సీఎం వైఎస్‌ జగన్‌: కన్నీళ్లు తుడిచే నేత కోసం కదిలొచ్చిన కోనసీమ | YS Jagan Mummidivaram Tour Highlights - Sakshi
Sakshi News home page

కన్నీళ్లు తుడిచే నేత కోసం కదిలొచ్చిన కోనసీమ  

Published Fri, Nov 22 2019 9:30 AM | Last Updated on Fri, Nov 22 2019 11:17 AM

CM YS Jagan Mohan Reddy East Godavari Tour Highlights - Sakshi

మత్స్యకార మహిళలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, కాకినాడ: కన్నీళ్లు తుడిచే నేతను చూసేందుకు కోనసీమ తరలివచ్చింది. తమ కడగండ్లు తీర్చే దైవాన్ని దర్శించుకునేందుకు గంగపుత్రులు బారులు తీరారు. నీరా‘జనాలు’ పలికారు. తమ అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు. సంక్షేమ పథకాల రూపంలో తమకు భరోసా ఇచ్చే ప్రసంగానికి కరతాళ ధ్వనులు, ఈలలతో కృతజ్ఞతలు చెప్పారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో మత్స్యకార గ్రామమైన కొమానపల్లి జనంతో కిక్కిరిసిపోయింది. బహిరంగ సభా స్థలి వద్ద జన సునామీ ఏర్పడింది. ఇసుకేస్తే రాలనంతగా ఎక్కడ చూసినా జనమే. సభా ప్రాంగణం మొత్తం జనంతో నిండిపోయింది. 

ఉత్సాహ తరంగం 
► సీఎం ప్రసంగం మొదలు పెట్టగానే సభా స్థలిలో ప్రజల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. తమ అభిమాన నేతను చూడగానే ఒక్కసారిగా పైకి లేచి ‘జై జగన్‌’ అంటూ నినాదాలు చేశారు. 
► పాదయాత్ర సమయంలో మత్స్యకారుల బాధలు తాను విన్నానని.. అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ దూరం చేస్తానని ఆనాడు.. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని భరోసా ఇచ్చానని సీఎం గుర్తు చేయగానే ఒక్కసారిగా యువకులు, మత్స్యకారులు, ప్రజలు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు.  
► గంగపుత్రులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని, వారి స్థితిగతులను కళ్లారా చూశానని, వాటి పరిష్కారానికి ప్రస్తుతం అడుగులు వేస్తున్నామని సీఎం చెప్పగానే మత్స్యకారుల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. పైకి లేచి ఈలలు, చప్పట్లతో సభా ప్రాంగణాన్ని దద్దరిల్లేలా చేశారు. తమకు మొదటి దైవం గంగమ్మతల్లి అయితే.. తమ బతుకులు మార్చేందుకు వచ్చిన రెండో దైవం వైఎస్‌ జగన్‌ అంటూ గంగపుత్రులు హర్షధ్వానాలు చేశారు.  
► వేట నిషేధ సమయంలో గతంలో ఇస్తున్న రూ.6 వేల పరిహారాన్ని రూ.9 వేలకు పెంచామని ప్రకటించగానే ఇక తమ కష్టాలు తొలగిపోతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.   
► ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారుల అకౌంట్లో నగదు జమ చేసే ప్రక్రియ మొదలు పెట్టగానే మత్స్యకారులు ఆనందంతో నృత్యాలు చేశారు.   
► వేటకు వెళ్లిన అన్నదమ్ములు దురదృష్టవశాత్తూ ప్రమాదాల బారిన పడి మృతి చెందితే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తామని సీఎం ప్రకటించగానే మళ్లీ ఒక్క సారిగా మత్స్యకారులు లేచి ఈలలు, చప్పట్లతో అభిమాన నేతకు కృతజ్ఙతలు తెలిపారు. ఇలా సభ జరిగినంత సేపు ఈలలు, చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోమోగింది. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలు పూర్తిగా నిండిపోవడంతో రహదారిపై, కొబ్బరి చెట్ల వద్ద ఉండి ఎండని సైతం లెక్క చేయకుండా సీఎం ప్రసంగం విన్నారు. 


► ఐదు నెలల్లోనే హామీలు నెరవేస్తుంటే... 
అధికారం చేపట్టిన ఐదు మాసాల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే.. తనపై ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంగ్ల విద్య అభ్యసించి పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం తీసుకొస్తుంటే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. తనను మీ బిడ్డగా భావించి అండగా ఉండాలని సీఎం కోరారు. దీంతో ప్రజలు తమ బిడ్డలా ఆదరిస్తామని చప్పట్లు కొట్టి తమ మనసులోని భావాన్ని వ్యక్తపరిచారు.  
 
