![పోరాటమే ఆమె పంథా!](/styles/webp/s3/article_images/2017/09/2/61415726584_625x300.jpg.webp?itok=Nvez_nsD)
పోరాటమే ఆమె పంథా!
పసిపిక్ మహాసముద్రం తూర్పు భాగంలో ఉండే చిన్న దీవి ఫిజి. ఈ దేశాన్ని ఇంకో రకంగా పరిచయం చేయాలంటే.. మహిళలపై హింస విషయంలో ప్రపంచంలోనే తొలి స్థానం ఈ దేశానిదే. ఇక్కడ సగటున 64 శాతం మహిళలు శారీరక, లైంగిక హింసకు గురవుతున్నారు. గృహహింసకు కూడా లోటు లేదు. ఇటువంటి చోట మహిళలకు అనుకూలంగా గళం విప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉండటం వల్లే రోషికాదేవ్‌కి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.‘కరేజియస్ ఉమన్’ అవార్డును దక్కేలా చేసింది.
రోషికాదేవ్... ఫిజీ దేశానికి చెందిన మహిళ. ఈ యేడాదికి గానూ యూఎస్ వాళ్లు ఎంపిక చేసిన అత్యంత శక్తిసామర్థ్యాలున్న మహిళల్లో ఒకరిగా నిలిచిందామె. పేరును బట్టి ఈమె భారతీయ మూలాలున్న మహిళ అని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫిజిలో రాజకీయ నేతగా, వ్యాపారవేత్తగా పేరున్న ఇందర్ దేవ్ తనయ రోషికా. తండ్రి వ్యాపారాలు చూసుకొంటూ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయినా... రోషికా మాత్రం సామాజిక ఉద్యమాలపై దృష్టి నిలిపింది.
సామాజిక మాధ్యమాల ద్వారా యువ, మహిళా శక్తిని సమీకరించుకొంటూ రిషిక తన పోరాటపంథాను కొనసాగిస్తోంది. విశేషం ఏమిటంటే... ఇటీవల జరిగిన ఫిజి ఎన్నికల్లో రోషిక పోటీ చేసింది! కేవలం 0.2 శాతం ఓట్లతేడాతో ఓడిపోయింది. మరింత విశేషం ఏమిటంటే ఆమె రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పోటీ చేసి ప్రధాన పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. స్వల్పతేడాతో ఓటమి పాలయ్యింది.అయితే అందుకు తానేమీ నిరుత్సాహపడలేదని.. మార్పు అనేది ఒక రోజులో రాదని, క్రమంగా సంభవిస్తుందన్నది రోషిక విశ్వాసం. ఏనాటికి అయినా ఫిజి దేశానికి దిశానిర్దేశం చేసే నేత కావాలనేది రోషిక లక్ష్యం. ఈ విషయాన్ని ఆమె గర్వంగా ప్రకటించుకొంటారు కూడా!