IND VS ENG 1st ODI: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా | IND VS ENG 1st ODI: RAVINDRA JADEJA COMPLETED 600 WICKETS IN INTERNATIONAL CRICKET | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st ODI: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

Feb 6 2025 5:50 PM | Updated on Feb 6 2025 6:00 PM

IND VS ENG 1st ODI: RAVINDRA JADEJA COMPLETED 600 WICKETS IN INTERNATIONAL CRICKET

టీమిండియా (Team India) లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. నాగ్‌పూర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో (England) జరుగుతున్న తొలి వన్డేలో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

జడ్డూకు ముందు అనిల్‌ కుంబ్లే (953), రవిచంద్రన్‌ అశ్విన్‌ (765), హర్భజన్‌ సింగ్‌ (707), కపిల్‌ దేవ్‌ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్‌ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ జడేజానే.

ఏకైక భారత స్పిన్నర్‌
ఈ ఘనత సాధించిన అనంతరం జడేజా మరో భారీ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

తాజా ప్రదర్శనతో జడ్డూ.. ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక వికెట్లు (43) సాధించిన బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ పేరిట ఉండేది. ఆండర్సన్‌ భారత్‌తో జరిగిన వన్డేల్లో 40 వికెట్లు తీశాడు. 

వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు (198 మ్యాచ్‌ల్లో 223 వికెట్లు) తీసిన లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్ల జాబితాలో జడ్డూ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో లంక దిగ్గజం సనత్‌ జయసూర్య (445 మ్యాచ్‌ల్లో 323 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్‌ అల్‌ హసన్‌ (247 మ్యాచ్‌ల్లో 317), డేనియల్‌ వెటోరీ (295 మ్యాచ్‌ల్లో 305) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. 248 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టారు. షమీ, అక్షర్‌, కుల్దీప్‌ తలో వికెట్‌ తీశారు. 

ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జోస్‌ బట్లర్‌ (52), జేకబ్‌ బేతెల్‌ (51) హాఫ్‌ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (32), ఫిలిప్‌ సాల్ట్‌ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్‌ 19, బ్రూక్‌ 0, లివింగ్‌స్టోన్‌ 5, కార్స్‌ 10, ఆదిల్‌ రషీద్‌ 8, సాకిబ్‌ మహమూద్‌ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్‌ (21 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించడంతో ఇంగ్లండ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement