Ministry of Defense
-
ఖండాంతర క్షిపణిని పరీక్షించిన చైనా
బీజింగ్: అమెరికాలోని నగరాలను తాకేంతగా సుదూరాలకు వెళ్లగల సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)ను చైనా విజయవంతంగా పరీక్షించింది. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటే ఉద్దేశంతోనే చైనా ఈ పరీక్ష జరిపిందని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర జలాల్లో బుధవారం ఉదయం 8.44 గంటలకు జరిపిన ఈ పరీక్ష తమ ఆయుధ పనితీరు, సైన్యం శిక్షణా సామర్థ్యాలను ప్రదర్శించి నిర్దేశిత లక్ష్యాన్ని చేధించిందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పొరుగు దేశాలు ఆందోళన చెందకుండా ముందే రాకెట్ ప్రయోగించే దిశ, గమ్యం తదితర వివరాలను వారితో చైనా పంచుకుంది. దశాబ్దాల కాలంలో చైనా బహిరంగంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని చైనా అధికారిక ‘చైనా డైలీ’ వార్తాసంస్థ పేర్కొంది. ఈ క్షిపణి ఎంత దూరం వెళ్తుందో చైనా చెప్పలేదు. ఇది పలు అమెరికా నగరాలనూ తాకగలదని హాంకాంగ్ కేంద్రంగా నడిచే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. -
15 వేల అడుగుల ఎత్తు నుంచి.. పోర్టబుల్ ఆస్పత్రి పారా–డ్రాప్
న్యూఢిల్లీ: భారత ఆర్మీ, వైమానిక దళం కలిసి అరుదైన ఘనతను సాధించాయి. పోర్టబుల్ ఆస్పత్రి ‘ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్’ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా లక్షిత ప్రాంతంలో నేలపైకి దింపాయి. అత్యంత ఎత్తులో నుంచి విజయవంతంగా పూర్తి చేసిన ఈ పారా–డ్రాప్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిదని రక్షణ శాఖ తెలిపింది. ఇందులోని క్రిటికల్ ట్రామాకేర్ క్యూబ్‌లను భీష్మ(భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి)ప్రాజెక్టులో భాగంగా దేశీయంగానే రూపొందించినట్లు వెల్లడించింది. మారుమూల, అటవీ కొండ ప్రాంతాల్లో వరదలు వంటి ప్రకృతి విపత్తులు, అత్యవసర సమయాల్లో బాధితులకు అత్యంత వేగంగా, సమర్థమైన వైద్యసేవలను అందించే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పోర్టబుల్ ఆస్పత్రికి రూపకల్పన జరిగిందని వివరించింది. ఇందులోనున్న వసతులతో 200 మందికి వైద్య సేవలందించొచ్చని తెలిపింది. ఈ క్యూబ్‌ను అధునాతన రవాణా విమానం సీ–130జే సూపర్ హెర్క్యులస్ ద్వారా అనుకున్న చోట అనుకున్న విధంగా నేలపైకి సురక్షితంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఆర్మీ ఇందుకోసం అత్యాధునిక ప్రెసిషన్ డ్రాప్ సాంకేతికతను వినియోగించుకుందని తెలిపింది. -
నావికా దళాధిపతిగా దినేశ్ త్రిపాఠీ
న్యూఢిల్లీ: భారత నావికా దళం నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ నియమితులయ్యారు. ప్రస్తుతం నేవీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైస్ అడ్మిరల్ త్రిపాఠీ ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. 1964 మే 15వ తేదీన జన్మించిన వైస్ అడ్మిరల్ త్రిపాఠీ 1985 జులై ఒకటో తేదీన భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిపుణుడిగా గత 30 ఏళ్లుగా బాధ్యతల్లో ఉన్నారు. -
రూ.84,560 కోట్లతో సైనిక సామగ్రి
న్యూఢిల్లీ: దేశ సైనిక బలగాల యుద్ధ పటిమను గణనీయంగా పెంచే రూ.84,560 కోట్ల విలువైన పలు ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ)ఆమోదం తెలిపింది. కొత్త తరం యాంటీ ట్యాంక్ మందుపాతరలు, ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్లు, హెవీ వెయిట్ టోర్పెడోలు, మధ్యశ్రేణి, మల్టీ మిషన్ యుద్ధ విమానాలు, ఫ్లయిట్ రీఫ్యూయలర్ విమానాలు, అధునాతన రేడియో వ్యవస్థలు ఇందులో ఉన్నట్లు రక్షణ శాఖ తెలిపింది. వీటి చేరికతో నేవీ, కోస్ట్‌గార్డ్, ఎయిర్‌ఫోర్స్ పాటవం గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది. -
రూ. 2.23 లక్షల కోట్లతో ‘రక్షణ’ కొనుగోలు ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: రూ.2.23 లక్షల కోట్ల విలువైన రక్షణ సంబంధిత కొనుగోలు ప్రాజెక్టులకు భారత రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) గురువారం ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలిక్టాపర్లను త్రివిధ దళాల కోసం రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. దీనివల్ల భారత సైనిక దళాలు మరింత శక్తివంతంగా మారుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారత్–పాకిస్తాన్, భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సమకూర్చుకోవాలని రక్షణ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. రూ.2.23 లక్షల కోట్లతో కొనుగోలు చేస్తే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో 98 శాతం స్వదేశంలోనే తయారవుతాయని రక్షణ శాఖ పేర్కొంది. -
దేశ రహస్యాలు అమ్మడానికి ప్రయత్నించి.. చివరికి బిగ్ ట్విస్ట్..
కెలమంగలం(కర్ణాటక): కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలోని రహస్యాలను సెల్‌ఫోన్ ద్వారా ఫోటోలు తీసి విదేశీ గూఢచార సంస్థలకు విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని డెంకణీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని బైరగొండపల్లి గ్రామానికి చెందిన రామక్రిష్ణారెడ్డి కొడుకు ఉదయ్‌కుమార్ (32). బెంగళూరులో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా 2017 నుంచి 2019 వరకు పనిచేశాడు. ఈ సమయంలో కార్యాలయంలో భద్రపరిచిన పలు ధృవీకరణ పత్రాలు, పరిశోధనా ఉపకరణాలను సెల్‌ఫోన్ ద్వారా ఫోటోలు తీసి విదేశీ ఏజెన్సీల వద్ద విక్రయించి డబ్బు సంపాదించడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకొన్న తళి పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి ఉదయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉంది. చదవండి: మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ముప్పు.. వీడియో -
Russia Ukraine War: విదేశీ నౌకలకు సేఫ్ కారిడార్
కీవ్/దావోస్: నల్ల సముద్రంలోని ఓడ రేవుల నుంచి విదేశీ నౌకలు భద్రంగా బయటకు వెళ్లేందుకు వీలుగా సేఫ్ కారిడార్ తెరుస్తామని రష్యా రక్షణ శాఖ హామీ ఇచ్చింది. మారియూపోల్ నుంచి నౌకలు వెళ్లడానికి మరో కారిడాన్ ప్రారంభించనున్నట్లు రష్యా రక్షణశాఖ ప్రతినిధి మైఖేల్ మిజింజ్‌సెవ్ చెప్పారు. ఒడెసా, ఖేర్సన్, మైకోలైవ్‌తో సహా నల్లసముద్రంలోని ఆరు పోర్టుల్లో ప్రస్తుతం 16 దేశాలకు చెందిన 70 నౌకలు ఉన్నాయని అన్నారు. కారిడార్లు ప్రతిరోజూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. మారియూపోల్ పోర్టులో కార్యకలాపాలు మూడు నెలల తర్వాత పునఃప్రారంభమైనట్లు రష్యా సైన్యం తెలియజేసింది. నల్లసముద్రంలోని ఓడ రేవుల్లో రష్యా సైన్యం పాగావేసింది. నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. దీనివల్ల ఉక్రెయిన్ నుంచి విదేశాలకు ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో రష్యా దిగివచ్చింది. ఉక్రెయిన్ ఆయుధ సామగ్రి ధ్వంసం: రష్యా ఉక్రెయిన్‌లోని పొక్రోవ్స్క్లో ఓ రైల్వేస్టేషన్ వద్ద ఉక్రెయిన్ ఆయుధ సామగ్రిని తమ సైన్యం ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. యుద్ధ విమానాలతో రైల్వేస్టేషన్‌పై దాడి చేసినట్లు చెప్పారు. మైకోలైవ్ రీజియన్‌లోని దినిప్రొవ్‌స్కీలో ఉక్రెయిన్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సెంటర్‌ను నేలమట్టం చేశామని వివరించారు. ఈ ఘటనలో11 మంది ఉక్రెయిన్ సైనికులు, 15 మంది విదేశీ నిపుణులు మరణించారని పేర్కొన్నారు. గత 24 గంటల్లో ఉక్రెయిన్‌పై భీకర దాడులు జరిపినట్లు కొనాషెంకోవ్ వివరించారు. 500 టార్గెట్లపై విరుచుకుపడినట్లు తెలిపారు. లుహాన్స్క్, డొనెట్స్క్లో ప్రస్తుతం 8,000 మంది ఉక్రెయిన్ జవాన్లు తమ ఆధీనంలో ఉన్నారని వేర్పాటువాదుల ప్రతినిధి రొడియోన్ మిరోష్నిక్ చెప్పారు. వాస్తవాన్ని ఉక్రెయిన్ గుర్తించాలి: పెస్కోవ్ క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని ఉక్రెయిన్ గుర్తిస్తుందని ఆశిస్తున్నామని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం అన్నారు. ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల సరఫరా పునఃప్రారంభం కావాలంటే రష్యాపై కొన్ని ఆంక్షలను పశ్చిమ దేశాలు సడలించాలని పెస్కోవ్ తెలిపారు. మళ్లీ వడ్డీ రేటు తగ్గించిన రష్యా సెంట్రల్ బ్యాంకు ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి గాను రష్యా సెంట్రల్ బ్యాంకు రుణాలపై వడ్డీ రేటును 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీ రేటును ఏకంగా 20 శాతం పెంచింది. అప్పటి నుంచి వడ్డీ రేటును మూడు పాయింట్లు తగ్గించడం ఇది మూడోసారి. -
ప్రత్యర్థుల గుండెల్లో ‘పిడిబాకు’.. కింజల్ ప్రత్యేకతలివే!
ఉక్రెయిన్‌పై యుద్ధంలో తొలిసారిగా కింజల్ హైపర్సోనిక్ ఏరో బాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ శనివారం అధికారికంగా ప్రకటించింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయంటున్న ఈ మిస్సైళ్లపై ఇప్పుడు అందరి దృష్టీ పడింది... ► కింజల్ అంటే రష్యన్ భాషలో పిడిబాకు. ‘కేహెచ్–47ఎం2 కింజల్’గా పిలిచే ఈ అత్యాధునిక క్షిపణులను రష్యా అధ్యక్షుడు పుతిన్ 2018 మార్చి నెలలో ఆవిష్కరించారు. వీటిని ఐడియల్ వెపన్ (ఆదర్శ ఆయుధం)గా అభివర్ణించారు. ఇతర ఆధునిక క్షిపణులతో పోలిస్తే కింజల్ వేగం, కచ్చితత్వం చాలా ఎక్కువ. ► కింజల్ మిస్సైళ్లను గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగిస్తారు. ధ్వనివేగం కంటే 10 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్లగలవు. ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల నుంచి సులువుగా తప్పించుకునే సామర్థ్యం వీటి సొంతం. అడ్డొచ్చే క్షిపణులను, ఆయుధాలను నిర్వీర్యం చేస్తూ దూసుకెళ్తాయి. ► గంటలో ఏకంగా 12,350 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. భూమి లోతుల్లోకీ చొచ్చుకెళ్లగలవు. ► 1,500 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. 480 కిలోల బరువైన సంప్రదాయ లేదా అణు పేలోడ్లను మోసుకెళ్తాయి. ఇది రెండో ప్రపంచయుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన ఫ్యాట్‌మ్యాన్ బాంబు బరువు కంటే 33 రెట్లు ఎక్కువ! ► టూ–22ఎం3 లేదా మిగ్–31కే ఇంటర్సెప్టర్ల నుంచి వీటిని ప్రయోగిస్తారు. ► ఇస్కాండర్–ఎం షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను అభివృద్ధి చేసి కింజల్ క్షిపణులను రూపొందించిందని రక్షణ నిపుణుల అంచనా. -
ఏకే203 @ అమేథి
అమేథి అనగానే ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ కంచుకోట గుర్తుకొస్తుంది ఎవరికైనా! ఆఫ్కోర్స్ ఇప్పుడు కాదనుకోండి... కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీ అక్కడ ఓడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమేథి రక్షణ ఉత్పత్తుల్లో సరికొత్త కేంద్రంగా అవతరించనుంది. అమేథిలో ఏర్పాటు చేయనున్న ఆయుధ కర్మాగారంలో ఏకంగా 6 లక్షల ఏకే203 అసల్ట్ రైఫిల్స్‌ను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రష్యాతో ఒప్పందానికి భారత రక్షణ శాఖ మంగళవారం పచ్చజెండా ఊపింది. భారత సాయుధ బలగాలు ప్రస్తుతం వాడుతున్న ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో దశలవారీగా ఈ అధునాతన కలష్నికోవ్ శ్రేణి రైఫిల్స్ వచ్చి చేరనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చేనెల ఆరో తేదీన భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో దీనికి సంబంధించి భారత్– రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. భారత్ నినాదమైన ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఇరుదేశాల సంయుక్త భాగస్వామ్యంలో ఏకే203 రైఫిల్స్ ఉత్పత్తి జరుగుతుంది. మొదటి 70 వేల రైఫిల్స్‌కు సంబంధించినంత వరకు రష్యా తయారీ విడిభాగాలను వాడతారు. తర్వాత ఇరుదేశాల మధ్య ఈ రైఫిల్స్ తయారీకి సంబంధించి సాంకేతికత బదిలీ పూర్తయి... భారత్‌లోనే తయారైన విడిభాగాలతో ఉత్పత్తి మొదలవుతుంది. మొదటి 70 వేల రైఫిల్స్ వచ్చే ఏడాది భారత సైనిక బలగాలకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మొత్తం రూ. 5,000 కోట్ల విలువైన ఒప్పందానికి మంగళవారం డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ (డీఏసీ) తుది ఆమోదముద్ర వేసిందని రక్షణవర్గాల విశ్వసనీయ సమాచారం. ఐఏఎఫ్‌కు జీశాట్–7సీ శాటిలైట్ భారత వాయుసేనకు జీశాట్– 7సీ శాటిలైట్, దాని సంబంధిత ఉపకరణాల కొనుగోలు నిమిత్తం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. రూ.2,236 కోట్ల నిధులను ఇందుకోసం కేటాయించింది. భారత వాయుసేన సాంకేతిక, సమాచార వ్యవస్థల ఆధునికీరణకు సంబంధించిన అవసరాల కోసం ‘మేకిన్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు రక్షణశాఖ వెల్లడించింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
మరోసారి సత్తా చాటిన ‘అగ్ని–5’
సాక్షి, విశాఖపట్నం: అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణి ప్రయోగం మరోసారి విజయవంతమైంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌లో బుధవారం రాత్రి 7.50 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి నిర్దేశిత పూర్తి దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించినట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై అలవోకగా విరుచుకుపడే సామర్థ్యం అగ్ని–5 క్షిపణి సొంతం. ఇప్పటివరకూ అగ్ని–5ని ఏడుసార్లు ప్రయోగించారు. ప్రతిసారీ విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. దేశంలో మొట్టమొదటి, ఏకైక ఖండాంతర క్షిపణి అగ్ని–5ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) సిద్ధం చేసింది. -
‘తేజస్’లో విహారం అద్భుతం
సాక్షి, బెంగళూరు: రూ.35 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆయన శుక్రవారం కర్ణాటకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌లో భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ)ను సందర్శించారు. ఈ సందర్భంగా తేజస్ ఎల్సీఏ (లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్) విమానంలో విహరించారు. కాక్‌పిట్‌లో కూర్చున్న ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తేజస్ యుద్ధ విమానంలో విహరించడం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేషనల్ కాంక్లేవ్ ప్రారంభోత్సవానికి రాజ్‌నాథ్ హాజరయ్యారు. 1971 నాటి ఇండో–పాక్ యుద్ధం బ్రోచర్‌ను ఆవిష్కరించి.. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శిక్షణ పూర్తి చేసుకున్న 1,185 మంది పైలెట్లను రాజ్‌నాథ్ అభినందించారు. -
విశాఖ చేరిన 'విగ్రహ'
సాక్షి, విశాఖపట్నం: భారతతీర గస్తీ దళం అమ్ముల పొదిలో చేరిన అధునాతన నౌక విశాఖ కేంద్రంగా సేవలందించేందుకు సిద్ధమైంది. అడ్వాన్స్డ్ ఫైర్ పవర్‌తో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్ విగ్రహ నౌకని గత నెల 28న చెన్నైలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు. అనంతరం కోస్ట్‌గార్డు ఈస్ట్రన్ సీబోర్డు ప్రధాన స్థావరమైన విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వర్తించేందుకు శుక్రవారం ఇక్కడికి చేరుకుంది. విగ్రహ నౌకకు విశాఖలోని కోస్ట్‌గార్డ్ సిబ్బంది.. అధికారులు స్వాగతం పలికారు. కోస్ట్‌గార్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, జిల్లా కమాండర్(ఏపీ) యోగిందర్ ఢాకా నేతృత్వంలోని బృందం విగ్రహ షిప్‌ని ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లోకి స్వాగతించారు. ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ సిరీస్‌లో ఏడో నౌక అయిన దీనిని చెన్నైలోని ఎల్ అండ్ టీ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ సంస్థ తయారుచేసింది. 98 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల డ్రాట్, 2,200 టన్నుల బరువుతో తయారైన విగ్రహ.. 9,100 కిలోవాట్స్ డీజిల్ సామర్థ్యం ఉన్న రెండు ఇంజిన్లతో 26 నాటికల్ మైళ్ల వేగంతో 5 వేల కి.మీ ప్రయాణించగల సామర్థ్యం సొంతం చేసుకుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాడార్లు, నేవిగేషన్, కమ్యూనికేషన్ పరికరాలు, సెన్సార్లు, సముద్ర స్థితిగతులకు అనుగుణంగా దిశ మార్చుకునే యంత్ర సామర్థ్యంతో దీనిని రూపొందించారు. రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడేలా ఒక ట్విన్ ఇంజిన్ హెలికాఫ్టర్, నాలుగు హైస్పీడ్ బోట్లను తీసుకెళ్లగలదు. షిప్లో 12 మంది అధికారులు, 90 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. తొలి కమాండెంట్‌గా పీఎన్ అనూప్‌కు బాధ్యతలు అప్పగించారు. ఐసీజీఎస్ విగ్రహ చేరికతో కోస్ట్‌గార్డ్ జాబితాలో 157 నౌకలు, 66 విమానాలున్నాయి. -
‘ఎన్ఎస్ఓ’తో ఎలాంటి లావాదేవీల్లేవ్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీ సంస్థతో తాము ఎలాంటి లావాదేవీలు జరుపలేదని భారత రక్షణ శాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుతం భారత్‌ను కుదిపేస్తున్న పెగసస్ మిలటరీ–గ్రేడ్ స్పైవేర్‌ను ఇదే సంస్థ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో సోమవారం సీపీఎం సభ్యుడు వి.సదాశివన్ అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్పందిస్తూ ఒక లిఖితపూర్వక ప్రకటన జారీ చేశారు. రక్షణ శాఖ చేసిన వ్యయాలపై ప్రశ్నలు సంధిస్తూ ఎన్ఎస్ఓ గ్రూప్‌తో ఏవైనా లావాదేవీలు నిర్వహించారా? అని సదాశివన్ అడిగారు. 2018–19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రక్షణ శాఖకు కేంద్రం రూ.4,04,364 కోట్లు కేటాయించిందని, ఇందులో రూ.4,03,459 కోట్లు ఖర్చు చేసినట్లు అజయ్ భట్ తెలిపారు. 2019–20లో రూ.4,31,010 కోట్లు కేటాయించగా, వ్యయం మాత్రం రూ.4,51,902 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు. 2020–21లో రూ.4,71,378 కోట్లు కేటాయించగా, ఖర్చు రూ.4,85,726 కోట్లకు చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వ మొత్తం బడ్జెట్లో రక్షణకు శాఖకు కేటాయించిన నిధులు 2018–19లో 16.56 శాతం, 2019–20లో 15.47 శాతం, 2020–21లో 15.49 శాతమని అజయ్ భట్ వివరించారు. విదేశాల నుంచి ఆయుధాలు, రక్షణ పరికరాల కొనుగోలు కోసం 2019–20లో రూ.47,961 కోట్లు, 2020–21లో రూ.53,118 కోట్లు వెచ్చించామని తెలియజేశారు. పార్లమెంట్లో ఆరని పెగసస్ మంటలు భారత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, జడ్జీల ఫోన్లపై నిఘా పెట్టిందని, ఇందుకోసం ఎన్ఎస్ఓ గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన పెసగస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో ఆందోళనలు, నినాదాలు కొనసాగిస్తున్నాయి. పెగసస్ వ్యవహారంలో పార్లమెంట్లో చర్చించాలని, దేశ భద్రతకు సంబంధించిన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జూలై 19న పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఉభయ సభల్లో పెగసస్ మంటలు ఆరడం లేదు. అయితే, ప్రతిపక్షాల ఆరోపణలను ఎన్ఎస్ఓ గ్రూప్ కొట్టిపారేసింది. భారత పౌరులపై ప్రభుత్వం నిఘా పెట్టిందంటూ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇదివరకే లోక్‌సభలో ఖండించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా సరిగ్గా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. దేశంలో ఎన్నో నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయని, అనధికార వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరులపై నిఘా పెట్టడం భారత్‌లో సాధ్యం కాదని వెల్లడించారు. -
ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డును సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్ఓ) నిర్మించింది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎగువన తూర్పు లద్దాఖ్‌లోని ఉమ్లింగ్లా పాస్ వద్ద 52 కిలోమీటర్ల పొడవునా వాహనాలు వెళ్లగలిగే (మోటరబుల్) ఈ రహదారిని నిర్మించినట్లు భారత రక్షణ శాఖ బుధవారం వెల్లడించింది. ఇప్పటిదాకా ఎత్తయిన మోటరబుల్ రోడ్డుగా బొలీవియాలోని రహదారి రికార్డుకెక్కింది. అక్కడ 18,953 అడుగుల ఎత్తులో రోడ్డు నిర్మించారు. ఉమ్లింగ్లా పాస్ వద్ద నిర్మించిన రహదారి తూర్పు లద్దాఖ్‌లో చుమార్ సెక్టార్‌లోని ముఖ్యమైన పట్టణాలను అనుసంధానిస్తోంది. లేహ్ నుంచి చిసుమ్లే, డెమ్‌చోక్‌కు చేరుకోవడం సులభతరం అయ్యిందని రక్షణ శాఖ తెలిపింది. ఈ రహదారితో లద్దాఖ్‌లో పర్యాటక రంగం వృద్ధి చెంది స్థానికుల ఆర్థిక స్థితిగతులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎగువన శీతాకాలంలో మైనస్ 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. -
INS Dhruv: ఇండియన్ జేమ్స్‌బాండ్.. ‘ధ్రువ్’
సాక్షి, విశాఖపట్నం: శత్రుదేశం ఎక్కుపెట్టిన క్షిపణి ఏదైనా సరే.. అదెక్కడ ఉంది.. ఎంత దూరంలో ఉంది.. దాన్ని ఛేదించేందుకు ఏం చేయాలనే వివరాల్ని రక్షణ రంగానికి చేరవేయగల సత్తాతో భారత్ అమ్ముల పొదిలో ‘ధ్రువ్’తార త్వరలో చేరబోతోంది. విభిన్న సాంకేతికతతో అత్యంత రహస్యంగా రూపొందించిన ఈ క్షిపణి (మిసైల్)గ్రాహక యుద్ధ నౌక త్వరలోనే భారత నౌకాదళంలో సేవలందించనుంది. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డు (హెచ్ఎస్ఎల్)లో రూ.1,500 కోట్ల వ్యయంతో ‘ఐఎన్ఎస్ ధ్రువ్’ రూపుదిద్దుకుంది. అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఈ సముద్ర నిఘా గూఢచారి నౌక వీసీ–11184ను నిర్మించారు. అనేక ప్రత్యేకతలు, శత్రు క్షిపణుల్ని గుర్తించగల అరుదైన సామర్థ్యం గల ఈ నౌకను రక్షణ శాఖ త్వరలోనే జాతికి అంకితం చేయనుంది. అణు క్షిపణుల్ని సైతం.. ధ్రువ్.. అనేక మిషన్లను ఒంటిచేత్తో పూర్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు, ఇండియన్ నేవీ ఇంజినీర్లు, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) శాస్త్రవేత్తలు, హిందుస్థాన్ షిప్‌యార్డు (హెచ్ఎస్ఎల్) నిపుణులు ఈ నౌక నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్‌తో పాటు ఇతర భూభాగాల నుంచి మిసైల్స్ ప్రయోగిస్తే.. వాటిని ధ్రువ్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. వాటి లక్ష్యాన్ని అక్షాంశాలు, రేఖాంశాల సహాయంతో ఇది సులువుగా కనిపెట్టేస్తుంది. వీటిని ఏ ప్రాంతంలో ధ్వంసం చేస్తే.. దేశానికి మేలు జరుగుతుందన్న విస్తృత సమాచారాన్ని రక్షణ శాఖకు అందించగల సామర్థ్యం దీని సొంతం. సాధారణ మిసైల్స్‌తో పాటు న్యూక్లియర్ మిసైల్స్ జాడల్ని కూడా సులభంగా గుర్తించేలా ధ్రువ్‌లో సాంకేతికతను అమర్చారు. ‘ఈసీజీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ దేశం మొత్తం ఎప్పటికప్పుడు నిశిత పరిశీలన చేసే శాటిలైట్ మోనిటర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ నౌక నిర్మాణంతో అత్యాధునిక అధునాతన సముద్ర నిఘా వ్యవస్థలున్న పీ–5 దేశాల సరసన భారత్ చేరింది. ఇప్పటివరకూ ఈ తరహా టెక్నాలజీ నౌకలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఉన్నాయి. అందుకే భారత నౌకాదళం ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ యుద్ధనౌకను ‘ఈసీజీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ అని పిలుస్తున్నారు. దీని తయారీని 2015లో ప్రారంభించారు. 2020 అక్టోబర్‌లో నౌక నిర్మాణం పూర్తయింది. హిందుస్థాన్ షిప్‌యార్డులో నిర్మితమైన అతి భారీ నౌక ఇదే కావడం విశేషం. అత్యంత రహస్యంగా దీని నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో సెన్సార్లతో కూడిన ‘త్రీ డోమ్ షేప్డ్ సరై్వలెన్స్ సిస్టమ్’ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎరే రాడార్స్ టెక్నాలజీ వినియోగించారు. దీని ద్వారా 14 మెగావాట్ల విద్యుత్‌ను సైతం ఉత్పత్తి చేయొచ్చు. నౌక నిర్మాణం పూర్తయిన తర్వాత 6 నెలల పాటు రహస్యంగా షిప్‌యార్డు డ్రై డాక్‌లోనే ఉంచారు. ఇటీవలే ప్రయోగాత్మకంగా విధుల్లోకి తీసుకొచ్చారు. త్వరలోనే అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు. -
‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్‌ను ఆదివారం భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విజయవంతంగా పరీక్షించింది. స్టెల్త్ డెస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ చెన్నై’నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని అధికారులు తెలిపారు. ‘సముద్ర జలాలపై లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా ఉన్న బ్రహ్మోస్ యుద్ధ నౌక అజేయశక్తిని మరింత ఇనుమడింపజేసిందని, భారత నేవీ వద్ద ఉన్న మరో ప్రమాదకర అస్త్రాల్లో ఒకటిగా మారిందని రక్షణ శాఖ తెలిపింది. భారత్–రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో రూపొందిన బ్రహ్మోస్ క్షిపణులను జలాంతర్గాములు, యుద్ధనౌకలు, విమానాలతో పాటు నేలపై నుంచి కూడా ప్రయోగించే వీలుంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో), బ్రహ్మోస్ ఏరోస్పేస్, భారత నేవీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. క్షిపణి ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు, సిబ్బందిని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి కూడా అభినందించారు. మన సైనిక పాటవం బ్రహ్మోస్ క్షిపణితో మరింత పెరుగుతుం దన్నారు. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్.. నేలపై నుంచి నేలపైకి బ్రహ్మోస్‌ను, యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం–1ను, లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్‌ను, అణు సామర్థ్యం ఉన్న శౌర్య క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. -
నవంబర్ 23 నుంచి సూర్యలంకలో మిలిటరీ శిక్షణ
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో వచ్చే నెల 23వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు 12 రోజుల పాటు రక్షణ శాఖ ఆధ్వర్యంలో మిలిటరీ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తున్నట్లు సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యలంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఫైరింగ్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఆరు నుంచి ఎనిమిది ఎయిర్ క్రాఫ్ట్‌లు ఇందులో పాల్గొననున్నాయి. శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే సూర్యలంక చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు ప్రమాదకర ప్రాంతంగా పేర్కొంటూ ప్రవీణ్ ప్రకాశ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అభ్యంతరం తెలుపలేదు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వంపై విషం కక్కుతూ తప్పుడు కథనాలు రాస్తున్న ఓ వర్గం మీడియా బండారం మరోసారి బట్టబయలైంది. మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటు పట్ల నౌకాదళ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయంటూ పత్రికల్లో(సాక్షి కాదు) అసత్య కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో తామెలాంటి అభ్యంతరం వ్యక్తం చెయ్యలేదంటూ తూర్పు నౌకాదళం శనివారం ప్రకటన విడుదల చేసింది. ఇంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని స్పష్టం చేసింది. అయినా.. తాము అభ్యంతరం వ్యక్తం చేశామంటూ కొన్ని పత్రికలు అసత్య కథనాలు రాయడం తగదని పేర్కొంది. కాగా, ఈ కథనాలపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
వాయుసేనకు 200 జెట్ విమానాలు
కోల్‌కతా: భారత వైమానిక దళంలోకి మరో 200 యుద్ధ విమానాలను చేర్చనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారుచేసే 83 ఎల్సీఏ తేజస్ మార్క్ 1ఏ విమానాల కాంట్రాక్టు తుది దశలో ఉందన్నారు. మొత్తంగా 200 విమానాలను తీసుకొనే ప్రక్రియ సాగుతోందన్నారు. ఎల్సీఏ మార్క్ 1ఏ విమానాల డిజైన్ పూర్తయినందున ఉత్పత్తిని ఏడాదికి 16కి పెంచుతుందన్నారు. -
బతుకమ్మ సంబురం... వేంకటేశ్వర వైభవం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలను ఎంపిక చేసింది. ఈమేరకు రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. రాష్ట్రపతిభవన్ వద్దనున్న రాయ్‌సీనా హిల్స్ నుంచి మొదలై రాజ్‌పథ్, ఇండియాగేట్ మీదుగా ఎర్రకోట వరకు జరిగే పరేడ్‌లో ఈ శకటాలు పాల్గొంటాయి. తెలంగాణ శకటాన్ని ఆ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, మేడారం సమ్మక్క–సారక్క జాతర, వేయిస్తంభాల గుడి ఇతివృత్తంతో రూపొందిస్తారు. ఏపీ శకటాన్ని కూచిపూడి నృత్యం, కొండపల్లి అంబారీ, దశావతారాల»ొమ్మలు, కలంకారీ హస్తకళలతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల వైభవం ప్రతిబింబించేలా రూపొందిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ శకటాలను ఎంపిక చేసింది. -
దొంగిలించలేదు.. జిరాక్స్ తీశారంతే!
న్యూఢిల్లీ: భారత రక్షణశాఖ కార్యాలయం నుంచి రఫేల్ ఒప్పంద పత్రాలు దొంగతనానికి గురయ్యాయని చెప్పిన అటార్నీ జనరల్ వేణుగోపాల్ మాటమార్చారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాల ఫొటోకాపీలను మాత్రమే తీసుకెళ్లారని, నిజమైన పత్రాలు రక్షణశాఖ ఆఫీసులోనే ఉన్నాయని చెప్పారు. ‘రక్షణశాఖ నుంచి రఫేల్ ఒప్పంద పత్రాలు అదృశ్యమయ్యాయని నేను సుప్రీంకోర్టుకు చెప్పినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని తెలిసింది. ఇది ఎంత మాత్రం నిజం కాదు. యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్ దాఖలుచేసిన పిటిషన్‌కు రఫేల్ ఒప్పంద పత్రాల ఫొటోకాపీలను జతచేశారు’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ..‘మోదీ ప్రభుత్వపు ఏజీకి రఫేల్ పత్రాల దొంగతనం, ఫొటోకాపీలకు మధ్య వ్యత్యాసం తెలియదు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందని ఆ ప్రభుత్వమే ప్రజలకు హామీ ఇస్తోంది. మోదీజీ ఈ మోసం ఏంటి? ఇప్పటివరకూ అనితరసాధ్యమైన అబద్ధాలన్నీ ఇప్పుడు సుసాధ్యంగా కనిపిస్తున్నాయి’ అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, అబద్ధాలు పర్యాయపదాలని బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పటేల్ విగ్రహం చైనాలో రూపొందించారంటూ రాహుల్ అబద్ధం చెప్పారన్నారు. -
రఫేల్ పత్రాలు చోరీ
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ దగ్గరి నుంచి దొంగతనానికి గురయ్యాయని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆ చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగానే ‘ద హిందూ’ పత్రిక రఫేల్‌పై కథనాలు రాసి అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి పాల్పడిందని అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. రఫేల్ వ్యవహారం మొత్తం రక్షణ పరికరాలను సమకూర్చుకోవడానికి సంబంధించినది కాబట్టి అసలు ఈ కేసుపై న్యాయసమీక్ష జరపడమే సాధ్యం కాదని ఏజీ అన్నారు. రఫేల్ ఒప్పందంపై వచ్చిన ప్రజాహిత వ్యాజ్యా(పిల్)లను గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తిరస్కరించడం తెలిసిందే. ఆ సమయంలో కేంద్రం కొన్ని కీలక వాస్తవాలను దాచిపెట్టిందనీ, ఇప్పుడు ద హిందూ పత్రిక కథనాలతో అవన్నీ వెలుగులోకి వచ్చినందున పిల్లను విచారణకు స్వీకరించడంపై పునరాలోచించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు సంయుక్తంగా పిటిషన్ వేశారు. ఆ వాస్తవాలు అప్పుడే బయటకొచ్చి ఉంటే సుప్రీంకోర్టు ఆ పిల్లను కొట్టివేసేది కాదని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ఏజీ తన వాదన వినిపిస్తూ ‘రఫేల్ పత్రాల దొంగతనం కేసులో విచారణ జరుగుతోంది. ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. రఫేల్ ఒప్పందం వివరాలు రహస్యమైనవి. వాటిని ప్రజా బాహుళ్యంలో పెట్టడం ద్వారా అధికారిక రహ్యసాల చట్టాన్ని ఉల్లంఘించడం, కోర్టు ధిక్కార నేరాలకు పాల్పడినట్లైంది. రహస్యం అన్న పదాన్ని తొలగించి వారు కథనాలు ప్రచురించారు’ అని తెలిపారు. కోర్టు విచారణను ప్రభావితం చేయడమే లక్ష్యంగా వార్తా కథనాలు వచ్చాయన్నారు. గత నెల 8 నుంచి ఇప్పటివరకు ద హిందూ పత్రిక రఫేల్‌పై పలు సంచలన కథనాలను ప్రచురించడం తెలిసిందే. ఈ వాదనలు జరిగిన బుధవారమే తాజాగా మరో కథనం వెలువడింది. అవినీతి జరిగితే చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా? ఏజీ వాదనలపై న్యాయమూర్తులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగా కథనాలు వచ్చాయని ఏజీ వెల్లడించడంతో ‘ఆ విషయం ఇప్పుడెందుకు చెబుతున్నారు? ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇన్ని రోజుల్లో ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పండి.’ అని జడ్జీలు ప్రశ్నించారు. ‘రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగి ఉంటే, దానిని కప్పిపుచ్చుకోడానికి అధికారిక రహస్యాల చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా? అవినీతి జరిగిందని నేననడం లేదు. కానీ ఒకవేళ జరిగి ఉంటే, ప్రభుత్వం చట్టాన్ని తమకు రక్షణగా ఉపయోగించుకోజాలదు’ అని జస్టిస్ గొగోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 14న కొనసాగించనుంది. ఆ సమాచారం ఎక్కడిదో చెప్పం: ఎన్.రామ్ న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై కీలక సమాచారాన్ని తమకు అందించిన వర్గాల వివరాల్ని బహిర్గతం చేయలేమని ది హిందూ దినపత్రిక చైర్మన్ ఎన్.రామ్ తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19(1)కు లోబడే రఫేల్ వివరాల్ని ప్రచురించామని సమర్థించుకున్నారు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వివరాల్ని గోప్యంగా నిలిపి ఉంచే ప్రయత్నం జరిగిందని, అందుకే వాటిని బహిర్గతం చేశామని తెలిపారు. రఫేల్ పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో రామ్ స్పందించారు. రఫేల్ ఒప్పందంపై ఆయన పలు కథనాలు రాశారు. అందులో బుధవారం కూడా ఒకటి ప్రచురితమైంది. ‘ రఫేల్ ఒప్పంద పత్రాలు తస్కరణకు గురయ్యాయని భావిస్తే మాకేం సంబంధం లేదు. మాకు ఆ సమాచారం కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి అందింది. మా వనరులను కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నాం. వారి గురించి మా నుంచి ఎవరూ సమాచారం పొందలేరు. మేము ప్రచురించిన పత్రాలు యధార్థమైనవి. ప్రజా ప్రయోజనాల రీత్యానే వాటిని వెలుగులోకి తెచ్చాం. ముఖ్యమైన అంశాలపై సంబంధిత సమాచారాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకురావడం పాత్రికేయుల విధి’ అని రామ్ అన్నారు. -
అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు ఓకే
న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా నుంచి 73 వేల రైఫిళ్లను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో కొనుగోలుకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారని అధికారులు వెల్లడించారు. సిగ్ సూయేర్ అని పిలవబడే ఈ రైఫిళ్లను 3,600 కిలోమీటర్లు ఉన్న చైనా సరిహద్దు ప్రాంతంలోని భద్రతా బలగాలకు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. రైఫిళ్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం వారంలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఒప్పందం పూర్తయిన సంవత్సరంలో రైఫిళ్లను డెలివరీ చేస్తారని సంబంధిత అధికారులు వివరించారు. వీటిని ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఉపయోగించనున్నట్లు తెలిపారు. -
రంగారెడ్డిలో మరో రెండు రక్షణ సంస్థలు!
- ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్ కోసం భూముల అన్వేషణ - ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు 1,000 నుంచి 2,000 ఎకరాలు - ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రక్షణ రంగ సంస్థలకు రంగారెడ్డి జిల్లా హబ్‌గా మారింది. ఇప్పటికే పలు సంస్థలను అక్కున చేర్చుకున్న జిల్లా తాజాగా సశస్త్ర సీమాబల్, సీఐఎస్ఎఫ్లను కూడా సరసన చేర్చుకుంటోంది. శత్రుసేనలను తుదముట్టించేందుకు దేశ సరిహద్దుల్లో పహారా కాసే సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), పారిశ్రామిక రక్షణ దళం (సీఐఎస్ఎఫ్)కు చెరో 70 ఎకరాలను కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపా దనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆక్టోపస్, ఎన్ఎస్జీ, బీఎస్ఎఫ్, ఎన్పీఏ తదితర సంస్థలకు కేంద్రంగా మారిన రంగారెడ్డి జిల్లా.. తాజాగా మరిన్ని సంస్థలకు ఆహ్వా నం పలుకుతోంది. ఈ రెండింటికి కూడా ఇబ్రహీం పట్నం మండలంలో భూములు కేటాయించే అం శాన్ని యంత్రాంగం పరిశీలిస్తోంది. మరోవైపు ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు ఏకంగా 1000ృ2000 ఎకరాలు కావాలని కోరుతూ రక్షణ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. గతంలో వివిధ చోట్ల ఆర్మీకి ఉన్న భూములను ప్రజోపయోగ అవసరాలకు తీసుకున్నందున ప్రత్యామ్నా యంగా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు ఈ మేరలో భూమి ఇవ్వాలని కోరింది. రక్షణ శాఖ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సర్కారు భూములను గుర్తిం చాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశిం చింది. హైదరాబాద్ పోలీస్ కమిషన రేట్‌కు కూడా ఫైరింగ్‌లో శిక్షణ కోసం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ లో 18 ఎకరాలను కేటాయించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే మండలంలోని రామోజీ ఫిలింసిటీకి పర్యాటకా భివృద్ధిలో భాగంగా 295 ఎకరాలను అప్పగించాలని నిర్ణయించారు. దీని పై వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశముం దని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అకాడమీ స్థాపిం చేందుకు భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్, మొయినాబాద్ మండలాల పరిధిలో పలు చోట్ల భూములను రెవెన్యూ యంత్రాంగం అన్వేషిస్తోంది. ఎయిమ్స్ కూడా జిల్లాకే.. రంగారెడ్డి జిల్లా యవనికపై మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువుదీరనుంది. దేశంలో అత్యున్నత వైద్యసేవలందించే అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు జిల్లా వేదిక కానుంది. ఈ మేరకు ఎయిమ్స్ ఏర్పాటుకు తగినంత భూమిని గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లేఖ రాసింది. ఎయిమ్స్ ఏర్పాటుపై వివిధ ప్రాంతాలను పరిశీలించిన ప్రభుత్వం.. రాజధానికి చేరువలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో దీన్ని స్థాపించడం ద్వారా ఎక్కువ మందికి వైద్యసేవలందించవచ్చని భావించింది. 200 ఎకరాల విస్తీర్ణంలో ఎయిమ్స్ సముదాయాన్ని నిర్మించనున్నందున.. దానికి తగ్గట్టుగా భూమిని గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. కేవలం ఆస్పత్రేగాకుండా.. మెడికల్ కాలేజీ, వైద్యులు, ఇతర సిబ్బందికి క్వార్టర్లు కూడా ఒకే ప్రాంగణంలో ఉండేలా ఎయిమ్స్‌ను డిజైన్ చేస్తున్నారు. దీంతో కనిష్టంగా 200 ఎకరాలు కావాలని కోరుతున్నట్లు తెలిసింది. కాగా, భూమి కేటాయింపుపై జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు తయారు చేస్తోంది. రెండేళ్ల క్రితం ఎయిమ్స్ కోసం కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో భూమిని పరిశీలించారు. దీనితోపాటు సరూర్‌నగర్ మండలం నాదర్గుల్లోని భూమిని కూడా ఎయిమ్స్‌కు ప్రతిపాదించాలని భావిస్తున్నారు. ఇవేగాకుండా మరిన్ని భూములతో కూడిన ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.