‘ఎన్నికల యావ తప్ప చేసిందేంటి?.. నాగయ్య మృతి కాంగ్రెస్‌ పాపమే’ | BRS Harish Rao Serious Comments On Congress Govt | Sakshi
Sakshi News home page

‘ఎన్నికల యావ తప్ప చేసిందేంటి?.. నాగయ్య మృతి కాంగ్రెస్‌ పాపమే’

Published Thu, Feb 6 2025 10:23 AM | Last Updated on Thu, Feb 6 2025 10:45 AM

BRS Harish Rao Serious Comments On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి పథకాలు ఇవ్వకపోవడం వల్లే నాగయ్య చనిపోయాడని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణలో దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేముంది? అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా..‘లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా, బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య (నాగేశ్వర్ రావు) గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.

పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖం చాటేస్తే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. నాగయ్యకు మంచి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడేందుకు ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంతో ప్రయత్నించింది. కానీ దురదృష్టవశాత్తు నాగయ్య ప్రాణాలు వదిలారు. తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి, ఆసుపత్రి పాలైన నాగయ్య దుస్థితికి ప్రభుత్వమే కారణం. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య.

ఉన్నదాంతో కుటుంబాన్ని పోషిస్తూ జీవితం గడుపుతున్న నాగయ్య కుటుంబంలో గ్రామ సభల పేరిట నిప్పులు పోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. భర్తను, తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న భార్య, ముగ్గురు ఆడబిడ్డలను ఎవరు ఆదుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపింది కాంగ్రెస్ పార్టీ.

దీంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందోళన మొదలైంది. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేముంది. గ్రామ సభల సాక్షిగా తిరగబడ్డ జనం, ఎక్కడిక్కడ నిలదీసిన దృశ్యాలు.. మీ 14 నెలల పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపాయి.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం. రోడ్డున పడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలారా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదాం. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement