
నౌకల్లో మంటలు, పేలుళ్లు
మొత్తం 37 మంది సిబ్బంది సురక్షితం
తెలిపిన స్థానిక ప్రజాప్రతినిధి
లండన్: ఇంగ్లండ్ తూర్పు తీరంలో ఆయిల్ ట్యాంకర్, సరుకు నౌక ఢీకొన్న ఘటనలో రెండు ఓడలకు మంటలు అంటుకున్నాయి. హల్ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం 9.48 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు నౌకల్లోని మొత్తం 37 మందిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చినట్లు రవాణా శాఖ మంత్రి తెలిపారని స్థానిక ప్రజా ప్రతినిధి గ్రాహం స్టువార్ట్ చెప్పారు. వీరిలో తీవ్రగాయాలతో ఉన్న ఒకరిని ఆస్పత్రిలో చేర్పించారన్నారు.
గ్రీస్ నుంచి వచ్చిన అమెరికాకు చెందిన ఎంవీ స్టెనా ఇమాక్యులేట్ పేరున్న ఆయిల్ ట్యాంకర్ గ్రీమ్స్‌బీ పోర్టులో లంగరేసి ఉంది. అదే సమయంలో, స్కాట్లాండ్ నుంచి నెదర్లాండ్స్‌లోని పోటర్‌డ్యామ్ వైపు వెళ్తున్న పోర్చుగల్ సరుకు నౌక సొలొంగ్ దానిని ఢీకొట్టింది. దీంతో, రెండు ఓడల్లో మంటలు చెలరేగాయి. సరుకు ఓడలో సోడియం సైనైడ్ అనే విషపూరిత రసాయన కంటెయినర్లు ఉన్నట్టు సమాచారం. బ్రిటన్ మారిటైం కోస్ట్‌గార్డ్ ఏజెన్సీ ఆ ప్రాంతానికి లైఫ్‌బోట్లను, రెస్క్యూ హెలి కాప్టర్‌ను పంపించింది.
నౌకల్లో నుంచి బయటకు దూకిన వారిని లైఫ్‌బోట్లలో రక్షించి ఒడ్డుకు చేర్చారు. కాగా, స్టెనా ఇమాక్యులేట్ ఓడలో జెట్–ఏ1 ఇంధనం రవాణా అవుతోందని అమెరికాకు చెందిన మారిటైం మేనేజ్‌మెంట్ సంస్థ క్రౌలీ తెలిపింది. సరుకు నౌక ఢీకొట్టడంతో ట్యాంకర్ దెబ్బతిని ఇంధనం లీకైంది. దీంతో మంటలు వ్యాపించడంతోపాటు పలుమార్లు పేలుళ్లు సంభవించినట్లు వెల్లడించింది. ట్యాంకర్ నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు క్రౌలీ వివరించింది. అమెరికా సైన్యానికి అవసరమైన ఇంధనాన్ని ఈ సంస్థ సరఫరా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment