, గాంధీనగర్‌కు చెందిన గద్దె లక్ష్మణరావు, శిరిష మోటారు సైకిల్‌పై కాకినాడ ఆస్పత్రికి వెళుతున్నారు. సామర్లకోట నుంచి వేట్లపాలెం అతి వేగంగా వస్తున్న కారు కెనాల్ రోడ్డులో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద మోటారు సైకిల్‌ను ఢీ కొనడంతో ఐదు అడుగుల ఎత్తు ఎగిరి కింద పడింది. డ్రైవింగ్ చేస్తున్న మైనర్ బాలుడు కారును అదుపు చేయలేక పోవడంతో కింద పడిన వారిని 20 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుపోయి రోడ్డు మార్జిన్‌లో కారు ఆగింది. కారు వేగం తగ్గించే క్రమంలో బ్రేక్ తొక్కబోయి, ఎక్స్‌లేటర్ తొక్కడం వల్ల కారు వేగం పెరిగినట్టు కారులో ఉన్న మైనర్లు చెప్పారని స్థానికులు తెలిపారు. ఇంటి నుంచి బయలు దేరిన 10 నిమిషాలకు ప్రమాదం జరిగినట్టు తెలియడంతో గ్రామ ప్రజలు ఘటనా ప్రదేశానికి చేరుకొని ప్రత్యేక అంబులెన్సులో క్షతగాత్రులను కాకినాడ ట్రస్టు ఆస్పత్రికి తరలించారు. కారులో ఐదుగురు మైనర్లు ఉండగా ఒక మైనర్ బాలుడు పారిపోవడంతో మిగిలిన నలుగురిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన్నట్లు స్థానికులు తెలిపారు. బలభద్రపురానికి చెందిన ట్రావెల్ ఏజెన్సీ నుంచి రమేష్ అనే వ్యక్తి కారును అద్దెకు తీసుకొనగా అతని నుంచి బిక్కవోలుకు చెందిన మైనర్ యువకులు కారు తీసుకున్నట్లు తెలిసింది. క్షతగాత్రుడు గద్దె లక్ష్మణరావు వేట్లపాలెం సమీపంలో ఉన్న హుస్సేపురం వెంకట్రామ ఆయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడని వేట్లపాలెం గ్రామస్తులు తెలిపారు. ఘటనలో కారు నుజ్జు నుజ్జు కాగా మోటారు సైకిలు ధ్వంసం అయింది. సీఐ ఎ.కృష్ణభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలు


