న్యూఢిల్లీ: రఫేల్ కేసు విషయంలో కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను తాము ముందుగా పరిశీలిస్తామనీ, ఆ తర్వాత రఫేల్ ఒప్పందంపై పునఃసమీక్ష కోసం వచ్చిన పిటిషన్లలోని అంశాలపై విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. అక్రమంగా పొందిన కొన్ని ప్రత్యేక పత్రాల్లోని సమాచారం ఆధారంగా రఫేల్ కేసుపై పునఃసమీక్ష చేయాలంటూ పిటిషనర్లు కోరజాలరంటూ కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం వాదనలు వినడాన్ని ముగించింది. ముందుగా తాము కేంద్రం అభ్యంతరాలను పరిశీలిస్తామనీ, అవి సరైన అభ్యంతరాలు అయితే తాము రఫేల్ ఒప్పందంపై పునఃసమీక్ష జరపబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఒకవేళ కేంద్రం అభ్యంతరాలు అనవసరమైనవని అనిపిస్తేనే పునఃసమీక్ష పిటిషన్లపై విచారణ జరుపుతామంది. దీంతో ఈ అంశంపై తీర్పు ఎప్పుడు వస్తుందో భవిష్యత్తులోనే తెలియనుంది. విచారణ ప్రారంభంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదిస్తూ రఫేల్ ఒప్పంద పత్రాలు ప్రత్యేకమైనవనీ, వాటిని సంబంధిత విభాగం అనుమతి లేకుండా ఎవరూ సుప్రీంకోర్టుకు సమర్పించకూడదని అన్నారు. అయితే ఆ పత్రాలు ఇప్పటికే ప్రజల్లోకి వచ్చేశాయనీ, ఇప్పుడు అవి ప్రత్యేకమైనవి కావని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. కేంద్రం అభ్యంతరాలు దురుద్దేశంతో కూడుకున్నవనీ, అవి కోర్టులో నిలువవని ఆయన అన్నారు. అలాగే భారత ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం తమకు సమాచారాన్ని ఎవరిచ్చారో విలేకరులు చెప్పాల్సిన అసవరం లేదనీ, సమాచార వనరులకు ఇది రక్షణ కల్పిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment