న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ దగ్గరి నుంచి దొంగతనానికి గురయ్యాయని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆ చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగానే ‘ద హిందూ’ పత్రిక రఫేల్‌పై కథనాలు రాసి అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి పాల్పడిందని అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. రఫేల్ వ్యవహారం మొత్తం రక్షణ పరికరాలను సమకూర్చుకోవడానికి సంబంధించినది కాబట్టి అసలు ఈ కేసుపై న్యాయసమీక్ష జరపడమే సాధ్యం కాదని ఏజీ అన్నారు.
రఫేల్ ఒప్పందంపై వచ్చిన ప్రజాహిత వ్యాజ్యా(పిల్)లను గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తిరస్కరించడం తెలిసిందే. ఆ సమయంలో కేంద్రం కొన్ని కీలక వాస్తవాలను దాచిపెట్టిందనీ, ఇప్పుడు ద హిందూ పత్రిక కథనాలతో అవన్నీ వెలుగులోకి వచ్చినందున పిల్‌లను విచారణకు స్వీకరించడంపై పునరాలోచించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు సంయుక్తంగా పిటిషన్ వేశారు.
ఆ వాస్తవాలు అప్పుడే బయటకొచ్చి ఉంటే సుప్రీంకోర్టు ఆ పిల్‌లను కొట్టివేసేది కాదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ఏజీ తన వాదన వినిపిస్తూ ‘రఫేల్ పత్రాల దొంగతనం కేసులో విచారణ జరుగుతోంది. ఇప్పటికైతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. రఫేల్ ఒప్పందం వివరాలు రహస్యమైనవి.
వాటిని ప్రజా బాహుళ్యంలో పెట్టడం ద్వారా అధికారిక రహ్యసాల చట్టాన్ని ఉల్లంఘించడం, కోర్టు ధిక్కార నేరాలకు పాల్పడినట్లైంది. రహస్యం అన్న పదాన్ని తొలగించి వారు కథనాలు ప్రచురించారు’ అని తెలిపారు. కోర్టు విచారణను ప్రభావితం చేయడమే లక్ష్యంగా వార్తా కథనాలు వచ్చాయన్నారు. గత నెల 8 నుంచి ఇప్పటివరకు ద హిందూ పత్రిక రఫేల్‌పై పలు సంచలన కథనాలను ప్రచురించడం తెలిసిందే. ఈ వాదనలు జరిగిన బుధవారమే తాజాగా మరో కథనం వెలువడింది.
అవినీతి జరిగితే చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా?
ఏజీ వాదనలపై న్యాయమూర్తులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగా కథనాలు వచ్చాయని ఏజీ వెల్లడించడంతో ‘ఆ విషయం ఇప్పుడెందుకు చెబుతున్నారు? ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇన్ని రోజుల్లో ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పండి.’ అని జడ్జీలు ప్రశ్నించారు. ‘రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగి ఉంటే, దానిని కప్పిపుచ్చుకోడానికి అధికారిక రహస్యాల చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా? అవినీతి జరిగిందని నేననడం లేదు. కానీ ఒకవేళ జరిగి ఉంటే, ప్రభుత్వం చట్టాన్ని తమకు రక్షణగా ఉపయోగించుకోజాలదు’ అని జస్టిస్ గొగోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 14న కొనసాగించనుంది.
ఆ సమాచారం ఎక్కడిదో చెప్పం: ఎన్.రామ్
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై కీలక సమాచారాన్ని తమకు అందించిన వర్గాల వివరాల్ని బహిర్గతం చేయలేమని ది హిందూ దినపత్రిక చైర్మన్ ఎన్.రామ్ తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19(1)కు లోబడే రఫేల్ వివరాల్ని ప్రచురించామని సమర్థించుకున్నారు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వివరాల్ని గోప్యంగా నిలిపి ఉంచే ప్రయత్నం జరిగిందని, అందుకే వాటిని బహిర్గతం చేశామని తెలిపారు. రఫేల్ పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో రామ్ స్పందించారు.
రఫేల్ ఒప్పందంపై ఆయన పలు కథనాలు రాశారు. అందులో బుధవారం కూడా ఒకటి ప్రచురితమైంది. ‘ రఫేల్ ఒప్పంద పత్రాలు తస్కరణకు గురయ్యాయని భావిస్తే మాకేం సంబంధం లేదు. మాకు ఆ సమాచారం కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి అందింది. మా వనరులను కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నాం. వారి గురించి మా నుంచి ఎవరూ సమాచారం పొందలేరు. మేము ప్రచురించిన పత్రాలు యధార్థమైనవి. ప్రజా ప్రయోజనాల రీత్యానే వాటిని వెలుగులోకి తెచ్చాం. ముఖ్యమైన అంశాలపై సంబంధిత సమాచారాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకురావడం పాత్రికేయుల విధి’ అని రామ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment