pacific ocean
-
పసిఫిక్ మహాసముద్రంలో చీకటి జీవి
భూగోళంపై ఎన్ని రకాల జీవులున్నాయో లెక్కేలేదు. ఎన్నో రకాల జీవులు ఇప్పటికే అంతరించిపోయినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. మరోవైపు కొత్తరకం జీవుల ఉనికి బయటపడుతూనే ఉంది. దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ, చిలీ దేశాల సముద్ర తీరంలో ఒక జీవిని గుర్తించారు. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన అటకామా ట్రెంచ్ అట్టడుగున ఈ ప్రాణి నివసిస్తున్నట్లు కనిపెట్టారు. యాంఫీపాడ్ పాడ్ వర్గానికి చెందిన ఈ జీవికి డుల్సిబెల్లా కమాంచక అని పేరుపెట్టారు. కమాంచక అంటే స్థానిక భాషలో చీకటి అని అర్థం. ఈ చీకటి జీవి మాంసాహారి. ఇతర జీవులే దీని ఆహారం. ఇవి ఇక్కడ పెద్దగా కనిపించలేదు కాబట్టి అంతరించేపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. ఇంటిగ్రేటెడ్ డీప్–ఓషియన్ అబ్జర్వింగ్ సిస్టమ్(ఐడీఓఓఎస్)లో భాగంగా గత ఏడాది సముద్రం అడుగు భాగంలో శోధించారు. ఉపరితలం నుంచి 7,902 మీటర్ల లోతులో కొత్త రకం జీవి ఉన్నట్లు బయటపడింది. అంటే దాదాపు 8 కిలోమీటర్ల లోతున ఇది సంచరిస్తుండడం గమనార్హం. వాస్తవానికి అక్కడ అత్యధిక నీటి ఒత్తిడి ఉంటుంది. జలాంతర్గాములు సైతం అంత లోతుకి చేరుకోవడం కష్టం. మానవుడు ఇప్పటికీ చూడని సముద్రాల అడుగు భాగంలో జీవ వైవిధ్యానికి కొదవ లేదు. మనకు తెలియని ఎన్నో ప్రాణులు అక్కడ ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అటకామా ట్రెంచ్ అనేది భూమిపై అత్యంత లోతైన సముద్ర ప్రాంతం. ఇక్కడ సముద్రం లోతు 6,000 మీటర్ల నుంచి 11,000 మీటర్ల దాకా ఉంటుంది. ఎన్నో విశిష్టమైన జీవులకు అటకామా ట్రెంచ్ నెలవుగా మారింది. అరుదైన యాంఫీపాడ్స్, స్నెయిల్ ఫిష్, మడ్ డ్రాగన్స్ ఇక్కడ కనిపిస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచంలో అతిపెద్ద పగడం
ఏకంగా 100 అడుగులకు పైగా పొడవైన పగడాన్ని(కోరల్)ను నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో సైంటిస్టులు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడం అని చెబుతున్నారు. 300 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ పగడం అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందని అంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రిస్టీన్ సీస్ ప్రోగ్రామ్‌లో భాగంగా గత నెలలో సోలోమాన్ దీవుల్లో సముద్ర స్థితిగతులను అధ్యయనం చేయడానికి బయలుదేరిన సైంటిస్టులకు ఈ పగడం కనిపించింది. గతంలో అమెరికాలో సమోవాలో గుర్తించిన భారీ పగడం కంటే ఇది మూడు రెట్లు పెద్దది కావడం విశేషం. అంతేకాదు భూమిపై అతిపెద్ద జంతువైన బ్లూవేల్ కంటే కూడా పొడవైనది. సాధారణంగా సముద్రాల అంతర్భాల్లో పగడపు దిబ్బలు ఏర్పడతాయి. ఈ దిబ్బల్లో చిన్నచిన్న పగడాలు కనిపిస్తాయి. కానీ, నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో తాజాగా గుర్తించి పగడం సింగిల్ కోరల్ కావడం గమనార్హం. కొన్ని శతాబ్దాలుగా దీని పరిమాణం పెరుగుతున్నట్లు గుర్తించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖండాంతర క్షిపణిని పరీక్షించిన చైనా
బీజింగ్: అమెరికాలోని నగరాలను తాకేంతగా సుదూరాలకు వెళ్లగల సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)ను చైనా విజయవంతంగా పరీక్షించింది. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటే ఉద్దేశంతోనే చైనా ఈ పరీక్ష జరిపిందని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర జలాల్లో బుధవారం ఉదయం 8.44 గంటలకు జరిపిన ఈ పరీక్ష తమ ఆయుధ పనితీరు, సైన్యం శిక్షణా సామర్థ్యాలను ప్రదర్శించి నిర్దేశిత లక్ష్యాన్ని చేధించిందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పొరుగు దేశాలు ఆందోళన చెందకుండా ముందే రాకెట్ ప్రయోగించే దిశ, గమ్యం తదితర వివరాలను వారితో చైనా పంచుకుంది. దశాబ్దాల కాలంలో చైనా బహిరంగంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని చైనా అధికారిక ‘చైనా డైలీ’ వార్తాసంస్థ పేర్కొంది. ఈ క్షిపణి ఎంత దూరం వెళ్తుందో చైనా చెప్పలేదు. ఇది పలు అమెరికా నగరాలనూ తాకగలదని హాంకాంగ్ కేంద్రంగా నడిచే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. -
Ghost Shark: కొత్త దెయ్యం షార్క్ దొరికింది
విల్లింగ్టన్: పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతుల్లో సంచరించే కొత్త రకం చేపను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చేప కళ్లు చాలా నల్లగా ఉండటంతోపాటు చిమ్మచీకటిమయమైన సముద్రం లోతుల్లో సంచరిస్తుండటంతో దీనిని ‘ఘోస్ట్ షార్క్’గా పేర్కొంటున్నారు. ఘోస్ట్ షార్క్‌లను స్పూక్ షిఫ్ లేదా చిమేరా అని కూడా అంటారు. వీటిలో ముళ్లులు, పొలుసులు ఉండవు. శరీరం మొత్తం మెత్తగా మృదులాస్థితోనే తయారై ఉంటుంది. న్యూజిలాండ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అటా్మస్ఫిరికల్ రీసెర్చ్ బృందం ఈ చేప జాతిని కనుగొంది. న్యూజిలాండ్‌కు తూర్పున ఉన్న ఛాథమ్ రైస్ అనే సముద్రజలాల ప్రాంతంలో ఈ చేపలు జీవిస్తున్నాయి. ఉపరితలం నుంచి దాదాపు 2,600 మీటర్లలోతు మాత్రమే సంచరిస్తుంటాయి. మొత్తం పొడవులో సగం ఉండే పొడవాటి ముక్కు లాంటి నోరు వీటి ప్రత్యేకత. ‘‘లాటిన్లో అవియా అంటే బామ్మ. అందుకే దీనిని హరియోటా అవియా అని పేరు పెట్టాం. అంతరించి పోతున్న జాతుల జాబితాలో చేర్చే విషయమై ఆలోచిస్తున్నట్టు నిపుణులు తెలిపారు. -
ఇదేం వింత చట్టం! భార్య పుట్టినరోజు మర్చిపోవడమే నేరమా..!
పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన రోజు. ఎంతలా అంటే వాళ్ళకి ఉన్నంతలో బాగా జరుపుకోవాలి అనుకుంటారు. అయితే భార్యలకు బయటవాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ కంటే మనసుకి నచ్చిన వాళ్ళు ఇచ్చే కామెంట్ ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. తాను పుట్టినరోజుని తన భర్త గుర్తుపెట్టుకుని విష్ చేస్తే వచ్చే ఆనందమే వేరు. ఎవరు ఎన్ని ఖరీదైన బహుమతులు ఇచ్చిన భర్త ఇచ్చే బహుమతి కోసం ఎదురు చూస్తుంటుంది. భార్య ఎప్పుడు భర్త ఇచ్చే బహుమతిలో ఖరీదు చూడదు. అందులోని ప్రేమనే చూస్తుంది. అయితే భార్యలకి ఉన్న అదృష్టం ప్రతేకత ఉన్న రోజులని గుర్తు పెట్టుకోవడం. అందుకే భార్యలు భర్త పుట్టినరోజుని, పిల్లల పుట్టిన రోజుని, పెళ్లి రోజుని, అనుకుంటే ఇరుగు పొరుగు వాళ్ళ పుట్టినరోజులు కూడా గుర్తుపెట్టుకోగలదు. కానీ భర్త తన భార్య పుట్టిన రోజుని గుర్తు పెట్టుకోవాలి అనుకున్నా.. పని హడావిడిలో మరిచిపోతుంటాడు.ఇలా భార్య పుటిన రోజుని మర్చిపోతే జైలు శిక్ష పడుతుంది అని మీకు తెలుసా..? అది కూడా ఏకంగా ఐదేళ్లు. అవును ఇది నిజం. పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలో సమోవా అనే అందమైన ద్వీపం ఉంది. ఇక్కడ ఎవరైన పెళ్ళైన వ్యక్తి తన భార్య పుట్టిన రోజుని పొరపాటున మర్చిపోతే జైలు శిక్ష పడుతుంది. తన భర్త తన పుట్టిన రోజుని మర్చిపోయారని భార్య గనుక ఫిర్యాదు చేస్తే.. తప్పనిసరిగా శిక్ష పడుతుంది. ఇక్కడ భార్య పుట్టిన రోజును మరిచిపోతే మాత్రం.. తప్పకుడా అది నేరం కింద లెక్క.ఇక్కడి రూల్ ప్రకారం.. అనుకుని మరిచిపోయాడా.. లేదంటే.. అనుకోకుండా మరిచిపోయాడా అనేది చూడరు. మరిచిపోయాడు అంతే.. దీనితో న్యాయపరమైన చిక్కుల్లో పడతాడు భర్త. అయితే ఈ చట్టంలో కాస్త వెసులుబాటు ఉంది. మెుదటిసారి భార్య పుట్టినరోజును మరిచిపోతే.. కాస్త చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారు. మరోసారి అలా చేయోద్దని.. పోలీసులు హెచ్చరిస్తారు. మళ్లీ అదే రిపీట్ చేశారనుకో.. తప్పు అవుతుంది. జైలు రూపంలో శిక్ష పడుతుంది. మన దేశంలో ఇలాంటి చట్టాలు అమలులో ఉంటే.. చాలా మంది భర్తలు జైలుకే వెళ్తారేమో.(చదవండి: పచ్చి జామకాయ కంటే కాల్చిందే బెటర్! ఎన్ని ప్రయోజనాలంటే..!) -
కాలచక్ర భ్రమణంలో మార్పులెన్నో!
చాలామంది వచ్చే సంవత్సరం బతుకు ఎలా సాగుతుందని తెలుసుకోవాలి అనుకుంటారు. మరికొందరికి వచ్చే వారంలో విశేషాలు తెలియాలని ఆత్రం. రానున్న తరాల తీరు, మనుషుల బతుకు గురించి తెలుసుకోవాలనే వారు కూడా ఉన్నారు. నిజంగా తెలివి తెలిసిన తర్వాత కూడా వేల ఏళ్లు గడిచాయి. ఈ మధ్యన జరిగిన ఒక పరిశోధన ప్రకారం మన దేశంలో 54 వేల సంవత్సరాల కాలం నుంచి మనుషులు ఉన్నట్టు ఆధారాలు కనిపించాయి. ఇప్పటికి పదివేల సంవత్సరాల మునుపు వ్యవసాయం మొదలైంది. అప్పటి వరకు మనిషి ప్రకృతి మీద ఆధారపడి మాత్రమే బతికాడని అర్థం. వ్యవసాయం వచ్చిన తర్వాతే నగరాలు పుట్టుకొచ్చాయి. నగరాలు వచ్చాయి అంటే నాగరికత వచ్చిందని అర్థం. ఇప్పుడేమో ఏకంగా 21వ శతాబ్దిలోకి వచ్చేశాము మనము! ఉత్త రోజులు వస్తాయి అని అందరూ ఎదురుచూచిన కాలం ఇదేనేమో? కొంతకాలం పోతే నీళ్లు ఉండవు, తిండి ఉండదు, చివరకు గాలి కూడా ఉండదు, అంతా సర్వనా శనం అవుతుంది లాంటి మాటలు తరచుగా వినబడుతున్నాయి. అది నిజమేనేమో? ఇప్పటికే కొన్ని చోట్లలో మంచినీళ్లు దొరకక పెట్రోల్ కొన్నట్టు లీటర్ల ప్రకారం నీళ్లు కొంటున్నారట! అయినప్పటికీ మనిషి జాతి మరో లక్ష సంవత్సరాలు మనగలగడం మాత్రం గ్యారెంటీ అంటున్నారు మరికొందరు! అటువంటి పరిస్థితులలో మనిషి మనుగడ ఏ రకంగా ఉంటుంది? యువాల్ నోవా హరారి లాంటివారు రానున్న కాలంలో బ్రతుకులను గురించి తమ ఊహలను బయట పెట్టి సంచలనం సృష్టించారు. మనకు గతం గురించి తెలుసు కనుక, ఆ విషయాలు, వివరాల ఆధారంగా భవిష్యత్తును కూడా ఊహించడానికి వీలవుతున్నది. మనుషులు ఇలాగే ఉంటారా? మునుముందు కూడా ఈ రకంగానే మాట్లాడతారా? ఎక్కడ బతుకుతారు?ప్రకృతి మనకోసం ఇలాగే మిగిలి కొనసాగుతుందా? మనిషి విశ్వం లోతులలోకి వెళ్ళగలుగుతాడా? మనకు కావ లసిన కనీసపు వనరులు మిగులుతాయా? దొరుకుతూనే ఉంటాయా? ఎన్నో ప్రశ్నలు! వాటికి జవాబులు కూడా! ఈ ప్రశ్నలన్నీ వెనకటి నుంచి అడుగుతున్నవే. సాహస యాత్రికులు ఈ రకం ప్రశ్నలు ప్రేరణతో ప్రపంచమంతా తిరిగి కొత్త ప్రాంతాలను కనుగొన్నారు. భూమి పొరలలోని ప్లేట్ల కదలిక, మరిన్ని మార్పుల కారణంగా కొత్త భూభాగాలు వెలుగులోకి వస్తాయి అంటున్నారు సైంటిస్టులు. హవాయి ప్రాంతంలో సముద్రంలోనే అగ్నిపర్వతాల పేలుళ్ల కారణంగా ఎన్నో దీవులు పుట్టాయి. అలాంటి దీవులు అక్కడక్కడ మరిన్ని పుట్టే వీలు కూడా ఉంది. అవి ప్రపంచమంతా సముద్రంలో ఎక్కడయినా పుట్టవచ్చు. హవాయి ప్రాంతంలో సముద్రంలో లోహియీ అనే అగ్ని పర్వతం మునిగి ఉంది. సముద్రమట్టంలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుంటే అక్కడ ఒక కొత్త దీవి పుట్టడం తప్పదనిపిస్తుంది. అంటే బయటపడుతుంది. యూరప్, ఆఫ్రికా తీరాల వెంట కూడా కొత్త దీవులు పుడతాయి. ఈ రెండు ఖండాలు ఏటా రెండున్నర సెంటీమీటర్ల చొప్పున వాయవ్యం వైపు కదులుతున్నాయి. మరో కొన్ని మిలియన్ సంవత్సరాలలో జిబ్రాల్టర్ సంధి మూసుకుపోతుంది. అట్లాంటిక్ నీరు అందకుంటే మధ్యధరాసముద్రం ఎండి పోతుంది. ఆఫ్రికా ఖండం తోసుకువచ్చి కలిసే లోపల, దక్షిణ యూరప్ తీరాలలో కొత్త ప్రాంతాలు బయటపడతాయి. అవి జరగడానికి చాలా కాలం పడుతుంది. మానవ ఆవిర్భావం నుంచి జరిగిన మార్పులు మనకు ఫాస్ట్ ఫార్వ ర్డ్గా కనిపిస్తున్నాయి. రానున్న మార్పులను మనం స్లో మోషన్లో చూడాలి. అసలు మార్పుల గురించి మనకు ఆలోచన అంటూ ఉంటే, చూడడం వీలు కుదురుతుంది. శుభకృతు, శోభకృతు అని రెండు సంవత్సరాలు గడిచాయి. వాటిలో ఎంత శుభం జరిగింది, ఎంతటి శోభ కుది రింది అని అందరూ ఆలోచించుకోవాలి. ప్రమాది సంవ త్సరంలో ప్రమాదాలు మాత్రమే జరుగుతాయి అను కుంటే అంతకంటే అమాయకత్వం లేదు. ఇక ఈ ఉగాది నుంచి మొదలయ్యే సంవత్సరం పేరు క్రోధి అంటున్నారు. క్రోధం అంటే కోపం అని అర్థం. సంవత్సరాల పేర్లను బట్టి ఏమీ జరగదు. ప్రపంచం మొదటి నుంచి ఒకే రకంగా ముందుకు సాగుతున్నది. ఇప్పుడు కూడా అదేరకంగా సాగు తుంది. క్రోధి అని పేరుగల సంవత్సరంలో కూడా ఎప్పటి లాగే మంచి చెడులు కలగలుపుగా ఉంటాయని అనుకుంటే ఇక సమస్య ఉండదు. డా‘‘ కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత -
ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు
శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఇండోనేషియా ఉలిక్కిపడుతోంది. తాజాగా.. రిక్టర్ స్కేల్‌పై దాదాపు 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదు అయ్యాయి. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు. ది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజి వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాందా సముద్ర ప్రాంతంలో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు అయ్యింది. అంబోన్‌కు 370 కిలోమీటర్ల దూరంలో.. 146 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. బాందా సముద్రంలో టానింబర్ దీవులకు దగ్గర్లో భూకంప కేంద్ర నమోదు అయ్యిందని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం ప్రకటించింది. ఈ దీవి జనాభా లక్షా 27 వేలు. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం.. మరిన్ని ప్రకంపనలు సంభవిస్తాయని మాత్రం హెచ్చరించింది. ఏడాది వేల భూకంపాలు ఇండోనేషియా జనాభా 27 కోట్లను పైనే. ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలిచే అగ్నిపర్వతాల జోన్లో ఈ దేశం ఉంది. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన టెక్టోనిక్ ప్లేట్ల బెల్ట్‌గా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ను చెబుతుంటారు. ఈ కారణంగానే అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతాలలో ఒకటిగా ఇండోనేషియా ఉంది. అందుకే ఆ దేశాన్ని భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపంతో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ అనేక దేశాల్లో తీవ్ర విషాదం నింపింది. ఒక్క ఇండోనేషియాలోనే దాదాపు 2.3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక.. గడిచిన 24 గంటల్లో ఇండోనేషియాలో మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై వరుసగా 7, 6.9, 5.1 తీవ్రతతో నమోదు అయ్యాయి. గత వారంగా 15సార్లు భూమి కంపించింది. నెల వ్యవధిలో 68 సార్లు భూమి కంపించగా.. ఏడాది కాలంగా 782సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 1.5 తీవ్రతతో చిన్నపాటి ప్రకంపనల నుంచి శక్తివంతమైన ప్రకంపనలే వాటిల్లాయి ఇక్కడ. 2020లో ఇండోనేషియాలో 8,260సార్లు భూకంపాలు సంభవించాయి. కానీ, అంతకు ముందు ఏడాదిలో 11,500 సార్లు భూమి కంపించింది. -
ఏనుగు చెవులు లాంటి అరుదైన ఆక్టోపస్! విస్తుపోయిన శాస్త్రవేత్తలు
సముద్ర గర్భంలో లభించే ప్రతి ఒక్క జంతువు ఓ అద్భుతం అనే చెప్పాలి. ఇప్పటికీ ఏదో ఒక వింత వింత జలచరాలు కనిపిస్తూనే ఉంటాయి. సముద్ర గర్భంలో మనిషికి అంతుపట్టని ఎన్నో గమ్మత్తు విషయాలు చెబుతూనే ఉంటుంది. ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అచ్చం అలాంటి అరుదైన ఘటనే పసిఫిక్ మహాసముద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత అరుదైన డంబో ఆక్టోపస్ కనిపించింది.రిమోట్ పనిచేసే ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ వాహనంలో అమర్బడిన డీప్ సీ కెమెరా ఈ ఫోటోని తీసింది. ఈ అరుదైన ఆక్టోపస్ దాదాపు 7 వేల కిలోమీటర్ల లోతులో నివశిస్తుంది. వీటిని ప్రంపచంలోనే అందమైన ఆక్టోపస్లుగా పిలుస్తారట. ఈ ఆక్టోపస్లకి చెవులు "డంబో ది ఎలిఫెంట్" వలే ఉంటాయట. అంటే చెవులు వలె కనిపించే రెక్కలు ఏనుగు చెవుల మాదిరిగా పెద్దగా ఉండటంతో అలా పిలుస్తారు. ప్రత్యేకమైన చెవిలాంటి రెక్కలతో కదులుతుంది. అందుకు సంబంధించిన వీడియోని ఓషన్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్ట్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది మీరు ఓ లుక్కేయండి. (చదవండి: 'అత్యంత స్వచ్ఛమైన గాలి' లభించేది ఇక్కడే..బాటిల్లో నింపి..) -
పనామా ట్రాఫిక్‌జామ్!
అంతర్జాతీయ వర్తకానికి అతి కీలకమైన పనామా కాలువ నానాటికీ చిక్కిపోతోంది. దాంతో భారీ సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా ఎప్పుడు చూసినా వందలాది నౌకలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతో పనామాకు ప్రత్యామ్నాయంగా మరో కాలువ ఉండాలన్న వాదన మళ్లీ తెరమీదకొచి్చంది. పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను కలిపే కీలకమైన పనామా కాలువలో నీటి పరిమాణం కొన్నాళ్లుగా బాగా తగ్గుతోంది. దాంతో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయి భారీ నౌకల ప్రయాణానికి ప్రతిబంధకంగా మారింది. ఓ మోస్తరు నౌకలు ఆచితూచి, అతి నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. దీంతో విపరీత జాప్యం జరుగుతోంది. ఫలితంగా భారీ నౌకలు కాలువను దాటి అటు అట్లాంటిక్, ఇటు పసిఫిక్ వైపు వెళ్లడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం కనీసం 250కిపైగా భారీ నౌకలు తమవంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కారణమేమిటి? పనామా కాలువకు ప్రధానంగా నీటిని సరఫరా చేసే రెండు రిజర్వాయర్లు కొద్ది్ద కాలంగా నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. వాటి పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావమే అందుకు అసలు కారణం. మళ్లీ తెరపైకి ’ఆ కాలువ’ పనామా కాలువ పరిమితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కాలువ ఉండాలన్న ప్రతిపాదన మళ్లీ తెర మీదికి వస్తోంది. ఇది కొత్తదేమీ కాదు. 1900 తొలి నాళ్లలో అమెరికా ముందు రెండు ప్రతిపాదనలు ఉండేవి. ఒకటి పనామా కాగా మరోటి నికరాగ్వా గుండా కాలువ నిర్మాణం. పనామాకే అమెరికా సెనేట్ ఓటు వేయడంతో నికరాగ్వా గుండా నిర్మాణం అనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. ఆ మార్గంలో చురుకైన అగ్ని పర్వతాలు ఉండటం సైతం ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగడానికి ప్రధాన కారణం. అదీకాక నికరాగ్వా మార్గంతో పోలిస్తే తక్కువ దూరం ఉండటమూ పనామాకు కలిసొచి్చన అంశాల్లో ఒకటి. దీంతో ఆనాడు కనుమరుగైన ఆ ప్రతిపాదన తాజాగా ఇప్పుడు కొత్త రెక్కలు కట్టుకుని ముందుకు వాలింది. ► ఎలాగైనా దాని నిర్మాణం పూర్తి చేస్తానని చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు ముందుకొచ్చారు. ► 2013 ఏడాదిలో హెచ్కేఎన్డీ అనే చైనా కంపెనీ నికరాగ్వా కాలువ నిర్మాణానికి సిద్ధపడింది కూడా. నికరాగ్వా దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 50 ఏళ్ల పాటు దాని నిర్వహణ అధికారాలు సంపాదించింది. కానీ ఇదీ కాగితాలకే పరిమితం అయింది. అంత ఈజీ కాదు... నికరాగ్వా గుండా కాలువ నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే... ► పశి్చమాన పసిఫిక్, తూర్పున అట్లాంటిక్‌ను కలుపుతూ రెండు కాలువలు తవ్వాలి. ఈ కాలువల మధ్యలోనే నికరాగ్వా సరస్సు ఉంటుంది. ► అట్లాంటిక్ వైపు 25 కిలోమీటర్లు, పసిఫిక్ వైపు 100 కిలోమీటర్ల పొడవునా ఈ కాలువలను తవ్వాల్సి ఉంటుంది. ► దీని నిర్మాణానికి కనీసం 40 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. ► ఇంత భారీ వ్యయంతో కాలువ నిర్మాణం చేపట్టాలంటే దాని ద్వారా అంతకు మించి ఆదాయం ఉంటుందన్న భరోసా కావాలి. ► ఇంత భారీ కాలువ నిర్మాణమంటే పర్యావరణపరంగా ఎంతో పెద్ద సవాలే. ► నిర్మాణం కారణంగా సతతహరిత అరణ్యాలు తుడిచి పెట్టుకుపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళనలు చేశారు. ఇదీ పనామా కథ ► మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. ► అక్కడ నిర్మించిన కృత్రిమ కాలువే పనామా కాలువ. ► ఇది ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతుంది. ► దీని పొడవు 80 కిలోమీటర్లు. ► పనామా కాలువ మధ్యలో గతూన్ అనే కృత్రిమ సరస్సు ఉంటుంది. అలజేలా అనే మరో కృత్రిమ సరస్సు ఈ కాలువకు రిజర్వాయర్‌గా ఉంది. ► ఇటు పసిఫిక్ మహా సముద్రం, అటు అట్లాంటిక్ మహా సముద్రం వైపు కరేబియన్ సముద్రాన్ని విడదీసే ఇస్తుమస్ ఆఫ్ పనామను ఆనుకుని పనామా కాలువ ఉంటుంది. ► పనామా కాలువ గుండా ఏటా 270 బిలియన్ డాలర్ల విలువైన సరుకు రవాణా జరుగుతోంది. ► పనామా గుండా 170 దేశాలకు సరుకులు వెళ్తాయి. ఏం జరగనుంది? ► సరుకు నౌకలు దీర్ఘ కాలం పాటు ఇలా వేచి ఉండటం కారణంగా రవాణా వ్యయం విపరీతంగా పెరుగుతుంది. ► దాంతో ధ్రవీకృత సహజ వాయువు తదితర ఇంధనాల ధరలకు అమాంతం రెక్కలొస్తాయి. ► ఇది అంతిమంగా చాలా దేశాల్లో, అంటే అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ► చివరకు ద్రవ్యోల్బణం పెరిగి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లాడే పరిస్థితి రావచ్చు. ‘పనామాలో ఇప్పుడున్నది కనీవినీ ఎరగని అసాధారణ పరిస్థితి. చాలా ఆందోళనకరం కూడా’ – మిషెల్ వైస్ బోక్మ్యాన్, లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్‌లో సీనియర్ విశ్లేషకుడు – సాక్షి, నేషనల్ డెస్క్ పనామా కాలువ ప్రవేశ మలుపు వద్ద తమ వంతు కోసం వేచి చూస్తున్న వందలాది ఓడలు -
అణుజలం.. ఆందోళన స్వరం
జపాన్‌లో 12 ఏళ్ల క్రితం భూకంపం, సునామీ ధాటికి దెబ్బతిన్న ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం నుంచి వ్యర్థ జలాలను çపసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేయడం ఆందోళన రేపుతోంది. చైనా, దక్షిణ కొరియాతో పాటు స్వదేశంలో కొన్ని సంస్థల అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ జపాన్ ప్రభుత్వం రేడియో ధార్మిక జలాలను విడుదల చేస్తోంది. ఈ నీటి విడుదల ఎంతవరకు సురక్షితం ? జపాన్ వాదనలేంటి ? నిపుణులు ఏమంటున్నారు ? ఫుకుషిమా ప్లాంట్ నుంచి పసిఫిక్ సముద్రంలోకి వ్యర్థ జలాల విడుదల వివాదాస్పదం 2011, మార్చి 11. జపాన్ను తీవ్ర భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 9.0గా నమోదైన ఈ తీవ్ర భూకంపంతో సునామీ ముంచెత్తింది. చెర్నోబిల్ అణు ప్రమాదం తర్వాత అంతటి విధ్వంసం జరిగింది. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్‌లోని మూడు అణు రియాక్టర్లలోని కూలింగ్ వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. దీంతో అణు రియాక్టర్లను చల్లార్చడం తప్పనిసరి అయింది. అప్పట్నుంచి భారీగా అణు వ్యర్థ జలాలు పేరుకుపోయాయి. ప్రమాదం జరిగిన పన్నెండేళ్లకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) అనుమతితో జపాన్‌లోని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) అణు జలాలను శుద్ధి చేసి పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేసే వివాదాస్పద కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అణుజలాలతో సముద్రంలో జీవజాలం ప్రమాదంలో పడుతుందని, పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి ముప్పు ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నా జపాన్ ఆగడం లేదు. జపాన్ నుంచి దిగుమతయ్యే సముద్ర ఉత్పత్తులపై చైనా నిషేధం విధించింది. జపాన్, దక్షిణ కొరియాలో ఈ జలాల విడుదల ఆపాలంటూ నిరసనలు పెరుగుతున్నాయి. అణు జలాల శుద్ధి ఇలా..! ► రేడియో ధార్మికత కలిగిన వ్యర్థ జలాలను దశల వారీగా శుద్ధి చేస్తారు. అడ్వాన్స్డ్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ (ఎల్పీఎస్) ద్వారా తొలి దశలో శుద్ధి చేస్తారు. ► జలాల్లో ఉన్న 62 రకాల రేడియో ధార్మిక మూలకాలను ఎల్పీఎస్ శుద్ధి చేస్తుంది. కానీ ట్రిటియం మూలకాన్ని మాత్రం అది ఫిల్డర్ చేయలేదు. ► అందుకే నీటిలో ఈ ట్రిటియం మూలకాల సాంద్రతను తగ్గించడానికి నీళ్లను మరింతగా డైల్యూట్ చేసే ప్రక్రియ చేపట్టింది టెప్కో. ట్రిటియం సాంద్రతనుæ జాతీయ భద్రతా ప్రమాణాలు నిర్దేశించిన ప్రమాణాల కంటే 40% తక్కువగా నీటిని డైల్యూట్ చేస్తోంది. జపాన్ ఏమంటోంది ? ప్రపంచంలో ఏ అణు ప్లాంట్ అయినా వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలి పెట్టడం సాధారణంగా జరిగేదేనని ఇప్పుడే ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారని జపాన్ ప్రశి్నస్తోంది. సెసియం–137, స్ట్రాంటియం–90 కంటే ట్రిటియం వల్ల ముప్పు తక్కువేనని జపాన్‌లో నిపుణుల అభిప్రాయంగా ఉంది. ‘‘ట్రిటియం మూలకాలున్న నీళ్లని డైల్యూట్ చేసి సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యానికి, పర్యవరణానికి ముప్పేమీ లేదు. అణుబాంబుల్ని పరీక్షించిన తర్వాత విడుదలయ్యే రేడియో ధార్మికత కన్నా శుద్ధి చేసిన అణుజలాల ద్వారా సముద్రంలో కలిసే రేడియో ధార్మికత అతి తక్కువ. ఇది కూడా కాలక్రమంలో క్షీణించిపోతుంది. దీని కోసం ఆందోళనలు అవసరం లేదు’’అని వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రేడియాలజిస్టు జార్జ్ స్టెయిన్‌హాజర్ అభిప్రాయపడ్డారు. పొల్యూషన్‌కి సొల్యూషన్ అంటే డైల్యూషన్ అని ఇంగ్లిషులో అంటారని నీటిని శుద్ధి చేస్తూ పోతే హానికరం కాదని స్పష్టం చేశారు. ఆ జలాలు విషతుల్యమేనా ? ప్రపంచంలో ఇతర దేశాలు సముద్రంలోకి అణు జలాలు విడుదల చేసినా వారు తీసుకున్న జాగ్రత్తలు జపాన్ తీసుకోవడం లేదని పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ గ్రీన్‌పీస్ ఆరోపిస్తోంది. ఈ వ్యర్థ జలాల్లో అత్యంత ప్రమాదకరమైన స్ట్రాంటియం–90 సహా మూలకాలున్నాయంటోంది. మరో మార్గం లేదా ? జపాన్ ప్రభుత్వం, టెప్కో అత్యంత వేగంగా, తక్కువ ధరకి అయిపోతుందని సముద్రంలోకి అణుజలాలను పంప్ చేస్తున్నారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఈ జలాల నిల్వ కి మరిన్ని ట్యాంకుల్ని ఏర్పాటు చేయాలని, లేదంటే మరిగించి ఆవిరి రూపంలో వదుల్చుకోవాలని సూచిస్తున్నారు. ట్యాంకుల్లో నిల్వ ఉంచడాన్ని జపాన్ వ్యతిరేకించింది. భూకంపాలు అధికంగా వచ్చే ఆ ప్రాంతంలో ట్యాంకుల్లో భద్రపరిస్తే లీకయి భూగర్భంలో కలిస్తే మరింత ప్రమాదకరమని అంటోంది. ఇక నీళ్లను ఆవిరిగా మార్చడం, సముద్రంలోకి విడుదల చేయడం మధ్య పెద్దగా తేడాలేదని వాదిస్తోంది. మొత్తమ్మీద ఈ నీటి విడుదల కార్యక్రమం మున్ముందు ఎలాంటి ఉద్రిక్తతల్ని పెంచుతుందో వేచి చూడాలి. వ్యర్థ జలాలు ఎంత ఉన్నాయి ? ► ఫుకుషిమా–దైచీ అణు విద్యుత్ కేంద్రం ధ్వంసమైనప్పట్నుంచి అణు రియాక్టర్లను నిరంతరం చల్లగా ఉంచడానికి రోజుకి 170 టన్నుల నీటిని వాడాల్సి వస్తోంది. ► 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు ఇప్పటికే పేరుకుపోయాయి. ► 1,046 ట్యాంకుల్లో వ్యర్థజలాలను భద్రపరిచారు. ► ఈ అణు జలాలను శుద్ధి చేసి వాటిలో రేడియో ధార్మికత తగ్గించి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► విద్యుత్ ప్లాంట్ నుంచి సముద్రంలోకి ఒక కిలోమీటర్ సొరంగం తవ్వి ఆ మార్గం ద్వారా వదులుతున్నారు. ► ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఏకంగా 30 ఏళ్లు పడుతుందని ఒక అంచనా ► 2024 మార్చి నాటికి 31వేల టన్నులకు పైగా జలాలను సముద్రంలోకి పంపాలని నిర్వాహక సంస్థ టెప్కో ప్రణాళికలు వేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్యుకుషిమా నుంచి అణు జలాల విడుదల
ఒకుమా: జపాన్ను 12 ఏళ్ల క్రితం కుదిపేసిన పెను భూకంపం, సునామీతో దెబ్బ తిన్న ఫ్యుకుషిమా అణు ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసే కార్యక్రమం మొదలైంది. ఇరుగు పొరుగు దేశాల నిరసనల మధ్య గురువారం నాడు తొలి విడతగా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) ప్రకటించింది. వివిధ దశల్లో శుద్ధి చేసిన జలాలు అణు ప్లాంట్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి విడుదల ప్రారంభానికి సంబంధించిన వీడియో కవరేజ్‌ను జపాన్ మీడియా లైవ్‌లో చూపింది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు నీటి విడుదల కార్యక్రమం మొదలైనట్టుగా అణుప్లాంట్ ఆపరేటర్ చెప్పారు. ఈ అణు జలాల విడుదలపై సొంత దేశంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. నీటి విడుదలతో సముద్ర జలాలు విషతుల్యంగా మారి మత్స్య సంపదకు అపార నష్టం చేకూరుతుందని జపాన్, చైనా, దక్షిణకొరియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై దీని ప్రభావం ఉంటుందని జపాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయితే జపాన్ ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. అణు ప్లాంట్‌ను మూసేయాలంటే జలాలు విడుదల చేయక తప్పదని స్పష్టం చేసింది. 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు వెయ్యి ట్యాంకుల్లో భద్రపరిచామని, ఆ ట్యాంకులకు ప్రమాదమేదైనా జరిగితే మరింత ముప్పు వాటిల్లుతుందని టెప్కో పేర్కొంది. అణు జలాలను శుద్ధి చేసి అవి సురక్షితమని తేలాక విడుదల చేస్తున్నట్టు సెంటర్ ఫర్ రేడియేషన్ రీసెర్చ్ డైరెక్టర్ టోనీ హూకర్ చెప్పారు. జపాన్ సీఫుడ్‌పై నిషేధం: చైనా జపాన్‌ది పూర్తిగా స్వార్థపూరిత, బాధ్యతారహిత చర్య అని చైనా మండిపడింది. జపాన్ నుంచి సీఫుడ్‌పై నిషేధం విధించింది. జపాన్ చేస్తున్న పనితో సముద్రంలో మత్స్య సంపదకి, వాతావరణానికి ఎంత ముప్పు ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరని ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. జపాన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ వివిధ దేశాలు జలాల విడుదలను ఖండిస్తున్నాయి. -
Fukushima nuclear disaster: పసిఫిక్‌లో ‘అణు’ అలజడి
టోక్యో: జపాన్‌లో భూకంపంతో దెబ్బతిన్న ఫ్యుకుషిమా అణు రియాక్టర్ నుంచి వ్యర్థ జలాలను గురువారం నుంచి సముద్రంలోకి విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంట్‌ను మూసివేయాలంటే వ్యర్థ జలాలను ఫసిఫిక్ మహా సముద్రంలోకి వదిలేయాక తప్పదని జపాన్ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిదా మంగళవారం చెప్పారు. కేబినెట్ మంత్రులతో సమావేశమైన ఆయన ఈ వ్యర్థ జలాలను ప్రణాళికా బద్ధంగా సముద్రంలోకి పంపాలని ఇందు కోసం ప్లాంట్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 24 నుంచి నీటి విడుదల కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2011 మార్చి 11న సంభవించిన తీవ్రమైన భూకంపం అనంతరం ముంచెత్తిన సునామీకి ఈ ప్లాంట్ దెబ్బ తింది. అప్పట్నుంచి ఈ వ్యర్థ జలాలను జపాన్ నిల్వ చేసి ఉంచింది. కానీ ఇప్పుడు వాటిని నిల్వ చేయడానికి చోటు సరిపోక సముద్రంలోకి వదలాలని నిర్ణయించింది. ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేయడంపై చుట్టుపక్కల దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. జపాన్ దగ్గర దాదాపుగా 13.4 లక్షల టన్నుల వ్యర్థ జలాలు ఉన్నాయి. వీటిని దశలవారీగా శుద్ధి చేసి సముద్రంలోకి వదులుతారు. ఇలా చెయ్యడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని అంచనా. ఈ నీళ్లను సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నీటి విడుదలకి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ఇప్పటికే అంగీకరించింది. జపాన్ పసిఫిక్ సముద్రాన్ని తన సొంత మురికి కాల్వగా భావిస్తోందని చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు విమర్శిస్తున్నాయి. కార్చిచ్చును కేర్ చేయని ఇల్లు! హవాయి: అమెరికాలోని హవాయి దీవిలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది. గత వందేళ్లలో ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు అని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ నగరమైన ‘లాహైనా’ బూడిద కుప్పగా మారిపోయింది. ఇక్కడ దాదాపు అన్ని ఇళ్లు మంటల్లో చిక్కుకొని నేలమట్టమయ్యాయి. మంటల తీవ్రతకు వంద మందికిపైగానే మరణించారు. కానీ, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలిచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఇల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాహైనా సిటీలో రివర్ ఫ్రంట్ వీధిలో ఈ ఇల్లు ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇదొక్కటే ఎప్పటిలాగే మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా? ఫొటోలో ఏదైనా మార్పులు చేశారా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భవన యజమాని ట్రిస్ మిలికిన్ స్పందించారు. అది నిజమైన ఫొటో అని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ చెక్క ఇంటిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశామని, పాత పైకప్పును తొలగించి, లోహపు పైకప్పు వేయిచామని తెలిపారు. చుట్టుపక్కల గడ్డి లేకుండా బండలు పరిచామని వెల్లడించారు. ఈ జాగ్రత్తల వల్లే తమ ఇల్లు మంటల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కార్చిచ్చులో నిప్పు రవ్వలు తమ ఇంటిపై పడినా లోహపు పైకప్పు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ట్రిస్ మిలికిన్ వివరించారు. -
మూడు నెలలపాటు నడిసంద్రంలో..
మెక్సికో సిటీ: సుమారు మూడు నెలల పాటు సముద్రంలో నిస్సహాయ స్థితిలో పెంపుడు కుక్కతో గడిపిన ఓ వ్యక్తి ఎట్టకేలకు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. నమ్మశక్యంకాని ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తిమోతీ లిండ్సే షడ్డక్(54) అనే ఆ్రస్టేలియా వాసి పెంపుడు కుక్క బెల్లాతో కేటమారన్ రకం పడవలో పసిఫిక్ సముద్రంలో విహరిస్తున్నాడు. ఆ సమయంలో ఆ పడవ మరమ్మతుకు గురయింది. అలా సముద్ర జలాల్లో తీరానికి 1,200 మైళ్ల దూరంలో ఆ ఇద్దరూ మూడు నెలలుగా ఉండిపోయారు. అనూహ్యంగా ఇటీవల అటుగా టునా చేపల వేటకు వెళ్లిన మెక్సికో వాసుల కంట పడ్డారు. -
అతడు సముద్రాన్ని జయించాడు.. 60 రోజుల పాటు ఒక్కడే..
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు రోజుల తరబడి సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తన పడవ ప్రయాణం మధ్యలో చిక్కుకుపోవడంతో సముద్రంలో దిక్కుతోచని స్థితిలో గుండెధైర్యంతో కాలాన్ని నెట్టుకొచ్చాడు. పడవలో అతనికి తోడుగా అతని పెంపుడు కుక్క మాత్రమే ఉంది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెక్సికో ఓడ ఒకటి అటుగా రావడంతో వారు అతనిని గుర్తించి రక్షించారు. ఆస్ట్రేలియా నావికుడు టిమ్ షాడోక్ తన పెంపుడు కుక్క బెల్లాతో కలిసి మెక్సికో తీరంలోని లా పాజ్ నగరం నుండి 6000 కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రెంచ్ పాలినీషియా చేరుకునేందుకు ప్రయాణమయ్యాడు. కానీ దురదృష్టకర పరిస్థితుల్లో పడవలో సాంకేతిక లోపం తలెత్తి టిమ్ పసిఫిక్ మహాసముద్రం మధ్యలో చిక్కుకుపోయాడు. చుట్టూ నీరు, అలల హోరు తప్ప మరొకటి కానరాక రెండు నెలలపాటు సాగరం మధ్యలో అలమటించాడు. సముద్రం అలల తాకిడికి పడవలోని ఎలక్ట్రానిక్ సామాగ్రి బాగా దెబ్బతింది. సరైన ఆహారం లేక ఆకలికి పచ్చి చేపలను తింటూ, దాహానికి వర్షపు నీళ్లను తాగుతూ ఎలాగోలా తనతో పాటు తన కుక్క ప్రాణాలను కూడా నిలబెట్టుకున్నాడు. మెక్సికోకు చెందిన ఒక పెద్ద ఓడ వారిని గుర్తించి రక్షించింది. అప్పటికే టిమ్ షాడోక్ బాగా గడ్డం పెరిగి, బక్కచిక్కి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించిన తర్వాత తన పెంపుడు కుక్కతో తిరిగి మెక్సికో చేరుకుని వైద్యపరీక్షలు చేయించుకుని సరైన ఆహారం తీసుకోవాలని అన్నాడు. ఇది కూడా చదవండి: లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ -
జూన్‌లో వర్షాభావం
న్యూఢిల్లీ: ఫసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడినప్పటికీ వాయవ్య భారత్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే జూన్ నెలలో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులుంటాయని తెలిపింది. దక్షిణ కర్ణాటక, ఉత్తర తమిళనాడు, రాజస్తాన్, లద్దాఖ్ మినహా మిగిలిన ప్రాంతాల్లో జూన్ నెలలో వానలు అంతగా కురిసే అవకాశాల్లేవని అంచనా వేసింది. ఫసిఫిక్ మహా సముద్రం వేడెక్కడం ఇప్పటికే ప్రారంభమైందని మన రుతుపవనాలపై ప్రభావాన్ని చూపిస్తే ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం 90శాతం ఉందని కేంద్ర వాతావరణ శాఖ పర్యావరణ పర్యవేక్షణ అధ్యయన కేంద్రం చీఫ్ డి. శివానంద చెప్పారు. అయితే వానలు కురవడానికి అనుకూలమైన ఇండియన్ ఓషన్ డిపోల్ (ఐఓడీ) హిందూ మహాసముద్రంలో ఏర్పడడం వల్ల చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. మధ్య భారతదేశంపై ఎల్‌నినో ప్రభావాన్ని ఐఓడీ సమర్థంగా ఎదు ర్కోవడం వల్ల ఏడాది మొత్తమ్మీద సాధారణ వర్షపాతం కురుస్తుందని వివరించారు. -
పసిఫిక్ ద్వీపదేశంలో భారీ భూకంపం
పోర్ట్ మోర్స్బీ: తరచూ భూకంపాల బారిన పడే ఫసిఫిక్ ద్వీపదేశం.. పపువా న్యూ గినియా Papua New Guinea మరోసారి భారీ భూకంపంతో వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. ఈ వేకువ ఝామున 4 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు స్థానిక విపత్తుల విభాగం. అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. తీర ప్రాంత పట్టణమైన వెవాక్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో చంబ్రీ లేక్ కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. దాదాపు 62 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. ఈ ప్రాంతం.. ఇండోనేషియా సరిహద్దుకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తని నేల స్వభావం వల్ల.. భూకంపం సంభవించిన ప్రాంతంలో నష్టం భారీగానే కలిగే అవకాశముందని అమెరికా జియోలాజికల్ సర్వే అభిప్రాయపడింది. అయితే.. సునామీ సంకేతాలు లేకపోవడం వల్లే హెచ్చరిక జారీ చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. తరచూ భూకంపాలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. భూకంప కేంద్రానికి 250 కిలోమీటర్ల దూరంలోని హైలాండ్ ప్రావిన్స్‌లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. సుమారు 45 సెకండ్లపాటు భారీగా భూమి కంపించిందని స్థానికుడొకరు చెప్తున్నాడు. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో ఒకటిగా ఉన్న పపువా న్యూ గినియా.. బయోడైవర్సిటీకి ఫేమస్. అలాగే అక్కడ కొండ ప్రాంతాలు అధికం. భూకంపాలు సంభవించిన సమయంలో కొండచరియలు విరిగి పడడం ద్వారా భారీగా నష్టం చేస్తుంటుంది. తద్వారా పేదరికంలో ఉన్న దేశం పరిస్థితి.. నానాటికీ మరింతగా దిగజారిపోతోంది. కిందటి ఏడాది సెప్లెంబర్‌లో.. 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం 21 మంది బలి తీసుకుంది. ఇక 2018లో సంభవించిన భూకంపం ఏకంగా 200 మందిని పొట్టనబెట్టుకుంది. వీళ్లలో కొండచరియల కింద నలిగి మరణించిన వాళ్లే అధికం. -
పెను విషాదం.. పదుల సంఖ్యలో మరణాలు!
మనీలా: ఫిలిప్పీన్స్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 31 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ సముద్రంలో సహాయక చర్యలు చేపట్టింది. వివరాల ప్రకారం.. లేడీ మేరీ జాయ్-3 నౌక మిండానావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 31 మంది మరణించినట్టు బాసిలన్ గవర్నర్ జిమ్ సల్లిమాన్ తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, నౌకలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు నీటిలో దూకేశారని అన్నారు. ప్రమాద సమయంలో నౌకలో 250 మంది ప్రయాణికులు ఉన్నట్టు స్పష్టం చేశారు. ప్రమాదం తర్వాత ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్, మత్స్యకారులు కలిసి 195 మందిని కాపాడినట్టు వెల్లడించారు. కాగా, మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: అయ్యో పాకిస్తాన్.. రంజాన్ వేళ దారుణ పరిస్థితులు! -
ఇస్రో సరికొత్త ప్రయోగం.. భూమిపైకి ‘మేఘాట్రోఫిక్–1’ పునరాగమనం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): నియంత్రిత పునరాగమన పద్ధతిలో సరికొత్త ప్రయోగానికి ‘ఇస్రో’ సిద్ధమైంది. 2011 అక్టోబర్ 12న పీఎస్ఎల్వీ–సీ18 రాకెట్ ద్వారా పంపించిన మేఘాట్రోఫిక్ ఉపగ్రహం కాలపరిమితికి మించి పనిచేసి, ప్రస్తుతం అంతరిక్షంలో నిరుపయోగంగా మారింది. దాదాపు 1,000 కిలోల బరువైన మేఘాట్రోఫిక్–1 (ఎంటీ–1) ఉపగ్రహాన్ని ఉçష్ణమండలంలోని వాతావరణం, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం కోసం ఇస్రో, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ (సీఎన్ఈఎస్) సంయుక్తంగా తయారుచేసి ప్రయోగించాయి. దీని కాలపరిమితి మూడేళ్లు. కానీ, 2021 దాకా సేవలందించింది. ప్రస్తుతం వ్యర్థంగా మారిన ఈ ఉపగ్రహంలో 125 కిలోల ద్రవ ఇంధనముంది. ఇది అంతరిక్షంలో పేలిపోయి ఇతర ఉపగ్రహాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఇస్రో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దానిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చి, పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేందుకు మంగళవారం సరికొత్త ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. భూమిపైకి మేఘాట్రోఫిక్–1 రీఎంట్రీ కోసం అందులో ఉన్న ఇంధనం సరిపోతుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. 26న ఎల్వీఎం3–ఎం3 ప్రయోగం లాంచ్ వెహికల్ మార్క్3–ఎం3 (ఎల్వీఎం3–ఎం3) ప్రయోగాన్ని ఈ నెల 26న నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్త భాగస్వాములుగా వన్‌వెబ్ ఇండియా–2 పేరుతో 5,796 కిలోల బరువైన 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రెండోసారి వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నాయి. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని రెండో ప్రయోగ వేదిక దీనికి వేదిక కానుంది. షార్‌లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రెండు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేశారు. క్రయోజనిక్ దశ మాత్రమే పెండింగ్‌లో ఉంది. ప్రయోగించబోయే 36 ఉపగ్రహాలు ఇప్పటికే షార్కు చేరుకున్నాయి. వీటికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. హీట్‌షీల్డ్‌లో అమర్చే పనులు జరుగుతున్నాయి. -
సంబరంగా న్యూ ఇయర్ వేడుకలు
న్యూఢిల్లీ/మెల్బోర్న్: 2022కు గుడ్‌బై చెబుతూ, 2023కు స్వాగతం పలుకుతూ ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ ఆంక్షల బెడద తొలగిపోవడంతో ఎక్కడ చూసినా జనం పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా వేడుకల్లో మునిగిపోయారు. పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవులవాసులు అందరికంటే ముందుగా న్యూ ఇయర్‌కు ఆహ్వానం పలికారు. వారు న్యూజిలాండ్ కంటే గంట ముందే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ స్కై టవర్ వద్ద అర్ధరాత్రికి 10 సెకన్ల ముందు నుంచి బాణసంచా వెలుగుల్లో ప్రజలు 2023కు స్వాగతం పలుకుతూ కేరింతలు కొట్టారు. చైనాలోని గ్రేట్ వాల్ వద్ద, షాంఘైలోని డిస్నీల్యాండ్‌లో ప్రత్యేకంగా మతాబులు కాల్చారు. ఇక ఆస్ట్రేలియాలోని విఖ్యాత సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపై, సమీపంలోని ఒపెరా హౌస్ వద్ద కన్నులు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా పేల్చారు. రాష్ట్రపతి శుభాకాంక్షలు..: దేశ విదేశాల్లోని భారతీయులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రత, ఐక్యత, సమ్మిళిత అభివృద్ధి కోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. -
రష్యాలో ఒళ్లు విరుచుకున్న అగ్నిపర్వతాలు
మాస్కో: రష్యాలో రాజధాని మాస్కోకు 6,600 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో కంచట్కా ద్వీపకల్పంలో రెండు అగ్నిపర్వతాలు నిద్రాణ స్థితి నుంచి మేల్కొని ఒళ్లు విరుచుకున్నాయి. భారీ పరిమాణంలో లావాను వెదజల్లుతున్నాయి. వాటినుంచి వెలువడుతున్న లావా, ధూళి మేఘాలు సుదూరాల దాకా కన్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అతి త్వరలో పూర్తిస్థాయిలో బద్దలయ్యే ప్రమాదముందన్నారు. శనివారం సంభవించిన గట్టి భూకంపమే ఇందుకు కారణమట. వీటిలో క్లుచెవ్స్కయా స్పోకా అగ్నిపర్వతం నుంచి గంటకు ఏకంగా పదిసార్లు భారీ పేలుళ్లు వెలువడుతున్నాయట! 4,754 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది యురేషియాలోకెల్లా అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం. కంచట్కా ద్వీపకల్ప ప్రాంతం ఏకంగా 30కి పైగా చురుకైన అగ్నిపర్వతాలకు నిలయం! -
అగ్నిపర్వతంపై సాహసం.. పట్టుజారితే బూడిద కూడా దొరకదు.. స్లాక్‌లైన్ వాక్‌లో గిన్నిస్ రికార్డు
-
చావుతో చెలగాటం.. అయినా ఈ సాహసాన్ని చూసేయండి
వైరల్: రఫెల్ బ్రిడి, అలెగ్జాండర్ షుల్జ్.. ఇప్పుడు తమ పనితో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నారు. ప్రాణాల్ని పణంగా పెట్టి చేసి వీళ్ల సాహసం ఇప్పుడు వైరల్ అవుతోంది. స్వయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్లే ఈ జంట చేసిన సాహసాన్ని సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది మరి. నైరుతి పసిఫిక్ మహాసముద్రంలోని టన్నా ఐల్యాండ్‌లోని వనాటు వద్ద యసుర్ అగ్నిపర్వం మీద వీళ్లు స్లాక్‌లైన్ నడక సాహసం చేశారు. అగ్నిపర్వతం అడుగు నుంచి సుమారు 137 అడుగుల ఎత్తులో ఒక తాడుపై ఎలాంటి ఆధారం లేకుండా వీళ్ల నడక కొనసాగింది. కింద నుంచి అగ్నికీలలు ఎగసిపడుతున్నా సుమారు 261 మీటర్ల దూరం నడక సాగించి.. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు ఈ ఇద్దరూ. రఫెల్ జుంగో బ్రిడి బ్రెజిల్‌కు చెందిన సాహసికుడు కాగా, అలెగ్జాండర్ షుల్జ్ జర్మనీకి చెందిన వ్యక్తి. సాహసమే వీళ్లిద్దరి ఊపిరి. గతంలో వీళ్లిద్దరి పేర్ల మీద పలు రికార్డులు కూడా ఉన్నాయి. -
పసిఫిక్ మహాసముద్రంలో వింత ‘పుష్ప’ జీవి గుర్తింపు
న్యూఢిల్లీ: అచ్ఛంగా విచ్చుకున్న పుష్పంలాగా ఉన్న కొత్త జీవిని పసిఫిక్ మహాసముద్రంలో పరిశోధకులు గుర్తించారు. ఓషియన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన పసిఫిక్ అడుగు భాగాన అన్వేషిస్తుండగా, ఈ జీవి దర్శనమిచ్చింది. సంబంధిత వీడియో దృశ్యాలను ఓషియన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టు విడుదల చేసింది. సముద్ర ఉపరితలం నుంచి 9,823 అడుగుల(2,994 మీటర్లు) లోతున ఈ జీవి కనిపించిందని పరిశోధకులు చెప్పారు. పువ్వుకు ఉన్నట్టుగానే దీనికి కాండం, రేకుల (తంతువుల) లాంటివి ఉండడం విశేషం. కాండం వంటి భాగం 7 అడుగులు (2 మీటర్లు) కాగా, ఒక్కో తంతువు 16 అంగుళాలు (40 సెం.మీ.) పొడవున్నాయట! ఇదో భారీ సముద్ర జీవి అని చెబుతున్నారు. అయితే ఇతర సముద్ర జీవజాతుల తరహాలో కాకుండా భిన్నంగా కనిపిస్తుండడం దీని ప్రత్యేకత. ఇలాంటి వింత జీవి ఒకటి కనిపిస్తుందని ఎప్పుడూ ఊహిచలేదని పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే.. -
సాగర కన్యలు ఉన్నది నిజమే! ఔను అంటున్న జపాన్ శాస్త్రవేత్తలు
మనం సినిమాల్లో సాగర కన్యలు(మత్స్య కన్య) చూశాం. కానీ నిజంగా అవి ఉన్నాయా? అనేది మాత్రం అందరి మదిలో మెదిలే ప్రశ్నే. డిస్కవరీ ఛానెల్స్‌లో వాటి గురించి చెబుతుంటారు కానీ రియల్‌గా మాత్రం వాటిని ఎవరు చూసి ఉండే అవకాశం లేదు. అయితే జపాన్ శాస్త్రవేత్తలు మాత్రం సాగర కన్యలు ఉన్నాయంటున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలతో సహా వివరిస్తున్నారు. వివరాల్లోకెళ్తే...మానవ ముఖం, తోకతో ఉన్న 300 ఏళ్ల నాటి మత్సకన్య మమ్మీని చూసి శాస్తవేత్తలు ఆశ్చర్యపోయారు. మత్స్య కన్య ఆకారంలో ఉన్న ఈ మమ్మీని జపాన్ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. 1736 మరియు 1741 మధ్యకాలంలో జపనీస్ ద్వీపం అయిన షికోకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 12 అంగుళాల మర్మమైన జీవి పట్టుబడిందని చెబుతున్నారు. ఈ మత్స్య కన్య మమ్మీ పసిఫిక్ మహాసముద్రంలో చేపలు పట్టే వలలో చిక్కుకుందని పేర్కొంటూ ఒక లేఖ దొరికిందని కూడా అన్నారు. ఆ తర్వాత ఎండిన మత్స్య కన్యను ఒక కుటుంబం పర్యవేక్షించిందని తదనంతరం అసకుచి నగరంలోని ఒక దేవాలయంలో ఉందని చెప్పారు. ఈ మమ్మీకి దంతాలు, ముఖం రెండు చేతులు, తల, నుదురుపై వెంట్రుకలు ఉన్నాయన్నారు. ఎగువ భాగం మానవ రూపంలోనూ, దిగువ భాగం చేప లక్షణాలను కలిగి ఉందని తెలిపారు. శరీరం దిగువ భాగంలో పొలుసులు, తోక-వంటి టేపర్డ్ ఎండ్ ఉంటుందని చెప్పారు. కురాషికి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ పరిశోధకులు వీటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయనుంది. జపనీస్ మత్స్యకన్యలకు అమరత్వపు పురాణం(యావో-బికుని) ఉందని, మత్స్యకన్య మాంసం తింటే ఎప్పటికీ చనిపోరు అని ఒకాయమా ఫోక్లోర్ సొసైటీకి చెందిన హిరోషి కినోషిత చెబుతున్నారు. ఈ పురాణం కుడా ఆ మత్య్స కన్య దొరికిన ఆలయంలోనే ఉందని చెప్పారు. ఆ పురాణాన్ని నమ్మే కొందరు మత్య్స కన్య పొలుసులను చెవిలో పెట్టుకుంటారని అన్నారు. ఆ మత్స్య కన్యలు అంటు వ్యాధులను దూరం చేస్తాయని జపాన్ వాసుల ప్రగాఢ నమ్మకం అని కూడా చెప్పారు. (చదవండి: చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం!...రష్యా బలగాలు ముట్టడించకుండా చేసేందుకు యత్నం!) -
టోంగా సముద్రగర్భంలో.. అగ్నిపర్వతం పేలుడు
వెల్లింగ్టన్: దక్షిణ ఫసిఫిక్ సముద్రంలోని ద్వీపకల్పమైన టోంగాలో సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం శనివారం బద్దలవడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. సముద్రం లోపల ఉన్న హుంగా టోంగా హాపై అనే అగ్నిపర్వతం వరసగా రెండు రోజులు పేలడంతో టోంగా వ్యాప్తంగా బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. ఈ బూడిద 19 కి.మీ.ఎత్తువరకు వ్యాపించినట్లు టోంగా జియోలాజికల్ సర్వే తెలిపింది. అమెరికా నుంచి జపాన్ వరకు తీరప్రాంతంలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎంత నష్టం జరిగిందనేది తెలియలేదు. లక్షకు పైగా జనాభా ఉన్న టోంగా తీరప్రాంతంలో భారీగా అలలు ముంచెత్తుతున్న వీడియోలను ప్రజలు సోషల్‌మీడియాలో షేర్చేశారు. ముప్పు తొలగిపోవడంతో అమెరికాలో సునామీ హెచ్చరికల్ని వెనక్కి తీసుకున్నారు.