
ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం కేసులో నిందితుడి అ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం కేసులో నిందితుడు దువ్వాడ మాధవరావు దీపక్‌ను స్థానిక ప్రకాశం నగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దిశ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిశోర్ ఈ వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడేనికి చెందిన విద్యార్థిని కోరుకొండ మండలం మధురపూడిలోని వికాస్ ఫార్మా కళాశాలలో ఫార్మ్–డి చివరి సంవత్సరం చదువుతోంది. రాజమహేంద్రవరం నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తొమ్మిది నెలలుగా ఇంటర్న్‌షిప్ చేస్తూ, ఫార్మాలజిస్టుగా పని చేస్తోంది. అక్కడకు సమీపంలోనే ఒక రూము అద్దెకు తీసుకుని ఉంటోంది. అదే ఆసుపత్రిలో పనిచేసే దీపక్ అనే వ్యక్తి ప్రేమ పేరిట ఆమె వెనకాల తిరిగాడు. లైంగికంగా వేధించి, ప్రేమించానని నమ్మించి, మోసగించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థిని ఈ నెల 23న డ్యూటీ చేస్తూ మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకుంది. దీనిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె రూములోని డైరీలో దొరికిన సూసైడ్ నోట్‌లో దీపక్ వేధింపులు భరించలేకే తాను చనిపోతున్నట్లు రాసి ఉందని పోలీసులకు ఆమె తండ్రి తెలిపారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. దీపక్ ఆచూకీ కోసం గాలించి, అతడిని విద్యానగర్‌లోని ఇంటి వద్ద ప్రకాశం నగర్ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్ నిమిత్తం సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ బాజీలాల్, కానిస్టేబుల్ వి.శివప్రసాద్, జె.ఈశ్వరరావులను అభినందించి, రివార్డు ప్రకటించారు.