![USA Donald Trump taking Panama Canal](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/Panama.jpg.webp?itok=6iOckmQR)
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు. పనామా కెనాల్ విషయంలో ట్రంప్ కొంత మేరకు తన పంతం నెగ్గించుకున్నారు. తమ యుద్ధ నౌకలు పనామా కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సె వెల్లడించారు. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం.. నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.
వివరాల ప్రకారం.. గతంలో ట్రంప్ పనామా కాలువను కొనుగోలు చేయాలని కలలు కన్నారు. కానీ అది తీరకముందే పదవిని కోల్పోయారు. ఇక, రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఈసారి కచ్చితంగా పనామా కాలువను కొనాలని చూస్తున్నారు. పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకొంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పనామా కాస్త వెనక్కి తగ్గి మరి అమెరికా యుద్ధ నౌకలు పనామా కాలువపై నుంచి ప్రయాణిస్తే ఎలాంటి ఫీజును తీసుకోమని చెప్పింది. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్‌కు మధ్య ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ కూడా ధ్రువీకరించింది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా.. అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుంచి ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు అని పేర్కొంది. దీని వల్ల అమెరికా ప్రభుత్వ నౌకలకు పెద్ద మొత్తంలో డబ్బులు మిగులుతాయని చెప్పుకొచ్చారు. వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకొంది. ఈ విషయాన్ని ఆదివారమే విదేశాంగ మంత్రి రూబియో సూచాయగా వెల్లడించారు. ఇక, అమెరికాకు చెందిన 40 శాతం కంటైనర్లు పనామా నుంచి ప్రయాణిస్తాయి.
ఇదిలా ఉండగా.. అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయప్రయాసలతో పనామా కాల్వను 1914లో నిర్మించింది. దీనిని తొలుత అమెరికానే నిర్వహించింది. కానీ, పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగడంతో.. 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఈ కాల్వను ఆ దేశానికి అప్పజెబుతూ ఒప్పందం చేసుకొన్నారు. ఈ కాల్వ తటస్థంగా ఉండి తీరాలని అమెరికా షరతు విధించింది. ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకొనే హక్కు ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాల్వ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment