నౌకల రాకపోకల ఆదాయంపై కన్ను!
తమ నౌకలపై అధిక చార్జీలని ఆరోపణ
చైనా అజమాయిషిలోకి వెళ్లిందని అక్కసు
తమ దేశం తవ్వినందున తమదేననే వాదన
పనామా కాలువ. వందేళ్ల క్రితం నిర్మించిన ఇంజనీరింగ్ అద్బుతం. చిన్నపాటి భూభాగం కారణంగా కలవకుండా ఉండిపోయిన అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను వందల కోట్లు వెచ్చించి అక్కడి వారి కలను సాకారం చేసింది అగ్రరాజ్యం. పాతికేళ్ల తర్వాత దానిపై అజమాయిషీ కోసం పట్టుబడుతుండటం విచిత్రం. ఆ కాల్వపై అజమాయిషిని నాటి అమెరికా అధ్యక్షుడు స్థానిక దేశానికి ధారాదత్తం చేస్తే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అదేమీ చెల్లవంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారు.
ట్రంప్ బెదిరింపులకు బెదిరేదిలేదని పనామా ప్రభుత్వం చెబుతుండటంతో ఏమౌతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అవసరమైతే సైనిక శక్తితో బెదిరించో, బలవంతపు దౌత్యంతోనో మాట నెగ్గించుకోవడం దశాబ్దాలుగా అమెరికాకు అలవాటు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వారమైనా తిరక్కుండానే ఏకంగా వందకు పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులిచ్చిన తెంపరి ట్రంప్ పనామాపై ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకుంటారోనని ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా వేచిచూస్తున్నాయి...
భారీ రాకపోకలు, అనూహ్య రాబడి
అమెరికా నౌకలు ఆసియా ఖండానికి వెళ్లాలంటే గతంలో దక్షిణ అమెరికా ఖండం చుట్టూతా వేల మైళ్లు సముద్రయానం చేయాల్సి వచ్చేది. ప్రయాణఖర్చలు విపరీతంగా ఉండేవి. వీటిని చాలా వరకు తగ్గించేందుకు, ప్రత్నామ్నాయ సముద్రమార్గంగా పనామా కాలువను తెరమీదకు తెచ్చారు. అనుకున్నదే తడవుగా వందల కోట్లు ఖర్చుపెట్టి కాలువను తవ్వి 1914 ఆగస్ట్ 15న కాలువను వినియోగంలోకి తెచ్చారు.
కొత్తలో ఈ మార్గం గుండా రోజుకు మూడు నాలుగు నౌకలే రాకపోకలు సాగించేవి. అయితే అత్యంత దగ్గరి దారికావడంతో రానురాను దీని గుండా అంతర్జాతీయ సరకు రవాణా నౌకల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఏటా లక్షలాది నౌకలు వెళ్తున్నాయి.
దీంతో కాల్వపై యాజమాన్య హక్కులున్న పనామా దేశానికి ఏటా నికర లాభం ఏకంగా రూ.43,000 కోట్లకు పెరిగిందని ఒక అంచనా. ఏటా ఇంతటి లాభాల పంట పండించే బంగారు కోడిని నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అప్పనంగా పనామాకు అప్పజెప్పారని నేటి అధ్యక్షుడు ట్రంప్ తెగ బాధపడిపోతున్నారు. పనామా దేశ వార్షిక ఆదాయంలో 23.6 శాతం ఒక్క ఈ కాలువ నుంచే వస్తుండటం గమనార్హం.
పనామా వాదనేంటి?
నాటి కాలువకు నేటి కాలువకు ఎంతో తేడా ఉంది. బాధ్యతలు తమ చేతుల్లోకి వచ్చాక పనామా దేశం ఈ కాలువను మరింతగా తవ్వి పెద్దగా విస్తరించింది. ఏకంగా 5 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది.
దీంతో 2016 ఏడాది తర్వాత భారీ నౌకలు సైతం సులభంగా వెళ్లడం మొదలవడంతో యాజమాన్యం అధిక లాభాలను కళ్లజూస్తోంది. ‘‘ మేం సొంతంగా ఎంతో ఖర్చుపెట్టాం. గతంలో పోలిస్తే ఆదాయం 55 శాతం పెరగడానికి గతంలో మేం పెట్టిన పెట్టుబడులే కారణం’’ అని కాలువ మాజీ అడ్మిని్రస్టేటర్ జార్జ్ లూయిస్ క్విజానో తేల్చి చెప్పారు.
‘‘ కాలువ మా దేశంలో, దేశభక్తిలో అంతర్భాగం. దీనిపై యాజమాన్య హక్కులు మాకే దక్కుతాయి’’ అని పనామా దేశస్తులు తెగేసి చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికలప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన స్థానికులు పనామా సిటీలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద పెద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అమెరికా ఈ కాలువను దక్కించుకోవాలంటే పెద్ద ఘర్షణ చెలరేగి అది అంతర్జాతీయ నౌకాయానంపైనా పెను ప్రభావం పడే ప్రమా దముంది.
అమెరికా నౌకలపై అధిక చార్జీలు
ఈ కాలువను వాణిజ్య అవసరాలకు అత్యధికంగా వాడుతున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత చైనా, చిలీ, జపాన్, దక్షిణకొరియాలు అతిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సరకు రవాణా నౌకలతోపాటు చాలా ప్రపంచదేశాలపై నిఘా కోసం, తమ మిత్రదేశాల్లో తమ స్థావరాలకు సైన్యాన్ని తరలించేందుకు యుద్ధనౌకలనూ ఇదే మార్గం గుండా పంపుతోంది. వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికాకు రాకపోకలు చార్జీలు ఎక్కువ అవుతున్నాయి.
అయితే మాపైనే అధిక చార్జీలు మోపుతున్నారని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే తన వాదనలకు బలం చేకూర్చే ఆధారాలను ఆయన బయటపెట్టలేదు. పైగా చైనా రహస్యంగా ఈ కాలువ నిర్వాహణ యాజమాన్య హక్కులు పొందిందని ట్రంప్ ప్రధాన ఆరోపణ. కాలువను పనామా దేశం శాశ్వతంగా సొంతంగా మాత్రమే నిర్వహించుకోవాలన్న ‘ టోరిజోస్–కార్టర్’ ఒడంబడికను పనామా కాలదన్నిందని, తటస్థ వైఖరికి తిలోదకాలు ఇచ్చిందని అమెరికా ఆరోపిస్తోంది.
కష్టపడి తవ్విన తమకే అధిక చార్జీల వాత పెడుతూ, శత్రుదేశం చైనాకు నిర్వహణ హక్కులు కట్టబెట్టారని ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఎలాగైనా సరే పనామా కాలువపై యాజమాన్య హక్కులను తిరిగి సంపాదిస్తామని ప్రమాణస్వీకారం రోజే ట్రంప్ ప్రకటించారు. 13 ఏళ్ల పాటు సుదీర్ఘ చర్చల తర్వాత 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, పనామా పాలకుడు ఒమర్ టోరిజోస్‌కు పనామాకాలువ బాధ్యతలు అప్పగించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment