చారిత్రక నిర్ణయాలతో.. సంపద సృష్టించాం: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan Fires On Chandrababu Alliance Govt | Sakshi
Sakshi News home page

చారిత్రక నిర్ణయాలతో.. సంపద సృష్టించాం: వైఎస్‌ జగన్‌

Published Fri, Nov 29 2024 4:35 AM | Last Updated on Fri, Nov 29 2024 7:21 AM

YSRCP President YS Jagan Fires On Chandrababu Alliance Govt
  • చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది

  • కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

  • సెకీతో కారుచౌకగా యూనిట్‌ రూ.2.49కే కొనుగోలు చేయడం ద్వారా రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేశాం.. ఇది సంపద సృష్టి కాదా? 

  • 17 మెడికల్‌ మెడికల్‌ కాలేజీలు, రూ.13 వేల కోట్లతో మూడు పోర్టుల నిర్మాణం 

  • భవిష్యత్‌లో వీటి వల్ల వచ్చే ఉద్యోగాలు, పెరిగే జీఎస్‌డీపీ, అభివృద్ధి 

  • తదితర అంశాల ద్వారా భారీగా పెరగనున్న సంపద.. విద్య, వైద్య రంగాల్లో మేము తెచ్చిన విప్లవాత్మక చర్యల వల్ల కొన్ని తరాలకు లబ్ధి 

  • రూ.87,500 కోట్లు ఆవిరి చేసిన చంద్రబాబును సంపద సృష్టికర్త అంటారా?  

  • రూ. 1.10 లక్షల కోట్లు ఆదా చేసిన నన్ను సంపద సృష్టికర్త అంటారా?

  • యూనిట్‌ రూ.6.99కు కొన్న బాబు గొప్పా? రూ.2.49కు నేను కొంటే తప్పా? 

  • చౌకగా రూ. 2.49కే 25 ఏళ్ల పాటు ‘సెకీ’ సౌర విద్యుత్‌ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి లబ్ధి జరిగితే తప్పుడు ప్రచారం చేస్తారా?

  • అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలను మినహాయించామన్న సెకీ లేఖను పట్టించుకోరా?.. ఇక్కడ రాష్ట్రం, డిస్కంలు.. సెకీ మధ్య ఒప్పందం జరిగితే థర్డ్‌ పార్టీకి తావెక్కడ? 

  • రాష్ట్ర అప్పుల విషయంలోనూ ఇలాగే విషం చిమ్మారు 

  • బడ్జెట్‌లో రూ.6.46 లక్షల కోట్లు అని చంద్రబాబే బడ్జెట్‌ సాక్షిగా చెప్పారు 

  • బయటకొచ్చి అప్పులు రూ.10 లక్షల కోట్లు, రూ.11 లక్షల కోట్లు,రూ.14 లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తారు 

  • సోషల్‌ మీడియాలో పోస్టులపై పీడీ యాక్టు పెడతారా?  

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ.. ఏపీ ప్రభుత్వం, డిస్కంల మధ్య ఒప్పందం జరిగితే.. ఇక్కడ థర్డ్‌ పార్టీకి ఎక్కడ చోటు ఉంది? రేపు అమెరికా కంపెనీ వ్యాపారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిందనుకుందాం. ప్రభుత్వం భూములు, సౌకర్యాలు కల్పిస్తుంది. జీఎస్టీ మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఇస్తుంది. అలాగని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి ప్రోత్సాహకాలు ఇప్పించారని అంటారా? అలా అనొచ్చా? వాస్తవాలు తెలియకుండా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటికి ముగింపు ఉండట్లేదు.   
 – మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంతో పోల్చితే ఇప్పుడు వ్యవస్థలన్నీ వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపు కనిపిస్తుంటే.. మరో వైపు చంద్రబాబు సంపద సృష్టి అంటున్నారు.రాష్ట్రానికి అదనపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ఏవైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అంటారు. రాష్ట్ర పురోగతిని మనసులో పెట్టుకుని, రాష్ట్రం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడ ఉన్నాయని ఆలోచించి, ఆచరణలో పెట్టింది వైఎస్సార్‌సీపీ హయాంలోనే. మూడు కొత్త పోర్టులు, 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వీటి వల్ల జీఎస్‌డీపీ పెరుగుతుంది. ఉద్యోగాలొస్తాయి. అభివృద్ధి కనిపిస్తుంది. దీనినే సంపద సృష్టి అంటారు. ఈ పోర్టులు, మెడికల్‌ కాలేజీలు రేపు రూ.లక్షల కోట్ల విలువ చేస్తాయి.

అంతర్రాష్ట్ర ట్రాన్స్‌విుషన్‌ చార్జీలు (ఐఎస్‌టీఎస్‌) నుంచి మినహాయింపుతో అత్యంత చౌకగా యూనిట్‌ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు సౌర విద్యుత్‌ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ(సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)తో ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇదో చరిత్రాత్మక ఒప్పందం.. చారిత్రక ఘట్టం గతంలో రాష్టంలో సగటు విద్యుత్‌ కొనుగోలు ధర యూనిట్‌కు రూ.5.10 కాగా మేం దాని కంటే యూనిట్‌ రూ.2.61 తక్కువకు కొనుగోలు చేశాం. దీనివల్ల ఏడాదికి రూ.4,400 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుంది. 

ఈ లెక్కన 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లు ఆదా అవుతుంది. సంపద సృష్టించడమంటే ఇదీ చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య సౌర విద్యుత్‌ యూనిట్‌ సగటున రూ.5.90 చొప్పున కొనుగోలు చేస్తూ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) చేసుకున్నారు. మేం సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్‌ రూ.3.41 అధికంగా కొన్నారు. దీనివల్ల ఏడాదికి రూ.3,500 కోట్లు చొప్పున 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడుతుంది. మరి 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లను ఖజానాకు ఆదా చేసి సంపద సృష్టించిన వైఎస్‌ జగన్‌ గొప్పా..? లేక రూ.87,500 కోట్లు ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్పా?
– వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంపద సృష్టిలో భాగంగా విప్లవాత్మక అడుగులు వేశామని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. నిజమైన సంపద సృష్టి జరిగింది, రాష్ట్రానికి అదనపు ఆదాయాలు పెరిగింది, అదనపు ఆస్తులు సమకూరింది వైఎస్సార్‌ సీపీ హయాంలోనేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కారుచౌకగా యూనిట్‌ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించామన్నారు. 

అధిక ధరలతో పీపీఏల ఒప్పందాల గుదిబండ వల్ల సీఎం చంద్రబాబు రూ.87,500 కోట్లు ఆవిరి చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం చుట్టడంతోపాటు దాదాపు రూ.13 వేల కోట్లతో మూడు కొత్త పోర్టుల నిర్మాణాన్ని చేపట్టామని.. వైద్య కళాశాలలు, పోర్టులు భవిష్యత్తులో రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల సంపద సృష్టించే ఆస్తులుగా మిగులుతాయని పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు.

చరిత్రలో నిలిచే ఒప్పందం..
సుస్థిర వ్యవసాయాభివృద్ధే లక్ష్యంగా, రైతుల జీవనోపాధులు పెంచడమే ధ్యేయంగా వ్యవసాయ పంపుసెట్లకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలన్న మా ప్రభుత్వ ఆశయాన్ని కేంద్రం సైతం అభినందించింది. రైతులకు మంచి చేస్తూ మీరు తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమానికి మా వంతు తోడ్పాటు అందిస్తామని చెప్పింది. ఐఎస్‌టీఎస్‌ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తూ యూనిట్‌ విద్యుత్‌ అత్యంత చౌకగా రూ.2.49కే సరఫరా చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ కేంద్ర సంస్థ సెకీ లేఖ రాసింది. 

నాడు ఆ ప్రతిపాదనకు నేను ఒప్పుకోకుండా ఉంటే ఇదే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో కూడిన ఎల్లో బ్యాచ్‌ నాపై ఏరకంగా దుమ్మెత్తిపోసేవారో అందరూ ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి నాపై ఇలా దుష్ఫ్రచారం చేయడం ధర్మమేనా? ఇంత తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. ఏ ఒక్కరూ చేయలేనిదాన్ని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేయగలిగింది. ఒక చరిత్ర సృష్టించాం. చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది.

రైతులకు హక్కుగా ఉచిత విద్యుత్‌ లక్ష్యంగా..
రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మీద భారం పడకుండా.. మరో 25 ఏళ్ల పాటు రైతన్నలకు ఢోకా లేకుండా ఉచిత విద్యుత్తు అందించడంలో భాగంగా గతంలో ఎప్పుడూ చేయని విధంగా ఆలోచన చేశాం. 2020 నవంబర్‌లో 6,400 మెగావాట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీజీఈసీఎల్‌) ఆధ్వర్యంలో సోలార్‌ పార్కులు రాష్ట్రంలో నెలకొల్పేందుకు టెండర్లు పిలిచాం. రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున విద్యుత్‌ సరఫరా చేయడానికి ఎన్టీపీసీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు అందులో పాల్గొన్నాయి. దాదాపు 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే చంద్రబాబు అనే చంద్రగ్రహణం కారణంగా న్యాయ వివాదాలు తలెత్తి ఈ ప్రక్రియ ఆగిపోయింది.

మేం సంపద సృష్టించాం.. ఆవిరి చేసింది చంద్రబాబే
మాట్లాడితే సంపద సృష్టిస్తానంటూ ప్రచారం చేసుకునే చంద్రబాబు తన హయాంలో సంపద ఏ విధంగా ఆవిరి చేశాడో ఒక్కసారి మీరే చూడండి. 2,500 మెగావాట్ల సోలార్‌ పవర్,, 3,494 మెగావాట్ల విండ్‌ పవర్‌ కోసం చేసుకున్న పీపీఏలను.. మా హయాంలో యూనిట్‌ రూ.2.49కే సరఫరా చేసేందుకు చేసుకున్న పీపీఏతో పోల్చి చూస్తే ఎవరు సంపద సృష్టించారన్నది అందరికీ అర్థమవుతుంది. 



సాధారణంగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వల్ల 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడుతుంది. చంద్రబాబు హయాంలో 3,494 మెగావాట్ల పవన విద్యుత్‌ కోసం చేసుకున్న పీపీఏలను పరిశీలిస్తే సగటున యూనిట్‌ రూ.4.84 చొప్పున చేసుకున్నారు. మా హయాంలో అదే విద్యుత్‌ యూనిట్‌ రూ.2.49కే వచ్చింది. మా హయాంతో పోలిస్తే బాబు హయాంలో చేసుకున్న ఒప్పందాల వలన రూ.2.35 అదనంగా భారం పడుతుంది. 3,494 మెగావాట్లు అంటే  9 వేల మిలియన్‌ యూనిట్లు! యూనిట్‌ రూ.2.35 చొప్పున చూస్తే ఏడాదికి రూ.2 వేల కోట్లు అదనపు భారం పడింది. 

ఆ లెక్కన 25 ఏళ్లకు అక్షరాల రూ.50వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ఇక 2,500 మెగావాట్ల సోలార్‌ పవర్‌ కోసం చేసుకున్న పీపీఏలను పరిశీలిస్తే.. సగటున యూనిట్‌ విద్యుత్‌ రూ.5.90 చొప్పున కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2,500 మెగావాట్లు అంటే  4,200 మిలియన్‌ యూనిట్లు. మన హయాంలో చేసుకున్న పీపీఏల ప్రకారం యూనిట్‌ రూ.2.49లతో పోల్చి చూస్తే.. చంద్రబాబు హయాంలో సోలార్‌ పవర్‌ యూనిట్‌ విద్యుత్‌ రూ.3.41 పైసల చొప్పున అదనంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. 

అంటే ఏడాదికి రూ.1,500 కోట్ల చొప్పున 25 ఏళ్లలో రూ.37,500 కోట్ల అదనపు భారం పడుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత చౌకగా యూనిట్‌ రూ.2.49 చొప్పున కొనుగోలు చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేయడం ద్వారా ఆ మేరకు నేను సంపద సృష్టిస్తే.. అదే చంద్రబాబు హయాంలో చేసుకున్న సోలార్, విండ్‌ పీపీఏల వల్ల 25 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.87,500 కోట్ల భారం పడటం వల్ల ఆ మేరకు సంపద ఆవిరి అయిపోతుంది. ఈ తేడా గమనించాలని అందరినీ కోరుతున్నా.

అభినందించాల్సింది పోయి నిందలేస్తారా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందం జరిగితే.. యూనిట్‌ రూ.2.49కే రాష్ట్రానికి  విద్యుత్‌ దొరుకుతుంటే.. పైగా స్పెషల్‌ ఇన్సెంటివ్‌గా అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ విుషన్‌ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించడం ద్వారా యూనిట్‌కు మరో రూ.1.98 ఆదా అవుతుంటే.. ఇంత మంచి ప్రతిపాదన రాష్ట్రానికి వస్తే ఎవరైనా క్షణం ఆ­లో­చించకుండా ముందుకెళ్తారు. మేం కూడా అదే చేశాం. 


ఈ ఒప్పందం ద్వారా 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేయడం వలన సంపద సృష్టించాం. నిజంగా ఇదొక రోల్‌ మోడల్‌ కేసు. ఇంత మంచి చేస్తే నాపై రాళ్లేస్తారా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆత్మనిర్భర్‌ ప్యాకేజ్‌ కింద తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు సెకి ఎంతకు అమ్మిందో తెలుసా? ఆ మూడు రాష్ట్రాలకు యూనిట్‌ రూ.2.61 చొప్పున సరఫరా చేశారు. అంటే వాళ్లకంటే రూ.0.12  తక్కువకే విద్యుత్‌ తీసుకొచ్చిన నన్ను అభినందించి శాలువా కప్పి ప్రశంసించాల్సిందిపోయి బురదజల్లుతారా? ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేయడం సమంజసమేనా? సంపద సృష్టించింది నేనా? చంద్రబాబా ? మీరే ఆలోచించండి. 

నేను సంపద సృష్టిస్తే.. చంద్రబాబు సంపద ఆవిరి చేశాడు. ధర్మం..న్యాయమనేది ఉండాలి కదా..! మంచి చేసిన వాడిపై రాళ్లు వేయడమే  ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5తో పాటు చంద్రబాబుకు చెందిన ఎల్లో గ్యాంగ్‌ పనిగా పెట్టుకుంది. వీళ్లు తానా అంటే తందానా అనే ఇతర పార్టీల్లో ఉండే టీడీపీ సభ్యులు, మిడిమిడి జ్ఞానంతో సగం తెలిసి సగం తెలియక..చంద్రబాబును మోయాలన్న  తపన, తాపత్రయంతో, జగన్‌పై బురద చల్లాలి అనే యావతో నోటికొచ్చినట్టు ఆరోపణలు గుప్పించడం ఎంతవరకు సమంజసం?

అడ్డగోలు రాతలు..  వక్రీకరణలు
వాస్తవాలు తెలుసుకోకుండా అడ్డగోలుగా రాయడం వక్రీకరణ కాదా? ఐఎస్‌టీఎస్‌ చార్జీలు లేకుండా యూనిట్‌ రూ.2.49కే  అత్యంత చౌకగా కొంటున్నప్పుడు ఇదే ఈనాడు రూ.5.73కు కొంటున్నామని ఎలా రాస్తారు. ఇది అబద్ధం కాదా? వక్రీకరణ కాదా? మనం యూనిట్‌ రూ.2.49కే కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. అది కూడా కోవిడ్‌ సమయంలో. ఈ ఏడాది మార్చిలో గుజరాత్‌లో సెకీ టెండర్లు పిలిస్తే యూనిట్‌ రూ.2.62 నుంచి రూ.2.67 చొప్పున ఖరారయ్యాయి. గుజరాత్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను గుజరాత్‌లోనే సరఫరా చేసేందుకు ఈ ధర నిర్ణయించారు. 

టీవీ మోడల్‌ రేట్లు తగ్గినట్టుగా పవర్‌ ఉత్పత్తి రేట్లు కూడా తగ్గాలి అంటూ మరో వక్రీకరణ చేశారు. 55 అంగుళాల టీవీ గతంలో రూ.2 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ.55 వేలకే వస్తుంది కదా..! ఆ లెక్కన విద్యుత్‌ ధర కూడా ఇప్పుడు తగ్గాలి అంటూ వాదిస్తున్నారు. ఈనాడు వాదన ప్రకారమైతే.. ఇదే సోలార్‌ పవర్‌ను మా హయాంలో రూ.2.49 చొప్పున కొనుగోలు చేశాం.  అంటే ఇప్పుడు అది రూ.1.50కే రావాలి కదా..? మరి గుజరాత్‌లో రూ.2.67 చొప్పున ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? వాస్తవాలను వక్రీకరించి ఏ విధంగా అడ్డగోలుగా అబద్ధాలు అచ్చేస్తారో.. మాట్లాడుతున్నారో చెప్పేందుకు ఇదో ఉదాహరణ!!

తియ్యటి కబురుతో కేంద్రం లేఖ..
చంద్రగ్రహణం పట్టిన సోలార్‌ బిడ్ల వ్యవహారంపై దాదాపు 10 నెలలు కోర్టుల్లో పోరాటాలు చేస్తుండగా.. 2021 సెప్టెంబర్‌ 15న రాష్ట్ర ప్రభుత్వానికి తియ్యటి కబురు మాదిరిగా సెకీ నుంచి లేఖ వచ్చింది. రైతులకు పగటి పూటే ఉచితంగా 9 గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అభినందించింది.సెకీ రాసిన ఆ లేఖలో యూనిట్‌ రూ.2.49 కే ట్రేడింగ్‌ మార్జిన్‌తో కలిపి ఇస్తామని ఉంది. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మీ ఉద్దేశాన్ని అభినందిస్తూ ఈ ప్రతిపాదన చేస్తున్నామని ఆ లేఖలో సెకీ పేర్కొంది. 

కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ ఇన్సెంటివ్‌ కింద ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌విుషన్‌ సిస్టం(ఐఎస్‌టీఎస్‌) చార్జీలు 25 ఏళ్ల పాటు మాఫీ అవుతాయని లేఖలో పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్‌లో 3 వేల మెగా­వాట్లు, 2026 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తంగా 9 వేల మెగా­వాట్లు సౌర విద్యుత్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సెకీ తెలి­పింది. తమ ప్రతిపాదనపై సాధ్యమైనంత త్వరగా స్పందన తెలియచేయాలని సెకీ లేఖలో కోరింది.

డిస్కంలను బాబు సంక్షోభంలోకి నెడితే.. మేం నిలబెట్టాం..
రైతన్నలకు దాదాపుగా 18 లక్షల వ్యవసాయ పంపు సెట్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఉచిత విద్యుత్‌ను రైతన్నలకు ఇచ్చేందుకు ఏటా దాదాపు రూ.9 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. పెట్టుబడి ఖర్చు తగ్గించగలిగితే రైతన్న ఆదాయాలు పెరుగుతాయి. అందులో  ఉచిత విద్యుత్‌ ప్రధాన భూమిక పోషిస్తుంది. దీనివల్ల ప్రతి రైతన్నకు ఏటా దాదాపు రూ.40 వేల నుంచి రూ.45 వేలు ప్రయోజనం చేకూరుతుంది. 


డిస్కంల పరిస్థితి చూస్తే చంద్రబాబు అధికారంలోకి రాకముందు అంటే 2014 నాటికి రూ.29 వేల కోట్లు అప్పులు, బకాయిలు ఉండగా ఆయన దిగిపోయే నాటికి అంటే 2019కి ఏకంగా రూ.86 వేల కోట్లకు ఎగబాకాయి. దాదాపుగా 23.88 శాతం వార్షిక అప్పు పెరుగుదల (సీఏజీఆర్‌)తో చంద్రబాబు హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా ఉంది. డిస్కంలను ఆదుకునేందుకు ఆయన చేసిన సాయం రూ.13,255 కోట్లు మాత్రమే. అదే వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.47,800 కోట్లు డిస్కంలకు అందించి ఆదుకున్నాం.

రూ.6.99కు కొన్న బాబు గొప్పా..? రూ.2.49కు నేను కొంటే తప్పా?
చంద్రబాబు హయాంలో పవన విద్యుత్‌(విండ్‌ పవర్‌)కు సంబంధించి 2014–19 మధ్య 3,494 మెగావాట్ల విద్యుత్‌ కోసం 133 పీపీఏలు చేసుకున్నారు. సగటున యూనిట్‌ రూ.4.84  చొప్పున  కొనుగోలు  చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2014లో మాత్రం రూ.4.70 చొప్పున కొన్నారు. 

సోలార్‌ విద్యుత్‌ సంబంధించి 2014–19 మధ్య 2,500 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు కోసం 35  పీపీఏలు చంద్రబాబు చేసుకున్నారు.  యూనిట్‌ రూ.5.25 నుంచి రూ.6.99 చొప్పున  కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2014లో 649 మెగావాట్ల కోసం 30 పీపీఏలు చేసుకోగా యూనిట్‌ రూ.6.49కు కొన్నారు. 2015లో రూ.5.96కు, 2016లో వరుసగా యూనిట్‌ రూ.6.80కు, రూ.5.99, రూ.4.61,రూ.4.50 చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. అంటే చంద్రబాబు హయాంలో సోలార్‌ విద్యుత్‌ను సగటున యూనిట్‌ రూ.5.90 చొప్పున కొన్నారు. 

2019–20లో ఏపీఈఆర్‌సీ టారిఫ్‌ ఆర్డర్‌ చూస్తే విండ్‌ పవర్‌ సగటు ధర యూనిట్‌ రూ.4.63, సోలార్‌ పవర్‌ సగటు ధర యూనిట్‌ రూ.5.90కు కొనేందుకు అనుమతినిస్తే.. మా హయాంలో రూ.2.49 చొప్పున అత్యంత చౌక ధరకు 7 వేల మెగావాట్లు సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటే నాపై బురద జల్లడం ఎంతవరకు సమంజసం? ఆత్మనిర్భర్‌ కింద సోలార్‌ ప్యానళ్ల తయారీని ప్రోత్సహించేందుకు దేశంలో ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ కింద కేంద్రం గొప్ప అడుగు వేసింది. 

రాష్ట్రానికి మంచి చేయాలన్న తపనతో చరిత్రలో ముందెన్నడూ లేనంత చౌక ధరకు విద్యుత్‌ కొనుగోలు కోసం సెకీతో ఒప్పందం చేసుకున్న నేను మంచోడినా? లేక అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు మంచోడా?

సమగ్ర అధ్యయనం తర్వాతే ఒప్పందం
యూనిట్‌ రూ.2.49కే యూనిట్‌ చొప్పున విద్యుత్‌ సరఫరా చేస్తామని 2021 సెప్టెంబర్‌ 15న సెకీ నుంచి లెటర్‌ వచ్చింది. ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్‌ 16న కేబినెట్‌ మీటింగ్‌ ఉన్నందున సెకీ ప్రతిపాదనను టేబుల్‌ అజెండాగా చేర్చి మంత్రివర్గ సహచరులతో చర్చించాం. అయితే ఆ కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయాలేమీ తీసుకోలేదు. ఆమోదాలు తెలప­లేదు. 


కేవలం సెకీ నుంచి వచ్చిన లెటర్‌లో పేర్కొన్న అంశాలపై లోతుపాతులను అధ్యయనం చేసి వచ్చే కేబినెట్‌ నాటికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదే­శా­లిచ్చాం. దీనిపై విద్యుత్‌ శాఖ అధికారుల కమిటీ ఏకంగాæ 40 రోజుల పాటు అధ్య­యనం చేసిన అనంతరం 2021 అక్టోబర్‌ 25వ తేదీన నివేదిక సమర్పించింది. అక్టోబర్‌ 28న కేబినెట్‌ దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏపీఈఆర్సీ నుంచి కూడా ఆమోదం తీసు­కోవాలని సూచిస్తూ తీర్మానం చేసింది. 

ఐఎస్‌టీఎస్‌ చార్జీలు, ఆ విధమైన ఇతర చార్జీలు ఏవీ కూడా వర్తించవంటూ సెకీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పంద పత్రంలో స్పష్టంగా పేర్కొన్న భాగం  

నవంబర్‌ 11న  ఏపీఈఆర్సీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో డిసెంబర్‌ 1వ తేదీన సెకీతో ఒప్పందంపై ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం, డిస్కమ్‌లు సంతకాలు చేశాయి. ఎక్కడా థర్డ్‌ పార్టీ ఎవరూ లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన పవర్‌ సేల్‌ అగ్రిమెంట్‌ ఇది. ఈ అగ్రిమెంట్‌ 3.2 క్లాజ్‌లో 25 ఏళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు నుంచి మినహాయింపు ఇస్తామని స్పష్టంగా పేర్కొంది.

గుజరాత్, రాజస్థాన్‌లలో పీఎల్‌ఎఫ్‌ అధికం
చంద్రబాబు ఎల్లో గ్యాంగ్‌ సభ్యులు ఓ విచిత్రమైన లాజిక్‌ తీసుకొచ్చారు. గుజరాత్‌లో రూ.1.99 విద్యుత్‌ వస్తుంటే... సెకీతో రూ.2.49కు ఎందుకు ఒప్పందం చేసుకున్నారని అడు గుతున్నారు. అయ్యా చంద్రబాబూ..! గుజరాత్, రాజస్థాన్‌ ఎడారి ప్రాంతాలు. అక్కడ ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్స్‌(పీఎల్‌ఎఫ్‌) 23.5 శాతం నమోదైతే, మన రాష్ట్రంలో 17–18 శాతం దగ్గర నమోదవుతాయి. 


ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో పోలిస్తే, గుజరాత్, రాజస్థాన్‌లో సోలార్‌ పవర్‌ ఉత్పత్తి చేసే వాళ్లకు యూనిట్‌కు రూ.0.50 అడ్వంటేజ్‌ (తక్కువ) ఉంటుంది. దీనిపై మాట్లాడుతున్న వీళ్లు ట్రాన్స్‌మిషన్‌ వ్యయంపై ఎందుకు మాట్లాడడం లేదో తెలియడం లేదు. ఐఎస్‌టీఎస్‌ ధర ప్రతీ యూనిట్‌కు దాదాపు రూ.2 అదనంగా పడుతుందన్న విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement