రేవంత్‌ చేసింది చెబితే చెవుల్లోంచి రక్తం కారుతుంది: కేటీఆర్‌ | KTR Satires On CM Revanth Over Good Bad Words | Sakshi
Sakshi News home page

రేవంత్‌ చేసింది చెబితే చెవుల్లోంచి రక్తం కారుతుంది: కేటీఆర్‌

Published Sat, Mar 1 2025 4:47 PM | Last Updated on Sat, Mar 1 2025 4:58 PM

KTR Satires On CM Revanth Over Good Bad Words

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని, కానీ నేరాల్లో.. అప్పుల్లో ఆ రైజింగ్‌ కనిపిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ఎద్దేవా చేశారు. శనివారం బీఆర్‌ఎస్‌ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, రేవంత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జి వస్తే సమావేశం పెట్టారు. ఆ మీటింగ్‌లో సీఎం రేవంత్‌ మూడు ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు. మంచి మైకులో చెప్పాలని.. చెడు చెవిలో చెప్పాలని ఆయన అన్నారు. మైక్‌లో చెప్పడానికి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) చేసిన మంచి ఏం లేదు. ఆయన చేసిన చెడు చెబితే చెవుల నుంచి రక్తం కారుతుంది. జనం కాంగ్రెస్‌ను.. రేవంత్‌ను తిట్టుకుంటున్నారు అని కేటీఆర్‌ అన్నారు. 

కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) నా బ్యాగులు మోయవద్దని అంటున్నారు. కానీ, ఆమె వాస్తవాలు తెలుసుకోవాలి. మీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డి బ్యాగులు మోసి ఇక్కడికి వచ్చారు. రేవంత్ రెడ్డికి టింగ్,టింగ్ అంటే నచ్చదు. అందుకే రేవంత్ రెడ్డి టకీ,టకీ మని పైసలు పడతాయని అన్నారు. మరి ఇప్పటి వరకు ఎవరికైనా టకీ,టకీ మని పైసలు పడ్డాయా?. పదిశాతం ఖర్చు పెడితే శ్రీశైలం జలాలు చేవెళ్లకు వచ్చేవి కానీ రేవంత్ రెడ్డికి ఇష్టం లేక చేయడం లేదు. కమీషన్లు రావనే ఉదేశ్యంతోనే పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేయడం లేదు. మూసీ వలన జరిగే లాభం ఎంత. కమీషన్ల కోసమే మూసీ అనే రంగుల సినిమా చూపుతున్నారు. మూసీతో 50-70 వేల కోట్లు కమీషన్లు తీసుకొని ఢిల్లీకి మూటలు పంపి సీఎం కుర్చీని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. నీళ్లు పాతాలానికి వెళ్లాయి నిధులు ఢిల్లీకి పోతున్నాయి.

తెలంగాణ రైజింగ్(Telangana Rising) అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ, ఆ రైజింగ్‌ క్రైమ్ రేట్‌లో, అప్పుల్లో కనిపిస్తోంది. ఆత్మహత్యల్లో రైజింగ్, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల్లో రైజింగ్. గురుకుల పాఠశాలల విద్యార్థుల మరణాల్లో రైజింగ్‌. కేసీఆర్ అప్పులు తెచ్చి మరీ ఆస్తులు సృష్టించారు. మరి ఈ ఏడాదిలో లక్షా 50 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రేవంత్ ఏం సాధించారు?.

రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టింది నా కోసమే. అధికారంలోకి వచ్చి 15 నెలల తర్వాత ఇంకా కేసీఆర్ ను తిట్టుకుంటా బ్రతుకుతావా?. అన్ని చూసుకోకుండా ఆగం,ఆగంగా కమీషన్ల కోసం SLBC పనులు ప్రారంభించారు. ఎనిమిది మంది చిక్కుకుంటే.. సహాయక చర్యల పేరుతో మంత్రులు చాపల కూరలు తింటున్నారు

కేసీఆర్(KCR) మన ఇంట్లో పెద్ద మనిషి,బాపు లాంటోడు కాబట్టే ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు.  కేసీఆర్ దళంలోకి..  గులాబీ వనంలోకి కార్తీక్‌ రెడ్డి(karthik Reddy)ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో  ఉప ఎన్నికలు వస్తాయి.  త్వరలోనే కార్తీక్ ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగుపెడతారు. కేసీఆర్ కు తెలంగాణపై ఉండే ప్రేమ కాంగ్రెస్,బీజేపీకి ఒక్క శాతం అయినా వుంటుందా?. 

ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచి ఏం చేసింది?. ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ నేతలు ఓట్లు ఎట్లా అడుగుతారు?. దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారా?. మనల్ని మనం ఓడించి.. మంది ముందు దరఖాస్తు పెట్టే పరిస్థితి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు అయినా పార్లమెంట్ ఎన్నికలు అయినా ఎగరాల్సింది గులాబీ జెండానే. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు.. జాగ్రత్త’’ అని కేటీఆర్‌ అన్నారు.

ఇదీ చదవండి: మామునూర్‌ ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ కోసం ఢిష్యూం.. ఢిష్యూం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement