
వేట నిషేధ భృతికి మత్స్యకారుల గుర్తింపు
కాకినాడ రూరల్: ఈ నెల 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం అమలులోకి రావడంతో వేట నిషేధ భృతి అందజేసేందుకు మత్స్యకారుల గుర్తింపు ప్రక్రియను అధికారులు శుక్రవారం చేపట్టారు. ఈ ప్రక్రియను దాదాపు ఒకే రోజులో పూర్తి చేసే లక్ష్యంతో ఉదయమే ఎన్యూమరేషన్ మొదలు పెట్టారు. జిల్లాలో సుమారు 4,600 బోట్లు ఉండగా సుమారు 24 వేల మంది గంగపుత్రులు లబ్ధి పొందనున్నారు. బోటు యజమాని తన బోటుపై వేట సాగించే మత్స్యకారులు జాబితాను, వారి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను మత్స్యశాఖ అధికారులకు అందజేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకే 3,725 బోట్లకు సంబంధించిన మత్స్యకారులు గుర్తింపు పూర్తి చేశారు. మిగిలిన వారిని శనివారం గుర్తిస్తామని జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక ఆన్‌లైన్‌లో వివరాలు అప్‌లోడ్ చేసి, 21న సోషల్ ఆడిట్ వివరాలు వెల్లడించనున్నారు. 22న అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం, సవరణలు చేసి 23న మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయానికి జాబితా అందజేస్తారు. ఈ నెల 26న వేట నిషేధ భృతిని మత్స్యకారుల ఖాతాలకు జమ చేయనున్నారు. దీనిని అర్హులైన అందరికీ వర్తింపజేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.