► అడుగడుగునా ఘన స్వాగతం   
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా తొలుత ముమ్మిడివరం మండలం గాడిలంకకు హెలీకాప్టర్‌ ద్వారా చేరుకున్నారు. ఆయనకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రజలు అభిమాన నేతను చూసి ఆనందంతో కేరింతలు కొట్టారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఐ.పోలవరం మండలం వలసలతిప్ప వద్ద రూ.35 కోట్లతో నిర్మించిన హైలెవెల్‌ బ్రిడ్జి ప్రారంభించేందుకు  వెళ్లారు. దారిపొడవునా జననేతకు స్వాగతం పలికేందుకు వేచి ఉన్న ప్రజలకు సీఎం అభివాదం చేస్తూ ముందుకు సాగారు.    
 స్టాల్స్‌ పరిశీలన  
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్‌ను సీఎం పరిశీలించారు. మత్స్యశాఖ ఏర్పాటు చేసిన ఆక్వా పరిశ్రమ ఉత్పత్తులను పరిశీలించి యాంటీబయోటిక్స్‌ లేకుండా ప్రకృతి పరంగా సహజ విధానాల ద్వారా పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక శాఖల ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆక్వా రంగ అభివృద్ధిని సీఎంకు వివరించారు.
  
► అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
 
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రాలకు ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన చేశారు. సింగంపల్లి, గండిపోచమ్మ, పేరంటాలపల్లి, పోచవరం, విజయవాడ దగ్గర బమ్రా పార్క్, రాజమహేంద్రవరం, రుషికొండ, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో రూ.1.62 కోట్లతో నిర్మించే కేంద్రాలను 90 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. కరప మండలం ఉప్పలంక గ్రామంలో రూ.1.06 కోట్లతో చేపట్టే ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు, ఎదుర్లంక గ్రామం రామాలయంపేట వద్ద 9వ కిలోమీటర్‌ నుంచి 11 వరకు రూ.79.76 కోట్ల వ్యయంతో నిర్మించే వరద కోత, ప్లడ్‌ బ్యాంక్‌ పనులకు శంకుస్థాపన చేశారు.
  
మత్స్యకారులకు పరిహారం పంపిణీ  
గుజరాత్‌ రాష్ట్ర పెట్రోలియం సంస్థ గతంలో పైపులైను వేసే సమయంలో జిల్లాలోని 8 మండలాల పరిధిలోని 68 గ్రామాలకు చెందిన 5,060 బోట్లకు చెందిన 16,559 మంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. తమకు పరిహారం ఇవ్వాలని 103 రోజుల పాటు వారు ఉద్యమించారు. ఆ సమయంలో 13 నెలలకు గాను 6 మాసాలకు మాత్రమే సదరు సంస్థ నష్టపరిహారం చెల్లించింది. పాదయాత్ర సమయంలో జగన్‌ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిహారం చెల్లిస్తామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 7 నెలల కాలానికి సంబంధించి రూ.78.24 కోట్ల పరిహారం చెల్లించారు. ఆ మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. పరిహారం అప్పట్లో ధర్నాలు చేసినా పట్టించుకున్న వారు లేరని, అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం అండగా నిలించిందని సీఎం గుర్తుచేశారు.  
ధర్మాడికి సన్మానం  
దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటును వెలికి తీసిన ధార్మాడి సత్యంను సీఎం సభా వేదికపై సన్మానించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం బోటును వెలికి తీసిన సత్యం బృందాన్ని వేదికపైకి ఆహ్వానించారు. సత్యంకు శాలువా కప్పి సన్మానించారు. బోటు వెలికి తీసినందుకు అభినందించారు.     
వైఎస్సార్‌ వారధి ప్రారంభం  
వృద్ధ గౌతమి గోదావరిపై ఐ.పోలవరం మండలం పశువుల్లంక–సలాదివారిపాలెం మధ్యలో రూ.35 కోట్లతో నిర్మించిన వైఎస్సార్‌ వారధిని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ వంతెనకు 2009లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ వంతెన వల్ల గోదావరికి అటు, ఇటు ఉన్న 11 గ్రామాల్లోని 12 వేల మందికి ప్రయోజనం కలుగుతుంది. వేలాది మంది మత్స్యకారుల చిరకాల కోరిక నెరవేరింది. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్‌ నిలువెత్తు విగ్రహానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నివాళులరి్పంచారు. స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరించారు.  

మత్స్యకార భరోసా అందజేత  
జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లోని 99 మత్స్యకార గ్రామాల పరిధిలో 1.15 లక్షల మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. వీరిలో 60 వేల మంది చేపల వేటపై జీవిస్తున్నారు. వీరికి వేటనిషేధ సమయంలో కుటుంబ పోషణ కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో గంగపుత్రులను ఆదుకునేందుకు వేట నిõÙధ భృతి అందజేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వేట నిషేధ సమయం ముగుస్తున్నప్పుడు అధికారంలోకి వచ్చినా.. ఇచ్చిన మాట కోసం నిషేధ మొత్తాన్ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. జిల్లా వ్యాప్తంగా 19 వేల మందికి రూ.19 కోట్ల మేర నిధులు వారి వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ సభా వేదికపై నుంచే ప్రారంభించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement