
అమెరికా నగరాలను తాకే సామర్థ్యం దాని సొంతం
బీజింగ్: అమెరికాలోని నగరాలను తాకేంతగా సుదూరాలకు వెళ్లగల సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)ను చైనా విజయవంతంగా పరీక్షించింది. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటే ఉద్దేశంతోనే చైనా ఈ పరీక్ష జరిపిందని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.
పసిఫిక్ మహాసముద్ర జలాల్లో బుధవారం ఉదయం 8.44 గంటలకు జరిపిన ఈ పరీక్ష తమ ఆయుధ పనితీరు, సైన్యం శిక్షణా సామర్థ్యాలను ప్రదర్శించి నిర్దేశిత లక్ష్యాన్ని చేధించిందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
పొరుగు దేశాలు ఆందోళన చెందకుండా ముందే రాకెట్ ప్రయోగించే దిశ, గమ్యం తదితర వివరాలను వారితో చైనా పంచుకుంది. దశాబ్దాల కాలంలో చైనా బహిరంగంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని చైనా అధికారిక ‘చైనా డైలీ’ వార్తాసంస్థ పేర్కొంది. ఈ క్షిపణి ఎంత దూరం వెళ్తుందో చైనా చెప్పలేదు. ఇది పలు అమెరికా నగరాలనూ తాకగలదని హాంకాంగ్ కేంద్రంగా నడిచే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment