బాబుపై క్రిమినల్‌ నెగ్లిజెన్స్‌ కేసు పెట్టాలి: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబే బాధ్యుడు: వైఎస్‌ జగన్‌

Published Thu, Sep 12 2024 4:52 AM | Last Updated on Thu, Sep 12 2024 7:05 AM

YSRCP President YS Jagan Fires On Chandrababu

ఆయనపై క్రిమినల్‌ నెగ్లిజెన్స్‌ కింద కేసు పెట్టాలి

వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపాటు

బుడమేరు వరదల్లో 60 మంది మృతికి చంద్రబాబే కారణం

సమయం ఉన్నా ముందస్తు చర్యలు తీసుకోలేదు  

అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా కేసులు.. బోట్లతో రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు  

రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో దాడులు, దౌర్జన్యాలు.. తప్పుడు సంప్రదాయాలకు నాంది  

బోట్లకు అనుమతులిచ్చింది బాబు హయాంలోనే.. 

డైవర్షన్‌ కోసమే నాలుగేళ్ల కిందటి పాత కేసులో నందిగం సురేష్‌ అక్రమ అరెస్ట్‌  

ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని గుర్తుంచుకోండి 

ఇలానే చేస్తే రేపు మీరు ఇదే జైళ్లలో ఉంటారు 

ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని బోగస్‌ స్టోరీలు రాయిస్తున్నారని ధ్వజం  

గుంటూరు సబ్‌ జైలులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు పరామర్శ.. 

టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన ఈదా సాంబిరెడ్డికి ధైర్యం చెప్పిన జగన్‌  

చంద్రబాబు రెడ్‌బుక్‌ పాలనలో నిమగ్నమై తుపాన్‌ వస్తోందన్న సంకేతాలను పట్టించు కోలేదు. శుక్రవారం (గత నెల 30వ తేదీ) నుంచి భారీ వర్షాలు వస్తాయన్న అలర్ట్‌ బుధవారమే (గత నెల 28వ తేదీ) వచ్చింది. చంద్రబాబు వద్ద బుధ, గురు, శుక్రవారం మధ్యాహ్నం వరకు సమయం ఉండింది. మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ నుంచి వరద నీరు వస్తోందని కూడా తెలుసు. అలాంటప్పుడు బాబు బుధవారమే రెవెన్యూ, ఇరిగేషన్, హోం సెక్రటరీలతో సమీక్ష నిర్వహించి ఉండాలి. అలా చేసి ఉంటే డ్యాంలన్నీ నిండి ఉన్నాయనే విషయం అర్థమయ్యేది.       
 – వైఎస్‌ జగన్‌

ఇరిగేషన్‌ సెక్రటరీ నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల డ్యాంలలో ఒక్కోదానిలో కనీసం 25 టీఎంసీలను తగ్గించుకుంటూ వచ్చి ఫ్లడ్‌ కుషన్‌ ఉండేలా చూసేవారు. పై నుంచి వస్తున్న వరదను ఆయా డ్యాంలలో ఉన్న ఫ్లడ్‌ కుషన్‌లో అడ్జస్ట్‌ చేసే అవకాశం ఉండేది. రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్‌ క్యాంపులు ఏర్పాటు చేసి అందులో ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు చేసేవారు. హోం సెక్రటరీ లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే పని చేసేవారు. ఈ పనులన్నీ చంద్రబాబు ఎందుకు చేయలేదు?  
– వైఎస్‌ జగన్‌

ఫ్లడ్‌ కుషన్‌ ఏర్పాటు చేయకపోవడం వల్ల పై నుంచి వచ్చే నీరు, ఇక్కడ వచ్చిన వరద నీరు కలిసి ప్రళయంగా మారింది. చివరికి బుడమేరు కూడా కృష్ణా నదికి పోవాల్సి ఉండగా, తన ఇంటిని రక్షించుకునేందుకు అర్ధరాత్రి ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎత్తేశారు. చంద్రబాబు చేసిన ఈ దుశ్చర్య, ఈ తప్పుడు పని వల్ల ఏకంగా సుమారు 60 మంది చనిపోయారు. ఇంకా పూర్తి లెక్క తేలలేదు. గతంలో ఎప్పుడైనా తుపాను వస్తే ఇంత మంది చనిపోయిన ఘటనలు ఉన్నాయా? ఇంత మంది చనిపోవడానికి కారకుడైన చంద్రబాబుపై క్రిమినల్‌ నెగ్లిజెన్స్‌ కింద కేసు పెట్టాలి.

గుంటూరులో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై, ప్రజలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీసుల ద్వారా పాత కేసుల్లో కావాలని చాలా మందిని ఇరికిస్తున్నారు. తప్పుడు సంప్రదాయాలకు నాంది పలుకుతున్నారు. ఇవి ఇలానే కొనసాగితే.. రేపు మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైళ్లలో ఉంటారు. మార్పు తెచ్చుకోకపోతే ఇబ్బంది పడతారు. రెడ్‌బుక్‌ పెట్టుకోవడం చాలా సులభం. ఎవరికి చెప్పినా ఆ పని చేస్తారు. ఇది ఘన కార్యం, గొప్ప పనికాదు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని గుర్తుంచుకోండి.  
– వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వర్షాలకు 60 మంది చనిపోవడం ఎప్పుడూ లేదు. సహాయక చర్యలకు సమయం ఉన్నా చంద్రబాబు నాయుడు స్పందించక పోవడం వల్లే అంత మంది మృతి చెందారు. క్రిమినల్‌ నెగ్లిజెన్స్‌ కింద చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టకూడదు?’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. వరదల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని పక్కదారి పట్టించేందుకే మూడు, నాలుగేళ్ల క్రితం కేసును బయటకు తీసి దానిలో సంబంధం లేని ఒక దళిత మాజీ ఎంపీని అరెస్టు చేసి లోపలపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజల గోడు పట్టించుకోకుండా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. శిశుపాలుడి వంద తప్పులు త్వరలోనే పూర్తవుతాయని, ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని.. తప్పుడు సంప్రదాయాలు సృష్టిస్తే దాని ఫలితం మీరు అనుభవించక తప్పదని హెచ్చరించారు. గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌, విజయవాడ డిప్యూటీ మేయర్‌ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిలను బుధవారం ఆయన ములాఖాత్‌లో కలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 

నిస్సిగ్గుగా డైవర్షన్‌ పాలిటిక్స్‌ 
వరదకు ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు వస్తే, దాన్ని రాజ­కీయం చేయాలని చూస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. ఇదే పెద్దమనిషి బోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ బోట్లు ఎవరివి? ఎవరి హయాంలో అనుమతులు వచ్చాయి? చంద్రబాబు హయాంలోనే కదా.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే బోట్లలో విజయోత్సవం చేసుకున్నది నిజం కాదా? 4 నెలలుగా చంద్రబాబుతో కలిసి ఇసుక దోపిడీలో భాగస్వాములయ్యారు. ఉషాద్రి అనే వ్యక్తి  ఎవరు? చంద్రబాబు, లోకేశ్‌తో ఫొటోలు కూడా దిగారు. 

అలాగే రామ్మోహన్‌న్‌అనే వ్యక్తి కూడా టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నేత కోమటి జయరాం సోదరుడి కుమారుడు కాదా? ఆలూరి చిన్న అనే వ్యక్తి కూడా టీడీపీ మనిషే. తన నిర్లక్ష్యంతో చంద్రబాబు 60 మందిని చంపేసిన విషయాన్ని పక్కదోవ పట్టించడానికి నానా యత్నాలు చేస్తూ వేలు ప్రతిపక్షం వైపు చూపిస్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పు జరిగితే క్షమాపణ చెప్పాల్సింది మీరు. ప్రజలకు అండగా నిలబడాల్సింది మీరు. దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాక్షస పాలన సాగిస్తున్నారు.  

ఎల్లో మీడియాతో బోగస్‌ స్టోరీలు 
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ని అడ్డం పెట్టుకుని గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియాతో బోగస్‌ స్టోరీలు రాయిస్తున్నారు. రెయిన్‌ గేజ్‌ మీటర్లు చెడిపోయాయని ఈనాడులో స్టోరీ రాశారు. దీని వల్ల వర్షం ఎంత పడిందో చంద్రబాబుకు తెలియడం లేదన్నట్టు రాశారు. ఎంత దుర్మార్గంగా రాస్తున్నారంటే అసలు మనుషులేనా? రాష్ట్రంలో పాత రెయిన్‌ గేజ్‌ మీటర్ల స్థానంలో ఆటోమేటిక్‌ సెన్సార్‌ వ్యవస్థలు వచ్చాయి. రాష్ట్రంలో 1,599 వెదర్‌ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని మరింత బలపరుస్తూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా 450 ఏర్పాటు చేశాం. 

ఇవి లేకపోతే వర్షాలు వచ్చిన రోజు ఏ మండలంలో ఎంత పడిందో ఎలా చెప్పగలిగారు? విజయవాడలో ఇంత పడిందీ, జి.కొండూరులో ఇంత పడిందీ అని ఎలా చెప్పగలిగారు? ఇవన్నీ ఉన్నాయి కనుకే రైతులకు ఇన్సూ్యరెన్స్‌ వస్తోంది. ఈ క్రాప్‌ నమోదు అవుతోంది. కళ్లెదుట ఇన్ని వాస్తవాలున్నా టాపిక్‌ డైవర్షన్‌లో భాగంగా రెయిన్‌ గేజ్‌ మీటర్లు చెడిపోతే పట్టించుకోలేదని, ఇప్పుడు చంద్రబాబు బాగు చేయిస్తున్నారని రాశారు. ఈనాడు దినపత్రికకు సిగ్గుండాలి. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు.  

ప్రశ్నించకూడదనే దాడులు.. 
చంద్రబాబు పాలన ఎంత దుర్మార్గంగా ఉందో మంగళవారం జరిగిన సంఘటనే సాక్ష్యం. వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి వారికి అండగా ఉండేందుకు వచ్చిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే శంకరరావును అడ్డుకున్నారు. ఆయన కార్లు పగలగొట్టారు. వరద బాధితులను పరామర్శించకూడదట. ఆ ప్రాంతాలను చూడ కూడదట. అలా చేస్తే చంద్రబాబునాయుడి తప్పిదాలు బయటకు రావని వారు అనుకుంటున్నారు. అయ్యా చంద్రబాబూ.. ఇవన్నీ తాత్కాలికం. నష్టపోయింది, దెబ్బతిన్నదీ, నొప్పి కలిగేది ప్రజలకు. 

ఈ ప్రజలే చంద్రబాబు చేస్తున్న తప్పులను యాడ్‌ చేసుకుంటూ పోతున్నారు. శిశుపాలుడిలా వంద తప్పులు వేగంగా చేస్తుండటాన్ని వారు గమనిస్తున్నారు. మీరు, మీ పార్టీ భూస్థాపితం అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా పని చేసిన సాంబిరెడ్డి కారు ఆపి.. కాళ్లు, చేతులు రాడ్లతో విరగ్గొట్టి మరణించాడనుకుని వదిలి వెళ్లారు. ఎవరూ జెండా పట్టుకోకూడదు. ప్రజలు ఎవరూ నిలదీయకూడదనే వైఖరిలో అధికార పార్టీ ఉంది.

అధైర్య పడొద్దు..  
తెలుగుదేశం గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి, శస్త్రచికిత్స అనంతరం గత రెండు నెలలుగా మంచానికే పరిమితమైన క్రోసూరు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ఈదా సాంబిరెడ్డిని బుధవారం వైఎస్‌ జగన్‌ గుంటూరులోని ఎస్వీఎన్‌ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అధైర్య పడొద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. టీడీపీ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొందామని, వారి దాడులకు భయపడేది లేదన్నారు. 

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, మాజీ మంత్రులు విడదల రజిని, ఆదిమూలపు సురేష్‌, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంకరరావు, కైలే అనిల్‌కుమార్, అన్నాబత్తుని శివకుమార్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, డిప్యూటీ మేయర్‌ వనమా బాల వజ్రబాబు ఉన్నారు.

ఒక సీఎంను పట్టుకుని బోస్‌డీకే అని అంటారా?
ఏపీ చరిత్రలో ఇంత దుర్మార్గమైన, అన్యాయమైన పాలన ఎప్పుడూ చూసి ఉండరు. వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమై పోతున్న సమయంలో ఈనెల 4వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్‌కు వెళ్లి మాజీ పార్లమెంటు సభ్యుడైన ఒక దళిత నాయకుడ్ని అక్రమంగా అరెస్టు చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే వరదల్లో దాదాపు 60 మంది చనిపోయారని విజయవాడ అట్టుడుకుతుంటే టాపిక్‌ డైవర్ట్‌ చేయడం కోసం నగర డిప్యూటీ మేయర్‌ భర్తను అరెస్టు చేశారు. వరద సహాయక చర్యల్లో చంద్రబాబు పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు. డైవర్షన్‌  కోసమే ఈ అరెస్టులు. 

టీడీపీ కార్యాలయం కేసు జరిగి దాదాపు నాలుగేళ్లయింది. ఆ రోజు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని బోస్‌డీకే అని తిట్టాడు. బోస్‌డీకే అంటే ఏంటో తెలుసా? లంజాకొడకా అని. నిజంగా ఆ మాదిరిగా తిడితే, అలాంటి మాటలు అన్న తర్వాత ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వారు, కడుపు మండిన వారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ వద్ద ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్న వారి మీద టీడీపీ వాళ్లు దాడులు చేశారు. ఆ దాడి జరిగిన సమయంలో, తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై కూడా రాళ్లు పడ్డాయి. 

సీఎంని అంత మాట అన్నా సరే, మేం చంద్రబాబు మీద కక్ష సాధింపుకు దిగలేదు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలు చూసి ఆ ఘటనలో ఉన్న వారందరికీ చట్ట ప్రకారం 41ఏ నోటీసులు ఇచ్చి అరెస్టు చూపించాం. ఏడేళ్ల లోపు శిక్షా కాల పరిమితి ఉన్న కేసు కాబట్టి చట్ట ప్రకారం, నిబద్ధతతో వ్యవహరించాం. అప్పటి ఎంపీ నందిగం సురేష్‌ కానీ, విజయవాడ డిప్యూటీ మేయర్‌ భర్త కాని ఈ ఘటనలో లేరు. 

ఈ విషయం సెల్‌ఫోన్లు ట్రాక్‌ చేస్తే తెలియదా? టీడీపీ ఆఫీసు సీసీ కెమెరాలు చూసినా తెలుస్తుంది. వీరెవరూ లేనప్పుడు, మూడేళ్ల తర్వాత దాన్ని మళ్లీ తవ్వి, అందులో ఉన్న వారిని భయపెట్టి, ప్రలోభపెట్టి తప్పుడు స్టేట్‌మెంట్లతో అరెస్టు చేస్తున్నారు. రెడ్‌బుక్‌లో పేర్లున్న వారి ఇళ్లు ధ్వంసం చేయడం, వాళ్లపై దాడులు చేయడం, వాళ్లపై కేసులు పెట్టడం, రాజ్యాధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం చేస్తున్నారు. చంద్రబాబునాయుడి ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు. కొన్ని లక్షల మంది అగచాట్లు పడుతున్నారు. ఇంతకన్నా దారుణమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా?  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement