రామాయపట్నం.. మూలపేట.. మచిలీపట్నం పరంపరలో రాష్ట్రంలో మరో పోర్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే మూడు పోర్టులు (కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్, రవ్వ క్యాపిటివ్) ఉన్న కాకినాడ సిగలో త్వరలో మరో పోర్టు చేరనుంది. కాకినాడ సమీపంలోని తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద సుమారు 1,944 ఎకారాల్లో కాకినాడ సెజ్ గేట్‌వే పోర్టు (కే–సెజ్ పోర్టు)ను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మిస్తున్న ఈ పోర్టు పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. తొలిదశలో సుమారు రూ.2,123.43 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఏడాదికి 16 మిలియన్ టన్నుల సామర్థ్యం, నాలుగు బెర్తులతో అరబిందో గ్రూపు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. 2023 ప్రారంభంలో మొదలైన ఈ పోర్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. పోర్టు నిర్మాణంలో కీలకమైన నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్‌ను నిర్మించడానికి 12 లక్షల టన్నుల రాయిని ఇప్పటివరకు వినియోగించారు. బ్రేక్ వాటర్ నిర్మాణం ఇప్పటికే 45 శాతం మేర పూర్తికాగా మొత్తం ప్రాజెక్టులో పనులు 18 శాతం వరకు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.
– సాక్షి, అమరావతి
పర్యావరణ అనుమతులు మంజూరు..
5,886 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కాకినాడ సెజ్ మధ్యలో ఈ పోర్టు నిర్మాణం జరుగుతోంది. మల్టీ ప్రోడక్ట్ ఇండస్ట్రియల్ జోన్‌గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఈ మధ్యనే కీలక అనుమతులు లభించాయి. ఈ పోర్టు నిర్మాణాన్ని 2025 నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పోర్టులో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయంలో 2.70 శాతం ప్రభుత్వానికి రానుండగా.. 31–40 ఏళ్ల వరకు 5.40 శాతం, 41–50 ఏళ్ల వరకు 10.80 శాతం వాటా ఏపీ మారిటైమ్ బోర్డుకు సమకూరనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా 3,000 మందికి పరోక్షంగా 10,000 మందికి చొప్పున మొత్తం 13,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పోర్టు లావాదేవీలు, పరిశ్రమల రాకతో రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఆదాయం, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని ఆర్థికవేత్తలు స్పష్టంచేస్తున్నారు.
మౌలిక వసతులకు భారీ వ్యయం..
► కే–సెజ్ గేట్‌వే పోర్టును ఇటు కాకినాడతో పాటు అటు అన్నవరం వద్ద జాతీయ రహదారికి రోడ్డు, రైల్వేలైన్ ద్వారా అనుసంధానించనున్నారు.
► సాగరమాల ప్రాజెక్టుకు కింద 40.కి.మీ మేర నాలుగులైన్ల రహదారిని రూ.1,480 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
► అలాగే, ఈ పోర్టును అన్నవరానికి అనుసంధానిస్తూ రూ.300 కోట్లతో 25కి.మీ మేర రైల్వేలైన్‌ను ఏర్పాటుచేయనున్నారు.
► 24 నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా 400/200 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేయడానికి ట్రన్స్‌కోకు 64 ఎకరాలను కేటాయించారు. 2,000 ఎంవీఏ విద్యుత్‌ను ఉత్పత్తి సామర్థ్యాన్ని తట్టుకునే విధంగా ఈ సబ్‌స్టేషన్‌ను అనుసంధానిస్తున్నారు.
► ఈ సెజ్‌లోని పరిశ్రమల ద్వారా వచ్చే వ్యర్థాలను శుద్ధిచేయడానికి ఒక ఉమ్మడి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటుచేయడమే కాకుండా ఈ వ్యర్థాలను గొట్టాల ద్వారా 35 కి.మీ దూరంలోని పాయకరావుపేటవరకు తరలించి అక్కడ నుంచి సుమారు రెండు కి.మీ లోతున సముద్రంలో కలపనున్నారు.
► ఇక్కడ యూనిట్లకు అవసరమైన నీటిని పోలవరం కాలువతో పాటు సుముద్రపు నీటిని శుద్ధిచేసుకుని వినియోగించుకునేందుకు డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు.
► అన్నవరం నుంచి పోలవరం కాలువ ద్వారా 100 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేయడంతో పాటు రూ.100 కోట్లతో డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు.
రూ.50,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..
ఇలా అన్ని మౌలిక వసతులతో పోర్టు అభివృద్ధి చేస్తుండటంతో ఈ పోర్టు పక్కనే దివీస్ భారీ ఫార్మా యూనిట్, రూ.2,000 కోట్లతో లైఫియస్ ఫార్మా పేరుతో పెన్సులిన్ తయారీ యూనిట్‌ను.. రూ.2,000 కోట్లతో క్యూలే ఫార్మా యూనిట్‌ను అరబిందో ఫార్మా ఏర్పాటుచేస్తోంది. వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఈ సెజ్ ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రూ,5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఫార్మాస్యూటికల్స్, గ్రీన్ హైడ్రోజన్, టెక్స్‌టైల్స్, ఆక్వా, స్టీల్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి.
కాకినాడ సెజ్‌కు ఆనుకుని ఉన్న ఉప్పాడ వద్ద రాష్ట్ర ప్రభుత్వం మినీపోర్టు తరహాలో భారీ ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేస్తుండటంతో ఆక్వా రంగానికి చెందిన పలు సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే నెక్కంటి సీ ఫుడ్స్, దేవీ ఫిషరీస్, సంధ్య ఆక్వా, కాంటినెంటల్ ఫిషరీస్, ఆదివిష్ణు వంటి పలు సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించి 8,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఇందులో అత్యధికమంది మహిళలు.. పైగా స్థానికులే కావడం గమనార్హం.
2025 నాటికి అందుబాటులోకి తెస్తాం..
ఇప్పటికే కీలకమైన బ్రేక్ వాటర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే డ్రెడ్జింగ్ బెర్తుల నిర్మాణ పనులు ప్రారంభించనున్నాం. బ్యాంకులతో రుణాల ద్వారా నిధుల సమీకరణ పూర్తికావడంతో ఇక పనులు వేగవంతం కానున్నాయి. 2025 ద్వితీయ త్రైమాసికం నాటికి పోర్టును పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
– ఓం రామిరెడ్డి, ఎండీ, కాకినాడ గేట్‌వే పోర్ట్స్ లిమిటెడ్
మా వాళ్లకు ఉద్యోగాలొస్తాయన్న ఆశ..
నాకున్న నాలుగెకరాల భూమి సెజ్‌కు ఇచ్చాను. ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మాలాంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. మా వాళ్లు బాగుపడతారనే నమ్మకంతో భూమి ఇచ్చాను. అందుకు తగ్గట్లుగానే సెజ్‌లో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాను. పెద్దగా చదువుకోకున్నా భూమి ఇచ్చాననే కారణంతో ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఫ్యాక్టరీలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది.
– యాదాల చంటిబాబు. ఆవులమంద, పెరుమాళ్లపురం, తొండంగి మండలం
ఇప్పుడు పనులు వేగవంతమయ్యాయి..
గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. గతంలో పట్టించుకునే వారు కాదు. ఇప్పుడు సెజ్‌లో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సెజ్‌కు భూమి ఇచ్చిన వారిలో నేను ఒకడిని. గత పాలనలో కొంతమందిని బెదిరించి భూములు లాక్కున్నారు. అప్పట్లో నాపై అన్యాయంగా 15 కేసులు బనాయించారు. ఈ ప్రభుత్వం వచ్చాక గత డిసెంబరు 26న 12 కేసులు ఎత్తేశారు. మరో 3 కేసులు నాపై పెండింగ్‌లో ఉన్నాయి.
– దూలం శ్రీను, గోర్సపాలెం, తొండంగి మండలం
Comments
Please login to add a commentAdd a comment