హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై ఏసీబీ(ACB) దాఖలు చేసిన కేసును కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను ఉన్నతన్యాయస్థానం కొట్టేసింది. ఈ పరిణామంపై తెలంగాణ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి.
హైకోర్టు తీర్పు అనంతరం నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics), కక్ష సాధింపు చర్యలు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసు వల్ల తెలంగాణకు మంచే జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ కష్టపడ్డారు. ఈ వ్యవహారంలో అవినీతికి ఆస్కారమే లేదు.
న్యాయ స్థానాలు, చట్టంపై గౌరవం ఉంది. కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే కేటీఆర్ విచారణకు సహకరిస్తానన్నారు. ఏసీబీ విచారణకు వెళ్తే.. 40 నిమిషాలు బయట నిల్చొబెట్టారు. అయినా ఆయన ఓపికగా వ్యవహరించారు. తిరిగి 9వ తేదీన విచారణకు రమ్మన్నారు. ఆ రోజు కూడా ఆయన విచారణకు హాజరవుతారు. ఇది కుట్రపూరితమైన కేసు. మేం సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారు. మా పార్టీ వాళ్లపై రేవంత్ రెడ్డి ఇంకా కేసులు పెట్టొచ్చు. కానీ, మేం అధైర్య పడం. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున పోరాడతాం. రేవంత్ అక్రమాలకు ప్రశ్నిస్తూనే ఉంటాం.
హైకోర్టు తీర్పు కాపీ ఇంకా అందలేదు. అది వచ్చాక ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటాం. సోషల్ మీడియాలో హైకోర్టు తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌ను విచారణ జరపమని మాత్రమే హైకోర్టు చెప్పింది. అసలు విచారణే ప్రారంభం కానప్పుడు.. ఇది తప్పుడు కేసు ఎలా అవుతుంది. కేటీఆర్‌కు శిక్ష పడుతుందంటూ బోగస్ వార్తలు ప్రచురిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అవి మానుకుంటే మంచిది’’ అని హరీష్ అన్నారు.
👉కేటీఆర్ యాక్టింగ్ చూసి సినిమా వాల్లే ఆశ్చర్యపోతున్నారు. జైలు కు పోవడానికి సిద్దం అని..ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఎందుకు.
ఈ ఫార్ములా కేసు ను లొట్టపీసు కేసు అన్నది కేటీఆర్ కాదా?. జైలు కు పోయి యోగా చేస్తా అన్నది కేటీఆర్ కాదా?. తప్పే చేయలేదు , సుద్దపూస అని ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కు చట్టం తెలియదా? అడ్వకేట్ లతో ఏసీబీ ఆఫీస్ కు ఎలా వెళ్తారు?. కోర్టు పర్మిషన్ లేకుండా అడ్వకేట్ లను ఏసీబీ అనుమతించదని తెలియదా?
:::బల్మూరి వెంకట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ
👉కేటీఆర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఫార్ములా ఈ రేసు.. మనీ లాండరింగ్ కేసులాగా అనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉంటే ఏ తప్పైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే.
:::వీహెచ్, మాజీ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment