Rafale jet Fighter Deal
-
‘ఫ్రెంచి పరేడ్’కు ‘రాఫెల్ పాసు’!
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పదం కోసం ఫ్రాన్స్‌లో పర్యటించడం ద్వారా బాస్టిల్ డే కవాతులో పాల్గొనే అవకాశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సంపాదించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘మణిపూర్‌లో ఓ వైపు విద్వేషాగ్ని వ్యాపిస్తోంది. ఈ అంశాన్ని యూరప్ పార్లమెంట్ కూడా పట్టించుకుని చర్చకు పెట్టింది! కానీ మన ప్రధాని మాత్రం అసలేం పట్టనట్లు కూర్చున్నారు. మణిపూర్‌పై ఇంతవరకు ఒక్కమాటా మాట్లాడలేదు. పైగా రాఫెల్ ఒప్పందంతో పారిస్‌లో బాస్టిల్ డే కవాతులో పాల్గొనే పాస్ సంపాదించారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా, ‘‘1997లో రిచర్డ్ నెల్సన్ ‘ది మూన్ అండ్ ది గెట్టో’ అని ఒక వ్యాసం రాశారు. అందులో ఏముందంటే.. అద్భుత సాంకేతికత సాధించిన అమెరికా చంద్రుడిపై కాలుమోపింది. కానీ స్వదేశంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోయింది. ఇప్పుడు ఆ వ్యాసాన్ని భారత్‌లో మాత్రం ‘ది మూన్ అండ్ మణిపూర్’గా చదువుకోవాలి’’ అని విమర్శించారు. విసుగెత్తిన యువరాజు: బీజేపీ కౌంటర్ రాహుల్ విమర్శలపై బీజేపీ నేత స్మృతి ఇరానీ స్పందించారు. ‘ఫ్రాన్స్‌లో నిరసనలు, అల్లర్ల విషయాన్ని ప్రస్తావించని ఈయూ పార్లమెంట్.. భారత్‌లో మణిపూర్ అంశంపై చర్చకు సిద్దమవుతాయి. ఇదే రాహుల్ ఆశించేది. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఆయన కోరుకుంటున్నారు. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారంతో మోదీని సత్కరించడంతో విసుగు చెందిన యువరాజు ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలను తుంగలో తొక్కుతున్నారు. ప్రజలు తిరస్కరించిన రాహుల్ రక్షణ ఒప్పందాలు తమ హయాంలో జరగలేదే అని తెగ బాధపడిపోతున్నారు’ అని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇన్నేళ్లూ మణిపూర్ సమస్యను అపరిష్కృతంగా తయారుచేసిన ఘనత కాంగ్రెస్‌దే అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘లైంగిక వేధింపులపై ఉద్యమిస్తున్న మహిళా అథ్లెట్లకు ఈ మహిళా నేత కనీస మద్దతు ఇవ్వరు. కానీ రాహుల్‌పై విమర్శలకు రెడీ అవుతారు’’ అంటూ స్మృతీపై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే విమర్శలు గుప్పించారు. -
మళ్లీ రాజుకున్న రఫేల్ గొడవ
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ సంస్థ నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందన్న అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఫ్రాన్స్‌లో తాజాగా న్యాయ విచారణ మొదలైనట్లు ఫ్రెంచ్ పరిశోధక వెబ్సైట్ ‘మీడియాపార్ట్’ వెల్లడించింది. విచారణకు నేతృత్వం వహించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక న్యాయమూర్తిని నియమించినట్లు ఆ వెబ్సైట్ పేర్కొంది. దాదాపు రూ.59 వేల కోట్ల విలువైన ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయల సొమ్ము చేతులు మారిందని ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేసిన 36 రఫేల్ ఫైటర్ జెట్లను ఇండియాకు విక్రయించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం గతంలో ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య 2016 సెప్టెంబర్‌లో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే కొన్ని ఫైటర్ జెట్లను దసాల్ట్ సంస్థ తయారుచేసి భారత్‌కు పంపించింది. ఈ ఒప్పందంలో అవినీతి ఆరోపణలు ఇరుదేశాల్లోనూ రాజకీయ ప్రకంపనలు రేపాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద రఫేల్ డీల్‌పై ఫ్రాన్స్‌లో ‘నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ ఆఫీస్(పీఎన్ఎఫ్)’ ఆదేశాల మేరకు గత నెల 14న న్యాయ విచారణ అధికారికంగా ప్రారంభమైనట్లు మీడియాపార్ట్ పేర్కొంది. అత్యంత భారీ ఆర్థిక, వాణిజ్య నేరాల విచారణ కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం.. పీఎన్‌ఎఫ్‌ను 2013 ఏడాదిలో ఏర్పాటుచేసింది. భారత మధ్యవర్తికి రూ.8.84 కోట్లు రఫేల్ ఒప్పందంలో అవినీతి, అవకతవకలపై ‘షెర్పా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ఫిర్యాదు చేసిందని, ఆర్థిక నేరాల గుట్టును రట్టు చేయడంలో ఈ సంస్థ దిట్ట అని మీడియాపార్ట్ గతంలో పేర్కొంది. డీల్ కుదిర్చినందుకు దసాల్ట్ .. భారత్‌లోని ఓ మధ్యవర్తికి 10 లక్షల యూరోలు(దాదాపు రూ.8.84 కోట్లు) కమీషన్ కింద చెల్లించినట్లు వెబ్సైట్ పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను దసాల్ట్ కంపెనీ కొట్టిపారేసింది. రఫేల్ ఒప్పందంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు చెప్పింది. రఫేల్ డీల్ లో కమీషన్ల బాగోతంపై వచ్చిన మొదటి ఫిర్యాదును 2019లో అప్పటి పీఎన్ఎఫ్ చీఫ్ ఎలియానీ హూలెట్ తొక్కిపెట్టారని మీడియాపార్ట్ వెబ్సైట్ పాత్రికేయుడు యాన్ ఫిలిప్పిన్ ఆరోపించారు. ప్రత్యర్థి కంపెనీల ఏజెంట్ రాహుల్: బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రత్యర్థి రక్షణ కంపెనీల ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆయా కంపెనీ చేతుల్లో పావుగా మారారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా శనివారం మండిపడ్డారు. రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్‌తోపాటు రాహుల్ గాంధీ పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అసత్య ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పర్యాయపదంగా మారిపోయిందన్నారు. రఫేల్ డీల్‌లో సోనియా గాంధీ కుటుంబానికి కమీషన్లు ముట్టలేదని, ఆ అక్కసుతో ఎన్డీయే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ‘కాగ్’, సుప్రీంకోర్టు తేల్చిచెప్పాయని సంబిత్ గుర్తుచేశారు. ఫైటర్ జెట్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు విశ్వసించలేదని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మళ్లీ పట్టం కట్టారని అన్నారు. జేపీసీ దర్యాప్తునకు ఆదేశించాలి: కాంగ్రెస్ రఫేల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా శనివారం డిమాండ్ చేశారు. దేశ రక్షణకు సంబంధించిన ఫైటర్ల జెట్ల కొనుగోలులో గోల్మాల్ను నిగ్గుతేల్చడానికి ఇదొక్కటే మార్గమని చెప్పారు. ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని, జేపీసీ దర్యాప్తునకు ఆదేశించాలని సూర్జేవాలా డిమాండ్‌చేశారు. ‘ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం అంగీకరించింది. న్యాయ విచారణ ప్రారంభించింది. అలాంటప్పుడు ఈ అవినీతికి మూలకేంద్రమైన భారత్‌లో జేపీసీ దర్యాప్తు ఎందుకు జరపకూడదు?’ అని సూర్జేవాలా ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోటీ అంశం కాదని, దేశ భద్రత, అవినీతికి సంబంధించిన అంశమన్నారు. రఫేల్ డీల్ సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని తెలిపారు. -
‘రఫేల్’లో కమీషన్ల బాగోతం
పారిస్/న్యూఢిల్లీ: భారత్–ఫ్రాన్స్ మధ్య కుదిరిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా డబ్బు చేతులు మారినట్లు ఫ్రెంచ్ ఆన్లైన్ ఇన్వెస్టిగేటివ్ జర్నల్ ‘మీడియాపార్ట్’ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ కంపెనీ రఫేల్ ఫైటర్ జెట్లను తయారుచేస్తోంది. వీటిని కొనేందుకు భారత్ 2016లో ఫ్రాన్స్‌తో ఒప్పందంచేసుకుంది. ఈ డీల్ కుదరడానికి సహకరించినందుకు భారత్‌లోని మధ్యవర్తులకు(సుశేన్ గుప్తా) దసాల్ట్ 1.1 మిలియన్ యూరోలు(రూ.9.5 కోట్లకుపైగా) కమీషన్లుగా చెల్లించినట్లు ‘మీడియాపార్ట్’ ప్రచురించింది. ఫ్రాన్స్ అవినీతి నిరోధక శాఖ ఏజెన్సీ ఫ్రాంకాయిస్ యాంటీ కరప్షన్(ఏఎఫ్ఏ) ఆడిటింగ్‌లో ఈ విషయం తేలిందని వెల్లడించింది. 2017 నాటికి దసాల్ట్ ఖాతాలను ఏఎఫ్ఏ పరిశీలించగా అవకతవకలు బయటపడ్డాయంది. ‘గిఫ్ట్ టు క్లయింట్స్’ కింద భారీగా ఖర్చును దసాల్ట్ చూపించినట్లు వివరించింది. ‘మీడియాపార్ట్’ కథనాన్ని దసాల్ట్ ఖండించింది. తాము ఎవరికీ ముడుపులు చెల్లించలేదని, 50 రఫేల్ ఫైటర్జెట్ల ప్రతిరూపాలను(రెప్లికా) తయారు చేయించడానికి ఈ సొమ్మును వెచ్చించినట్లు తేల్చిచెప్పింది. సుశేన్ గుప్తా నేతృత్వంలోని డిఫెన్స్ కంపెనీ ‘డెఫ్సిస్ సొల్యూషన్స్’కు ఆర్డర్ ఇచ్చి, ఈ నమూనాలను తయారు చేయించామని తెలిపింది. అగస్టా–వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో సుశేన్ గుప్తా సీబీఐ, ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. డెఫ్సిస్ సొల్యూషన్స్ సంస్థ దసాల్ట్ సంస్థకు భారత్‌లో సబ్ కాంట్రాక్టర్. 50 రఫేల్ నమూనాలను తయారీకి 1.1 మిలియన్ యూరోలను భారతీయ కంపెనీకి చెల్లించినట్లు దసాల్ట్ చెబుతున్నప్పటికీ, అందుకు ఆధారాలు చూపలేదని ఏఎఫ్ఏ నివేదించిందని ‘మీడియాపార్ట్’ తెలిపింది. ఒక్కో రఫేల్ నమూనా తయారీకి 20,357 యూరోలు ఖర్చయిందని దసాల్ట్ చెబుతోంది. సొంత ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్‌ను తయారు చేయడానికి ఒక భారతీయ కంపెనీకి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఖర్చును ‘గిఫ్ట్ టు క్లయింట్’ కింద ఎందుకు చూపారు? అయినా నమూనాల తయారీకి అంత సొమ్ము ఎందుకు? ఒక్కొక్కటి ఒక కారు పరిమాణంలో తయారు చేశారా? ఏఎఫ్ఏ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించగా, దసాల్ట్ సంస్థ సమాధానం చెప్పలేకపోయిందని, కనీసం ఒక్క డాక్యుమెంట్ చూపించలేకపోయిందని ఏఎఫ్ఏ నివేదికను ఉటంకిస్తూ ‘మీడియాపార్ట్’ వెల్లడించింది. ప్రధాని సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ మీడియాపార్ట్ కథనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. డీల్‌పై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు: బీజేపీ రఫేల్ డీల్‌పై మీడియాపార్ట్ కథనాన్ని బీజేపీ తోసిపుచ్చింది. అవి ఆధారాల్లేని ఆరోపణలని పేర్కొంది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చిచెప్పిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తుచేశారు. తప్పుడు ఆరోపణలపై మన సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కాంగ్రెస్‌కు రవిశంకర్ హితవు పలికారు. -
‘రఫేల్ సరఫరాలో జాప్యం జరగదు’
న్యూఢిల్లీ: భారత్‌కు 36 రఫేల్ జెట్ విమానాల సరఫరాలో ఎలాంటి జాప్యం జరగబోదని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్ లినైన్ చెప్పారు. ఈ విషయంలో విధించిన గడువును తాము గౌరవిస్తామని అన్నారు. ఫ్రాన్స్ నుంచి రూ.58,000 కోట్లతో 36 రఫేల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు 2016 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 36 రఫేల్ విమానాల్లో 30 విమానాలు ఫైటర్ జెట్లు, మరో ఆరు ట్రైనర్ జెట్లు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్మంత్రి గత ఏడాది అక్టోబర్ 8వ తేదీన మొదటి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్ నుంచి స్వీకరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరో విమానాన్ని ఫ్రాన్స్ అందజేసిందని ఇమ్మానుయేల్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రఫేల్ విమానాల సరఫరాలో జాప్యం తప్పదని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. -
సీజేఐ గొగోయ్‌కి వీడ్కోలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ హోదాలో శుక్రవారమే ఆయనకు చివరి వర్కింగ్ డే. 2018, అక్టోబర్ 3న సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి న్యాయవ్యవస్థలో ఈ స్థాయికి ఎదిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. వివాదం.. సుప్రీంకోర్టులోని ఒక ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా వెంటనే స్పందించిన జస్టిస్ గొగోయ్.. ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీ వేశారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఆ కమిటీలో ఇద్దరు మహిళా జడ్జీలు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిర బెనర్జీలకు స్థానం కల్పించారు. విచారణ అనంతరం ఆ కమిటీ జస్టిస్ గొగోయ్‌కి క్లీన్చిట్ ఇచ్చింది. తిరుగుబాటు.. 2018 జనవరిలో నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి సంచలనం సృష్టించిన నలుగురు సీనియర్ జడ్జీల్లో(గ్యాంగ్ ఆఫ్ ఫోర్) జస్టిస్ గొగోయ్ కూడా ఒకరు. కేసుల కేటాయింపులో సీనియర్ న్యాయమూర్తులపై వివక్షకు పాల్పడుతున్నారంటూ జస్టిస్ మిశ్రాకు వ్యతిరేకంగా నాడు జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ లోకూర్‌లు గళం విప్పిన విషయం తెలిసిందే. ఇటీవలి కీలక తీర్పులు జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని పలు ధర్మాసనాలు కీలక తీర్పులను వెలువరించాయి. వాటిలో ముఖ్యమైనది, అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడికే చెందుతుందని స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పు. శతాబ్దాల వివాదానికి ఆ తీర్పు తెర దించింది. రఫేల్ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్, శబరిమల సహా సంబంధిత వివాదాలను విస్తృత ధర్మాసనానికి నివేదించడం, ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు తదితరాలు వీటిలో కొన్ని. జస్టిస్ గొగోయ్ శుక్రవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి హోదాలో చివరిసారి సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్ 1లో కొద్దిసేపు ఆశీనులయ్యారు. కానీ కేసుల విచారణేదీ చేపట్టలేదు. అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లి.. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. శుక్రవారం 650 మంది హైకోర్టు జడ్జీలతో, 15 వేల మంది న్యాయాధికారులతో సీజేఐ జస్టిస్ గొగోయ్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి రికార్డు సృష్టించారు. వృత్తి జీవితంలో సవాళ్లను తాను కోరుకున్నానని ఈ సందర్భంగా జస్టిస్ గొగోయ్ వారికి చెప్పారు. కష్టాల వల్ల పట్టుదల మరింత పెరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం న్యూఢిల్లీ: పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) వీడ్కోలు పలికింది. ఆదివారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్ గొగోయ్‌కి శుక్రవారమే చివరి పనిదినం కావడంతో బార్ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు పలుకుతూ సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో ఎవరూ ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. అట్టహాసాలు లేకుండా, నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే సహా అత్యున్నత న్యాయస్థానంలోని దాదాపు అందరు జడ్జీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్ గొగోయ్ ఆకాంక్ష మేరకే ఈ కార్యక్రమాన్ని సింపుల్‌గా నిర్వహిస్తున్నామని ఎస్సీబీఏ కార్యదర్శి ప్రీతి సింగ్ వెల్లడించారు. సుప్రీంకోర్టులో పనిచేసిన అత్యున్నత న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగోయ్ ఒకరని ఎస్సీబీఏ అధ్యక్షుడు రాకేశ్‌ఖన్నా ప్రశంసించారు. జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణల పక్కన కూర్చున్న జస్టిస్ గొగోయ్.. ఇతర న్యాయమూర్తులతో కబుర్లు చెబుతూ, న్యాయవాదుల నుంచి బొకేలు స్వీకరిస్తూ సరదాగా కనిపించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు కూడా జడ్జీలతో పాటు కూర్చున్నారు. -
రాఫెల్‌పై మోదీ సర్కారుకు క్లీన్చిట్
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి, ఫ్రాన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. గతంలో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస లేదు. కాబట్టి గతంలో మేం కేంద్రానికి ఇచ్చిన క్లీన్చిట్కే కట్టుబడి ఉన్నాం. ఈ అంశంపై మోదీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు తప్పు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం.. దీనికి సంబంధించి ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం.. దీనికి అనుసరించిన విధానంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి అవకతవకలు జరగలేదని గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లు సహేతుకంగా లేవని తాజాగా గురువారం కొట్టివేసిన ధర్మాసనం.. దీనిపై గతంలో ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. రూ.58 వేల కోట్ల విలువైన ఒప్పందం చుట్టూ నెలకొన్న వివాదంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న అభ్యర్థనలను కూడా తిరస్కరించింది. న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో మోదీ ప్రభుత్వానికి మరోసారి ఊరట లభించింది. గతంలో ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస లేదని సుప్రీం స్పష్టంచేసింది. గతంలో కేంద్రానికిచ్చిన క్లీన్ చిట్కే కట్టుబడి ఉన్నట్టుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌తో కుదుర్చుకున్న 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, దానికి అనుసరించిన విధానంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి అవకతవకలు జరగలేదని 2018, డిసెంబర్ 14నే సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని పునఃసమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, లాయర్ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లు సహేతుకంగా లేవని సుప్రీం స్పష్టంచేసింది. 58 వేల కోట్ల విలువైన ఒప్పందం చుట్టూ నెలకొన్న వివాదంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న అభ్యర్థనల్ని కూడా తిరస్కరించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అంశాలేవీ అందులో లేవని న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా జస్టిస్ కౌల్ తీర్పు చదివి వినిపించారు. తీర్పుపై తాను ఏకీభవిస్తానని చెబుతూనే... కొన్ని అంశాల్లో తనకు వేరే అభిప్రాయాలు ఉన్నాయంటూ జస్టిస్ జోసెఫ్ విడిగా తీర్పు ఇచ్చారు. అందుకు గల కారణాలను వెల్లడించారు. మే 10న రివ్యూ పిటిషన్లపై తీర్పుని రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు... ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న అంతర్ ప్రభుత్వ ఒప్పందంలో (ఐజీఏ) సాంకేతిక సహకారం బదిలీని ఎందుకు చేర్చలేదని, ఒప్పందానికి సంబంధించి సార్వభౌమ పూచీకత్తుని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా విచారణ సంస్థలు కేసుల్ని నమోదు చేయలేవని కోర్టుకు విన్నవించారు. ఇక టెక్నాలజీ బదిలీ వంటి అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని చెప్పారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: అమిత్ షా రాఫెల్ ఒప్పందంపై సుప్రీం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి సరైన సమాధానమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సుప్రీం తీర్పు వెల్లడయ్యాక ఆయన వరస ట్వీట్లు చేశారు. ఎన్డీయే ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలందరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ జాగ్రత్తగా ఉండండి: సుప్రీం కోర్టు చీవాట్లు కోర్టు ధిక్కార కేసులన్నీ క్లోజ్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని మోదీనుద్దేశించి చౌకీదార్ చోర్ హై (కాపలదారుడే దొంగ) అని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది. రాహుల్ వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని, భవిష్యత్‌లో ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. రాఫెల్ ఒప్పందంలో అవకతవకలేవీ జరగలేదని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ పదే పదే అదే వ్యాఖ్య చేసి ప్రధాని పరువు తీశారని, ఇదంతా కోర్టు ధిక్కారం కిందకి వస్తుందని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి రాహుల్‌కు వ్యతిరేకంగా కేసు వేశారు. దీన్ని విచారించిన ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగాయ్, జస్టిస్ ఎస్కే పాల్, జస్టిస్ కేఎం జోసెఫ్ రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రాజకీయాల్లో కీలకమైన హోదా అనుభవిస్తున్న రాహుల్ వాస్తవాలు పరిశీలించకుండా ప్రధానికి వ్యతిరేకంగా మాట తూలడం దురదృష్టకరం’అని వ్యాఖ్యానించారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు కోర్టు తీర్పునుద్దేశించి చేసినవి కాదని, అవి పూర్తిగా రాజకీయ వ్యాఖ్యలని గతంలోనే రాహుల్ అఫడివిట్ దాఖలు చేశారు. ఇప్పుడు రాహుల్ కోర్టుకి బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో ధిక్కార కేసుల్ని మూసివేస్తున్నట్టుగా న్యాయమూర్తులు ప్రకటించారు. రాఫెల్‌పై విచారణ జరపాల్సిందే: రాహుల్ రాఫెల్ ఒప్పందంపై తీర్పు వెలువరించిన జస్టిస్ కేఎం జోసెఫ్ పేర్కొన్న అంశాల ఆధారంగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పేర్కొన్న అంశాలు రాఫెల్ కుంభకోణంపై విచారణకు మార్గం చూపాయి. దీనిపై ఇప్పుడు దర్యాప్తు పూర్తిస్థాయిలో జరగాలి. ఈ స్కాంపై జేపీసీ కూడా వేయాలి’అని గురువారం ఆయన ట్విట్టర్లో డిమాండ్ చేశారు. రాఫెల్ ఒప్పందం విషయంలో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని, సుప్రీంకోర్టు తీర్పుతో పండగ చేసుకోవడం మాని విచారణపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కోరారు. కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలు 1. జాతీయ భద్రతా ముసుగులో యుద్ధ విమానాల ధరను వెల్లడించకపోవడం ఎంతవరకు సరైనది ? ధర తడిసిమోపెడవడానికి కారణాలేంటి ? 2. రిలయెన్స్‌ను ఆఫ్సెట్ భాగస్వామిగా ఎంచుకోవాల్సిన అవసరం ఏమిటి ? 3. దేశీయ విమానాల తయారీ సంస్థ హాల్‌ను ఎందుకు పక్కన పెట్టారు ? 4. ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో పరిణామాలు ఎలా జరిగాయి ? -
రాఫెల్ డీల్ : కేంద్రానికి క్లీన్చిట్
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సమీక్ష పిటిషన్లన్నింటిని కోర్టు తిరస్కరించింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు, ఇటీవల సుప్రీంతీర్పుని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. అలాగే కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. తద్వారా వివాదాస్పదమైన రాఫెల్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చినట్టైంది. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కరణప పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. రాహుల్ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇకముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీం సూచించింది. కాగా ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువరించింది. అయితే, తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. దీనిపై దాఖలైన సమీక్ష పిటీషన్‌ను కొట్టి వేస్తూ తాజాగా రాఫెల్ డీల్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని నిర్ధారించింది. -
శబరిమల, రాఫెల్‌పై తీర్పు నేడే
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నెలకొన్న అయో«ధ్య వివాదంపై ఇటీవల తుది తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు మరో మూడు కీలక అంశాలపై తీర్పు ఇవ్వనుంది. శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం, రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో అక్రమాలు, రాఫెల్ తీర్పుపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణ పిటిషన్లపై గురువారం తీర్పునివ్వనుంది. శబరిమల వివాదం.. శబరిమలలో ఉన్న ప్రముఖ అయ్యప్పస్వామి ఆలయంలోకి రుతుక్రమం (10 నుంచి 50 మధ్య వయస్సు)లోని స్త్రీల ప్రవేశంపై నిషేధం ఉంది. ఆలయంలోకి అన్ని వయస్సుల స్త్రీలను అనుమతిస్తూ 2018, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ధర్మాసనం వీటిపై విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వులో ఉంచింది. రఫేల్ వివాదం రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ 2018 డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఈ కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలతో, ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. అలాగే రాఫెల్‌పై సుప్రీంకోర్టును తప్పుగా అన్వయిస్తూ ‘కాపలాదారు దొంగ’అని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణపై పిటిషన్‌పై కూడా ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. -
ఈనెల 17లోగా 6 కీలక తీర్పులు!
న్యూఢిల్లీ: ముస్లిం మహిళల స్వేచ్ఛను హరించి వేస్తోన్న ట్రిపుల్ తలాక్ రద్దు మొదలుకొని సామాజిక అసమానతలు వేళ్లూనుకొన్న అనేక అంశాల్లో చారిత్రక, సంచలన తీర్పులిచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ ఈనెల 17న పదవీ విరమణ చేయబోతున్నారు. అయితే ఆయన పదవీ విరమణకు మిగిలి ఉన్న ఈ పది రోజుల్లో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అత్యంత కీలకమైన తీర్పులిచ్చే అవకాశముంది. అందులో యావత్ భారత దేశం కొన్ని దశాబ్దాలుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రామజన్మభూమి–బాబ్రీ మసీదు కేసు కీలకమైనది. దీంతోపాటు రాజకీయపరమైన, రక్షణకు సంబంధించిన, ఆర్థికపరమైన కేసుల్లో ధర్మాసనం తీర్పులను ఆవిష్కరించబోతోంది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు దశాబ్దాలుగా దేశంలో ఎన్నో భావోద్వేగాలకు కారణమైన, ఎన్నెన్నో ఉద్రిక్తతలకు దారితీసిన, మరెన్నో వివాదాలకు తెరలేపిన రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం ప్రధానమైనది. 70 ఏళ్ళుగా ఉన్న ఈ కేసులో జస్టిస్ గొగోయ్ సారథ్యంలోని బెంచ్ ఈ కీలక తీర్పుని వెలువరించనుంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హిందు, ముస్లిం వర్గాలు దాఖలు అప్పీలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు 40 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు వినింది. శబరిమలలోకి మహిళల ప్రవేశం వయోపరిమితులకు అతీతంగా మహిళలందరినీ శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంలో రివ్యూ పిటిషన్‌పై తుదితీర్పును సైతం చీఫ్ జస్టిస్ గొగోయ్ రిజర్వులో ఉంచారు. కేరళలోని శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018 నాటి తీర్పును జస్టిస్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం కొనసాగిస్తుందా? లేదా అన్నది ఈ వారంలో తేలనుంది. రఫేల్ ఒప్పందం... రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. 36 యుద్దవిమానాల అవినీతి ఒప్పందానికి సంబంధించి పిటిషనర్లు గత ఏడాది అక్టోబర్‌లో దాఖలు చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో సీబీఐ ఎందుకు విఫలమైందనేది ఈ కేసు విచారణ సందర్భంగా తలెత్తిన ప్రధాన వివాదాంశం. డిసెంబర్ 14, 2018లో ఈ ఒప్పందాన్ని సమర్థిçస్తూ తీర్పునివ్వడానికి ప్రభుత్వం కోర్టుని తప్పుదోవ పట్టించడమే కారణమని రివ్యూ పిటిషన్ ఆరోపించింది. చౌకీదార్ చోర్‌హై వివాదం మే 10న సీజేఐ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ కేసులో చౌకీదార్ చోర్‌హై అనే పదబంధాన్ని తప్పుగా ఆపాదించినందుకు కోర్టుకి రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ కేసులో తుది తీర్పు ఇదే వారంలో వచ్చే అవకాశముంది. ఆర్థిక చట్టం రాజ్యాంగ బద్దత 2017 ఆర్థిక చట్టం యొక్క రాజ్యాంగబద్దమైన ప్రామాణికతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై అంతిమ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. ఈ వివాదంపై సైతం గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పుని ఇదే వారంలో ఇచ్చే అవకాశముంది. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అన్న అంశంపై దాఖలైన పిటిషన్‌పై ఏప్రిల్ 4న వాదనల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 2(హెచ్) ప్రకారం చీఫ్ జస్టిస్ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010, జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. -
భారత్ చేతికి అత్యాధునిక యుద్ధవిమానం రఫెల్
-
‘ఏ దేశంపై దాడి చేసే ఉద్దేశం లేదు’
పారిస్: అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నది దేశ భద్రత కోసమే కానీ.. ఇతర దేశాలపై దాడి చేసే ఉద్దేశం భారత్‌కు లేదన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఫ్రాన్స్‌లో తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని మంగళవారం అధికారికంగా స్వీకరించిన సంగతి తెలిసిందే. రఫేల్ యుద్ధ విమానానికి ఆయుధ పూజ నిర్వహించారు రాజ్‌నాథ్ సింగ్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఇది చాలా చారిత్రత్మక రోజు. రఫేల్ అప్పగింతతో భారత్-ఫ్రాన్స్‌ల మధ్య బంధం మరింత బలపడింది. రఫేల్ చేరికత భారత వైమానిక రంగం మరింత శక్తివంతంగా మారింది. భారత్ రక్షణ వ్యవస్థ బలోపేతం కోసమే ఆయుధాలను సమకూర్చుకుంటుంది. ఏ దేశం మీద దాడి చేసే ఉద్దేశం మాకు లేదని’ రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఆయుధ పూజ అనంతరం రాజ్‌నాథ్ రఫేల్ జెట్‌లో పర్యటించారు. ఈ క్రమంలో తన అనుభూతిని తెలుపుతూ.. రఫేల్‌లో విహరించడం సౌకర్యంగా, హాయిగా ఉందన్నారు. సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తానని జీవితంలో ఎప్పుడు అనుకోలేదని తెలిపారు రాజ్‌నాథ్ సింగ్. రఫేల్ జెట్ల చేరిక ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కాలన్నారు. దేశ భద్రత కోసం మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజ్‌నాథ్ తెలిపారు. ఫిబ్రవరి 2021నాటికి ఫ్రాన్స్ మరో 18 రఫేల్ యుద్ధ విమానాలను భారతకు అందజేస్తుంది. మే 2022 నాటికి దేశం మొత్తం మీద 36 రఫేల్ జెట్లు ఉండబోతున్నాయి. -
తొలి రఫేల్ జెట్‌ను అందుకున్న రాజ్‌నాథ్..
పారిస్ : భారత్ అమ్ములపొదిలో మరో శక్తివంతమైన సాధనా సంపత్తి సమకూరింది. ఫ్రాన్స్‌లో తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం అధికారికంగా స్వీకరించారు. దసరా పర్వదినంతో పాటు 87వ ఎయిర్‌ఫోర్స్ డే జరుపుకుంటున్న క్రమంలో తొలి రఫేల్ విమానాన్ని అందుకోవడం సంతోషదాయకమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అనుకున్న సమయానికి రఫేల్ ఎయిర్‌క్రాఫ్ట్ డెలివరీ జరగడం స్వాగతించదగిన పరిణామమని రఫేల్ రాకతో తమ వైమానిక దళం మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, ఫ్రాన్స్‌లను ఉద్దేశిస్తూ రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల నడుమ రానున్న రోజుల్లో పలు రంగాల్లో పరస్పర సహకారం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు.రఫేల్ జెట్ సరఫరాకు శ్రీకారం చుట్టడం ద్వారా నేడు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య పరంపరలో నూతన మైలురాయి వంటిదని వ్యాఖ్యానించారు. రఫేల్ సామర్థ్యం మేర రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వాయుసేనలో భారత్ బలోపేతమై ఈ ప్రాంతంలో శాంతిభద్రతల బలోపేతానికి మార్గం సుగమమవుతుందని అన్నారు. -
పారిస్‌లోని ఐఏఎఫ్ ఆఫీస్‌లో చొరబాటు
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కార్యాలయంలోకి ఆదివారం కొందరు దుండగులు చొరబడ్డారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇది గూఢచారుల పని అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన గురించి అటు ఐఏఎఫ్ కానీ, ఇటు రక్షణ మంత్రిత్వ శాఖగానీ ఏ ప్రకటనా చేయలేదు. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలుచేస్తుండటం తెల్సిందే. ఆ విమానాల తయారీని ఈ ఆఫీస్ పర్యవేక్షిస్తోంది. భారత్, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన రఫేల్ ఒప్పందానికి సంబంధించిన రహస్య పత్రాలను దొంగిలించేందుకే దుండగులు కార్యాలయంలోకి ప్రవేశించారనే అనుమానాలు ఉన్నాయి. స్థానిక పోలీసులు కేసును విచారిస్తున్నారు. -
రఫేల్‌పై సుప్రీం తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందానికి సంబంధించిన సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి పలు ప్రశ్నలు వేసింది. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో సార్వభౌమ గ్యారంటీని ఎందుకు మాఫీ చేశారనీ, సాంకేతికతను ఎందుకు బదిలీ చేసుకోవడం లేదని కోర్టు ప్రశ్నించింది. గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు రఫేల్ విషయంలో కేంద్రానికి క్లీన్చిట్ ఇస్తూ తీర్పు చెప్పడం తెలిసిందే. ఆ తీర్పును పునఃసమీక్షించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సామాజిక కార్యకర్త, లాయర్ ప్రశాంత్ భూషణ్, ఆప్ శాసనసభ్యుడు సంజయ్ సింగ్, లాయర్ వినీత్ రివ్యూ పిటిషన్లు వేయడం తెలిసిందే. ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నిస్తూ సాంకేతికత బదిలీ అంశం ఒప్పందంలో ఎందుకు లేదో చెప్పాలంది. దీనికి కేంద్రం తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ వాదిస్తూ అలాంటి సాంకేతిక అంశాలను కోర్టు విచారించకూడదన్నారు. సార్వభౌమ గ్యారంటీని మాఫీ చేసి కేవలం లెటర్ ఆఫ్ కంఫర్ట్‌ను తీసుకోవడాన్ని ప్రశ్నించగా, ఇదేమీ కొత్తగా జరిగింది కాదనీ, రష్యా, అమెరికాలతో ఒప్పందాల్లోనూ ప్రభుత్వం ఇలాగే చేసిందని తెలిపారు. ఇంకా వేణుగోపాల్ మాట్లాడుతూ ‘ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ప్రపంచంలోని ఇతర ఏ కోర్టు కూడా ఇలాంటి వాదనలపై రక్షణ ఒప్పందాలపై విచారణ జరపదు’ అని అన్నారు. డిసెంబర్ 14 నాటి తీర్పును పునఃసమీక్షించాలా? వద్దా? అన్న విషయంపై తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. రాహుల్ కేసుపై తీర్పు సైతం రిజర్వ్‌లోనే.. రఫేల్ కేసు విషయంలో ‘కాపలాదారుడే (మోదీ) దొంగ’ అన్న వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించినందుకు తాను ఇప్పటికే బేషరతుగా క్షమాపణ చెప్పినందున తనపై క్రిమినల్ ధిక్కార చర్యలను ఆపేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును కోరారు. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి గతంలో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు. దీనిపై తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం రిజర్వ్‌లో ఉంచింది. రాహుల్ తరఫున ఏఎం సింఘ్వీ వాదిస్తూ రాహుల్ ఇప్పటికే బేషరతు క్షమాపణ చెప్పి, తన చింతన కూడా వ్యక్తపరిచారని కోర్టుకు తెలిపారు. మీనాక్షి తరఫున ముకుల్ రోహత్గీ వాదిస్తూ ఆ క్షమాపణను తిరస్కరించాలనీ, రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు క్షమాపణ చెప్పేలా రాహుల్‌ను కోర్టు ఆదేశించాలని కోరారు. దీనిపై తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. -
రఫేల్‌పై వాడివేడీ వాదనలు.. తీర్పు రిజర్వు
సాక్షి: న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కోనుగోలు ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాడీవేడిగా జరిగింది. పిటిషనర్లు, కేంద్ర ప్రభుత్వం తరఫు అటర్నీ జనరల్ ధర్మసనానికి వాదనలు వినిపించారు. వారి వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పిటిషనర్ల తరుఫున తొలుత వాదనలు వినిపించిన ప్రశాంత్ భూషణ్ కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒప్పందంలోని నిజనిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున అటర్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి.. జెట్ల ధరలను బహిర్గతం చేయలేమని అన్నారు. పిటిషనర్లు ప్రతిసారి ధరల గురించి ప్రస్తావించడం సరైనది కాదని అసహనం వ్యక్తంచేశారు. ఇద్దరి వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల్లోగా లిఖితపూర్వక వాదనలు తమకు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. కాగా రాఫెల్‌పై పిటిషన్ దాఖలు చేసిన మరో పిటిషనర్ అరుణ్ శౌరి న్యాయస్థానం ఎదుట తన వాదనల్ని విన్పించారు. పత్రాలు చోరీకి గురయ్యాయన్న కేంద్రం వాదన సరైంది కాదన్నారు. ఇప్పటికే కొన్ని పత్రాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే సుప్రీంకోర్టు గత తీర్పు ఇచ్చిందని న్యాయస్థానం ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
అది సరే.. రఫేల్ సంగతేంటి?
సిర్సా(హరియాణా)/బినా(మధ్యప్రదేశ్)/ఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని అవినీతిపరుడంటూ విమర్శలు చేస్తున్న ప్రధాని మోదీ రఫేల్ ఒప్పందంలో ఏం చేసిందీ ప్రజలకు వెల్లడించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీ, హరియాణాలోని సిర్సా, మధ్యప్రదేశ్‌లోని బినాలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. ‘మీరు నా గురించి, రాజీవ్ గురించి నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు. కానీ, ముందుగా రఫేల్ ఒప్పందం, యువతకు 2 కోట్ల ఉద్యోగాలిస్తామంటూ చేసిన హామీ అమలు విషయం ఏం చేశారో చెప్పండి’ అని మోదీని నిలదీశారు. ‘రైతులకు మద్దతు ధర ఇచ్చారా? ప్రజల బ్యాంకు అకౌంట్లలో రూ.15 లక్షల చొప్పున జమ చేశారా?’ అంటూ గత ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలను రాహుల్ గుర్తు చేశారు. ‘తనకు 56 అంగుళాల ఛాతీ ఉందంటూ గొప్పలు చెప్పుకునే మోదీ రైతులు, నిరుద్యోగ యువత గురించి ఈ ఎన్నికల్లో మాట్లాడటం లేదు’ అని దెప్పిపొడిచారు. ‘గత ఐదేళ్లలో మీరు ఏం చేశారు? దేశానికి మీరు ఏమిచ్చారో మోదీ చెప్పాలి’అని అన్నారు. తన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఏమీలేకనే గతంలో జరిగిన విషయాలపై మోదీ మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ‘మీరు ఏం చేశారు? ఏం చేయగలరు? అనేది తెలుసుకునేందుకే ప్రజలు మిమ్మల్ని ప్రధానిగా ఎన్నుకున్నారు తప్ప ఇతరులు ఏం చేశారో మీరు చెబుతారని కాదు’ అని పేర్కొన్నారు. పకోడీలను అమ్ముకోవడం కూడా మంచి ఉద్యోగమేనన్న ప్రధాని వ్యాఖ్యలపై ఆయన.. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పథకాల గురించి మాట్లాడే మోదీ పకోడీలతో ముగిస్తారు’ అంటూ ఎద్దేవా చేశారు. హరియాణా, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్.. ఇలా మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో విద్వేషం నూరిపోస్తుంటారని రాహుల్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో రైతులకు అమలు చేసిన రుణమాఫీ ద్వారా బీజేపీ నేతలు కూడా లబ్ధిపొందారని చెప్పారు. బీజేపీకి, మోదీకి వీడ్కోలు చెప్పాల్సిన సమయం దగ్గరపడిందని తెలిపారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు కనీసం ఆదాయం కల్పించే న్యాయ్ పథకాన్ని ప్రవేశపెడుతుంది. ఈ పథకం నిధుల్లో ఒక్క నయా పైసా కూడా మధ్యతరగతి, లేదా ఇతరుల నుంచి వసూలు చేయబోం. మోదీ హయాంలో అతిగా లాభపడిన పారిశ్రామిక వేత్తల నుంచి ఈ పథకానికి అవసరమైన నిధులను రాబడతాం’ అని అన్నారు. కాగా, ఢిల్లీలో మోదీని ఓడించే సత్తా ఆప్‌కు లేదని, కాంగ్రెస్‌కే అది సాధ్యమవుతుందని ఢిల్లీలో ప్రచారసభలో రాహుల్ అన్నారు. -
సుప్రీంకోర్టును మోసం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టును కేంద్రం మోసం చేసిందని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. కేంద్రానికి అనుకూలంగా తీర్పు వచ్చేందుకు సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. రఫేల్ కేసులో డిసెంబర్ 14న వచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా వారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రీజాయిండర్ అఫిడవిట్లో సుప్రీంకోర్టును కోరారు. తప్పుడు ఆధారాలు చూపి, సరైన పత్రాలను, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం వల్ల ఆ తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటికి కూడా నిజమైన పత్రాలను కోర్టు ముందు ఉంచట్లేదని, అందుకే తాము నిజమైన పత్రాలను బహిర్గతపరచాలని డిమాండ్ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ‘సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందజేసిన వివరాలతో కేంద్రం తప్పుదోవపట్టించిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆధారాలను కేంద్రం తొక్కిపట్టి కోర్టు నుంచి తప్పుడు తీర్పు పొందింది’ అని ఆరోపించారు. రఫేల్ కేసు తీర్పుపై సమీక్ష జరపాలని పిటిషన్‌కు సమాధానంగా కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌కు స్పందనగా ఆ ముగ్గురు రీజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కాగా, రఫేల్ తీర్పుపై సమీక్ష జరపాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరుపుతామని సీజేఐ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. వారి ఆరోపణలు నిరాధారం.. రఫేల్ కొనుగోలు కేసులో పిటిషనర్ల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. రక్షణ శాఖ నుంచి లీక్ అయిన పత్రాల ఆధారంగా వచ్చిన వార్తాకథనాలపైనే వారు ఆధారపడ్డారని పేర్కొంది. ఇది కచ్చితంగా అధికారులు వారి విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడమే అవుతుందని వెల్లడించింది. -
మోదీ మళ్లీ ప్రధాని కాబోరు
మొరేనా/భిండ్/గ్వాలియర్: ప్రధాని మోదీపై దేశప్రజలు నమ్మకం కోల్పోయారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ విమర్శించారు. ఆయన మరోసారి ప్రధాని కాబోరని వ్యాఖ్యానించారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారనీ, అందుకే ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సామాన్యులపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్‌లను వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తెస్తామన్నారు. మధ్యప్రదేశ్‌లోని మొరేనా, గ్వాలియర్, భిండ్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడారు. అంబానీని కౌగిలించుకోను.. ప్రధాని మోదీకి పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలపై ఉన్న ప్రేమ సామాన్యులు, పేదలు, యువతపై లేదని రాహుల్ విమర్శించారు. ‘15 మంది బడా పారిశ్రామికవేత్తలకు మోదీ ప్రభుత్వం రూ.5.55 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. కానీ రైతులు, యువతపై ఇదే సానుభూతి చూపించలేకపోయింది. ఓ రైతు వ్యవసాయ రుణాలను చెల్లించకలేకపోతే జైలుకు పోతున్నాడు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి రైతన్నలను అరెస్ట్‌చేయకుండా చర్యలు తీసుకుంటాం. విదేశాలకు వెళ్లే మోదీ వ్యాపారవేత్తలతో కరచాలనం చేయడంతో పాటు కౌగిలించుకుంటూ ఉంటారు. కానీ నేనుమాత్రం అనిల్ అంబానీని ఎప్పుడూ ఆలింగనం చేసుకోను. దేశంలోని పేదప్రజలకు తోడుగా ఉంటాను’ అని తెలిపారు. అమరులను అవమానించారు.. రఫేల్ ఒప్పందాన్ని దొంగలించడం ద్వారా మోదీ అమరుల్ని అవమానించారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఫేల్ ఫైటర్జెట్లను భారత్‌లో కాకుండా ఫ్రాన్స్‌లో తయారుచేయాలని నిర్ణయించడం ద్వారా భిండ్‌లో వందలాది యువకులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. ‘రఫేల్’పై విచారణ జరుపుతాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రఫేల్ ఒప్పందంపై విచారణ జరుపుతామని రాహుల్ ప్రకటించారు. ‘ఈ విచారణలో ప్రధానంగా ఇద్దరి పేర్లే బయటకు వస్తాయి. వాటిలో మోదీ ఒకరు కాగా, అనిల్ అంబానీ మరొకరు. మోదీకి దమ్ముంటే అనిల్ అంబానీ ఇంట్లో తప్పించి ఎక్కడైనా నాతో బహిరంగ చర్చకు రావాలి. నాతో 15 నిమిషాలు చర్చకు కూర్చుంటే మోదీ దేశానికి ముఖం చూపించుకోలేరు. నిజాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను బీజేపీ ప్రభుత్వం జాగ్రత్తగా విమానంలో వదిలిపెట్టింది. అదే ఉగ్రవాది పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారకుడయ్యాడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో ఓ పోలీస్, 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. -
తీర్పులో సమీక్షించేంత తప్పేం లేదు
న్యూఢిల్లీ: రఫేల్ కేసుకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన విస్పష్టమైన తీర్పులో సమీక్షించాల్సినంత తప్పేమీ లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం శనివారం తెలిపింది. తీర్పు సమీక్ష పేరిట పిటిషనర్లు.. కొన్ని పత్రికా కథనాలు, చట్టవ్యతిరేకంగా, అనధికారికంగా సేకరించిన కొన్ని అసంపూర్తి అంతర్గత ప్రభుత్వ పత్రాలను ఆధారంగా చేసుకుని మొత్తం వ్యవహారాన్ని తిరగదోడాల్సిందిగా కోరలేరని చెప్పింది. ప్రభుత్వ రహస్య సమాచారాన్ని ఈ విధంగా వెల్లడించడం తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తుందని తెలిపింది. రఫేల్ కేసులో గత ఏడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ఆదేశాల మేరకు కేంద్రం శనివారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రివ్యూ పిటిషన్ ద్వారా కోర్టు నుంచి మరొక విచారణ ఉత్తర్వు తెచ్చుకునేందుకు పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారంది. కొందరు వ్యక్తుల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని విచారణ జరిపేందుకు కోర్టు ఇంతకుముందే నిరాకరించిందని తెలిపింది. 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఇందులో జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని కోర్టు భావించిందని వివరించింది. మీడియా కథనాల ఆధారంగా కోర్టులు నిర్ణయం తీసుకోలేవని చట్టంలోనే ఉందని తెలిపింది. కేసులో యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరితో పాటు మరో ఇద్దరు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం వచ్చే వారం విచారణ జరపనుంది. -
రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘చౌకీదార్ చోర్’ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను కోర్టుకు ఆపాదించడం తప్పేనని.. ఇందుకు రాహుల్ బాధపడుతున్నట్లు ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మంగళవారం కోర్టుకు తెలిపారు. దీన్ని బట్టి రాహుల్, కోర్టును క్షమాపణ కోరినట్లే అని అర్థ చేసుకోవాలంటూ అభిషేక్ సింఘ్వీ కోర్టుకు నివేదించారు. గతంలో రాహుల్ గాంధీ.. రాఫెల్ కుంభకోణంలో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ చౌకీదార్ చోర్ అని కోర్టే చెప్పిందంటూ.. తన వ్యాఖ్యలను సుప్రీం కోర్టుకు ఆపాదించిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ సుప్రీం కోర్టు వ్యాఖ్యలను వక్రీకరించారంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రాఫెల్ డీల్ కేసులో చౌకీదార్ చోర్ అనే వ్యాఖ్యానం తాను ఎప్పుడు చేయలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మేము అని మాటలను మాకేలా ఆపాదిస్తారని కోర్టు రాహుల్‌ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న రాహుల్ అఫిడవిట్ దాఖలు చేశారు. దానిలో సదరు వ్యాఖ్యలపై ‘చింతిస్తున్న’ అని తెలిపారు. అయితే ‘చింతిస్తున్న’ అనే పదాన్ని బ్రాకెట్లో ఎందుకు చేర్చారని కోర్టు రాహుల్‌ని ప్రశ్నించింది. దీనిపై కోర్టు ధిక్కారం కింద చర్యలు చేపడతామని రాహుల్ గాంధీని కోర్టు హెచ్చరించింది. -
సుప్రీంకు రాహుల్ మరో‘సారీ’
న్యూఢిల్లీ: చౌకీదార్ చోర్ హై అన్న తన వ్యాఖ్యలను రఫేల్ కేసులో తీర్పుకు తప్పుగా ఆపాదించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు మరో తాజా అఫడవిట్ దాఖలు చేశారు. తనపై ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం ద్వారా.. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి తన రాజకీయ లబ్ది కోసం కోర్టును రాజకీయ వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ధిక్కార పిటిషన్‌ను కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. ముమ్మర ఎన్నికల ప్రచార వేడిలో తానా వ్యాఖ్యలు చేశానని, సుప్రీంకోర్టు తీర్పులను తప్పుగా వక్రీకరించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. రఫేల్ కేసులో కోర్టు ఉత్తర్వులను చదవకుండానే ఎన్నికల వేడిలో మాటలన్నానని తెలిపారు. తన మాటలను ప్రత్యర్థి పార్టీలు ఉపయోగించుకున్నాయని, దుర్వినియోగం చేశాయని విమర్శించారు. తాను 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఒక బాధ్యతాయుతమైన రాజకీయ, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తినని పేర్కొంటూ.. కోర్టు ప్రక్రియపై తప్పుడు ప్రభావం చూపించే లేఖి పిటిషన్‌ను తోసిపుచ్చాలని విజ్ఞప్తి చేశారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వాటిపై విచారం వ్యక్తం చేస్తూ తొలిసారి ఏప్రిల్ 22న రాహుల్ కోర్టులో అఫడవిట్ దాఖలు చేశారు. విచారణను వాయిదా వేయాలన్న కేంద్రం గత డిసెంబర్ 14 నాటి రఫేల్ కేసు తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం నాటి విచారణను వాయిదా వేయాలని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టును కోరింది. పార్టీల రివ్యూ పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని తన లేఖలో పేర్కొంది. కాగా ఈ మేరకు సంబంధిత పార్టీలకు లేఖను పంపిణీ చేసేందుకు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతించింది. సభలో ‘చౌకీదార్’ చొక్కాలు చురు/ధోల్పూర్ (రాజస్తాన్): రాజస్తాన్‌లోని చురు జిల్లా సర్దార్ షహర్లో రాహుల్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు ‘మై భీ చౌకీదార్’అని రాసున్న టీషర్ట్లను ధరించిన కొందరు యువకులు హాజరయ్యారు. వారిని స్వాగతిస్తామని రాహుల్ తెలిపారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘తాము అధికారంలోకి రాగానే 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చౌకీదార్ గారు ప్రమాణం చేశారు. మీలో ఎవరికైనా ఆ ఉద్యోగాలు వచ్చాయా’అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే అందరి బ్యాంకు అకౌంట్లలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని.. మీలో ఎవరికైనా ఆ మొత్తం వచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు. జైపూర్ గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గంలో రాహుల్ ప్రచారం చేస్తూ ‘రఫేల్‌పై ఒక విచారణ జరగనుంది. ఇద్దరి పేర్లు బయటకు వస్తాయి. ఒకటి అనిల్ అంబానీ, రెండు నరేంద్ర మోదీ’ అని అన్నారు. -
15 మంది కోసమే మోదీ
లఖింపూర్ ఖేరి/ఉన్నావ్: ప్రధాని నరేంద్ర మోదీ 15 మంది ఎంపిక చేసిన వ్యక్తుల ప్రయోజనాలను మాత్రమే పరిరక్షించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులు, పేద ప్రజల ప్రయోజనాలను ఆయన విస్మరించారన్నారు. చెరకు రైతులు తమకు రావాల్సిన బకాయిలు అడిగితే, ఆ రైతుల వల్లనే షుగర్ వ్యాధి వచ్చిందని అన్నారని రాహుల్ మండిపడ్డారు. వాస్తవానికి ఈ వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసినట్లుగా చెబుతారు. 2014లో మోదీ ఎన్నో హామీలు ఇచ్చి, మంచి రోజులని చెప్పి, హామీలను నెరవేర్చలేదని రాహుల్ విమర్శించారు. లఖింపూర్ ఖేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జాఫర్ అలీ నఖ్వీ తరఫున రాహుల్ ప్రచారం చేశారు. అనంతరం ఆయన ఉన్నావ్‌లోనూ ప్రచారంలో పాల్గొన్నారు. రఫేల్ ఒప్పందంలో అవకతవకలు ఉన్నాయని రాహుల్ మరోసారి ప్రస్తావించారు. ఒక్క విమానాన్ని కూడా తయారు చేసిన అనుభవం లేని అనిల్ అంబానీకి మోదీ 30 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును కట్టిబెట్టారనీ, బకాయిలు అడిగిన చెరకు రైతులను మాత్రం షుగర్ వ్యాధి మీ వల్లే వచ్చిందని అన్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం తీసుకొస్తున్న కనీస ఆదాయ భద్రత పథకంతో నిరుపేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ. 72 వేల ఆదాయం ఉండేలా చూస్తామని కాంగ్రెస్ ప్రకటించడం తెలిసిందే. ఆర్థిక వేత్తలు, మేధావులతో సంప్రదించాకే ఈ పథకాన్ని ప్రకటించామనీ, దీని అమలు సాధ్యమేనని రాహుల్ తెలిపారు. మోదీని ఉద్దేశించి ఓ ట్వీట్ చేస్తూ ప్రజల ముందు జిత్తులమారితనం పనిచేయదని అన్నారు. -
‘రఫేల్’ వ్యాఖ్యలపై సుప్రీంకు రాహుల్ క్షమాపణ
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందానికి సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులపై చేసిన వ్యాఖ్యలను గాను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ క్షమాపణలు కోరారు. రఫేల్ ఒప్పందంలో ప్రధాని మోదీని సుప్రీంకోర్టు తప్పుపట్టిందంటూ రాహుల్ పేర్కొన్నారని, న్యాయస్థానం పేర్కొనని విషయాలను కూడా ఆయన జోడించారంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఈనెల 15వ తేదీన సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం ఆ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా భావిస్తూ 22వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రాహుల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచార వేడిలో తాను చేసిన వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు వక్రీకరించారని అందులో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశం తనకు లేదన్నారు. ప్రధాని మోదీ కూడా రఫేల్ ఒప్పందంలో తనకు సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినట్లు చెప్పుకున్నారని పేర్కొన్నారు. ఈ అఫిడవిట్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించనుంది. కాగా, రాహుల్ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ..రఫేల్ ఒప్పందం విషయంలో ప్రధానిపై చేసిన ఆరోపణలు అబద్ధాలంటూ రాహుల్ సుప్రీంకోర్టులో అంగీకరించారని అన్నారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ వ్యాఖ్యలు తీవ్ర కోర్టు ధిక్కారం కిందికి వస్తాయని పేర్కొంది. -
రాహుల్‌కు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. ‘ప్రధాని మోదీ దొంగ అని సుప్రీంకోర్టే చెప్పింది’ అన్న వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం రాహుల్‌కు నోటీసులు జారీచేసింది. రఫేల్ తీర్పునకు రాహుల్ తప్పుడు ఆరోపణల్ని ఆపాదించారని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలకు ఏప్రిల్ 22లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రఫేల్ ఒప్పందంపై లీకైన పత్రాల ఆధారంగా గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీం ఈ నెల 10న అంగీకరించిన సంగతి తెలిసిందే. అదేరోజు అమేథీలో నామినేషన్ దాఖలుచేసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..‘చౌకీదార్(కాపలాదారు–మోదీ) దొంగ అని సుప్రీంకోర్టు చెప్పింది. మోదీ దొంగతనానికి పాల్పడ్డారని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నేను సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెబుతున్నా. సత్యమే గెలిచింది’ అని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం తీర్పునకు రాహుల్ తన అభిప్రాయాన్ని ఆపాదించారని ఆరోపించారు. రఫేల్ పత్రాలపైనే చర్చించాం ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం స్పందిస్తూ..‘రఫేల్ వ్యవహారంలో రాహుల్ గాంధీ తన ప్రసంగాలు, మీడియా సమావేశాల్లో తప్పుడు ఆరోపణలను సుప్రీం తీర్పునకు ఆపాదించారు. అంతేకాకుండా రాహుల్ ప్రస్తావించిన కొన్ని వ్యాఖ్యల్ని మేం అసలు చెప్పనేలేదు. మేం కేవలం లీకైన రఫేల్ పత్రాల చట్టబద్ధతపైనే చర్చించాం. కాబట్టి ఈ విషయంలో స్పష్టత కోసం రాహుల్ గాంధీ నుంచి వివరణ కోరడమే సరైనదని భావిస్తున్నాం’ అని తెలిపింది. ఈ కేసులో ఏప్రిల్ 23న తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. రాజకీయ నేతలు న్యాయస్థానాల తీర్పులకు ఎలాంటి అభిప్రాయాలను ఆపాదించరాదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా మీనాక్షి లేఖీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. సుప్రీంకోర్టును ప్రస్తావిస్తూ ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేందుకు రాహుల్ ప్రయత్నించారని ఆరోపించారు. ఇది కోర్టు ధిక్కారానికి పాల్పడటమేననీ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పందిస్తూ.. ఈ విషయంలో రాహుల్ వివరణను తీసుకుంటామని పునరుద్ఘాటించింది. ఈ కేసులో అదనపు అఫిడవిట్ దాఖలుచేసేందుకు అనుమతిస్తున్నామని పేర్కొంది. రాహుల్ అబద్ధాల కోరు: బీజేపీ పదేపదే అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు అలవాటైపోయిందని బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శించారు. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో మోదీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు రాహుల్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రవిశంకర్ డిమాండ్ చేశారు. రాహుల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. కేవలం అబద్ధాలు చెప్పడమే కాకుండా తన ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థలను రాహుల్ వివాదంలోకి లాగారన్నారు. మోదీ పారదర్శక పాలన అందిస్తుంటే, కుంభకోణాల్లో మునిగితేలిన కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోందని దుయ్యబట్టారు. సుప్రీంకు వివరణ ఇస్తాం: కాంగ్రెస్ రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ..‘రాహుల్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు వివరణ కోరింది. వాళ్లకు మేం వివరణ ఇస్తాం’ అని ముక్తసరిగా జవాబిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ స్పందిస్తూ..‘సుప్రీంకోర్టు నోటీసుపై సమగ్రంగా, గట్టిగా జవాబు ఇస్తాం. ఎవ్వరినీ నొప్పించే ఉద్దేశం రాహుల్‌కు లేనప్పటికీ ఆయన వ్యాఖ్యలను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇది ఎంతమాత్రం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. -
ఆ ఊరికి ‘రఫేల్’ మరక..
రాయ్‌పూర్ : దేశ రాజకీయాల్లో పెనుదుమారం సృష్టిస్తున్న ఫ్రెంచ్ యుద్ధ విమానం రఫేల్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని ఓ చిన్న గ్రామాన్ని కుదిపేస్తోంది. రఫేల్ విమానాల కొనుగోలు దేశంలో వివాదాలకు కేంద్ర బిందువు కాగా ఇదే పేరుతో రఫేల్ అనే గ్రామం తమ ఊరి పేరు ఇలా ప్రతికూల వార్తలతో ముడిపడటంపై భగ్గుమంటున్నారు. చత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ నియోజకవర్గ పరిధిలోని రఫేల్ గ్రామంలో ఈనెల 18న పోలింగ్ జరగనుంది. తమ ఊరి పేరును ఇతర గ్రామాల వారు అవహేళన చేస్తున్నారని, తమ ఊరి పేరు మార్చాలని కోరుతూ తాము సీఎం కార్యాలయానికి వెళ్లామని, అయితే ఆయనను కలిసేందుకు వీలుపడలేదని గ్రామ పెద్ద, 83 ఏళ్ల ధరమ్ సింగ్ చెప్పుకొచ్చారు. రఫేల్ వివాదంతో తమ ఊరిపేరు నెగెటివ్ వార్తలతో మార్మోగుతున్నా తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, రాష్ర్టం వెలుపల తమ గ్రామం గురించి ఎవరికీ పెద్దగా తెలియదని ఆయన పేర్కొన్నారు. తమ ఊరిలో మంచినీరు, పారిశుధ్ధ్యం వంటి మౌలిక వసతులు సైతం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు దేశంలో ఎన్నో గ్రామాలను రాజకీయ నేతలు దత్తత తీసుకున్నా తమ గ్రామాన్ని ఎవరూ కనీసం సందర్శించలేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా తమ గ్రామం పేరు మార్చాలని కోరుతామన్నారు. అయితే రఫేల్ అంటే ఏమిటో, తమ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందో తనకు తెలియదని ఆయన చెప్పారు. దశాబ్ధాల తరబడి తమ ఊరికి ఇదే పేరు కొనసాగుతోందని తెలిపారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహాసముంద్ నుంచి సిటింగ్ ఎంపీ చందులాల్ సాహూ బీజేపీ నుంచి బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి ధనేంద్ర సాహు, బీఎస్పీ నుంచి ధన్సింగ్ కొసరియా ఆయనతో తలపడుతున్నారు. కాగా, రఫేల్ ఒప్పందంలో మోదీ సర్కార్ అనిల్ అంబానీకి సాయపడేలా అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తున్నసంగతి తెలిసిందే. -
అంబానీకి 1,121 కోట్ల లబ్ధి!
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌తో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాల విమర్శల వేడి చల్లారకముందే రియలన్స్ కంపెనీకి కొత్త చిక్కు వచ్చిపడింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థ ‘రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ ఫ్రాన్స్’కు ఫ్రెంచి ప్రభుత్వం రూ.1,121.18 కోట్లు(14.37 కోట్ల యూరోల) పన్నును మినహాయించినట్లు ‘లా మాండే’ అనే ఫ్రాన్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఒప్పందాన్ని కుదర్చుకున్న కొన్ని నెలలకే ఫ్లాగ్ అట్లాంటిక్‌కు ఈ మినహాయింపు లభించిందని తెలిపింది. దీంతో మోదీ ఆశీర్వాదంతోనే ఈ పన్ను మినహాయింపులు లభించాయని కాంగ్రెస్ దుమ్మెత్తిపోయగా, రఫేల్ ఒప్పందం–రిలయన్స్ పన్ను మినహాయింపునకు లంకె పెట్టడం సరికాదని కేంద్రం స్పష్టం చేసింది. అనిల్‌కు చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థ రఫేల్ యుద్ధవిమానాలు తయారుచేసే డసో ఏవియేషన్‌కు భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామిగా ఉంది. రఫేల్ ఒప్పందం కుదరగానే.. ఫ్లాగ్ అట్లాంటిక్ 2007–10లో రూ.468.14 కోట్ల(60 మిలియన్ యూరోలు) పన్నును చెల్లించాల్సి ఉన్నట్లు ఫ్రాన్స్ ఐటీ అధికారుల విచారణలో తేలిందని ‘లా మాండే’ కథనంలో తెలిపింది. ‘ఈ విషయమై ఫ్రెంచ్ అధికారులు కంపెనీకి నోటీసులు జారీచేశారు. దీంతో తాము సెటిల్మెంట్లో భాగంగా 56.95 కోట్లు (7.3 మిలియన్ యూరోలు) చెల్లిస్తామని ఫ్లాగ్ అట్లాంటిక్ సంస్థ ప్రతిపాదించింది. కానీ దీన్ని అధికారులు తిరస్కరించారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరిపిన అధికారులు 2010–12 మధ్యకాలంలో మరో రూ.710 కోట్లు(91 మిలియన్ యూరోలు) పన్ను బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం రూ.1,178 కోట్లుగా తేలింది. అయితే 2015, ఏప్రిల్ 10న భారత ప్రధాని మోదీ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో 36 రఫేల్ ఫైటర్జెట్ల కోసం ఒప్పందం కుదర్చుకున్నారు. ఇది జరిగిన 6 నెలలకు అంటే.. 2015, అక్టోబర్‌లో ఫ్రాన్స్ అధికారులు అనూహ్యంగా రిలయన్స్ ప్రతిపాదించిన రూ.56.95 కోట్ల(7.3 మిలియన్ యూరోల) పన్ను సెటిల్మెంట్కు అంగీకరించారు. ఫ్లాగ్ అట్లాంటిక్‌కు రూ.1,121 కోట్ల లబ్ధిని చేకూర్చారు’ అని లా మాండే వెల్లడించింది. ఫ్లాగ్ అట్లాంటిక్ సంస్థకు ఫ్రాన్స్‌లో కేబుల్ నెట్‌వర్క్‌తో పాటు టెలికాం సేవలందించే మౌలికవసతులు ఉన్నాయని పేర్కొంది. అంతా మోదీ ఆశీర్వాదమే: విపక్షాలు ఫ్రాన్స్ అధికారులు రిలయన్స్ అనుబంధ సంస్థకు రూ.1,121.18 కోట్ల లబ్ధి చేకూర్చడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ప్రధాని మోదీ ఆశీర్వాదం, అనుగ్రహం కారణంగానే రిలయన్స్‌కు ఈ పన్ను మినహాయింపు లభించిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. రఫేల్ ఒప్పందంలో మోదీ మధ్యవర్తిగా వ్యవహరించారని దుయ్యబట్టారు. తన స్నేహితుడైన పారిశ్రామికవేత్తకు లబ్ధి చేకూర్చడం కోసం మోదీ రఫేల్ ఒప్పందం ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. ఆర్థిక కష్టాలతో అల్లాడుతున్న రైతులు, విద్యార్థులకు రుణాలు ఇవ్వని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం దోచిపెడుతోందని సీపీఐ నేత డి.రాజా విమర్శించారు. ఈ రఫేల్ ఒప్పందాన్ని అంగీకరించలేకే మాజీ రక్షణమంత్రి, దివంగత మనోహర్ పరీకర్ తన పదవికి రాజీనామా చేశారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. రాజకీయ జోక్యం లేదు: ఫ్రాన్స్ రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ సంస్థకు పన్ను మినహాయింపులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ఫ్రాన్స్ ప్రకటించింది. రిలయన్స్ అనుబంధ సంస్థ నిబంధనల మేరకు ఫ్రెంచ్ అధికారులతో సెటిల్మెంట్ చేసుకుందని తెలిపింది. ఈ ప్రక్రియ చట్టబద్ధంగా ఫ్రాన్స్ నియంత్రణ సంస్థ పర్యవేక్షణలో సాగిందని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీలోని ఫ్రాన్స్ ఎంబసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. చట్టాలకు లోబడే.. ఈ వివాదంపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రతినిధి స్పందిస్తూ.. ‘ఫ్రాన్స్ అధికారులు రూ.1,178 కోట్లు చెల్లించాలని మమ్మల్ని కోరడం పూర్తిగా చట్టవ్యతిరేకం. గడచిపోయిన పదేళ్ల కాలానికి గానూ ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరారు. కానీ అప్పటికే రిలయన్స్ అట్లాంటిక్ సంస్థ రూ.20 కోట్ల నష్టాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ చట్టాలకు లోబడి రూ.56.95 కోట్లు (7.3 మిలియన్ యూరోలు) చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నాం’ అని తెలిపారు. మరోవైపు ఈ పన్ను మినహాయింపునకు, రఫేల్ ఒప్పందాన్ని ముడిపెట్టి ఊహాజనిత కథనాలు రాయడం దురదృష్టకరమని భారత రక్షణశాఖ విమర్శించింది. రఫెల్ ఒప్పందానికి, రిలయన్స్ పన్ను సెటిల్మెంట్కు సంబంధం లేదంది. -
లీకైన పత్రాలు చెల్లుతాయి
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు మార్గం సుగమమైంది. పిటిషన్‌దార్లు సమర్పించిన లీకేజీ పత్రాల ఆధారంగా విచారణ జరుపుతామని కోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఆ పత్రాలపై విశిష్ట అధికారం ప్రభుత్వానిదే అని, అక్రమంగా సేకరించిన సమాచారంతో వేసిన పిటిషన్ల విచారణార్హతపై కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం అంతా సవ్యంగానే ఉందని గత డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌దార్లు దాఖలుచేసిన పత్రాల యోగ్యత ఆధారంగా రివ్యూ పిటిషన్లను విచారిస్తామని కోర్టు తెలిపింది. ఈ పిటిషన్ల విచారణకు ప్రత్యేక తేదీని ప్రకటిస్తామంది. ఈసారి విచారణలో రఫేల్ విమానాల ధరల నిర్ధారణతో పాటు భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామి ఎంపికపై దృష్టిసారిస్తామంది. తన తరఫున, జస్టిస్ కౌల్ తరపున జస్టిస్ గొగోయ్ తీర్పును రాయగా, వేరుగా తీర్పు వెలువరించిన జస్టిస్ జోసెఫ్ మిగిలిన ఇద్దరు సభ్యులతో ఏకీభవించారు. ‘హిందూ’ ప్రచురణ స్వేచ్ఛా హక్కే రఫేల్ ఒప్పందం వివరాలు ‘ది హిందూ’ పత్రికలో ప్రచురితం కావడం భావప్రకటనా స్వేచ్ఛలో భాగమేనని కోర్టు తెలిపింది. గతంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు తమకు గుర్తొచ్చాయని పేర్కొంది. పెంటగాన్ పత్రాల ప్రచురణకు సంబంధించి ‘న్యూయార్క్ టైమ్స్ వర్సెస్ యునెటెడ్ స్టేట్స్’ కేసులో పత్రికలపై ప్రభుత్వ నియంత్రణను అమెరికా కోర్టు గుర్తించలేదని తెలిపింది. ఇదే కేసు రఫేల్కూ వర్తిస్తుందని జస్టిస్ గొగోయ్, జస్టిస్ కౌల్ తమ తీర్పులో పేర్కొన్నారు. రహస్య పత్రాల ప్రచురణను నిలిపేసేలా ప్రభుత్వ విభాగాలకు విశేషాధికారులు కట్టబెడుతూ అధికారిక రహస్యాల చట్టంలో నిబంధనలు ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని తెలిపారు. జాతీయ భద్రతను సాకుగా చూపుతూ కేంద్రం ఆర్టీఐ కింద ఇవ్వాల్సిన సమాచారాన్ని దాచిపెట్టకూడదని జస్టిస్ జోసెఫ్ అన్నారు. ‘ అడిగినంత మాత్రాన సమాచారం వెల్లడించకూడదనడంలో సందేహం లేదు. కానీ ఆ సమాచారాన్ని వెల్లడించడం కన్నా దాచితే ఎక్కువ నష్టం అని దరఖాస్తుదారుడు నిరూపించాలి. దేశ భద్రతతో ముడిపడిన సమాచారాన్ని అడిగే హక్కును ఆర్టీఐ పౌరుడికి కట్టబెట్టింది. ఆæ సమాచారం ప్రజా ప్రయోజనం కోసమే ఉద్దేశించినదవ్వాలి’ అని ఆయన అన్నారు. బహిరంగ చర్చకు సిద్ధమా?: రాహుల్ రఫేల్ ఒప్పందం, నోట్లరద్దు అంశాలపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ‘రఫేల్ ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టు తనకు క్లీన్చిట్ ఇచ్చినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మోదీ అన్నారు. కానీ, చౌకీదార్‌జీ అవినీతికి పాల్పడినట్లుగా సుప్రీంకోర్టు తాజాగా పేర్కొంది. వైమానిక దళం డబ్బును చౌకీదార్‌జీ(మోదీ) పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి అప్పగించారనే విషయాన్ని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నా. దీనిపై కోర్టు దర్యాప్తు చేయబోతోంది. మోదీ, అంబానీ పేర్లు బయటకు రానున్నాయి’ అని అన్నారు. ‘సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో మిమ్మల్ని సవాల్ చేస్తున్నా.. బహిరంగ చర్చకు రండి. అవినీతి, నోట్లరద్దు, రఫేల్ ఒప్పందం, బీజేపీ చీఫ్ అమిత్ షా తనయుడు జై షా అవినీతి తదితర అంశాలపై దేశ ప్రజలు మీ నుంచి నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని అన్నారు. ఎవరేమన్నారంటే.. ► నిజాలపై మూత ఎగిరిపోయింది: కాంగ్రెస్ మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరకు నిజం బయటకు వస్తుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లూ నిజాలు దాచేందుకు మోదీ పెట్టిన మూత కొట్టుకుపోయిందని ఎద్దేవా చేసింది. ‘రఫేల్ అవినీతిన బయటపెట్టిన పాత్రికేయులపై అధికారిక రహస్యాల చట్టాన్ని ప్రయోగించాలని మోదీ ప్రభుత్వం భావించింది’ అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ► దేశభద్రతపై కేంద్రం రాజీ పడిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరీ ఆరోపించారు. ► సుప్రీం తీర్పును పిటిషనర్లలో ఒకరైన అరుణ్ శౌరీ స్వాగతించారు. ► అసమగ్ర సమాచారం: రక్షణ శాఖ జాతీయ భద్రతపై జరిగిన చర్చలకు సంబంధించి అసంపూర్ణ సమాచారం ఇవ్వడమే పిటిషన్‌దారుల ఉద్దేశమని రక్షణ శాఖ పేర్కొంది. ‘గోప్యంగా ఉంచాల్సిన సున్నిత సమాచారం ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఆందోళనకరం’ అని సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రక్షణ శాఖ ప్రకటన జారీ చేసింది. ► రాహుల్‌ది కోర్టు ధిక్కారం: బీజేపీ కోర్టు తన తీర్పులో చెప్పని మాటలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యున్నత న్యాయస్థానానికి ఆపాదించి తీవ్ర కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ దొంగతనానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసిందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రాహుల్ సుప్రీం తీర్పులోని సగం పేరాను కూడా చదవలేదని, కోర్టు చెప్పని మాటలు చెప్పినట్లు వ్యాఖ్యానించి తన నైరాశ్యాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. ఎప్పుడేం జరిగింది ⇒ 2007, ఆగస్టు 28: 126 మీడియం మల్టీరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల (ఎంఎంసీఏ) కొనుగోలుకు ప్రకటన జారీ ⇒ 2011 మే: రఫేల్, యూరో ఫైటర్ జెట్ విమానాలతో తుది జాబితా తయారీ ⇒ 2012, జూన్ 30: తక్కువ మొత్తానికి బిడ్ దాఖలుచేసిన ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ ⇒ 2014, మార్చి 13: 108 విమానాల కోసం 70, 30 శాతం చొప్పున పని చేయడానికి హాల్, డసాల్ట్ మధ్య కుదిరిన ఒప్పందం ⇒ 2015, ఏప్రిల్: ఫ్రాన్స్ నుంచి ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 విమానాల కొనుగోలుకు కొత్త ఒప్పందం ఖరారు ⇒ సెప్టెంబర్ 23: ఇరు దేశాల మధ్య అంతర ప్రభుత్వ ఒప్పందంపై సంతకాలు ⇒ నవంబర్ 18: ఒక్కో విమానం ఖర్చు రూ.670 కోట్లు అని ప్రకటించిన ప్రభుత్వం ⇒ 2016, డిసెంబర్ 31: 36 విమానాల ఖర్చు రూ.60 వేల కోట్లని డసాల్ట్ నివేదికలో వెల్లడి. ఈ మొత్తం ప్రభుత్వం ప్రకటించిన మొత్తంపై రెట్టింపు కన్నా అధికం ⇒ 2018 మార్చి 13: రఫేల్ కొనుగోలుపై సుప్రీంలో పిటిషన్ ⇒ అక్టోబర్ 10: రఫేల్ కొనుగోలుకు నిర్ణయాలు తీసుకున్న విధానంపై వివరాలు సీల్డ్ కవర్లో సమర్పించాలన్న సుప్రీంకోర్టు ⇒ డిసెంబర్ 14: ప్రభుత్వ నిర్ణయాల్లో సంశయించాల్సిందేం లేదని తీర్పు ⇒ 2019, జనవరి 2: ఈ తీర్పును సమీక్షించాలని సుప్రీంలో పిటిషన్లు దాఖలు ⇒ మార్చి 6: రఫేల్ పత్రాలు చోరీకి గురయ్యాయని కోర్టుకు తెలిపిన కేంద్రం ⇒ మార్చి 13: లీకేజీ పత్రాలతో విచారణ వద్దని కోర్టుకు విన్నవించిన కేంద్రం ⇒ ఏప్రిల్ 10: లీకేజీ పత్రాలను విచారణలో పరిగణనలోకి తీసుకుంటామన్న సుప్రీం నేపథ్యమిదీ.. రివ్యూ పిటిషన్ల దాఖలుపై కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించిన కోర్టు మార్చి 14న తన తీర్పును రిజర్వులో ఉంచింది. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన కీలక సమాచారం మీడియాలో ప్రచురితం కావడం అప్పట్లో కలకలం రేపింది. ప్రధాని కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరపడంపై రక్షణ శాఖ అయిష్టత వ్యక్తం చేసినట్లు ‘ది హిందూ’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు, సమాచారంపై కేంద్రానికే పూర్తి హక్కులుంటాయని, సంబంధిత విభాగం అనుమతి లేనిదే వాటిని కోర్టుకు సమర్పించరాదని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. -
అందర్నీ కాపలాదారులుగా మారుస్తున్నారు
సాక్షి, బళ్లారి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మై భీ చౌకీదార్ (నేనూ కాపలాదారుడినే)’ ప్రచారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేస్తూ, రఫేల్ కుంభకోణంలో దొరికిపోయాక మోదీ దేశ ప్రజలందరినీ కాపలాదారులుగా మారుస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ మొదలుకుని బీజేపీ నేతలు, కార్యకర్తలంతా తమ సామాజిక మాధ్యమ ఖాతాల పేర్లకు ముందు ‘చౌకీదార్’ పదాన్ని చేర్చుకుంటుండటం తెలిసిందే. కర్ణాటకలోని కలబుర్గి (గుల్బర్గా)లో సోమవారం రాహుల్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘రఫేల్ కుంభకోణంలో దొరకక ముందు ఆయన మాత్రమే కాపలాదారుడు. ఆయన పట్టుబడ్డాక దేశం మొత్తాన్ని కాపలాదారులుగా మారుస్తున్నారు. దేశం మొత్తానికీ తెలుసు కాపలాదారుడే దొంగని’ అంటూ మోదీపై విరుచుకుపడ్డారు. బెంగళూరులో కొందరు వ్యాపారవేత్తలతోనూ రాహుల్ మాట్లాడారు. రఫేల్ ఒప్పందంపై ఫ్రాన్స్ ప్రభుత్వంతో మోదీ కార్యాలయం జరిపిన సమాంతర చర్చలకు సంబంధించిన పత్రాలపై కూడా విచారణ జరిపితే మోదీ, అనిల్ అంబానీ జైలుకెళ్తారని రాహుల్ పేర్కొన్నారు. మీడియాను కూడా మోదీ తన గుప్పిట పెట్టుకుని ఆయనకు వ్యతిరేక వార్తలు రాకుండా ఒత్తిడి తెస్తున్నట్లు తన పాత్రికేయ మిత్రులు చెబుతున్నారని రాహుల్ ఆరోపించారు. -
ముందుగా కేంద్ర అభ్యంతరాల పరిశీలన
న్యూఢిల్లీ: రఫేల్ కేసు విషయంలో కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను తాము ముందుగా పరిశీలిస్తామనీ, ఆ తర్వాత రఫేల్ ఒప్పందంపై పునఃసమీక్ష కోసం వచ్చిన పిటిషన్లలోని అంశాలపై విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. అక్రమంగా పొందిన కొన్ని ప్రత్యేక పత్రాల్లోని సమాచారం ఆధారంగా రఫేల్ కేసుపై పునఃసమీక్ష చేయాలంటూ పిటిషనర్లు కోరజాలరంటూ కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం వాదనలు వినడాన్ని ముగించింది. ముందుగా తాము కేంద్రం అభ్యంతరాలను పరిశీలిస్తామనీ, అవి సరైన అభ్యంతరాలు అయితే తాము రఫేల్ ఒప్పందంపై పునఃసమీక్ష జరపబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ కేంద్రం అభ్యంతరాలు అనవసరమైనవని అనిపిస్తేనే పునఃసమీక్ష పిటిషన్లపై విచారణ జరుపుతామంది. దీంతో ఈ అంశంపై తీర్పు ఎప్పుడు వస్తుందో భవిష్యత్తులోనే తెలియనుంది. విచారణ ప్రారంభంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదిస్తూ రఫేల్ ఒప్పంద పత్రాలు ప్రత్యేకమైనవనీ, వాటిని సంబంధిత విభాగం అనుమతి లేకుండా ఎవరూ సుప్రీంకోర్టుకు సమర్పించకూడదని అన్నారు. అయితే ఆ పత్రాలు ఇప్పటికే ప్రజల్లోకి వచ్చేశాయనీ, ఇప్పుడు అవి ప్రత్యేకమైనవి కావని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. కేంద్రం అభ్యంతరాలు దురుద్దేశంతో కూడుకున్నవనీ, అవి కోర్టులో నిలువవని ఆయన అన్నారు. అలాగే భారత ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం తమకు సమాచారాన్ని ఎవరిచ్చారో విలేకరులు చెప్పాల్సిన అసవరం లేదనీ, సమాచార వనరులకు ఇది రక్షణ కల్పిస్తుందన్నారు. -
దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. లీకైన రహస్య సమాచారం ఆధారంగానే పిటిషన్‌దారులు కోర్టును ఆశ్రయించారని తెలిపింది. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అంతా సక్రమంగానే ఉందని గతంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునివ్వగా, దానిని సమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రక్షణశాఖ అఫిడవిట్ దాఖలుచేసింది. రఫేల్ పత్రాలు బహిర్గతం కావడం దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టిందని రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పేపర్లను నకళ్లు తీసినవారు దొంగతనానికి పాల్పడ్డారని ఆరోపించింది. బలగాల పోరాట సామర్థ్యానికి సంబంధించిన ఈ సమాచారం విస్తృతంగా వ్యాపించి శత్రువుకు కూడా అందుబాటులోకి వచ్చిందని రక్షణ శాఖ ఆక్షేపించింది. ఈ వ్యవహారంలో అంతర్గత విచారణ ప్రారంభమైందని, లీకేజీ ఎక్కడ జరిగిందో కనుక్కోవడంపై ప్రధానంగా దృష్టిపెట్టామని కోర్టుకు తెలిపింది. ఈ అఫిడవిట్ గురువారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. వారంతా ఐపీసీ కింద దోషులే రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురైన పత్రాల ఆధారంగానే రివ్యూ పిటిషన్లు వేశారని మార్చి 6నే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మళ్లీ రెండు రోజుల తరువాత మాటమారుస్తూ..పత్రాలు తస్కరణకు గురి కాలేదని, వాటి నకళ్లనే పిటిషన్‌దారులు ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం రఫేల్ గోప్యతను కాపాడుతున్నా..సిన్హా, శౌరి, భూషణ్‌లు సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేసి ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అందులో పేర్కొంది. ఈ కుట్రలో పాలుపంచుకుని అనధికారికంగా ఆ పత్రాలను నకళ్లు తీసిన వారు ఐపీసీ చట్టం ప్రకారం దోషులేనని తెలిపింది. ఈ వ్యవహారంలో లీకేజీ ఎక్కడ జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వ కీలక నిర్ణయాల గోప్యతను కాపాడతామని చెప్పింది. అనధికారికంగా, అక్రమంగా సేకరించి సమర్పించిన పత్రాలను కోర్టు రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది. రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిదే ఆ సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేయరాదని గుర్తు చేసింది. -
దొంగిలించలేదు.. జిరాక్స్ తీశారంతే!
న్యూఢిల్లీ: భారత రక్షణశాఖ కార్యాలయం నుంచి రఫేల్ ఒప్పంద పత్రాలు దొంగతనానికి గురయ్యాయని చెప్పిన అటార్నీ జనరల్ వేణుగోపాల్ మాటమార్చారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాల ఫొటోకాపీలను మాత్రమే తీసుకెళ్లారని, నిజమైన పత్రాలు రక్షణశాఖ ఆఫీసులోనే ఉన్నాయని చెప్పారు. ‘రక్షణశాఖ నుంచి రఫేల్ ఒప్పంద పత్రాలు అదృశ్యమయ్యాయని నేను సుప్రీంకోర్టుకు చెప్పినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని తెలిసింది. ఇది ఎంత మాత్రం నిజం కాదు. యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్ దాఖలుచేసిన పిటిషన్‌కు రఫేల్ ఒప్పంద పత్రాల ఫొటోకాపీలను జతచేశారు’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ..‘మోదీ ప్రభుత్వపు ఏజీకి రఫేల్ పత్రాల దొంగతనం, ఫొటోకాపీలకు మధ్య వ్యత్యాసం తెలియదు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందని ఆ ప్రభుత్వమే ప్రజలకు హామీ ఇస్తోంది. మోదీజీ ఈ మోసం ఏంటి? ఇప్పటివరకూ అనితరసాధ్యమైన అబద్ధాలన్నీ ఇప్పుడు సుసాధ్యంగా కనిపిస్తున్నాయి’ అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, అబద్ధాలు పర్యాయపదాలని బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పటేల్ విగ్రహం చైనాలో రూపొందించారంటూ రాహుల్ అబద్ధం చెప్పారన్నారు. -
పరీకర్ నుంచే మొదలెట్టండి
జైపూర్(ఒడిశా): రఫేల్ ఒప్పంద పత్రాల మాయంపై విచారణ గోవా సీఎం మనోహర్ పరీకర్ నుంచే ప్రారంభం కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. శుక్రవారం పణజిలో జరిగిన పార్టీ బూత్ కార్యకర్తల సమావేశంలో రాహుల్∙మాట్లాడారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం ఉనికిలో లేకుండా పోయినట్టే రఫేల్ పత్రాలు కూడా మాయమయ్యానని ఎద్దేవా చేశారు. ‘ఆ పత్రాలు తన వద్దే ఉన్నాయంటూ గతంలో పరీకరే చెప్పారు. అందుకే వాటి కోసం సాగే దర్యాప్తు పరికర్ నుంచే ప్రారంభం కావాలి’ అని రాహుల్ అన్నారు. కాగా, పరీకర్ రక్షణ మంత్రిగా ఉన్నపుడే ప్రభుత్వం రఫేల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతోపాటు ఈ ఒప్పంద పత్రాలు కొన్ని కనిపించడం లేదంటూ ఇటీవల కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ‘రఫేల్’ డీల్ ద్వారా అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారుల స్థాయి చర్చలను పట్టించుకోకుండానే ఒప్పందం సిద్ధం చేశారని రాహుల్ ఆరోపించారు. కొరాపుట్ జిల్లా జైపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసి, రూ.30వేల కోట్ల మేర అంబానీకి లాభం చేకూర్చేందుకు మోదీ కాంట్రాక్టు సిద్ధం చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చిందన్నారు. బీజేపీకి దోచిపెడుతున్నారు: మమత కోల్‌కతా: ప్రభుత్వ ధనాన్ని ప్రధాని మోదీ బీజేపీకి దోచి పెడుతున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రఫేల్ ఒప్పంద పత్రాలనే పరిరక్షించలేని ఈ ప్రభుత్వం దేశాన్ని ఎలా కాపాడగలుగుతుందని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఆమె శుక్రవారం కోల్‌కతాలో ప్రారంభించారు. ‘ఇంతకుముందు బీజేపీ వాళ్లకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. రఫేల్ డీల్, నోట్ల రద్దు ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు బైక్‌లు కొంటున్నారు’ అంటూ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో కశ్మీర్లో హింసాత్మక ఘటనలు 210 శాతం పెరిగాయంటూ ఆమె.. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే అక్కడ ప్రశాంతత ఏర్పడుతుందని చెప్పారు. -
‘రఫేల్’ ఫైళ్లను ఎవరు దొంగిలించారు?
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద ‘రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం’కు సంబంధించిన ఫైళ్లు ఎవరు ఎత్తుకు పోయి ఉండవచ్చనే విషయమై సోషల్ మీడియాలో వ్యంగ్యోక్తులు వెల్లువెత్తుతున్నాయి. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ సరిగ్గా అర్ధరాత్రి తన రక్షణ శాఖా కార్యాలయం నుంచి రఫేల్ ఫైళ్లు తీసుకెళ్లడం అక్కడి సీసీటీవీ కెమేరాల్లో చిక్కిందంటూ ఒకరు, రోజుకు 23 గంటలపాటు పనిచేసి, చేసి అలసిపోయిన ప్రధాని నరేంద్ర మోదీ పది సెకండ్లపాటు కునుకుతీయగానే రఫేల్ ఫైళ్లను నెహ్రూ తస్కరించారని మరొకరు, ఫైళ్ల తస్కరణకు నెహ్రూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ మరొకరు సంబంధిత ఫొటోలతో ట్వీట్లపై ట్వీట్లు చేశారు. (రఫేల్ పత్రాలు చోరీ) నేటి భారత దేశంలోని పరిస్థితులకు, ప్రతి సమస్యకు నాటి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం కారణమంటూ ఇటు ప్రధాని మోదీ అటు ఆరెస్సెస్ నాయకులు నిందిస్తుండడం వల్లన నెటిజెన్లు ఈ తీరుగా స్పందించి ఉండవచ్చు. నేటి కశ్మీర్ కల్లోలానికి నెహ్రూయే కారణమని, తొలి ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే పరిస్థితి వేరుగా ఉండేదని, అసలు ఆయన ప్రధాన మంత్రి కాకుండా అడ్డుకున్నదే నెహ్రూ అని, నాడు భారత్, పాకిస్థాన్‌లుగా దేశం రెండుగా చీలిపోవడంలో నెహ్రూ ప్రధాన పాత్ర వహించారని నరేంద్ర మోదీ పదే పదే విమర్శించడం తెల్సిందే. ఆరెస్సెస్ అయితే మరో మెట్టు ముందుకు వెళ్లి ‘జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు బాధ్యుడు నాథూరామ్ గాడ్సే కాదు. జవహర్ లాల్ నెహ్రూ బాధ్యుడు’ అని 2005లో అప్పటి చీఫ్ కేఎస్ సుదర్శన్ ఆరోపించారు. (ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు కూడా అదే అన్నారు) -
‘రఫేల్’ ఒప్పందంపై ‘ఫేక్’ వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునర్ సమీక్షించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను.. పరిగణనలోకి తీసుకోకూడదంటూ ప్రభుత్వ అటార్నీ జనరల్ కేకే వేణు గోపాల్ బుధవారం కోర్టు ముందు చేసిన వాదన చిత్రంగా ఉంది. ‘రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పత్రాలను రక్షణ శాఖ నుంచి ఎవరో తస్కరించారు. అందులోని అంశాలను హిందూ ఆంగ్ల దిన పత్రిక ప్రచురిస్తే వాటిని ఆధారంగా చేసుకొని ప్రశాంత భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమంగా సాధించిన డాక్యుమెంట్లను ఆధారం చేసుకున్నందున ఆ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోకూడదు. పైగా ఆ డాక్యుమెంట్లలోని అంశాలను హిందూ పత్రిక ప్రచురించడం అనేది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది. ఆ మేరకు ఆ పత్రికపై చర్య తీసుకోవచ్చు’ అన్నది అటార్నీ జనరల్ చేసిన వాదన. పిటిషన్లో సవాల్ చేసిన లేదా లేవనెత్తిన అంశాల్లో బలం ఉందా, లేదా ? అవి తప్పా, ఒప్పా ? అని వాదించాల్సిన అటార్నీ జనరల్, అవి దొంగలించినవి, అవి అక్రమంగా సంపాదించినవి అనడం చిత్రమే కాదు, అవివేకం కూడా. రఫేల్ పత్రాలను దొంగలించారంటే, ఆ లెక్కన ప్రశాంత్ భూషణ్ పిటిషన్లో ప్రస్తావించిన అంశాలన్నీ నిజమని తేలినట్లే. పత్రిక మీద అధికార రహస్యాల చట్టం కింద చర్య తీసుకోమని సూచించడం అంటే కేంద్రానికి మద్దతుగా ఏదో దాస్తున్నట్లే లెక్క! మరో పక్క ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే.(రఫేల్ పత్రాలు చోరీ) 1923 నాటి చట్టం ఏమి చెబుతోంది? భారత దేశానికి స్వాతంత్య్ర రాకముందు బ్రిటీష్ హయాంలో అంటే, 1923లో అధికార రహస్యాల చట్టం అమల్లోకి వచ్చింది. జాతీయ భద్రతా లేదా జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు నాటి నుంచి నేటి వరకు పాలకులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఇరుకున పడినప్పుడల్లా ఈ చట్టాన్ని ఆశ్రయించడం పరిపాటిగా మారిపోయింది. పైగా 2005లో తీసుకొచ్చిన సమాచార హక్కుకు ఈ అధికార రహస్యాల చట్టం పూర్తి భిన్నంగా ఉంది. ఈ చట్టాన్ని సమీక్షించాల్సిందిగా ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వమే 2015లో చట్టం సమీక్షకు ఓ ప్యానెల్‌ను నియమించింది. ఆ ప్యానెల్ సమీక్ష ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఇంకెంత కాలం పడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో రెండు చట్టాలు పరస్పరం భిన్నంగా ఉన్నందున ప్రభుత్వ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. గతంలో కేసులు భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని మిలిటెంట్లకు అందజేశారన్న ఆరోపణలపై ఓ కశ్మీర్ జర్నలిస్ట్‌పై అధికార రహస్యాల చట్టం కింద 2006లో కేసు పెట్టారు. దర్యాప్తు సందర్భంగా ఆ సమాచారం ఎంత మాత్రం రహస్యమైనది కాదని, అది ప్రజలందరికి అందుబాటులో ఉన్న సమాచారమేనని తేలింది. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన కేబినెట్ నోట్‌ను బయట పెట్టినందుకు 1998లో కూడా ఓ జర్నలిస్టుపై ఈ చట్టం కింద కేసు పెట్టి వేధించారు. అమెరికా సుప్రీం కోర్టు ఏమి తీర్పు ఇచ్చింది ? ‘వియత్నాంతో ఎన్నేళ్లు యుద్ధం చేసినా విజయం సాధించడం కష్టం. రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధం చేయక తప్పడం లేదు. వేలాది మంది యువకుల ప్రాణాలు వృథా అవుతున్నాయి. ప్రాణ నష్టంతోపాటు ఎంతో అర్థిక నష్టం జరుగుతోంది’ అన్న కీలక సమాచారం కలిగిన ప్రభుత్వ రహస్య డాక్యుమెంట్లు అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కాలంలో అమెరికాలోని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికకు దొరికాయి. వాటిని ప్రచురించాలా, వద్దా ? అని అప్పటి ఎడిటర్ ఇన్ చీఫ్ బెన్ బ్రాడ్లీ సంశయించారు. చివరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రచురించాలని నిర్ణయించుకొని వరుసగా ప్రచురించారు. అందులో ఓ భాగాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కూడా ప్రచురించింది. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆ రెండు పత్రికలపైనా అమెరికా ప్రభుత్వం ‘యూఎస్ ఎస్పనేజ్ యాక్ట్’ కింద కేసులు పెట్టింది. పత్రికా స్వేచ్ఛ ప్రకారం ఆ డాక్యుమెంట్లను ప్రచురించడంలో తప్పు లేదంటూ తొమ్మిది మంది సభ్యులు గల అమెరికా జ్యూరీ 6-3 తేడాతో మెజారిటీ తీర్పు చెప్పింది. ‘ది పోస్ట్’ పేరిట సినిమా పత్రికల న్యాయపోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని హాలివుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత స్టీవెన్ స్పీల్బెర్గ్ ‘ది పోస్ట్’ చిత్రాన్ని నిర్మించారు. 2017లో విడుదలైన ఈ చిత్రంలో పత్రికా సంపాదకుడిగా టామ్ హాంక్స్ నటించారు. పలు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అందుకున్న ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయినా అవార్డులు మాత్రం రాలేదు. -
రఫేల్ పత్రాలు చోరీ
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ దగ్గరి నుంచి దొంగతనానికి గురయ్యాయని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆ చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగానే ‘ద హిందూ’ పత్రిక రఫేల్‌పై కథనాలు రాసి అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి పాల్పడిందని అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. రఫేల్ వ్యవహారం మొత్తం రక్షణ పరికరాలను సమకూర్చుకోవడానికి సంబంధించినది కాబట్టి అసలు ఈ కేసుపై న్యాయసమీక్ష జరపడమే సాధ్యం కాదని ఏజీ అన్నారు. రఫేల్ ఒప్పందంపై వచ్చిన ప్రజాహిత వ్యాజ్యా(పిల్)లను గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తిరస్కరించడం తెలిసిందే. ఆ సమయంలో కేంద్రం కొన్ని కీలక వాస్తవాలను దాచిపెట్టిందనీ, ఇప్పుడు ద హిందూ పత్రిక కథనాలతో అవన్నీ వెలుగులోకి వచ్చినందున పిల్లను విచారణకు స్వీకరించడంపై పునరాలోచించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు సంయుక్తంగా పిటిషన్ వేశారు. ఆ వాస్తవాలు అప్పుడే బయటకొచ్చి ఉంటే సుప్రీంకోర్టు ఆ పిల్లను కొట్టివేసేది కాదని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ఏజీ తన వాదన వినిపిస్తూ ‘రఫేల్ పత్రాల దొంగతనం కేసులో విచారణ జరుగుతోంది. ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. రఫేల్ ఒప్పందం వివరాలు రహస్యమైనవి. వాటిని ప్రజా బాహుళ్యంలో పెట్టడం ద్వారా అధికారిక రహ్యసాల చట్టాన్ని ఉల్లంఘించడం, కోర్టు ధిక్కార నేరాలకు పాల్పడినట్లైంది. రహస్యం అన్న పదాన్ని తొలగించి వారు కథనాలు ప్రచురించారు’ అని తెలిపారు. కోర్టు విచారణను ప్రభావితం చేయడమే లక్ష్యంగా వార్తా కథనాలు వచ్చాయన్నారు. గత నెల 8 నుంచి ఇప్పటివరకు ద హిందూ పత్రిక రఫేల్‌పై పలు సంచలన కథనాలను ప్రచురించడం తెలిసిందే. ఈ వాదనలు జరిగిన బుధవారమే తాజాగా మరో కథనం వెలువడింది. అవినీతి జరిగితే చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా? ఏజీ వాదనలపై న్యాయమూర్తులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగా కథనాలు వచ్చాయని ఏజీ వెల్లడించడంతో ‘ఆ విషయం ఇప్పుడెందుకు చెబుతున్నారు? ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇన్ని రోజుల్లో ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పండి.’ అని జడ్జీలు ప్రశ్నించారు. ‘రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగి ఉంటే, దానిని కప్పిపుచ్చుకోడానికి అధికారిక రహస్యాల చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా? అవినీతి జరిగిందని నేననడం లేదు. కానీ ఒకవేళ జరిగి ఉంటే, ప్రభుత్వం చట్టాన్ని తమకు రక్షణగా ఉపయోగించుకోజాలదు’ అని జస్టిస్ గొగోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 14న కొనసాగించనుంది. ఆ సమాచారం ఎక్కడిదో చెప్పం: ఎన్.రామ్ న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై కీలక సమాచారాన్ని తమకు అందించిన వర్గాల వివరాల్ని బహిర్గతం చేయలేమని ది హిందూ దినపత్రిక చైర్మన్ ఎన్.రామ్ తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19(1)కు లోబడే రఫేల్ వివరాల్ని ప్రచురించామని సమర్థించుకున్నారు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వివరాల్ని గోప్యంగా నిలిపి ఉంచే ప్రయత్నం జరిగిందని, అందుకే వాటిని బహిర్గతం చేశామని తెలిపారు. రఫేల్ పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో రామ్ స్పందించారు. రఫేల్ ఒప్పందంపై ఆయన పలు కథనాలు రాశారు. అందులో బుధవారం కూడా ఒకటి ప్రచురితమైంది. ‘ రఫేల్ ఒప్పంద పత్రాలు తస్కరణకు గురయ్యాయని భావిస్తే మాకేం సంబంధం లేదు. మాకు ఆ సమాచారం కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి అందింది. మా వనరులను కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నాం. వారి గురించి మా నుంచి ఎవరూ సమాచారం పొందలేరు. మేము ప్రచురించిన పత్రాలు యధార్థమైనవి. ప్రజా ప్రయోజనాల రీత్యానే వాటిని వెలుగులోకి తెచ్చాం. ముఖ్యమైన అంశాలపై సంబంధిత సమాచారాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకురావడం పాత్రికేయుల విధి’ అని రామ్ అన్నారు. -
రఫేల్ డీల్: సుప్రీంకోర్టులో బాంబు పేల్చిన కేంద్రం
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. రఫేల్ డీల్‌కు సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయని, వీటిని ప్రభుత్వ ఉద్యోగులే దొంగలించి ఉంటారని పేర్కొంది. రఫేల్ యుద్ధ విమానాలను ఎంతకు కొనుగోలు చేశారు? వాటి ధర ఎంత? అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో రఫేల్ ధరలకు సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వశాఖ నుంచి దొంగలించబడ్డాయని, ప్రచురణ కోసం ఈ పత్రాలను ‘ది హిందూ’ న్యూస్‌పేపర్‌కు అందించారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. రఫేల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్లో.. దొంగలించిన పత్రాల నుంచి సేకరించిన విషయాలు ఉన్నాయని, కాబట్టి ఆయన పిటిషన్ కొట్టివేయాలని వేణుగోపాల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. పత్రాలు దొంగలించిన వారు.. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు దోషులుగా మారుతారని ఆయన తెలిపారు. అయితే, ఈ విషయంలో చట్టపరమైన ఉల్లంఘనలేమీ లేవని, ఈ పత్రాల్లోని సమాచారం సమాచార హక్కు చట్టం పరిధిలోనేదేనని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు స్పష్టం చేశారు. ఫ్రెంచ్ నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన రఫేల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే. -
రఫెల్ డీల్ తీర్పుపై సుప్రీంకోర్టు సమీక్ష
న్యూఢిల్లీ: రఫెల్ డీల్‌పై తీర్పును రివ్యూ చేసేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. రఫెల్ ఒప్పందంపై గతేడాది డిసెంబర్ 14న తీర్పును వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహరంలో కేంద్రం తీరును సమర్ధించిన సంగతి తెలిసిందే. ఇందులో భారీ అవకతవకలు జరిగనట్టు కనిపించడం లేదని అభిప్రాయపడ్డ న్యాయస్థానం.. చిన్న పొరపాట్లకు ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన పనిలేదని పేర్కొంది. వివాదస్పద రఫెల్ డీల్‌కు సంబంధించి సుప్రీం తీర్పుపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పెద్దలు సరైన సమాచారం ఇవ్వకుండా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, వీటిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును రివ్యూ చేసేందుకు అంగీకారం తెలిపారు. రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని.. ఇందుకోసం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రఫెల్ డీల్‌పై డిసెంబర్లో సుప్రీం ఇచ్చిన తీర్పు: రఫేల్ ఒప్పందం సక్రమమే -
‘రఫేల్’లో ఏ కుంభకోణం లేదు
బెంగళూరు: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కుంభకోణం, అవినీతి ఏదీ లేదని ఆ విమానాల తయారీ కంపెనీ డసో ఏవియేషన్ సీఈవో పేర్కొన్నారు. భారత వాయుసేనకు మరో 110 విమానాలను సమకూర్చే ఒప్పందాన్ని దక్కించుకునేందుకు కూడా తాము రేసులో ఉన్నామని ఆయన బుధవారం చెప్పారు. ఫ్రాన్స్‌కు చెందిన సంస్థ అయిన డసో ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రేపియర్ బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ‘రఫేల్ ఒప్పందంలో కుంభకోణమేదీ లేదు. 36 రఫేల్ విమానాలను మేం సరఫరా చేయబోతున్నాం. భారత ప్రభుత్వానికి మరిన్ని విమానాలు కావాలంటే వాటిని కూడా అందించేందుకు మేం సంతోషంగా అంగీకరిస్తాం’ అని ఆయన తెలిపారు. 110 విమానాల కొనుగోలుకు సంబంధించి భారత వాయుసేన 2018 ఏప్రల్ 6న తొలిదశ టెండర్లను (రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్) ఆహ్వానించగా, ఆ బిడ్డింగ్‌లో డసో ఏవియేషన్ కూడా పాల్గొంటోంది. రక్షణ రంగం లో ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్ ను భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామిగా డసో ఏవియేషన్ ఎందుకు ఎంపిక చేసుకుందని ప్రశ్నించగా ‘వారికి అనుభవం లేదు నిజమే. కానీ మాకుందిగా. మా అనుభవాన్ని, సాంకేతికతను మేం భారత బృందానికి బదిలీ చేస్తు న్నాం. భారత బృందాన్ని మా కొత్త సంయుక్త సంస్థ ఎంపిక చేసింది. వారు భారత్‌కు, మా కొత్త కంపెనీకి ఉపయోగపడతారు. ఇంక సమస్యేముంది?’ అని ట్రేపియర్ అన్నారు. దివాళా తీసేందుకు సిద్ధంగా ఉన్న రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి లాభం చేకూర్చేందుకే డసోకు భాగస్వామిగా రిలయన్స్‌ను ఎంపిక చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రిలయన్స్ గ్రూప్ ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ఆ సంస్థతోనూ ఎందుకు జట్టుకట్టారన్న ప్రశ్నకు ‘అవి వాళ్ల అంతర్గత విషయం.. కానీ మేం కలసి పనిచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు కూడా అదే అన్నారు
అజ్మీర్/ధరంపూర్: ‘రఫేల్’ఒప్పందంపై ప్రధాని మోదీ తీరును కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఎండగట్టారు. అనిల్ అంబానీ కంపెనీకి రఫేల్ కాంట్రాక్టు అప్పగించడంలో ఫ్రాన్సు ప్రభుత్వం పాత్ర ఏమీ లేదన్న మాజీ అధ్యక్షుడు హొలాండే ప్రకటనను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘కాపలాదారే దొంగ’అన్న విషయం ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడికి కూడా తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. గురువారం గుజరాత్ రాష్ట్రం వల్సద్ జిల్లా ధరంపూర్లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీతోపాటు అజ్మీర్‌లో కాంగ్రెస్ సేవా దళ్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ..తన మిత్రుడు అనిల్ అంబానీ కోసం ప్రధాని మోదీ దళారీగా మారి డసో ఏవియేషన్ సంస్థతో సమాంతర చర్చలు జరిపారంటూ రక్షణ శాఖ, వైమానిక దళాధికారులే పేర్కొన్నారన్న రాహుల్.. ‘చౌకీదారే దొంగ’అన్న నినాదం ఫ్రాన్స్‌కు కూడా చేరింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు కూడా ఈ మాట అన్నారు’అని ఎత్తిపొడిచారు. ఈ సందర్భంగా‘చౌకీదార్ చోర్ ఛే(గుజరాతీ)’అంటూ ప్రజలతో నినాదం చేయించారు. ‘ఆయన(మోదీ) 15 మంది పారిశ్రామిక వేత్తల లాభం కోసమే దేశాన్ని పాలిస్తున్నారు’అని విమర్శించారు. పంట రుణాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను పట్టించుకోకుండా 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.3.5 లక్షల కోట్ల అప్పును మాఫీ చేశారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అనిల్ అంబానికి రూ.30 వేల కోట్లు లబ్ధి చేకూర్చినట్లే తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ చేస్తుందని చెప్పారు. బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు లాఠీలు పట్టుకుని సమాజంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. వారు పెంచుతున్న విద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కోవాలని సేవాదళ్ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. ‘భయానికి మరో రూపమే విద్వేషం. భయం అనేది లేకుండా విద్వేషం పుట్టదు. ఇదే ప్రధాని మోదీకి నాకు తేడా. మన(కాంగ్రెస్)కు ద్వేషం లేదు ఎందుకంటే మనలో భయం లేదు. కానీ, వారి(బీజేపీ–ఆర్ఎస్ఎస్)కి ద్వేషం ఉంది. తమకున్న భయాన్ని దాచుకునేందుకే వారంతా విద్వేషాన్ని ప్రదర్శిస్తారు’అని వ్యాఖ్యానించారు. ‘వచ్చే ఎన్నికల్లో వారి(బీజేపీ)ని మనం అంతం చేయం. హత్య చేయం. వారిపై చేయిచేసుకోబోం. కానీ, ఓడిస్తాం. అదీ ప్రేమతోనే’అని అన్నారు. రాహుల్‌కు ముద్దు..! గుజరాత్ రాష్ట్రం ధరంపూర్లో ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ మహిళా విభాగం కార్యకర్తలు రాహుల్‌ను పూలదండలతో సన్మానించారు. ఆ సమయంలో సూరత్‌కు చెందిన కశ్మీరా బెన్(60) అనే మహిళా కార్యకర్త ఆయన్ను ముద్దు పెట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యా రు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘రాహుల్ మా ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు సోదరుని వంటి వారు. రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్నది నా ఆకాంక్ష’అని తెలిపారు. -
కాగ్ నివేదిక
పదవీకాలం పూర్తికావస్తున్న లోక్‌సభ ఆఖరి సమావేశాల్లో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక ప్రభుత్వ వైఖ రికి అనుకూలంగా ఒక వ్యాఖ్య చేయడమైనా... కనీసం అలా చేసిందని ప్రభుత్వం ప్రకటించుకునేందుకు వీలు కల్పించినా అది నెత్తిన పాలుబోయడమే. త్వరలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలు కానున్న తరుణంలో ఆ అదృష్టం ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. 2007లో యూపీఏ ప్రభుత్వం రఫేల్ యుద్ధ విమానాల కోసం ఖరారు చేసుకున్న ధరతో పోలిస్తే రెండేళ్లక్రితం ఎన్డీఏ సర్కారు కుదుర్చుకున్న ఒప్పందంలోని ధర 2.86 శాతం తక్కువని కాగ్ నివేదిక నిర్ధారించింది. నిజానికిది తుది నివేదిక కాదు. కాగ్ పరిశీలించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. అందులో ఆఫ్సెట్ భాగ స్వామి ఎంపిక ఒకటి. ఇలాంటి మరో పది అంశాలకు సంబంధించిన ఆడిటింగ్ జరగాల్సి ఉన్నదని కాగ్ నివేదిక వివరించింది. ఒప్పందంలో వచ్చి చేరిన ఆఫ్సెట్ భాగస్వామికి సంబంధించిన అంశమే ప్రస్తుతం రాజకీయంగా పెనుదుమారం లేపుతోంది. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకే ఎలాంటి అనుభవమూ లేని ఆయన సంస్థను ఆఫ్సెట్ భాగస్వామిగా చేర్చారని విపక్షాలు ఆరోపి స్తున్నాయి. అయితే అది రఫేల్ ఉత్పత్తిదారు డసో స్వీయ నిర్ణయమని ప్రభుత్వం బదులిస్తోంది. అంతటి కీలకమైన అంశంపై కాగ్ తన మనోగతాన్ని వెల్లడించి ఉంటే భిన్నంగా ఉండేది. అలా లేక పోబట్టే తాజా నివేదికపై కాంగ్రెస్ నిప్పులు కక్కితే, బీజేపీ పండగ చేసుకుంటోంది. 2014లో కాంగ్రెస్ స్థితి దీనికి విరుద్ధం. కామన్వెల్త్ క్రీడలతో మొదలెట్టి అన్నిటా ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుకు ప్రతికూలతలే ఎదురయ్యాయి. 2జీ స్కాం, బొగ్గు కుంభకోణం వగైరాలు దేనికవి యూపీఏ సర్కారును ఉతికారేశాయి. ముఖ్యంగా 2జీ స్కాంలో కాగ్ లెక్కలు ఊహాజనిత మైనవని, అందులో కాస్తయినా వాస్తవం లేదని కాంగ్రెస్ నేతలు ఆక్రోశించినా ఫలితం లేకపో యింది. ఆ నివేదికలే ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రాలు అయ్యాయి. వేల కోట్ల రూపాయల వ్యయమయ్యే ఏ భారీ కాంట్రాక్టుపైన అయినా ఆరోపణలు రావడం సహజమే. వాటిల్లో అనేకం కాగ్ నివేదికల్లో నిర్ధారణవుతుంటాయి కూడా. అయితే ఆరోపణలు చేసే వారిలో సత్తా లేకపోతే, దాన్ని బలంగా జనం ముందుకు తీసుకెళ్లలేకపోతే కాగ్ నిర్ధారించినా ఫలితం ఉండదు. తాజా కాగ్ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఘాటుగా విమర్శిం చారు. ఆ నివేదికకు అది అచ్చయిన కాగితాలంత విలువ కూడా లేదన్నారు. నివేదికలో ప్రభుత్వా నికి అనుకూలమైన అభిప్రాయాలుండటం అందుకు కారణం కావొచ్చు. అలాగని కాగ్ గంపగుత్తగా కేంద్రానికి క్లీన్చిట్ ఇవ్వలేదు. ముఖ్యంగా ఒప్పందంలో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి సురక్షితమైన పూచీకత్తు తీసుకోకుండా, ఏమాత్రం చట్టబద్ధత లేని ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’తో ఎందుకు సరిపెట్టాల్సి వచ్చిందని నిలదీసింది. 2007 నాటి అవగాహనలో ముందస్తు చెల్లింపులకు 15 శాతం బ్యాంకు పూచీకత్తు ఉన్న సంగతిని ఎత్తిచూపింది. ఆ తరహా పూచీకత్తు ఉంటే డసో ముందూ మునుపూ ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పుడు ఆ డబ్బును ఫ్రాన్స్ సర్కారునుంచి వెంటనే రాబట్టుకునే అవకాశ ముంటుందని వివరించింది. తాజా ఒప్పందం ప్రకారం ఇతరత్రా ప్రయత్నాలు విఫలమయ్యాకే ఆ పని చేయగలుగుతామని చెప్పింది. అలాగే అప్పటి పూచీకత్తులో ప్రదర్శన, వారంటీలకు సైతం 5 శాతం చొప్పున పూచీ ఉన్న అంశాన్ని ప్రస్తావించింది. ధరవరల్లో మార్పులు గురించి కూడా నివేదిక వివరాలిచ్చింది. మొత్తం 11 అంశాలకు సంబంధించి ఈ వివరాలున్నాయి. యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహనతో పోలిస్తే తాజా ఒప్పందం వల్ల విమానాల సేవలు, నిర్వహణ అంశంలో 4.77 శాతం మేర, మన వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా చేసే మార్పులకు అయ్యే ఖర్చు 17.08 శాతం మేర, ఆయుధ ప్యాకేజీలో 1.05 శాతం తక్కువని కాగ్ చెప్పిన అంశం వాస్తవమే అయినా...నాలుగు అంశాల్లో–పైలెట్, సాంకేతిక నిపుణుల శిక్షణకు 2.68 శాతం, ఇంజ నీరింగ్ పరమైన సాయానికి 6.54శాతం, లాజిస్టిక్స్‌లో 6.54శాతం మేర ధరలు పెరిగాయని తెలి పింది. అలాగే ఆడిట్ నివేదిక ప్రక్రియ ముగింపు దశలో ఉన్నదని, ఇతర అంశాలన్నీ అందులో పొందుపరుస్తామని వివరించింది. బహుశా నివేదికను క్షుణ్ణంగా చదివుంటే రాహుల్ వేరే విధంగా వ్యాఖ్యానించేవారేమో! లోక్‌సభ చివరి సమావేశాలనాటికైనా పూర్తి నివేదిక సమర్పించనందుకు కాగ్‌ను తప్పుబట్టి ఉంటే వేరుగా ఉండేది. అటు ప్రభుత్వం సహజంగానే ఈ నివేదికను తమకొచ్చిన క్లీన్ చిట్‌గా చెబుతోంది. ముఖ్యంగా యూపీఏ హయాంనాటి ధరవరలతో పోల్చి తమ ఒప్పందం వల్ల విమానాల ఖర్చు 2.86 శాతం మేర తగ్గిందన్నది ప్రభుత్వ పెద్దలు ప్రముఖంగా చూపుతున్నారు. కానీ ఇతరత్రా అంశాల్లో వ్యయం పెరగడాన్ని కాగ్ ఎత్తిచూపింది. అలాగే 2007నాటి అవగాహనలో రఫేల్ యుద్ధ విమానాల్లో 18 విమానాలను వెంటనే అందిస్తామని, మిగిలినవన్నీ భారత్‌లో ఉత్పత్తి చేయడానికి సహకరిస్తామని హామీ ఇచ్చింది. కానీ 2016నాటి ఒప్పందంలో ఈ 36 యుద్ధ విమానాలనూ ఫ్రాన్స్‌లో తయారు చేసి పంపుతామని చెప్పింది. అయితే ఒప్పంద వ్యయం రూ. 59,000 కోట్లలో కొంత శాతాన్ని భారత్‌లోనే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చింది. అది ఎంత మొత్తమన్న అంశంలో భిన్నాభిప్రాయా లున్నా మిలిటరీ ఎయిరోనాటిక్స్ పరిశోధన, రఫేల్‌కు అవసరమైన విడిభాగాల ఉత్పత్తి ఆ ‘కొంత శాతం’లో ఉంటాయి. పబ్లిక్ రంగ సంస్థ హెచ్ఏఎల్ను కాదని అంబానీ సంస్థను ఎన్నుకున్నది వాటికోసమే. ఎయిరోస్పేస్, రక్షణ విడిభాగాల తయారీలో ఏమాత్రం అనుభవంలేని సంస్థకు తోడ్పాటునీయడం ఏమిటన్నది విపక్షాల ప్రశ్న. ఇది సబబేనా, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉందా లేదా అన్న అంశాన్ని తుది నివేదికలో కాగ్ చెబుతుంది. అయితే దేశ రక్షణతో ముడిపడిన అంశాల్లో ఇలా తరచు వివాదాలు తలెత్తడం విచారకరం. పాలకులు పారదర్శకంగా వ్యవహరిస్తే, విపక్షాలు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే తప్ప ఈ ధోరణికి అడ్డుకట్ట పడదు. -
‘వెయ్యి అబద్ధాలు ఆడినా రాహుల్ పెళ్లి చేయలేరు’
సాక్షి, హైదరాబాద్ : రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు అంశానికి సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదికను చూసి కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యిందని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆ నివేదికతో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగి పోయిందన్నారు. గురువారం మీడియా మాట్లాడిన శ్రీధర్ రెడ్డి.. ‘ ఇన్ని రోజులుగా రఫేల్ డీల్‌పై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలకు వత్తాసు పలుకుతున్న ప్రతిపక్ష నేతల మాటలన్నీ విష ప్రచారం అని తేలిపోయింది. రఫేల్‌పై ఎలాంటి తప్పులు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుగా కాంగ్రెస్ వ్యవహారశైలి ఉంది. తాజా కాగ్ నివేదిక కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటింది. ఈ నివేదికలో 16 అంశాలు ప్రస్తావించారు. రాడార్, చీకట్లో శత్రువులను ఛేదించే పనితీరు విమానాలు ఇందులో ఉన్నాయి. అబద్ధాలు మాట్లాడమే పనిగా పెట్టుకున్న రాహుల్‌కు నిజాలు మింగుడు పడటం లేదు. రఫేల్‌పై మోదీకి మరకపూయాలని రాహుల్ చూశారు. అబద్ధాన్ని గట్టిగా ప్రచారం చేసి అధికారంలోకి రావాలని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి అబద్ధాలు ఆడినా రాహుల్ గాంధీ పెళ్లి చేయలేరు. విష ప్రచారం చేసి అధికారంలోకి రాలేరు. కమీషన్లు రావని అప్పట్లు రఫేల్ విమానాలను కొనుగోలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. అవసమరి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చెప్తే వాటిని మేము కొనుగోలు చేశాం. రాహుల్, సోనియా, రాబర్ట్ వాద్రాలు ట్యాక్స్ ఎగ్గొట్టి దేశాన్ని దోచుకున్నారు. రాష్ట్రాలను దేశాన్ని దోచుకున్నది కాంగ్రెస్ పార్టీ’ అని తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ చదవండి: ధర 2.86 శాతం తక్కువే -
సుస్థిర ప్రభుత్వంతోనే దేశ ప్రతిష్ట
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజలు విస్పష్ట మెజారిటీ కట్టబెట్టడంతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీంతో భారత్ పట్ల ప్రపంచ దేశాల వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పారు. అస్థిర ప్రభుత్వాలతో ఇంతకుముందు ఎన్నో ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజైన బుధవారం మోదీ లోక్‌సభలో ప్రసంగించారు. 2019–20 తాత్కాలిక బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ చేపట్టకుండానే రాజ్యసభ బుధవారం బడ్జెట్‌కు పచ్చజెండా ఊపింది. అనంతరం లోక్‌సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదాపడ్డాయి. దీంతో 16వ లోక్‌సభా కాలంలో చివరి పార్లమెంట్ సమావేశాలు ముగిసినట్లయింది. ఈ లోక్‌సభా కాలంలో మొత్తం 219 బిల్లులు ప్రవేశపెట్టగా 203 బిల్లులు ఆమోదం పొందాయి. లోక్‌సభ కార్యకలాపాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ సమర్థంగా నిర్వహించారని మోదీ ప్రశంసించారు. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ సవరణ బిల్లులకు జూన్ 3న గడువు తీరనుంది. భూకంపం వస్తుందన్నారు..ఏదీ? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యస్త్రాలు కొనసాగిస్తూ.. రఫేల్ ఒప్పందంపై మాట్లాడితే భూకంపం వస్తుందన్న ఆయన మాటలు డొల్ల అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో రాహుల్ తనను కౌగిలించుకుని తరువాత కన్ను గీటడాన్ని ప్రస్తావిస్తూ.. మొదటిసారి లోక్‌సభ ఎంపీ అయిన తనకు ఇలాంటివి చాలా కొత్తగా అనిపించాయని చురకలంటించారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట పెరగడానికి తాను కానీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కానీ బాధ్యులు కారని, ఈ క్రెడిట్ సంపూర్ణ మెజారిటీ సాధించిన ప్రభుత్వానికి, దేశ ప్రజలకు దక్కుతుందని మోదీ అన్నారు. నాలుగున్నరేళ్ల తమ ప్రభుత్వ విజయాల్ని మోదీ ప్రస్తావిస్తూ..భారత్ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు. ఈ లోక్‌సభ సమావేశాల్లో మొత్తం 17 సెషన్లు జరగ్గా, అందులో 8 సెషన్ల లో వందశాతానికి పైగా ఉత్పాదకత సాధించా మన్నారు. మొత్తం మీద లోక్‌సభ సఫలతా శాతం 85 శాతంగా నమోదైందని తెలిపారు. అంచనాలు అందుకున్నారా: స్పీకర్ ఐదేళ్లలో ప్రజల అంచనాలను అందుకున్నారో? లేదో? ఆత్మపరిశీలన చేసుకోవాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభ సభ్యులకు సూచించారు. సభ ఏర్పడినప్పటి నుంచి సభ్యుల ఆందోళనల వల్ల 422 గంటల 19 నిమిషాల సమయం వృథా అయిందన్నారు. మొత్తం 331 సిట్టింగ్‌లలో 1,612 గంటల పాటు కార్యకలాపాలు కొనసాగాయి. మళ్లీ మోదీనే ప్రధాని కావాలి: ములాయం నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించి ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం లోక్‌సభలో అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీనికి మోదీ స్పందిస్తూ ములాయంకు చేతులు జోడించి నమస్కరించారు. ప్రస్తుత సభ్యులు మళ్లీ లోక్‌సభకు ఎన్నిక కావాలని కోరుకుంటున్నట్లు ములాయం తెలిపారు. తరువాత మోదీ వైపు చూస్తూ ‘మీరే మళ్లీ ప్రధానిగా రావాల’ని అనడంతో అధికార పక్ష సభ్యులు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆయన పక్కనే కూర్చున్న యూపీయే అధ్యక్షురాలు సోనియా గాంధీ కాస్త ఇబ్బందిపడినట్లు కనిపించింది. తనను ఆశీర్వదించిన ములాయంకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఇదీ రఫేల్‌పై కాగ్ నివేదిక
రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికను బుధవారం పార్లమెంట్ ముందుకు తెచ్చింది. ఏడాదిన్నరకు పైగా కాలంపాటు కాగ్ రఫేల్ ఒప్పందాన్ని పరిశీలించి నివేదికను సిద్ధం చేశారు. విమానాల ధర, విక్రేతల ప్రతిపాదనల పరిశీలనతోపాటు ప్రపంచ వ్యాప్తంగా జెట్ యుద్ధ విమానాల ధరలను కూడా కాగ్ పరిశీలించారు. రక్షణ శాఖ ఐదేళ్లుగా జరిపిన లావాదేవీలపై కాగ్ నివేదిక వచ్చింది. ముసాయిదా నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. అయితే, ఎన్నికలకు ముందు ఈ నివేదిక ఖరారు కాకపోవచ్చు. రఫేల్ ఒప్పందంలోని ధర, సరఫరా, పూచీకత్తు తదితర పలు అంశాలను కాగ్ నివేదిక చర్చించింది. అందులోని ముఖ్యాంశాలు: ధర: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో పేర్కొన్న ధర అంతకు ముందు ఒప్పందంలోని సమీకృత ధర(మొత్తం ధర) కంటే 2.86 శాతం తక్కువ. 2007లో (యూపీఏ హయాం) కుదుర్చుకున్న ఒప్పందంలోని 36 విమానాల కొనుగోలు ధర కంటే 2016 నాటి ఎన్డీఏ ఒప్పందంలోని ధర 9 శాతం తక్కువంటూ రక్షణ శాఖ చేసిన వాదనను కాగ్ తోసిపుచ్చింది. ఒప్పందంలో మొత్తం 14 ఐటెమ్‌లతో కూడిన ఆరు వేర్వేరు ప్యాకేజీలు ఉన్నాయి. వీటిలో ఏడు ఐటెమ్‌ల ధర సమీకృత ధర కంటే చాలా ఎక్కువగా ఉంది. బేసిక్ విమానం సహా మూడు ఐటెమ్‌లను సమీకృత ధరకే కొన్నారు. 4 ఐటెమ్‌లను సమీకృత ధరకంటే తక్కువకు కొన్నారు. సరఫరా: పాత ఒప్పందంతో పోలిస్తే కొత్త ఒప్పందంలో పేర్కొన్న గడువు ప్రకారం యుద్ద విమానం ఒక నెల ముందే సరఫరా అవుతుంది. 2007 ఒప్పందం ప్రకారం నిర్దేశిత ప్రమాణాల మేరకు యుద్ధ విమానాలను ఒప్పందం నాటి నుంచి 72 నెలల్లోపు సరఫరా చేయాల్సి ఉండగా. 2016 ఒప్పందంలో ఈ గడువు 71 నెలలుగా పేర్కొన్నారు. 2007 ఒప్పందం ప్రకారం ఒప్పందపు నెల నుంచి 50 నెలల్లోగా 18 విమానాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగతా 18 విమానాలను హెచ్ఏఎల్లో తయారు చేయాలి. వీటిని 49–72 నెలల్లోపు అందజేయాల్సి ఉంటుంది. 2016 ఒప్పందం ప్రకారం మొదటి విడత విమానాలను(18) ఒప్పందపు నెల నుంచి 36–53 నెలల మధ్య సరఫరా చేయాలి. మిగతా వాటిని 67 నెలల్లో అందజేయాల్సి ఉంటుంది. గ్యారెంటీ: న్యాయ మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ ఒప్పందానికి సంబంధించి సార్వభౌమత్వ హామీ(ప్రభుత్వమే హామీ ఉండటం) ఇవ్వాల్సిందిగా రక్షణ మంత్రిత్వశాఖ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఆ ప్రభుత్వం కేవలం లెటర్ ఆఫ్ కంఫర్ట్ ను మాత్రమే ఇచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ ఒప్పందానికి సంబంధించిన చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతా తెరవాలని రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన విజ్ఞప్తికి ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించలేదు. 2007నాటి ఒప్పందంలో విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్ ‘పనితీరు, ఆర్థిక హామీ(పెర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్) ఇచ్చింది. మొత్తం కాంట్రాక్టు విలువలో 25 శాతం మేరకు ఈ హామీ ఇచ్చింది. 2007నాటి ఒప్పందంలో అమ్మకందారు(డసో)ఈ హామీ విలువను బిడ్‌లో చేర్చారు. అయితే, 2016 ఒప్పందంలో ఇలాంటి హామీలు ఏమీ లేవు. దీనివల్ల డసో సంస్థకు బోలెడు ఆదా అయింది. -
ధర 2.86 శాతం తక్కువే
న్యూఢిల్లీ: నిత్యం వివాదాలతో వార్తల్లో ఉంటున్న రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఎట్టకేలకు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక బుధవారం పార్లమెంటుకు చేరింది. రఫేల్ విమానాల కోసం 2007లో నాటి యూపీఏ ప్రభుత్వం ఖరారు చేసిన ధర కన్నా ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న ధర 2.86 శాతం తక్కువగానే ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. అయితే రఫేల్ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఉన్న ‘భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక’ అంశాన్ని కాగ్ ఈ నివేదికలో కనీసం ప్రస్తావించలేదు. యుద్ధ విమానాల పూర్తి, స్పష్టమైన ధరలను కూడా కాగ్ తన నివేదికలో పేర్కొనలేదు. కాంగ్రెస్ కుదుర్చుకున్న ధర కన్నా తమ ప్రభుత్వం రఫేల్ విమానాలను కొంటున్న ధర 9 శాతం తక్కువగా ఉందంటూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించగా, తాజాగా కాగ్ మాత్రం అది 2.86 శాతమే తక్కువని స్పష్టం చేయడం గమనార్హం. ఆ ప్యాకేజీకి 6.54 శాతం ఎక్కువ ధర రఫేల్ ధరల వివరాలను సంపూర్ణంగా బయటపెట్టకపోయినప్పటికీ, ఇంజనీరింగ్ సహాయక ప్యాకేజీ, వాయుసేనకు పనితీరు ఆధారిత లాజిస్టిక్స్ వరకు చూస్తే ప్రస్తుత ధర గతం కన్నా 6.54 శాతం ఎక్కువగా ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. 2007లో కుదుర్చుకున్న ధరలతో పోలిస్తే శిక్షణా వ్యయం కూడా ప్రస్తుతం 2.68 శాతం పెరిగిందంది. రఫేల్ విమానాల్లో భారత్ కోరిన సౌకర్యాలు తదితరాల్లో మాత్రం యూపీఏ ధర కన్నా ఎన్డీయే ధరలు 17.08 శాతం తక్కువగా ఉన్నాయంది. ఆయుధాల ప్యాకేజీ కూడా గతం కన్నా ప్రస్తుతం 1.05 శాతం తక్కువకే వచ్చిందని తన 157 పేజీల నివేదికలో కాగ్ వెల్లడించారు. మొత్తంగా చూస్తే యూపీఏ కన్నా ఏన్డీయే కుదుర్చుకున్న ధర 2.86 శాతం తక్కువగా ఉందన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం తాము ఒక్కో విమానాన్ని రూ. 520 కోట్లకు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకుంటే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఒక్కో విమానానికి రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తోందని గతం నుంచీ ఆరోపిస్తోంది. డసో పోటీ సంస్థ యూరోపియన్ ఏరోనాటిక్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ (ఈఏడీఎస్) విమానాల ధరపై 20 శాతం తగ్గింపు ఇస్తామనడంపై ప్రభుత్వ స్పందనను కూడా కాగ్ రాజీవ్ మహర్షి ఈ నివేదికలో ప్రస్తావించారు. 20 శాతం తగ్గింపును ఆ కంపెనీ భారత్ అడగకుండానే ఇచ్చిందనీ, అలాగే ఈఏడీఎస్ ప్రతిపాదనల్లో వాస్తవిక వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీని ఎంపిక చేయలేదని రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పినట్లు కాగ్ నివేదిక తెలిపింది. లెటర్ ఆఫ్ కంఫర్ట్తోనా? ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలోని లోపాలనూ కాగ్ తన నివేదికలో ప్రస్తావించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి హామీ/పూచీ తీసుకోకుండా కేవలం లెటర్ ఆఫ్ కంఫర్ట్తోనే మోదీ ప్రభుత్వం సరిపెట్టుకుందనీ, దీనివల్ల రఫేల్ విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్‌కు లబ్ధి చేకూరిందని కాగ్ తెలిపారు. 2007లో కుదిరిన ఒప్పందం ప్రకారమైతే ముందస్తు చెల్లింపులకు 15 శాతం బ్యాంకు గ్యారంటీ కూడా ఉందనీ, ప్రస్తుత ఒప్పందంలో అలాంటిదేమీ లేదని కాగ్ నివేదిక వెల్లడించింది. ‘ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి పూచీకత్తు లేకుండా లెటర్ ఆఫ్ కంఫర్ట్‌తో సరిపెట్టుకోవడం వల్ల ఒకవేళ భవిష్యత్తులో డసో ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే భారత్‌కు తలనొప్పి తప్పదు. ఒప్పంద ఉల్లంఘన జరిగితే ముందుగా భారత్ మధ్యవర్తిత్వం ద్వారా డసోతోనే చర్చలు జరపాలి. ఈ చర్చల ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉంటే, ఇందులో వచ్చిన తీర్పును/పరిష్కారాన్ని అనుసరించేందుకు కూడా డసో విముఖత చూపితే భారత్ మళ్లీ అందుబాటులో ఉన్న అన్ని న్యాయ పరిష్కారాలనూ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే డసో తరఫున ఫ్రాన్స్ ప్రభుత్వం భారత్‌కు డబ్బు తిరిగి చెల్లిస్తుంది’ అని నివేదిక వివరించింది. అబద్ధాలని తేలిపోయింది: జైట్లీ కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు రఫేల్‌పై చెబుతన్నవన్నీ అబద్ధాలేనని కాగ్ నివేదికతో తేటతెల్లమైందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆఫ్సెట్ భాగస్వామి ప్రస్తావనే లేని నివేదిక రఫేల్ వివాదంలో కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ ఆఫ్ ఎంపిక గురించే. డసో భారత్‌లో తనకు ఆఫ్సెట్ భాగస్వామిగా ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను కాకుండా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకుందనీ, ఈ రంగంలో ఏ అనుభవం లేని కొత్త కంపెనీ రిలయన్స్ డిఫెన్స్‌కు ఈ అవకాశం దక్కడానికి మోదీ ప్రభుత్వ అవినీతే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కాగ్ నివేదికలో మాత్రం ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక అంశం గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు. ఆ కాగితమంత విలువ కూడా లేదు: రాహుల్ రఫేల్ ఒప్పందం కుదుర్చుకునేందుకు జరిపిన చర్చల సమయంలో వచ్చిన అసమ్మతి గురించి అసలు ఈ నివేదికలో కాగ్ ప్రస్తావించలేదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగ్ నివేదికను ముద్రించిన కాగితాలకు ఉన్నంత విలువ కూడా అందులో పేర్కొన్న అంశాలకు లేదని విమర్శించారు. ‘కొత్త ఒప్పందం కుదుర్చుకోవడానికి మోదీ ప్రభుత్వం చెబుతున్న కారణాలు ధర, మరింత వేగంగా సరఫరా. కానీ ఈ ఆ రెండు వాదనలూ అవాస్తవాలేనని ద హిందూ పత్రిక తాజా కథనంతో తేలిపోయింది. కేవలం రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకీ రూ. 30 వేల కోట్లు అక్రమంగా ఇచ్చేందుకే ఈ కొత్త ఒప్పందం జరిగింది’ అని రాహుల్ మరోసారి ఆరోపించారు. రఫేల్ అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్, సోనియా తదితరులు పార్లమెంటు భవనం వద్ద నిరసన చేపట్టారు. -
రఫేల్: కాగ్ నివేదికతో మరోసారి రుజువైంది!
సాక్షి, హైదరాబాద్: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని కాగ్ నివేదిక తేలిపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. రాజకీయ అవసరాల కోసమే రఫేల్ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినట్టు కాగ్ నివేదికతో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు సరైనదేనని కాగ్ నివేదికతో మరోసారి రుజువైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన దళారి వ్యవస్థను అంతం చేసి మోదీ సర్కారు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఇది రెండు ప్రభుత్వాల (భారత్-ఫ్రాన్స్) మధ్య జరిగిన ఒప్పందం ఇదని చెప్పారు. రఫేల్ వ్యవహారంపై విపక్షాల దుష్ప్రచారాన్ని, కాంగ్రెస్ పార్టీ దివాలాకోరుతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. అభ్యర్థుల ఎంపికతోపాటు పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తామన్నారు. -
యూపీఏతో పోలిస్తే చవకే
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోళ్ల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని తేల్చింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులతో పోలిస్తే 2.86 శాతం తక్కువ ధరకు మోదీ సర్కారు ఒప్పందం కదుర్చుకున్నట్టు కాగ్ వెల్లడించింది. బుధవారం రాజ్యసభకు సమర్పించిన 141 పేజీల నివేదికలో ఈ మేరకు పేర్కొంది. 2007, 2015 కొనుగోలు ఒప్పందాలను పోల్చిచూసినట్టు కాగ్ తెలిపింది. రఫేల్ యుద్ధవిమానాల కోసం గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కారు జరిపిన సంప్రదింపుల్లో బేస్ ధరలో ఎటువంటి మార్పులేదని తేల్చింది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం సర్వీసెస్, ప్రొడక్ట్స్, ఆపరేషనల్ సపోర్ట్ నిర్వహణ 4.77 శాతం తగ్గింది. భారత అవసరాలకు తగినట్లు సాంకేతిక మార్పులు చేయడంలో 17.08 శాతం తగ్గుదల కనిపించింది. ఇంజినీరింగ్ సపోర్ట్ ప్యాకేజీ 6.54 శాతం పెరిగింది. పనితీరు ఆధారిత విషయంలో 6.54 శాతం మెరుగుపడింది. టూల్స్, టెస్టర్స్, గ్రౌండ్ ఎక్విప్‌మెంట్‌లో 0.15 శాతం పెరిగింది. ఆయుధాల ప్యాకేజీలో 1.05 శాతం తగ్గుదల నమోదైంది. పైలట్, సాంకేతిక నిపుణుల శిక్షణ వ్యయం 2.68 శాతం పెరిగిందని కాగ్ వివరించింది. అయితే ధరల వివరాలు వెల్లడించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్యం గెలిచింది: బీజేపీ కాగ్ నివేదికపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సత్యం గెలిచిందని, ప్రతిపక్షాల కుట్రలు బయటపడ్డాయని వ్యాఖ్యానించారు. విపక్షాలు ఇకలైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. బీజేపీ చిత్తశుద్ధి మరోసారి రుజువైందని పేర్కొన్నారు. -
మోదీ దేశద్రోహానికి పాల్పడ్డారు
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదంలో మంగళవారం కొత్తగా మరో అంశం తెరపైకి వచ్చింది. భారత్–ఫ్రాన్స్‌లు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ముందే దీని గురించి పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి సమాచారం అందిందనీ, అంబానీ నాడు ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్–యైవ్స్ లీ డ్రియాన్స్ కార్యాలయాన్ని కూడా సందర్శించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు రుజువుగా ఆయన ఓ ఈ–మెయిల్‌ను బహిర్గతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోద అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించి అనిల్ అంబానీకి రఫేల్ ఒప్పంద వివరాలను ముందుగానే తెలియజేయడం ద్వారా దేశద్రోహానికి పాల్పడ్డారంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్‌కు మధ్యవర్తిగా మోదీ వ్యవహరించారని అన్నారు. బీజేపీ ఈ ఆరోపణలను ఖండించింది. అసలు ఆ ఈ–మెయిల్లో ఉన్న విషయం రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించినదే కాదని బీజేపీతోపాటు అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ స్పష్టం చేసింది. ఎయిర్‌బస్ సంస్థ ఉద్యోగి హెలికాప్టర్ల ఒప్పందానికి సంబంధించిన వివరాలను అందులో ప్రస్తావించారంది. ‘కాంగ్రెస్ బయట పెట్టిన ఈ–మెయిల్ రిలయన్స్ డిఫెన్స్, ఎయిర్‌బస్ సంస్థల మధ్య పౌర, రక్షణ హెలికాప్టర్ల ఒప్పంద చర్చలకు సంబంధించినది. ఇందులో రఫేల్ ప్రస్తావన లేదు.’ అని రిలయన్స్ డిఫెన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. రక్షణ మంత్రి కన్నా ముందు అంబానీకే.. 2015 మార్చి 28 నాటి తేదీతో ఉన్న, ఎయిర్‌బస్ ఉద్యోగి నికోలస్ ఛాముస్సీ ‘అంబానీ’ అనే సబ్జెక్ట్‌తో ముగ్గురికి పంపిన ఈ–మెయిల్‌ను రాహుల్ మీడియాకు విడుదల చేశారు. రఫేల్ ఒప్పందం ఖరారు కావడానికి ముందే అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణ మంత్రిని కలిసి నాటికి ఇంకా రూపుదిద్దుకుంటున్న ఎంవోయూ గురించి మాట్లాడారనీ, మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఒప్పందాన్ని ఖరారు చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారని రాహుల్ ఆరోపించారు. అంటే నాటి రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్‌లకంటే ముందుగానే అనిల్ అంబానీకి రఫేల్ ఒప్పందం విషయం తెలుసునని రాహుల్ పేర్కొన్నారు. ‘ఇది అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన. నాటికి ఈ ఒప్పందం గురించి తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి ప్రధాని మోదీయే అనిల్‌కు ఈ సమాచారాన్ని చేరవేశారు. ఇది దేశద్రోహమే. గూఢచారులు చేసే పనిని మోదీ చేస్తున్నారు. రహస్యాలను వెల్లడించనని ప్రమాణం చేసిన తర్వాత ఆయన రక్షణ ఒప్పందాల రహస్యాలను బయటపెడుతున్నారు. అనిల్‌కు మధ్యవర్తిగా మోదీ వ్యవహరిస్తున్నారు’ అని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై నేర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రఫేల్ అంశం గతంలో కేవలం అవినీతి, విధానపరమైన అవకతవకలకు సంబంధించినదేనని తాము భావించామనీ, ఇప్పుడు ఇది అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘనగా తేలడంతో మరింత తీవ్రమైన అంశంగా మారిందన్నారు. రఫేల్‌పై జేపీసీ విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేశారు. రాహుల్ తన మొహంపైనే పేడ కొట్టుకున్నారు: బీజేపీ ప్రధానమంత్రిని నిందించడం ద్వారా రాహుల్ తన మొహంపైనే పేడ కొట్టుకున్నారనీ, ఆయన అబద్ధాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘గాంధీ కుటుంబం నుంచి వచ్చిన గత ప్రధాన మంత్రులతో మా పార్టీకి తీవ్రమైన భేదాభిప్రాయాలున్నాయి. వారి హయాంలో జరిగిన అనేక అవినీతి రక్షణ ఒప్పందాలే ఇందుకు కారణం. కానీ మేం ఎన్నడూ వారిపై దేశద్రోహం ఆరోపణలు చేయలేదు. రాహుల్ ఓ అబద్ధాల యంత్రం. తాజా అబద్ధాలు ఆయన సిగ్గులేని తనానికి, బాధ్యతారాహిత్యానికి ఓ నిదర్శనం’ అని అన్నారు. రాహుల్ బయటపెట్టిన ఎయిర్బ స్ ఈ–మెయిల్ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించినది తప్ప రఫేల్ యుద్ధ విమానాల అంశం అందులో లేదని స్పష్టం చేశారు. రాహులే విదేశీ కంపెనీలకు లాబీయిస్ట్‌గా పనిచేస్తున్నారన్నారు. ఎయిర్‌బస్ సంస్థ అంతర్గత ఈ–మెయిల్ రాహుల్‌కు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. -
దాచేస్తే దాగదు ‘రఫేల్’
రఫేల్ ఒప్పందంపై తాజా సంచలనాత్మక వివరాల నేపధ్యంలో స్పష్టమవుతున్నది ఒక్కటే. అహంకారంతో, మూర్ఖత్వంతో కేంద్రం తనకుతానుగా తెచ్చిపెట్టుకున్న కుంభకోణంగా తప్ప మరే కోణంలోనూ దీన్ని చూడలేం. కేంద్రప్రభుత్వం వాస్తవాన్ని ముందే యధాతథంగా చెప్పి ఉన్నట్లయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి కుంభకోణంలో ఇరుక్కునే ప్రమాదం నుంచి తప్పించుకుని ఉండేది. ప్రత్యర్థులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఆశించగల అర్హత వారికి లేదని, తాము అన్ని అంశాల్లోనూ సరిగా ఉన్నామనే స్వీయ అహంకారంలో మునిగిపోయి ఉన్నప్పుడే ఇలా జరుగుతుంటుంది. రఫేల్ వివాదంలో మోదీ ప్రభుత్వం పతన దశ ఇక్కడే మొదలైంది. రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంపై తాజాగా ద హిందూ పత్రికలో ఎన్ రామ్ వెల్లడించిన విషయాలు, వాటికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యక్తపరిచిన సమర్థనలు ఈ అంశంపై జరుగుతున్న చర్చను ముందుకు తీసుకుపోవడంలో మరింతగా సహాయపడ్డాయి. ఈ నేపథ్యంలో రఫేల్ ఒప్పందం గురించి స్పష్టమవుతున్నది ఒక్కటే. ఇది అహంకారం, మూర్ఖత్వంతో కేంద్రం తనకుతానుగా తెచ్చిపెట్టుకున్న కుంభకోణంగా తప్ప మరే కోణంలోనూ దీన్ని చూడలేం. రఫేల్ స్పష్టపరుస్తున్న తాజా వివరాలను ఒకటొకటిగా చూద్దాం. 1. మనోహర్ పారికర్ నేతృత్వంలోని రక్షణ శాఖ ఉన్నతాధికారులు రఫేల్ చర్చలు పట్టాలెక్కిన తీరుపై చాలా అసౌకర్యంగా లేక అభద్రతను ఫీలయ్యారు. ఈ ఒప్పందం పట్ల తమ అభ్యంతరాన్ని వారు రికార్డు చేశారు కూడా. 2. కానీ వారి అభ్యంతరాలను మరీ అతిగా స్పందించారని పేర్కొంటూ రక్షణ మంత్రి తోసిపుచ్చారు. పైగా ప్రధానమంత్రి పీఎస్ (బహుశా ప్రిన్సిపల్ కార్యదర్శి)తో సంప్రదింపులు జరపాల్సిం దిగా శాఖాధికారులను ఆదేశించారు. 3. దీనర్థం ఏమిటి? అత్యున్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకత్వం ఉన్నతాధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చిందనే కదా. ఈ ఒప్పందాన్ని సత్వరంగా కుదుర్చుకోవాలని నాయకత్వం కోరుకుంది. 4. సూత్రబద్ధంగా చూస్తే ఇది సరైందే. ఎందుకంటే సందేహాలను లేవనెత్తడం ఉన్నతాధికార వర్గం సహజ స్వభావం. నిర్ణయాత్మక శక్తి కలిగిన రాజకీయ నేత అలాంటి అభ్యంతరాలను తోసిపుచ్చి తన నిర్ణయానికి బాధ్యత తీసుకుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడినుంచి మనం సమస్యను కొనితెచ్చుకుంటాం. పై నాలుగు అంశాలు నిజానికి ఏం చెబుతున్నాయి? అంటే.. ఒక ఒప్పందం కుదరాల్సి ఉంది. సాధారణంగానే ఉన్నతాధికారులు తమ స్వచర్మరక్షణను చూసుకుంటారు, కానీ దృఢమైన, జాతీయవాదంతో కూడిన నిజాయితీ కలిగిన ప్రభుత్వం తమముందు ఉన్న అవరోధాలను తొలగించుకుని ఒప్పందాన్ని ఖాయపరుస్తుంది. అలాంట ప్పుడు సాహస ప్రవృత్తి కలిగిన అదే ప్రభుత్వం ఈ విషయాన్ని నేరుగా ప్రకటించడానికి ఎందుకు సిగ్గుపడుతున్నట్లు? అలా వాస్తవాలను ప్రకటించడానికి భిన్నంగా తన చర్యపై వరుస సమర్థనల వెనుక ఎందుకు దాక్కుంటున్నట్లో? కేంద్రప్రభుత్వం వాస్తవాన్ని ముందే యధాతథంగా చెప్పి ఉన్నట్లయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రక్షణ శాఖ కుంభకోణంగా తలెత్తే ప్రమాదం నుంచి తప్పించుకుని ఉండేది. అప్పుడు ఆ సత్యం ఇలా ఉండేది: యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2012 ప్రారంభంలో 125 యుద్ధవిమానాల కొనుగోళ్లకు గాను తక్కువ బిడ్ దాఖలు చేసిన రఫేల్‌ని ఎంచుకున్నారు. కానీ, 14 మంది సభ్యులతో కూడిన ధరల సంప్రదింపు కమిటీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తపరిచింది. నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఈ అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పర్చి ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి ముగ్గురు బాహ్య పర్యవేక్షకుల బృందాన్ని నియమించారు. తర్వాత ఈ అభ్యంతరాలను 14 మంది సభ్యులతో కూడిన పూర్తిస్థాయి కమిటీ తోసిపుచ్చింది. ఒక కమిటీపై మరో కమిటీ, ఆ కమిటీ మరొక కమిటీ చర్చల ప్రక్రియ కొనసాగాక 126 యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం ఖరారైంది. ఆపై ఏం జరిగింది? యధావిధిగానే నాటి రక్షణ మంత్రి ఆంటోనీ సందేహిస్తూనే ఈ కమిటీ తుది నిర్ణయంతో విభేదించి మళ్లీ బిడ్లను ఆహ్వానించాల్సిందిగా సూచించారు. వాస్తవానికి ఈ ఒప్పందం 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఆంటోనీ దీనిపై నిర్ణయాన్ని తదుపరి ప్రభుత్వానికి వదిలిపెట్టడానికే మొగ్గు చూపారు. తన హయాంలో ఏ రక్షణ కొనుగోలు కుంభకోణం చోటు చేసుకోకుండా ముగించాలన్నది ఆయన వైఖరి. ఒప్పందంలో ఒక భాగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. పెద్దగా కొనుగోలు చేసిందీ లేదు. కానీ ఆయన సైతం చివరకి అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంతో పదవిని ముగించాల్సి వచ్చింది. మరి మన నిర్ణయాత్మకమైన, రాజీలేని మోదీ ప్రభుత్వం ఏం చేసింది? అది చాలా మొరటుగా వ్యవహరించింది. భారత వాయుసేన తన అవసరాలకు శాశ్వతంగా ఎదురు చూడలేదు. కాబట్టి కొన్ని విధివిధానాలను పాటించకుంటే ఏం కొంప మునుగుతుంది? పైగా ఆ విధానాలు కార్యనిర్వాహక నిబంధనలే తప్ప రాజ్యాం గబద్ధమైన ఆదేశాలు కావు. కాబట్టి ప్రధాని విశాల జాతి ప్రయోజనాల రీత్యా ఈ విధానాలను పక్కకు తోసేయగలడు. ఇదంతా బాగుంది. కానీ మోదీ ప్రభుత్వం ఈ ఒప్పంద వివరాలను పూర్తిగా ఎందుకు బహిర్గతం చేయలేదు? ఇంతకుముందే దాన్ని బహిర్గతపర్చి ఉంటే గత ఆరునెలలుగా రఫేల్ ఒప్పందంపై వస్తున్న పతాక శీర్షికలు పూర్తి అసందర్భంగా వెలిసిపోయి ఉండేవి. పైగా మీడియా కెమెరాల ముందు, పార్లమెంటులో ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రెచ్చిపోతూ మాట్లాడాల్సిన అవసరం అసలు ఉండేది కాదు. పైగా నచ్చబలికే వాస్తవాలు, ప్రస్తావనలతో ఆమె మంచి ఒప్పందాన్ని కుదుర్చుకుని ఉండి ఉంటే, రాహుల్ పదేపదే ఈ ఒప్పందంపై సంధిస్తున్న ప్రశ్నలకు ఆమె ఎందుకు సమాధానాలు ఇవ్వడం లేదు? రఫేల్ ఒప్పం దంపై రక్షణ శాఖ అభ్యంతరాలు లేవనెత్తిందా లేదా? ఈ ప్రశ్నకు ఆమె నిజాయితీగా అవునని సమాధానం చెప్పి ఉంటే, ఒప్పందంపై వచ్చే అన్ని ప్రశ్నలను ప్రభుత్వం తన విజ్ఞతతో తోసిపుచ్చి ఉండేది. ప్రభుత్వాలు తమను తాను స్వచ్ఛంగా ఉంచుకోవడానికి సాధారణ అంశాలను కూడా పాటించకపోవడానికి సాధారణంగా రెండు కారణాలు ఉంటుంటాయి. మరిన్ని విషయాలను తాను దాచి ఉంచి, వాటిని విమర్శకులు కనుగొనలేరని ప్రభుత్వం భావిస్తున్న సందర్భంగా ప్రభుత్వ వివేకం స్పష్టం కానప్పుడు ఇలా జరుగుతుంటుంది. రెండోది. ప్రత్యర్థులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఆశించగల అర్హత వారికి లేదని, తాము అన్ని అంశాల్లోనూ సరిగా ఉన్నామనే స్వీయ అహంకారంలో మునిగిపోయి ఉన్నప్పుడూ కూడా ఇలా జరుగుతుంటుంది. నన్ను ప్రశ్నించడానికి కూడా నీకెంత ధైర్యం? నీకు లాగ నేను కూడా అవినీతిలో కూరుకుపోయానని అనుకుంటున్నావా? రఫేల్ వివాదంలో మోదీ ప్రభుత్వం పతన దశ ఇక్కడే మొదలైంది. ఒక విశ్లేషకుడిగా, సంపాదకుడిగా ఈ రెండు నిర్ధారణల్లో మొదటిదాన్ని ప్రకటించడానికి నాకు మరింత సాక్ష్యాధారం కావాలి. అదేమిటంటే ప్రభుత్వం విషయాన్ని దాచి ఉంచడానికి ఏవైనా ముడుపులు తీసుకున్నటువంటి తప్పు మార్గంలో నడిచిందా? అదే జరిగివుంటే ప్రతిపక్షం సహనంగా ఉండటానికి కారణమే లేదు. ఇక రెండో నిర్ధారణ నిస్సందేహంగా ఇప్పుడు స్పష్టమైంది. గత మూడు దశాబ్దాల్లో ఈ డ్రామాను రెండు సార్లు విభిన్నమైన ఫలితాలతో చూశాం. మొదటిది బోఫోర్స్. రాజీవ్ గాంధీ స్పష్టంగా విజ్ఞతను ప్రదర్శించి ఉంటే ఆరోపణ వచ్చిన తొలిరోజే విచారణకు ఆదేశించి, నేరస్థులను శిక్షిస్తానని హామీ ఇవ్వడం ద్వారా బోఫోర్స్ కుంభకోణం నుంచి బయట పడేవారు. కానీ రాజీవ్ తప్పు మీద తప్పు చేసుకుంటా వెళ్లిపోయారు. స్విస్ అకౌంట్ వివరాలు వెలికి రాకముందే రాజీవ్ ఈ అంశంలో నిజాయితీతో లేరని, తప్పు చేశారని అనుమానం వచ్చేలా వ్యవహరించారు. దీని పర్యవసానమేమిటో స్పష్టమే. సరే, మీరు పరిశుద్ధులే. కానీ, ఎవరో చేసినప్పటికీ దేశం కోసం సరైన, నిజ మైన, పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి దోషులను పట్టుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అందుకే 32 ఏళ్లు గడిచినా బోఫోర్స్ ముడుపులకు సంబం ధించి ఎవరినీ పట్టుకోలేకపోయారని కాంగ్రెస్ వ్యాఖ్యానించగలిగింది. కనీసం ఒక్క క్రోనా(స్వీడిష్ కరెన్సీ) స్వాధీనం కాలేదు. అదేసమయంలో కోల్పోయిన కాంగ్రెస్ ప్రతిష్ట కూడా తిరిగి రాలేదు. ఢిల్లీ హైకోర్టు దాన్ని కొట్టేసిందనే విషయం పక్కనబెడితే, బోఫోర్స్ మచ్చ మిగిలే ఉంది. ఇక రెండోది, సుఖోయ్–30 కొనుగోళ్లు కూడా పెద్ద కుంభకోణ మేనని మార్మోగింది. 1996లో ఎన్నికలు ప్రకటించినప్పటికీ పి.వి.నర సింహారావు ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకం చేయడమే కాకుండా, పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా చెల్లించింది. ఈ విషయంలో ఏ నిబంధనలూ సక్రమంగా పాటించలేదు. ఇప్పటి ప్రమాణాలను బట్టి చూస్తే దాన్ని దేశద్రోహంగానే పిలవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష బీజేపీ నాయకులపై నమ్మకంతోనే ఆయన అలా వ్యవహరించారు. తరువాత ప్రధాని అయిన దేవెగౌడ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న ములా యం సింగ్ యాదవ్ అన్ని ఫైళ్లను తెరిచి ప్రతిపక్షంలోని పెద్దలందరినీ వదిలిపెట్టేశారు. తెలివిగా సాగిన రాజకీయ నేతల కుమ్మక్కు వ్యవహా రంపై మనం గతంలో ఓ కథనంలో పేర్కొన్నాం. 23 ఏళ్లు గడిచిపోయినా ఇంతవరకూ ఎవరూ సుఖోయ్ గురించి ప్రశ్నించలేదు. భారత వైమానిక దళానికి ఇప్పటికీ సుఖోయ్ విమానాలే ప్రధాన ఆధారం, బలం కూడా. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఎక్కడిదో మీరు గమ నించే ఉంటారు. తాను పరిశుద్ధుడనని, తనను నిష్కారణంగా అనుమా నిస్తున్నారని, తాను బాధితుడనని చెప్పుకుని తనకున్న పేరు ప్రఖ్యాతుల ద్వారా మోదీ బయటపడిపోతారనుకుంటే పొరపాటు. రహస్యాలను కాపాడుకోవడంలో ఈ సర్కారుకు అమోఘమైన ప్రావీణ్యం ఉన్నదన్న అభిప్రాయానికి భిన్నంగా రఫేల్æ పత్రాలు ప్రముఖులంతా కొలువుదీరే ఢిల్లీలోని లూటెన్స్‌లో సులభంగా లభ్యమవుతున్నాయి. కనీసం ఈ దశ లోనైనా ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బావుంటుంది. విమ ర్శకులు, జర్నలిస్టులపై దాడి చేయడం కాకుండా, వారి ప్రశ్నలకు సమా ధానాలివ్వాలి. అలా చేయకపోతే, ఈ వ్యవహారం చాలా సులువుగా వారిని ముంచెత్తకమానదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
పారదర్శకత సర్కారు బాధ్యత
నాలుగేళ్లక్రితం రఫేల్ ఒప్పందంపై సంతకాలు అయింది మొదలు దాని చుట్టూ అల్లుకుంటున్న అనేకానేక ఆరోపణలకూ, సందేహాలకూ ఇప్పట్లో ముగింపు ఉండకపోవచ్చునని తాజాగా వెల్లడైన మరో అంశం నిరూపిస్తోంది. మన దేశం, ఫ్రాన్స్ మధ్య ఈ ఒప్పందంపై చర్చలు సాగుతున్న సమ యంలో ప్రధాని కార్యాలయం అధికారుల తీరుపై రక్షణ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఒక ఆంగ్ల దినపత్రిక వెల్లడించడంతో ఈ వ్యవహారంలో మళ్లీ కొత్త సందేహాలు పుట్టుకొ చ్చాయి. రఫేల్ ఒప్పందంపై ఏడుగురు సభ్యులున్న రక్షణ శాఖ అధికారుల బృందం ఫ్రాన్స్‌తో చర్చిస్తుండగా, దానికి సమాంతరంగా అదే అంశంపై ప్రధాని కార్యాలయం (పీఎంఓ) అధికారులు కూడా ఫ్రాన్స్‌తో మంతనాలు జరపడాన్ని అప్పట్లో ఆ శాఖను చూస్తున్న మంత్రి మనోహర్ పారికర్ దృష్టికి రక్షణ అధికారులు దృష్టికి తీసుకొచ్చారని ఆ కథనం చెబుతోంది. ఇది సరికాదని పీఎంఓకు చెప్పమన్నా పారికర్ ఈ విషయంలో చొరవ తీసుకోలేదు. ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా సీతారా మన్ ఏం చెప్పినా, ఎలా సమర్థించుకున్నా ఆ విషయంలో రేగిన అనుమానాలు రూపుమాసిపోవు. ఒక వ్యవహారంలో ఆరోపణలొచ్చినప్పుడు, సందేహాలు వ్యక్తమైనప్పుడు దానికి సంబంధిం చిన సమస్త అంశాలను తేటతెల్లం చేయడం పాలకుల కనీస కర్తవ్యం. ప్రభుత్వం ఆ పని చేయనంత మాత్రాన వాస్తవాలు మరుగునపడి ఉండిపోతాయనుకోవడం సరికాదు. మీడియా చురుగ్గా పని చేసేచోట ఎప్పుడో ఒకప్పుడు అవి వెల్లడవుతాయి. ప్రభుత్వ తీరును ప్రశ్నార్థకం చేస్తాయి. అప్పుడు ఆ అనుమానాలు మరింత చిక్కబడతాయి. ఒప్పందంలో ఇంతవరకూ డబ్బులు చేతులు మారింది లేదు.. రఫేల్ విమానాలు మన దేశానికి వచ్చింది లేదని బీజేపీ నేతల వాదన. కాబట్టి స్కాం కాదం టున్నారు. అలాగే ఈ విమానాల ఉత్పత్తికి భారత్‌లో ఏ సంస్థను భాగస్వామిగా చేర్చుకోవాలో నిర్ణ యించుకునే స్వేచ్ఛ ఒప్పందం ప్రకారం రఫేల్ విమానాలు ఉత్పత్తి చేసే డస్సాల్ట్ సంస్థకే ఉంద న్నదీ నిజమే కావొచ్చు. కానీ ఎప్పటికప్పుడు సంజాయిషీ ఇవ్వడం తప్ప సమగ్రంగా అన్నిటినీ ప్రజల ముందు ఎందుకు ఉంచరు? రఫేల్ ఒప్పందంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచా రణ సమయంలో కేంద్రం నివేదించిన వివరాల్లో పీఎంఓ పాత్ర గురించిన ప్రస్తావన ఎందుకు లేదు? ఒక్కసారి వెనక్కి వెళ్లి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి దారితీసిన పూర్వాప రాలు తెలుసుకుంటే ఇదిలా ఎడతెగకుండా సాగడం వల్ల జరిగే నష్టమేమిటో అర్ధమవుతుంది. 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇదే డస్సాల్ట్‌తో యుద్ధ విమానాల గురించి చర్చలు సాగాయి. దాదాపు ఒప్పందం కుదిరే దశలో అదంతా నిలిచిపోయింది. చర్చల సందర్భంగా ఆ సంస్థ 126 యుద్ధ విమానాలు మనకు సమకూర్చేందుకు...అందులో 18 విమానాలను 2015 కల్లా అందించేందుకు అవగాహన కుదిరింది. మిగిలిన 108 విమానాలనూ అవసరమైన సాంకేతిక పరి జ్ఞానాన్ని అందించడం ద్వారా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో ఉత్పత్తి చేసేం దుకు ఏడేళ్లపాటు సహకరిస్తామని చెప్పింది. అయితే డస్సాల్ట్–హెచ్ఏఎల్ మధ్య జరిగిన తదుపరి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈలోగా రఫేల్ యుద్ధ విమానాల సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతూ మీడియాలో కథనాలు రావడంతో ఆ ఒప్పందం సాకారం కాలేదు. రక్షణ కొనుగోళ్లకు ఒప్పందాలు ఖరారు కావడానికి ముందో, తర్వాతో ఆరోపణలు ముసురుకోవడం మన దేశంలో రివాజుగా మారింది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రక్షణ శాఖను తానే చూస్తూ, తనకు అత్యంత సన్నిహితుడైన అరుణ్‌సింగ్‌ను ఆ శాఖలో సహాయమంత్రిగా నియమించారు. 1987లో బోఫోర్స్ శతఘ్నుల ఒప్పందంపై ముసురుకున్న వివాదం ఎన్ని మలుపులు తీసుకుందో, అత్యంత భారీ మెజారిటీ సాధించి అధికారంలోకొచ్చిన రాజీవ్ దాని పర్యవసానంగా రాజకీయంగా ఎంత దెబ్బతిన్నారో అందరికీ తెలుసు. దానికి విరుగుడుగా నిజాయితీపరులని పేరున్న నేతలను ఎంచు కుని వారికి రక్షణ శాఖ కట్టబెట్టడం ఆనవాయితీగా మారింది. వాజపేయి హయాంలో జార్జి ఫెర్నాండెజ్, యూపీఏ ఏలుబడిలో ఏకే ఆంటోనీ, మోదీ ప్రభుత్వం మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ అందుకే అప్పగించారు. కానీ వీరు కూడా ఆరోపణల భారాన్ని మోయక తప్పలేదు. కొనుగోళ్లకు సంబంధించి, వాటి పారదర్శకతకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందు తున్నాయి. దళా రుల ప్రమేయం లేకుండా చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబు తున్నారు. కానీ చివరాఖరికి ఆరోపణలు మాత్రం తప్పడం లేదు. వీటి తక్షణ ఫలితమేమంటే... మన రక్షణ దళాలకు అవసరమైన యుద్ధ విమానాలు, శతఘ్నులు, ఇతర పరికరాలు సకాలంలో సమకూరడం లేదు. రఫేల్ ఒప్పందంలో లొసుగులున్నాయంటున్న విపక్షాలు దాన్ని బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయి. విపక్షాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మినహా మరెవరూ ఈ విషయాన్ని పెద్దగా మాట్లాడటం లేదు. ఆయన శక్తి అంత సరిపోతున్నట్టు లేదు. ఇతర నేతలకు రఫేల్ వ్యవహారంపై ఆసక్తి లేదో... వారికి అసలు అవగాహనే కొరవడిందో చెప్పలేం. ఈమధ్యే కోల్‌కతాలో జరిగిన విపక్ష ర్యాలీలో ఈ స్కాంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు విపక్షాల బలహీనతను పట్టిచూపుతుంది. బాబు గారికి రఫేల్ ఫైటర్ జెట్ విమానాలకూ, జెట్ ఎయిర్వేస్ విమానాలకూ తేడా తెలియదు. విపక్షాలు ఇలాంటి దైన్యస్థితిలో ఉండటం ప్రభుత్వానికి వరమే కావచ్చుగానీ... దాపరికం అంతిమంగా తమకే చేటు తెస్తుందని అది గుర్తించడం అవసరం. రక్షణ శాఖ బృందం చర్చిస్తుండగా ఈ ఒప్పందంలో పీఎంఓ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందో, రక్షణ శాఖ కార్యదర్శి అభిప్రాయాన్ని ఎందుకు బేఖాతరు చేశారో వివరించడం దాని బాధ్యత. మీడియాలో వచ్చినప్పుడల్లా సంజాయిషీ ఇస్తూ, ఎదురుదాడులు చేస్తూ పోయే వ్యూహాన్ని విడిచి అన్నిటినీ పారదర్శకంగా ప్రజల ముందుంచాలి. -
రఫేల్‌పై తాజా పోస్టర్ కలకలం
భోపాల్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలక, విపక్ష పార్టీల మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను రాముడిగా, ప్రధాని నరేంద్ర మోదీని పదితలలతో కూడిన రావణుడిగా చూపుతూ ఏర్పాటైన పోస్టర్ కలకలం రేపుతోంది. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో పాలక బీజేపీని దోషిగా చూపుతూ ఈ పోస్టర్లు వెలిశాయి. రఫేల్ విమానంపై ప్రధాని మోదీ ఫోటోను చూపుతూ ‘ కాపలాదారే దొంగ’ అనే క్యాప్షన్‌ను పొందుపరిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్ధానిక నేతలు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఈ తరహా పోస్టర్లను ప్రదర్శించడం వివాదాస్పదమవుతోంది. బిహార్ రాజధాని పట్నాలో ఇటీవల రాహుల్‌ను రాముడిగా చూపుతూ వెలిసిన పోస్టర్లు దుమారం రేపాయి. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందు రాహుల్ గాంధీని శివభక్తుడిగా చూపే పోస్టర్లు భోపాల్‌లో కాంగ్రెస్ మద్దతుదారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రియాంక, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ శ్రేణులు కూడా గతంలో పలు నగరాల్లో హోర్డింగ్‌లు, పోస్టర్లను ప్రదర్శించాయి. -
పీఎంవో సమీక్షను జోక్యంలా భావించలేం
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో రక్షణ శాఖ నిర్ణయాలకు భిన్నంగా ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుందని, ఫ్రాన్స్ ప్రభుత్వంతో సమాంతరంగా చర్చలు జరిపిందన్నఓ జాతీయ పత్రిక కథనాన్ని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. పీఎంవో సమీక్షను జోక్యంగా భావించలేమని అన్నారు. ఇదే నివేదికలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఇచ్చిన వివరణను మీడియా ప్రస్తావించలేదన్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వంతో రఫేల్ ఒప్పందంపై చర్చలను ప్రస్తావిస్తూ అంతా సజావుగా సాగుతుందని పారికర్ స్వదస్తూరితో రాసిన నోట్‌ను మీడియా ఉద్దేశపూర్వకంగా విస్మరించిందన్నారు. రఫేల్‌పై పార్లమెంట్లో, న్యాయస్ధానాల్లోనూ ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని, దీనిపై ఇంకా మాట్లాడటం సమయం వృధాయేనని పేర్కొన్నారు. రఫేల్‌పై ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ సమాధానం ఇచ్చిందన్నారు. కాగా రఫేల్ ఒప్పందంలో పీఎంవో జోక్యంపై రక్షణశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసిందంటూ జాతీయ మీడియా ప్రచురించిన కథనంతో రఫేల్ వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపింది. రఫేల్ ఒప్పందం విషయంలో రక్షణశాఖ నిర్ణయాలకు భిన్నంగా పీఎం కార్యాలయం వ్యవహరిస్తూ ఫ్రాన్స్‌తో సమాంతరంగా చర్చలు జరిపిందన్న కథనంతో మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విరుచుకుపడ్డారు. రఫేల్ డీల్‌లో తన సన్నిహితుడు అనిల్ అంబానీకి భాగస్వామ్యం కట్టబెట్టేందుకు చౌకీదార్ మోదీ ప్రయత్నించారనేందుకు రక్షణ శాఖ నోట్ నిదర్శనమని నిప్పులు చెరిగారు. -
పరామర్శలోనూ రాజకీయాలా?
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించి, దానిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం తగదని గోవా సీఎం మనోహర్ పారికర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. మంగళవారం పారికర్‌ను పరామర్శించిన అనంతరం రాహుల్‌గాంధీ కోచిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ తమ మధ్య రఫేల్ కుంభకోణంపై చర్చ జరిగిందని వెల్లడించిన విషయం విదితమే. అనిల్ అంబానీకి ప్రయోజనం కలిగించేందుకు మోదీ ప్రయత్నించారని, ఈ విషయంలో పారికర్ తనకు సంబం ధం లేదని తెలిపారని రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పనాజీలోని గోవా అసెంబ్లీ భవనంలో పారికర్ మాట్లాడుతూ ‘రాహుల్‌తో నా భేటీ కేవలం అయిదు నిమిషాలు మాత్రమే జరిగింది. ఆ భేటీలో రాహుల్ రఫేల్‌పై మాట్లాడలేదు. అసలు భేటీలో ఆ అంశమే ప్రస్తావనకు రాలేదు’ అని స్పష్టం చేశారు. తనతో జరిగిన పరామర్శ భేటీని కూడా రాహుల్ అల్పమైన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా రాహుల్‌పై మండిపడ్డారు. -
దేశ రక్షణలో రాజీ లేదు!
న్యూఢిల్లీ: భారత్ శాంతికాముక దేశమే అయినా.. దేశ రక్షణ విషయంలో రాజీ పడబోదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. యుద్ధ విమానాలు, సాయుధ దళాల ఆధునీకరణలకు సంబంధించి దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షణ రంగ ప్రాజెక్టులకు తాము అధికారంలోకి వచ్చాకే మోక్షం వచ్చిందని మోదీ గుర్తు చేశారు. దేశీయంగా క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో మోదీ స్పందించారు. తాను స్వప్నిస్తున్న ‘నవ భారత్’లో అవినీతికి చోటు లేదన్న మోదీ.. అవినీతికి పాల్పడిన వారిని ఎంతవారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్సీసీ క్యాడెట్లను ఉద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు. ‘మీ భవిష్యత్తును నిర్దేశించేవి మీ కుటుంబం, మీ ఆర్థిక నేపథ్యం కాదు.. మీ పట్టుదల, మీ నైపుణ్యం, మీ ఆత్మవిశ్వాసమే బంగారు భవితకు బాటలు వేస్తుంది’ అని అన్నారు. వీఐపీ సంస్కృతి స్థానంలో తన ప్రభుత్వం ఈపీఐ(ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్– ప్రతీ వ్యక్తి ప్రముఖుడే) సంస్కృతిని చేర్చిందన్నారు. గ్రామాల నుంచి వచ్చి ఎన్సీసీలో శిక్షణ పొందుతున్న వారిని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. తమ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా రక్షణ శాఖలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ భవిష్యత్‌లో దేశ భద్రతకు తోడ్పడతాయని ధీమా వ్యక్తం చేశారు. అప్పటివరకు దేశ ప్రజలు తమపై భరోసా ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని.. రాబోయే ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటు వేసేలా యువతను ప్రోత్సహించాలని వారికి సూచించారు. ఇక తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి యువత భారీగా మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు. లింగ వివక్షకు తావీయకుండా స్త్రీ, పురుషులిద్దరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ ఉద్ఘాటించారు. మహిళలను యుద్ధ విమానాలకు పైలట్లుగా నియమించామని, నేవీలోని మహిళా దళాలు ప్రపంచాన్ని చుట్టివచ్చాయని తెలిపారు. మిలటరీ సహా పలు కీలక విభాగాల్లో మహిళలను భాగస్వామ్యం చేసేలా తమ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. బెంగాల్లో ప్రధాని ర్యాలీ ప్రాంతం మార్పు పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 2న ప్రధాని మోదీ పాల్గొననున్న బహిరంగ సభ స్థలాన్ని మార్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వెల్లడించారు. ముందుగా అనుకున్నట్లు నార్త్ 24 పరగణా జిల్లాలోని థాకూర్‌నగర్‌లో కాకుండా దానికి సమీపంలోని మరో స్థలంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
పేదలకు కనీస ఆదాయ భద్రత
న్యూఢిల్లీ/పణజీ/రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయ భద్రత కల్పించి పేదరికాన్ని రూపుమాపుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రకటించారు. దీంతో ‘పేదరికాన్ని తొలగించండి’(గరీబీ హఠావో) అంటూ 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఇచ్చిన నినాదాన్ని మళ్లీ రాహుల్ అందుకున్నట్లైంది. ప్రధాని మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరిగ్గా 4రోజుల ముందు కాంగ్రెస్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రైతుల ర్యాలీలో సోమవారం రాహుల్ మాట్లాడారు. ‘చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రజలందరికీ కనీస ఆదాయ భద్రతను కాంగ్రెస్ కల్పించబోతోంది. దీంతో దేశంలో ఆకలి, పేదరికం అనేదే ఉండదు’ అని రాహుల్ అన్నారు. చెప్పింది చేస్తానని, పథకాన్ని దేశమంతటా అమలు చేస్తానన్నారు. ర్యాలీలో బీజేపీపై రాహుల్ పలు విమర్శలు చేశారు. 15 మంది బడా పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.3.5కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసిందనీ, రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు. మోదీ ప్రభుత్వం రెండు భారత దేశాలను సృష్టించాలని ప్రయత్నిస్తోందనీ, వాటిలో ఒకటి రఫేల్ కుంభకోణం, అనీల్ అంబానీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ తదితరులు ఉండే దేశం కాగా, ఇంకొకటి పేద రైతులు ఉండే దేశమని రాహుల్ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు ఓటేసి భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టిన రైతులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ ర్యాలీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. కనీస ఆదాయ భద్రత హామీపై బీజేపీ స్పందించింది. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన వందలకొద్దీ అబద్ధపు హామీల్లో ఇదొకటనీ, వాటిని అమలు చేయడం ఆ పార్టీకి కుదరని పని అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆ టేపులు నిజమైనవే రఫేల్ ఒప్పందానికి సంబంధించిన వ్యాఖ్య లున్న గోవా ఆడియో టేపులు నిజమైనవేనని రాహుల్ ఆరోపించారు. గోవా ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ రక్షణ మంత్రి మనోహరీ పరీకర్ వద్ద రఫేల్ ఒప్పందం గురించిన భారీ రహస్యాలు ఉన్నాయనీ, వాటి వల్లనే ప్రధాని నరేంద్ర మోదీపై అధికారం చెలాయించే అవకాశం పరీకర్‌కు దక్కిందని రాహుల్ అన్నారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన రహస్య పత్రాలు పరీకర్ వద్ద ఉన్నాయి కాబట్టే ఆయన పదవిలో ఉన్నాడంటూ గోవా మంత్రి విశ్వజిత్ రాణే ఒక గుర్తు తెలియని వ్యక్తికి చెబుతున్న ఆడియో టేపులు ఈ నెల మొదట్లో బయటపడటం తెలిసిందే. రాహుల్ మాట్లాడుతూ ‘30 రోజులవుతున్నా వీటిపై విచారణేదీ లేదు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మంత్రిపై ఏ చర్యలూ లేవు. ఈ ఆడియోటేపులు నిజమైనవేనని తెలుస్తోంది. రఫేల్ రహస్య పత్రాలు పరీకర్ దగ్గర ఉన్నాయి’ అని అన్నారు. రఫేల్ డీల్‌కు చెందిన ఆధారాలు తన పడకగదిలో ఉన్నాయంటూ పరీకర్ వ్యాఖ్యానించినట్లుగా గతంలో వచ్చిన వార్తలపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటలయుద్ధం జరిగింది. ఆ ఆడియో టేపులు నకిలీవనీ, నిజాలను దాచి అబద్ధాలను వ్యాప్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని పరీకర్ అప్పట్లో చెప్పారు. బీజేపీ నేత అనంతకుమార్ హెగ్డే కేంద్ర మంత్రి పదవిలో ఉండేందుకు అనర్హుడనీ, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని రాహుల్ అన్నారు. అంతకుముందు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ భార్యను ఉద్దేశించి హెగ్డే అనుచిత వ్యాఖ్యలు చేశారు. గోవాలో రాహుల్, సోనియా రాహుల్ తన తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియాతో కలిసి శని, ఆదివారాల్లో గోవాలో వ్యక్తిగతంగా పర్యటించారు. పార్టీ నేతలతో సమావేశాలు అక్కడ ఏర్పాటు చేయలేదు. ఆదివారం వారు ఓ బీచ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. కాగా, గోవాలో మండోవి నదిపై తమ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 5.1 కిలో మీటర్ల పొడవైన తాళ్ల వంతెనను రాహుల్ సందర్శించి, దేశాన్ని బీజేపీ ఎలా మారుస్తుందో చూడాలని రాహుల్‌ను ట్విట్టర్లో బీజేపీ కోరింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు మీదుగా ఈ వంతెనకు అటల్ సేతు అని పేరు పెట్టారు. -
‘మిషెల్ మామ’తో బంధమేంటి?
షోలాపూర్: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో తమపై ఆరోపణలు చేసేలా కాంగ్రెస్‌ను ప్రేరేపిస్తున్నది ఏంటో ఆ పార్టీ చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని మోదీ ఉటంకిస్తూ, అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా ఉండి అరెస్టయిన క్రిస్టియన్ మిషెల్.. యూపీఏ కాలం నాటి రఫేల్ ఒప్పందంలో డసో ఏవియేషన్ ప్రత్యర్థిగా ఉన్న మరో కంపెనీ యూరోఫైటర్ తరఫున లాబీయింగ్ చేశాడనీ, కంపెనీకి, ప్రభుత్వ పెద్దలకు నడుమ కూడా మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపించారు. ఈ విషయం నిజమో కాదో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. ‘రఫేల్ అంశంలో కాంగ్రెస్‌లోని ఏ నేతతో మిషెల్‌కు సంబంధాలున్నాయో ఆ పార్టీ చెప్పాలి. ఖర్చు పెట్టిన ప్రతీ పైసాకు లెక్క చూపాలి’ అని డిమాండ్ చేశారు. ఉన్నత కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్‌సభ సజావుగా ఆమోదించడమే.. తమపై అబద్ధాలు వ్యాప్తి చేస్తున్న వారికి గట్టి సమాధానమని మోదీ అన్నారు. దళితులు, గిరిజననులు తదితరుల హక్కులపై ఈ బిల్లు ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఆయన బుధవారం పర్యటించి పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ‘గత ప్రభుత్వాల కాలంలో మధ్యవర్తుల వ్యవస్థ పాలనలో భాగంగా ఉండేది. ఆ ప్రభుత్వాలు పేదల హక్కులను హరించాయి. దేశ భద్రతతోనూ ఆటలాడుకున్నాయి’అని మోదీ అన్నారు. అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు తెచ్చిన బిల్లుపై మోదీ మాట్లాడుతూ, దీని కారణంగా అస్సాం లేదా ఇతర ఈశాన్య రాష్ట్రాల ప్రజల హక్కులకు భంగం కలగదన్నారు. నన్నెవరూ కొనలేరు, భయపెట్టలేరు.. అవినీతిని శుభ్రం చేసేందుకు తాను నడుం బిగించాననీ, వెనక్కు తగ్గకుండా పనిచేసుకుపోతానని మోదీ వివరించారు. ‘మోదీని ఎవరూ కొనలేరు, భయపెట్టలేరు. ఈ కాపలాదారుడు నిద్రపోడు. తప్పుచేసే వాళ్లను చీకట్లోనూ పట్టుకోగలడు. వాళ్లు నన్ను దుర్భాషలాడటం ఆపకపోవచ్చు. కానీ అవినీతిని అంతం చేయాలన్న నా పనిని నేను విడిచిపెట్టను’ అని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాహుల్ వర్సెస్ మోదీ జైపూర్: ‘మహిళ’ కేంద్రంగా బుధవారం ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మధ్య వేర్వేరు వేదికలపై మాటల యుద్ధం చోటు చేసుకుంది. రాజస్తాన్‌లోని ఒక ర్యాలీలో రాహుల్ ప్రధానిని ఉద్దేశిస్తూ ‘56 అంగుళాల ఛాతీ కలిగిన మన దేశ చౌకీదార్ పార్లమెంటు నుంచి పారిపోయారు. రఫేల్‌కు సంబంధించి నేనడిగిన చిన్న ప్రశ్న కు బదులివ్వలేక ఒక మహిళ అయిన రక్షణ మంత్రి సీతారామన్‌జీకి ఆ బాధ్యత అప్ప గించి తప్పించుకున్నారు’ అని అన్నారు. మహిళను అవమానించారు ఆగ్రా: జైపూర్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రాలో ప్రధాని మోదీ స్పందించారు. ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ‘వారు ఒక మహిళను, దేశ రక్షణమంత్రిని అవమానించే స్థాయికి దిగజారారు. ఇది దేశ మహిళలను, మహిళాశక్తిని అవమానించడమే. అందుకు వారు శిక్ష అనుభవించక తప్పదు’ అని కాంగ్రెస్ అధినేతపై విరుచు కుపడ్డారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ నోటీసు పంపించినట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. -
రఫేల్‌పై మళ్లీ వాగ్యుద్ధం
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై శుక్రవారం లోక్‌సభలో అధికార, విపక్షాల మధ్య మరోసారి వాడివేడి చర్చ జరిగింది. ఈ ఒప్పంద విషయమై కేంద్రం సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని, ప్రధాని స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముడుపులు అందని కారణంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం రఫేల్ ఒప్పందాన్ని అడ్డుకుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఎన్డీయే హయాంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే రక్షణ శాఖ పనిచేస్తోందని పరోక్షంగా యూపీయే నాటి బోఫోర్స్, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణాల్ని ప్రస్తావించారు. బోఫోర్స్‌తో కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని, కానీ రఫేల్‌తో మోదీ మళ్లీ ప్రధాని అవుతారని పేర్కొన్నారు. 1.30 లక్షల కోట్ల కుంభకోణం: కాంగ్రెస్ కల్పిత కాగ్ నివేదికను ఉటంకించి సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం తప్పుదోవపట్టించిందని కాంగ్రెస్ మండిపడింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ..ప్రధాని మోదీ తన సన్నిహితుడికి ఆఫ్సెట్ కాంట్రాక్టును కట్టబెట్టారని, ఈ మొత్తం వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ‘రఫేల్ ఒప్పందంలో రూ.1.30 లక్షల కోట్ల కుంభకోణం ఇమిడి ఉంది. ఈ ఒప్పందంపై చర్చించేందుకు మోదీ..ఏఏ(అనిల్ అంబానీ)ని తన విమానంలోనే తీసుకెళ్లారు. పార్లమెంట్ కోర్టులోనే నిజాన్ని నిగ్గు తేల్చాలి. ప్రధాని పార్లమెంట్‌కు వచ్చి సమాధానం చెప్పే వరకు సమస్య పరిష్కారం కాదు. అవసరం లేని చోట మాట్లాడే మోదీ..దేశం ఆయన మాటలు వినాలనుకున్నప్పుడు మౌనం వహిస్తున్నారు’ అని ఖర్గే అన్నారు. బోఫోర్స్ కుంభకోణం..రఫేల్ డీల్.. రఫేల్‌లో ఎలాంటి స్కాం లేదని, జాతీయ భద్రత కోసం కుదుర్చుకున్న ఆ ఒప్పందంపై అసత్య ప్రచారం చేస్తూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. యూపీయే నాటి రక్షణ ఒప్పందం బోఫోర్స్ ఒక కుంభకోణమని, కానీ రఫేల్ ఒక ఒప్పందమని వ్యాఖ్యానించారు. యూపీయే హయాంలో రఫేల్‌పై జరిగిన బేరసారాలను ప్రస్తావిస్తూ..‘రఫేల్ ఒప్పందం మీకు నప్పలేదు. దాని నుంచి మీకు ఎలాంటి ముడుపులు రాలేదు. అందుకే, ఓ వైపు వైమానిక దళం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కీలకమైన రఫేల్ ఒప్పందాన్ని చాలా రోజుల పాటు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఒప్పందాల్లో క్యూ(ఖత్రోచి), ఆర్వీ(రాబర్ట్ వాద్రా) ఉన్నారు’ అని మండిపడ్డారు. బోఫోర్స్‌తో కాంగ్రెస్ ఓటమిపాలవగా, రఫేల్‌తో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి సరికొత్త భారత్‌ను నిర్మిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్లైఅవే(ఎగరడానికి సిద్ధంగా ఉన్న) విధానంలో 36 యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి వైమానిక దళమే సూచించిందని గుర్తు చేశారు. యూపీయే హయాంలో ఫ్లైఅవే విధానంలో కేవలం 18 విమానాలే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 126 యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో సొంత పార్టీ ఖజానా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ దేశ భద్రతపై రాజీపడిందని ఆరోపించారు. మేమొస్తే రఫేల్‌పై దర్యాప్తు : రాహుల్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే రఫేల్ ఒప్పందంపై విచారణ చేపడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. దోషుల్ని శిక్షించకుండా వదిలిపెట్టమని హెచ్చరించారు. పార్లమెంట్ బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ...రఫేల్‌పై చర్చకు రాకుండా ప్రధాని మోదీ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రఫేల్ ఒప్పందంపై విచారణ జరపడం తమ పరిధిలో లేదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ అసలు విచారణే వద్దని ఆదేశించలేదని అన్నారు. కొనుగోలు చేయాల్సిన విమానాల్ని 126 నుంచి 32కు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. లోక్‌సభలో సీతారామన్ వివరణ ఇచ్చిన తరువాత రాహుల్ స్పందిస్తూ..రఫేల్ ఒప్పందంపై తాను సంధించిన ప్రశ్నలకు ఆమె బదులివ్వలేదని తెలిపారు. ‘ప్రధాని పార్లమెంట్‌కు రారు. గోవా ముఖ్యమంత్రేమో రఫేల్ ఫైల్స్ తన వద్ద ఉన్నాయని అంటున్నారు. రక్షణ మంత్రి రెండు గంటలు ప్రసంగించినా నేను అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు’ అని రాహుల్ అన్నారు. -
రఫేల్‌పై తీర్పును పునఃసమీక్షించండి
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుపై వెలువరించిన సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ బుధవారం సుప్రీం కోర్టును కోరారు. 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 14న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎటువంటి సంతకాలు లేకుండా ప్రభుత్వం సమర్పించిన సీల్డ్‌కవర్ నివేదికపై ఆధారపడి సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించిందని వారు కోర్టుకు విన్నవించారు. ‘కేవలం నమ్మశక్యంకాని ఆధారాల ఆధారంగా కోర్టు ఈ తీర్పునిచ్చిందని భావిస్తున్నాం. కనీసం సంతకాలు కూడా లేని సీల్డ్‌కవర్ నివేదికపై తీర్పు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమ’ని యశ్వంత్‌సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత భూషణ్‌లు పిటిషన్లో వివరించారు. తీర్పును రిజర్వ్ చేసిన తరువాత అనేక కొత్త వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, వాటి మూలాల్లోకి వెళ్లి కోర్టు విచారించాలని, ఆ లోపు తీర్పును సమీక్షించాలని వారు కోర్టుకు విన్నవించారు. -
పరీకర్ పడకగదిలో ‘రఫేల్’ ఫైల్స్!
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఓ దస్త్రం అప్పటి రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పడక గదిలో ఉందని, ఆయన సహచర మంత్రి ఒకరు వ్యాఖ్యానిస్తున్న ఆడియోను కాంగ్రెస్ బయటపెట్టింది. అయితే ఈ వీడియో ఎంత వరకు నిజమో తెలియరాలేదు. ఓసారి కేబినెట్ సమావేశంలో పరీకర్ ఈమేరకు వ్యాఖ్యానించినట్లు గోవా మంత్రి విశ్వజిత్ రాణె గుర్తుతెలియని వ్యక్తితో అంటున్నట్లు ఆడియోలో ఉంది. రఫేల్ ఒప్పంద విషయమై మోదీని పరీకర్ బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఆడియో టేపులు అబద్ధం, కట్టుకథలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని సుప్రీంకోర్టే ఎండగట్టిందని, నిజాల్ని తారుమారు చేసేందుకు మరే మార్గం లేకపోవడంతో ఆ పార్టీ ఇలా నకిలీ ఆడియోల్ని విడుదలచేస్తోందని పరీకర్ దుయ్యబట్టారు. ఆడియోలో ఉన్నట్లుగా తానెప్పుడూ కేబినెట్ సమావేశంలోగానీ, మరే ఇతర సమావేశంలోగానీ చర్చించలేదని స్పష్టం చేశారు. ‘సీఎం పరీకర్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రఫేల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఆయన పడకగదిలోనే ఉందట. దీనర్థం.. ఏదో ఆశించే ఆయన ఆ సమాచారాన్నంతా తన వద్ద భద్రపరుచుకున్నారు’ అని రాణెను ఉటంకిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. ఈ ఆడియో కల్పితమని, దాని విడుదల వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రాణె అమిత్ షాకు చెప్పారు. పరీకర్‌కు లైడిటెక్టర్ పరీక్షలు: గోవా కాంగ్రెస్ రఫేల్ ఒప్పంద ఫైల్‌ను గుర్తించడానికి పరీకర్ నివాసంపై సీబీఐతో సోదాలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పరీకర్, ఆయన సహచరులకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కూడా కోరింది. ఈ ఆడియోను వెలుగులోకి తెచ్చిన వేగును గుర్తించి రక్షణ కల్పించాలని, దివంగత జడ్జి లోయా లాంటి పరిస్థితి ఎదురుకాకుండా, పరీకర్‌కు కూడా భద్రతను పెంచాలని గోవా కాంగ్రెస్ ప్రతినిధి సిద్ధాంత్ బుయావో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
దమ్ముంటే చర్చకు రండి
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందం సహా ఏ వ్యూహాత్మక అంశంపై అయినా దమ్ముంటే తనతో 20 నిమిషాలు ముఖాముఖి చర్చకు రావాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాలు విసిరారు. రాహుల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రధాని మోదీతో ముఖాముఖి చర్చ కోసం నాకు కేవలం 20 నిమిషాలు ఇవ్వండి. ఆ తర్వాత వాస్తవమేంటో మీరే నిర్ణయించుకోండి. కానీ ప్రధాని మోదీకి మీ(మీడియా) ముందు కూర్చుని మాట్లాడే దమ్ము లేదు. మీరంతా మంగళవారం ప్రధాని ఇంటర్వ్యూ చూశారా? ఆయనేమో అక్కడ నవ్వుతున్నారు. ఎదురుగా ఉన్న జర్నలిస్ట్ మాత్రం ప్రశ్నలతో పాటు ప్రధాని ఇవ్వాల్సిన జవాబులను చెప్పేస్తున్నారు’ అని విమర్శించారు. రఫేల్ ఆడియో టేపు విషయమై మాట్లాడుతూ..‘రఫేల్‌కు సంబంధించిన ఫైలు మొత్తం తన దగ్గర ఉందని గోవా సీఎం పరీకర్ చెప్పినట్లు ఆయన కేబినెట్ సభ్యుడు రాణే బయటపెట్టారు. తనను ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించకుండా ఉండేందుకు పరీకర్ దీన్ని వాడుకుంటున్నారు. ఇలాంటి ఆడియో టేపులు ఇంకా చాలా ఉండొచ్చు. పరీకర్ ప్రధానిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం.. రఫేల్ ఒప్పందంపై తనకు ఎలాంటి ప్రశ్నలు ఎదురుకాలేదని మోదీ చెప్పడంపై స్పందిస్తూ..‘ఆయన ఏ లోకంలో జీవిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మోదీజీ.. మీకు వ్యతిరేకంగా ప్రశ్నలు వస్తున్నాయి. మీరు అనిల్ అంబానీ(ఏఏ)కు రూ.30,000 కోట్లు ఎందుకు ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రఫేల్ ఒప్పందంపై విచారణకు ఆదేశిస్తామన్నారు. -
లోక్‌సభలో ‘రఫేల్’ రచ్చ
న్యూఢిల్లీ రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య బుధవారం పార్లమెంటులో హైడ్రామా నడిచింది. రఫేల్ వ్యవహారంలో దేశ ప్రజలకు జవాబు ఇచ్చే ధైర్యంలేక ప్రధాని మోదీ ఇంట్లో దాక్కుంటున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ సందర్భంగా రఫేల్ ఒప్పందంపై గోవా మంత్రి విశ్వజిత్ రాణే మరొకరితో ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపును సభలో వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని రాహుల్ స్పీకర్‌ను కోరారు. వెంటనే కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ స్పందిస్తూ, అవినీతిలో నిండా మునిగిన కాంగ్రెస్ మోదీ ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేస్తోందన్నారు. ఈ టేపు నకిలీ, కల్పితమని ఆరోపించారు. ఈ టేపు నిజమైనదేనని రాహుల్ నిరూపించగలరా? అని సవాలు విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే ప్రివిలేజ్ మోషన్‌ను రాహుల్ ఎదుర్కోవాల్సి ఉంటుందనీ, అలాగే సభ నుంచి సస్పెండ్ అవుతారని హెచ్చరించారు. దీంతో బీజేపీ సభ్యులు భయపడుతున్నందున ఈ టేపును పార్లమెంటులో వినిపించబోనని రాహుల్ వ్యాఖ్యానించారు. కాగా, ఆడియో టేపు నకిలీ అని తెలుసు కాబట్టే రాహుల్ భయపడి వెనక్కి తగ్గారని జైట్లీ దుయ్యబట్టారు. సభలో కాగితపు విమానాలు అరుణ్ జైట్లీ మాట్లాడుతుండగా విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగితపు విమానాలను సభలో విసిరి ఆందోళనకు దిగడంతో కార్యకలాపాలు కొద్దిసేపు స్తంభించాయి. దీంతో కాంగ్రెస్ సభ్యులపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ‘మీరంతా ఇంకా చిన్నపిల్లలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రఫేల్ టేపును సభలో వినిపించేందుకు అనుమతి నిరాకరించారు. బీజేపీ మిత్రపక్షం శివసేన సైతం విపక్షాలకు మద్దతు పలికింది. రఫేల్‌పై జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. రఫేల్ జెట్లు మంచివే అయినప్పటికీ ఒప్పందం మాత్రం లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు కావేరీ నదీజలాల వివాదంలో ఆందోళనకు దిగిన 24 మంది అన్నాడీఎంకే ఎంపీలను స్పీకర్ మహాజన్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. బీజేపీ నేతలు భయపడొద్దు: రాహుల్ లోక్‌సభలో రాహుల్ మాట్లాడుతూ..‘మీరు(మోదీ) ఈ కాంట్రాక్టును మీ ప్రియమైన మిత్రుడు ఏఏ(అనిల్ అంబానీ)కి ఎందుకు ఇచ్చారు? ఖనాజాపై రూ.30వేల కోట్ల భారాన్ని ఎందుకు మోపారు. మోదీకి పార్లమెంటులో ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే ప్రధాని తన ఇంట్లోని బెడ్రూమ్లో దాక్కుంటుంటే, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యుల వెనుక దాక్కుంటున్నారు. ఈ విషయంలో వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు ఆదేశించాలి. నిజం నిదానంగా బయటకు వస్తుంది. ప్పటికైనా మోదీ వెంటనే సభకు వచ్చి జవాబు చెప్పాలి. దేశమంతా ఆయన ఏం చెబుతారోనని ఆసక్తిగా చూస్తోంది’ అని తెలిపారు.రఫేల్ యుద్ధవిమానాల ధరను రూ.526 కోట్ల నుంచి రూ.1,600 కోట్లకు పెంచడాన్ని రక్షణశాఖ అధికారులు స్వయంగా వ్యతిరేకించలేదా? అని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఒప్పందాన్ని హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హాల్) నుంచి లాక్కుని ఏఏకు అప్పగించారని ఆరోపించారు. అలాగే యుద్ధ విమానాల సంఖ్యను 126 నుంచి 36కు తగ్గించేశారని విమర్శించారు. మోదీ ఇటీవల ఇచ్చిన 90 నిమిషాల ఇంటర్వ్యూలో రఫేల్‌పై ప్రశ్నలకు జవాబివ్వలేదని దుయ్యబట్టారు. రఫేల్ ఒప్పందం విషయంలో తనపై ఎవరూ వేలెత్తి చూపడం లేదని ప్రధాని అంటున్నారనీ, కానీ దేశమంతా ఆయనవైపే వేలెత్తి చూపుతోందని అన్నారు. జేపీసీతో నిష్పాక్షిక విచారణ జరగదు: జైట్లీ రఫేల్ ఒప్పందంలో అవకతవకల్లేవని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పిందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.అలాంటప్పుడు రఫేల్‌పై జేపీసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ‘అవినీతిలో నిండా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు అబద్ధాలను ప్రచారం చేస్తోంది. బోఫోర్స్ కుంభకోణంపై ఏర్పాటైన జేపీసీని గుర్తుకు తెచ్చుకోండి. లంచం అందుకున్నారన్న ఆరోపణలను అది కొట్టివేసింది. అసలు అవినీతే జరగలేదని స్పష్టం చేసింది. జేపీసీ అన్నది ఇరుపార్టీలకు చెందిన కమిటీ. దీనివల్ల నిష్పాక్షిక విచారణ జరగదు. యూపీఏతో పోల్చుకుంటే మా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న రఫేల్ యుద్ధవిమానం 9 శాతం చవకగా, ఆయుధ వ్యవస్థలు అమర్చిన రఫేల్ 20 శాతం చవకగా అందుబాటులోకి రానుంది. కొందరు వ్యక్తులు నిజాలను ఇష్టపడరు. వాళ్లు గత ఆరు నెలలో పార్లమెంటు లోపల, బయట రఫేల్‌పై చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధాలను వండివార్చడం వారికి వారసత్వంగా సంక్రమించింది. నిజాలను అంగీకరించలేని అలవాటు రాహుల్‌కు ఉంది. అందుకే ఆయన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడితో మాట్లాడినట్లు కట్టుకథలు అల్లారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు’ అని జైట్లీ వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కాగితపు విమానాల్ని విసరడంపై స్పందిస్తూ.. ‘ఐఏఎఫ్ కాంట్రాక్టును దక్కించుకోడానికి డసో కంపెనీతో పోటీపడిన యూరో ఫైటర్‌కు గుర్తుగా కాంగ్రెస్ నేతలు వీటిని విసురుతున్నారేమో’ అని ఎద్దేవా చేశారు. అగస్టాస్కాæం, నేషనల్ హెరాల్డ్ కేసు, బోఫోర్స్‌లో మధ్యవర్తి ఖత్రోచీ పేర్లను ప్రస్తావించిన జైట్లీ.. కాంగ్రెస్‌కు డబ్బుపై ఉన్న శ్రద్ధ దేశభద్రతపై లేదన్నారు. గతంలో పలు కుంభకోణాలకు పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారని దుయ్యబట్టారు. ‘జేమ్స్‌బాండ్’పై సంవాదం చర్చలో మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. ‘‘రాహు ల్ గతంలో జేమ్స్‌బాండ్ సినిమాలు చూసుంటారు. అందులో ‘ఏదైనా ఘటన ఒకసారి జరిగితే అనుకోకుంటే జరిగిందనుకోవాలి. రెండుసార్లు అదే జరిగితే యాదృచ్ఛికమనీ, మూడుసార్లు జరిగితే అది కుట్ర అని అర్థం చేసుకోవాలి’ అని బాం డ్ చెబుతాడు. కాంగ్రెస్ చీఫ్ అదే చేస్తున్నారు’’ అని అన్నారు. దీనికి తృణమూల్ ఎంపీ సౌగత రాయ్ స్పందిస్తూ.. ‘జైట్లీ ఆ డైలాగ్ తప్పుగా చె ప్పారు. ఓ ఘటన మొదటిసారి జరిగితే దాన్ని అనుకోకుండా జరిగిన విషయంగా భావించాలి. అదేరెండుసార్లు జరిగితేయాదృచ్ఛికమనీ, మూడు సార్లు జరిగితే అది శత్రువుల చర్య అని అర్థం చేసుకోవాలి’ అని సినిమాలో ఉంటుందన్నారు. -
సరోగసీ బిల్లుకు ఓకే
న్యూఢిల్లీ: రఫేల్ వివాదంపై రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. సభా కార్యకలాపాలకు ఆటంకం జరిగింది. అయితే ఆందోళనల నడుమనే సరోగసీ (రెగ్యులేషన్) బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కావేరీ డ్యాం సమస్యపై డీఎంకే, అన్నా డీఎంకే సభ్యులు ఉభయ సభలను నినాదాలతో హోరెత్తించారు. రఫేల్ విమానాల కొనుగోలు వివాదంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ గోయెల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రఫేల్ వివాదంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు కొనసాగడంతో ఉదయం11 గంటలకు ప్రారంభమైన రాజ్యసభ.. కొద్దిసేపటికే మరుసటి రోజుకు వాయిదా పడింది. సభ నడవడం ఎవరికీ ఇష్టం లేనట్లు ఉందంటూ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. కాగా, లోక్‌సభలో మాత్రం సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు ఆమోదం పొందింది. వినియోగదారు హక్కుల రక్షణ బిల్లుకు మాత్రం మోక్షం కలగలేదు. ఆందోళనలు తీవ్రతరం కావడంతో ఈ బిల్లుపై చర్చ సాధ్యం కాదని, దీనిపై గురువారం చర్చిస్తామని స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. 24, 26 తేదీల్లోనూ రాజ్యసభకు సెలవు సభ్యుల వినతి మేరకు రాజ్యసభకు శనివారం(డిసెంబర్ 22) మొదలుకొని బుధవారం (డిసెంబర్ 26) వరకు సెలవు ప్రకటించారు. క్రిస్మస్ను పురస్కరించుకుని డిసెంబర్ 25న మాత్రమే సెలవు దినంగా నిర్ణయిస్తూ గతంలో ప్రకటన వెలువడింది. సరోగసీ బిల్లు ముఖ్యాంశాలు ► 23–55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు, 26–55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పురుషులు మాత్రమే సరోగసీ(అద్దె గర్భం) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ► వాణిజ్య అవసరాల కోసం సరోగసీ చేపట్టడాన్ని నిషేధించారు. ► ఎన్ఆర్ఐలు, విదేశీయులు, పీఐవోలు, హోమో సెక్సువల్స్, సింగిల్ పేరెంట్స్, సహ జీవనం చేసే జంటలు సరోగసీకి అనర్హులు. ► ఒకే సంతానం ఉన్న జంటలు సైతం సరోగసికి అర్హులు కారు. కానీ వీరు ఇతర చట్టాల ప్రకారం చిన్నారులను దత్తత తీసుకోవచ్చు. ► సమీప బంధువులు అంటే సోదరి లేదా మరదలు వంటివారినే సరోగసీ కోసం అనుమతిస్తారు. ► ఓ మహిళను సరోగసీ కోసం జీవితకాలంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. ► సరోగసికి ముందుకొచ్చే మహిళకు అప్పటికే వివాహమై, ఓ కుమారుడు/కుమార్తె ఉండాలి. ► ఈ చట్టం జమ్మూకశ్మీర్ తప్ప దేశమంతటా వర్తిస్తుంది. ► 3 నెలల్లోగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సరోగసీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. -
ప్రజాస్వామ్య సంస్థలను అవమానించింది
చెన్నై: భారత ప్రజాస్వామ్య మనుగడకు కీలకమైన ఆర్మీ, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వంటి ప్రతిష్టాత్మక సంస్థలను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ ఆ పార్టీ నేతలు తనపై తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఎన్నికల ముందు అనుమానాలు రేకెత్తించేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తారనీ, తీరా ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే సంతోషంగా స్వీకరిస్తారని ఎద్దేవా చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగ్, ఆర్మీలను అవమానించారు.. భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న బొగ్గు కుంభకోణాలను ప్రస్తావిస్తూ.. ‘కాంగ్రెస్ నేతలకు ఎన్నికల సంఘం(ఈసీ), ఈవీఎంలతోనే సమస్య అని మీరు అనుకుంటూ ఉంటే ఒక్కక్షణం ఆగండి. వాళ్లు ఆర్మీ, కాగ్ సహా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకంగా ఉన్న ప్రతీ సంస్థను అవమానించారు. రఫేల్ ఫైటర్ జెట్ల కేసులో సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పును ఇవ్వకపోవడంతో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ బెదిరింపులకు లొంగకుండా నిజాయితీగా వ్యవహరించినందుకు గతంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే(జస్టిస్ దీపక్ మిశ్రా) అభిశంసన ద్వారా తొలగించేందుకు యత్నించారు’ అని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్లాలనీ, కాంగ్రెస్ నైజాన్ని బయటపెట్టాలని ఓ బీజేపీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం ఇచ్చారు. ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల వ్యవహారశైలి.. పిల్లాడు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ త ప్పంతా అతను చదువుకున్న స్కూలు, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు, పరీక్షల నిర్వాహకుడిదే అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను భారత్ క్షమించదు.. భారత ప్రజాస్వామ్యం ఉనికికి గతంలోనూ ఓసారి(1975 ఎమర్జెన్సీ పాలన) ప్రమాదం ఎదురైనప్పటికీ, ప్రజలు దాన్ని కాపాడుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. ‘బీజేపీ కార్యకర్తలు ప్రజల్లో మమేకమై కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ అప్పటికీ, ఇప్పటికీ మారలేదని వివరించాలి. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు తిరగబడటంతో ఆ పార్టీ నేతలు ఇప్పుడు మరింత జిత్తులమారిగా తయారయ్యారు. కానీ ప్రజాస్వా్యమ్యంతో ఆటలాడితే భారత్ ఈసారి కాంగ్రెస్‌ను క్షమించదు’ అని అన్నారు. -
రఫేల్‌పై పోటాపోటీగా నోటీసులు
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షాల మధ్య పోరు మరింత తీవ్రమవుతోంది. పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సోమవారం సభా హక్కుల నోటీసు ఇచ్చింది. దీనికి ప్రతిగా బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా అలాంటి నోటీసే ఇచ్చారు. కాంగ్రెస్ పంపిన నోటీసు తనకు అందిందని, దాన్ని పరిశీలిస్తున్నట్లు జీరో అవర్‌లో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. రఫేల్ ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఎందుకిచ్చారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ ఉభయ సభల్లో సభా హక్కుల తీర్మానాల్ని ప్రవేశపెట్టింది. రాజ్యసభలో గులాం నబీ ఆజాద్.. చైర్మన్ వెంకయ్య నాయుడుకు, లోక్‌సభలో మల్లికార్జున ఖర్గే.. స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఈ నోటీసులు అందజేశారు. మరోవైపు, రఫేల్ ఒప్పందంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిశికాంత్ దూబే, సంజయ్ జైశ్వాల్..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు పంపారు. కాగా, రఫేల్ విషయంపై అధికార, విపక్షాల నినాదాలతో సోమవారం లోక్‌సభ మూడుసార్లు వాయిదా పడింది. దీంతో రెండు సభలు పెద్దగా కార్యకలాపాలు చేపట్టకుండానే మంగళవారానికి వాయిదా పడ్డాయి.‡ రఫేల్‌పై కాగ్ ముసాయిదా నివేదిక రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తొలి ముసాయిదా నివేదికను రక్షణ శాఖకు పంపింది. నివేదికలోని అంశాలపై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని కోరింది. అయితే ఈ నివేదికను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు లేనట్లేనని సమాచారం. -
రఫేల్‌పై తీర్పును రీకాల్ చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కు తీసుకోవాలని (రీకాల్) కాంగ్రెస్ పార్టీ ఆదివారం కోరింది. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుదోవపట్టించేలా వ్యవహరించడంతోపాటు పార్లమెంటు సమగ్రతను దెబ్బతీసిన కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వాలంది. రఫేల్ విమానాల కొనుగోలుకు సంబంధించి కాగ్ తన నివేదికను ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి సమర్పించిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తప్పుగా చెప్పడం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత అనంద్ శర్మ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘అసలు విమానాల కొనుగోలుపై కాగ్ ఇంకా నివేదికే తయారు చేయకపోతే పీఏసీకి ఎప్పుడు అందజేసింది? పార్లమెంటుకు ఎప్పుడు సమర్పించింది’ అని ప్రశ్నించారు. రఫేల్ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి తీర్పునే ప్రభావితం చేసిన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి తీర్పును వెనక్కు తీసుకుని కేసును పునర్విచారించాలని ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తమ తప్పును అంగీకరించి, ప్రాయశ్చిత్తంగా గంగా నదిలో మునిగితేలాలని ఆనంద్ శర్మ అన్నారు. అసలు రఫేల్ విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారానే సాధ్యపడుతుందని ఆనంద్ శర్మ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పే అంతిమం: జైట్లీ రఫేల్‌పై జేపీసీని ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనే లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. సుప్రీం తీర్పే ఈ విషయంలో అంతిమమనీ, ఆ కోర్టే తమ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చాక జేపీసీ ఎందుకని జైట్లీ ఫేస్బుక్లో ప్రశ్నించారు. రఫేల్‌పై కాగ్ నివేదిక సిద్ధమయ్యాక అది ఎలాగూ పీఏసీ ముందుకు వెళ్లక తప్పదన్నారు. రఫేల్‌పై పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే కాంగ్రెస్‌కు తెలుసనీ, వారిది విధ్వంసకర పార్టీ అని విమర్శించారు. కాగా, సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం చేరిన అంశంపై అటార్నీ జనరల్ (ఏజీ), కాగ్‌లకు నోటీసులిస్తామన్న పీఏసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే నిర్ణయాన్ని పీఏసీలోని మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. -
సుప్రీంకోర్టుపైనే నిందలు వేస్తున్నారు!
రాయ్‌బరేలీ / ప్రయాగ్‌రాజ్: ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు నుంచి క్లీన్‌చీట్ లభించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం తప్పుడు వివరాలు సమర్పించినందున రఫేల్ కేసును మళ్లీ విచారించాలని కాంగ్రెస్ నేతలు కోరడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును అబద్ధాలకోరుగా చిత్రీకరించేందుకు యత్నిస్తోందని విమర్శించారు. దేశ భద్రతాబలగాలు పటిష్టం కావడం ఇష్టంలేని శక్తులతో ఆ పార్టీ జతకడుతోందని ఆరోపించారు. ‘కొందరు వ్యక్తులు కేవలం అబద్ధాలనే నమ్ముతారు.. దాన్నే ఇతరులకు వ్యాప్తి చేస్తారు’ అంటూ రామచరితమానస్‌ను ఉటంకించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం సోనియాగాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో రూ.1,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం రాయ్‌బరేలీతో పాటు ప్రయాగ్ రాజ్(అలహాబాద్)లో నిర్వహించిన బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఖత్రోచీ, మిషెల్ మామయ్యలు లేరు.. ‘సుప్రీంకోర్టును అబద్ధాల కోరుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. వీళ్ల దృష్టిలో రక్షణశాఖ, రక్షణమంత్రి, ఐఏఎఫ్ అధికారులు, ఫ్రాన్స్ ప్రభుత్వం.. ఇలా అందరూ అబద్ధాలు చెప్పేవారే. తాజాగా వీళ్లకు సుప్రీంకోర్టు అబద్ధాలు చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు భారత భద్రతాబలగాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంటే, మరోవైపు మాత్రం కొన్ని శక్తులు దేశాన్ని ఎలాగైనా బలహీనపర్చేందుకు కంకణం కట్టుకున్నాయి. కొందరు నేతల వ్యాఖ్యలకు పాకిస్తాన్ నుంచి ప్రశంసలు లభించడం వెనుక అర్థం ఏమిటి?’ అని మోదీ ప్రశ్నించారు. బోఫోర్స్, అగస్టా కుంభకోణాలను ప్రస్తావిస్తూ..‘కాంగ్రెస్ నేతలు అదేపనిగా ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. బీజేపీ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాల్లో ఖత్రోచీ(బోఫోర్స్ మధ్యవర్తి), మిషెల్(అగస్టా మధ్యవర్తి) వంటి మామయ్యలు లేరనా? ఆ మిషెల్ మామయ్యను కూడా భారత్‌కు పట్టుకొచ్చాం’ అని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలనే బెదిరించారు.. ‘ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ఓ పార్టీ(కాంగ్రెస్) తాము చట్టం, న్యాయానికి అతీతులమనీ, దేశం, ప్రజల కంటే గొప్పవాళ్లమని భావిస్తోంది. తమ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోని ప్రతీ రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను వాళ్లు నాశనం చేశా రు. ఇందులోభాగంగా భారత న్యాయవ్యవస్థను సైతం బలహీనపర్చేందుకు ప్రయత్నా లు జరిగాయి’ అని మోదీ విమర్శించారు. రైతుల సమస్యలు పట్టించుకోలేదు.. ‘జవాన్లు, రైతుల్లో ఎవ్వరినీ కాంగ్రెస్ పట్టించుకోలేదు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆరునెలైనా రుణమాఫీ కాలేదు. అంతేకాకుండా రైతులకు అరెస్ట్ వారెంట్లు జారీచేస్తున్నారు’ అని తెలిపారు. -
‘సుప్రీం’నే తప్పుదారి పట్టించారు
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం అంశంలో కేంద్ర ప్రభుత్వం తన అబద్ధాలతో సుప్రీంకోర్టునే తప్పుదారి పట్టించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదికను ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి కూడా చూపించకపోయినా పీఏసీ కాగ్ నివేదికను పరిశీలించిందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిందని బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా బీజేపీ ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడిందనీ, అసత్యాలను చెప్పిందని దుయ్యబట్టింది. రఫేల్ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ వచ్చిన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేస్తూ, ఈ ఒప్పందంలో అవకతవకలేమీ లేవంటూ ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇవ్వడం తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని 21వ పేజీ, 25వ పేరాలో ‘రఫేల్ ఒప్పందాన్ని కాగ్ పరిశీలించింది. కాగ్ నివేదికను పీఏసీ కూడా తనిఖీ చేసింది’ అని ఉంది. అయితే వాస్తవానికి రఫేల్‌పై కాగ్ నివేదిక ఇంకా కనీసం సిద్ధం కాలేదు. కాబట్టి పీఏసీ ముందుకు ఆ నివేదిక వచ్చే ప్రసక్తే లేదు. కానీ సుప్రీంకోర్టు మాత్రం కాగ్ నివేదికను పీఏసీ పరిశీలించిందని తన తీర్పులో పేర్కొంది. కోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లనే ఇలా జరిగిందనీ, కేంద్రం సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టించిందని కాంగ్రెస్‌తోపాటు ఇతర పిటిషనర్లు తాజాగా ఆరోపిస్తున్నారు. కోర్టు తీర్పు దోషాలతో కూడుకున్నదని వారంటున్నారు. కేంద్రం తప్పు కారణంగా తీర్పు ప్రభావితమైందనీ, కాబట్టి రఫేల్ కేసును సుప్రీంకోర్టు పునర్విచారించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కోరింది. టైపింగ్‌లో పొరపాటు కారణంగానే ఈ అనర్థం జరిగి సుప్రీంకోర్టుకు సమాచారం తప్పు గా వెళ్లిందని కేంద్రం శనివారం స్పష్టతనిచ్చింది. మాకు వచ్చిన వివరాల్లో అది లేదు.. పిటిషనర్లలో ఒకరైన ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టు తీర్పులోని 21వ పేజీలోని 25వ పేరా వాస్తవ దూరంగా, అబద్ధాలతో ఉంది. అంతేగాక మాకు అందించిన కేంద్రం స్పందనల్లో ఇది లేదు’ అని అన్నారు. మరో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ ‘దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వమే కదా. ఆ అఫిడవిట్‌ను అటార్నీ జనరల్ ఎలా ఆమోదించారు?’ అని ప్రశ్నించారు. రఫేల్ యుద్ధ విమానాల ధరలు, ఇతరత్రా సాంకేతికాంశాలపై సుప్రీంకోర్టు లోతుగా విచారణ జరపలేదనీ, ఒప్పందంలో అవకతవకలు తేలాలంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేయాల్సిందేనని కాంగ్రెస్ పేర్కొంది. అది టైపింగ్‌లో తప్పు.. సరిచేయండి: కేంద్రం టైపింగ్‌లో పొరపాటు కారణంగానే ఈ అనర్థం జరిగి సుప్రీంకోర్టుకు సమాచారం తప్పుగా వెళ్లిందని కేంద్రం శనివారం స్పష్టతనిచ్చింది. దీనిని సరిచేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టైపింగ్‌లో పొరపాటు కారణంగా ఈ అంశం వివాదమవుతోందని కేంద్రం కోర్టుకు విన్నవించింది. కాగ్ నివేదికను పీఏసీ పరిశీలించిందని గానీ, కాగ్ నివేదికలో కొంత భాగాన్ని మాత్రమే పార్లమెంటుకు సమర్పించామని గానీ తాము సుప్రీంకోర్టుకు చెప్పలేదని కేంద్రం స్పష్టం చేసింది. తమ స్పందనలో ‘ఈజ్’ అనే పదానికి బదులుగా ఓ చోట ‘హ్యాజ్ బీన్’ అని, మరోచోట ‘వాజ్’ అని తప్పుగా టైప్ చేయడం కారణంగానే ఇలా జరిగిందని కేంద్రం వివరించింది. అంతేతప్ప సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించే లేదా అబద్ధాలు చెప్పే ఉద్దేశం తమకు లేదంది. -
పార్లమెంటును కుదిపేసిన ‘రఫేల్’
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రఫేల్ విమానాల కొనుగోలు విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. శుక్రవారం నాలుగో రోజు సమావేశాలు వాడివేడిగా సాగాయి. రఫేల్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపణలు చేయగా, అధికారపక్షం ఎదురుదాడికి దిగింది. రఫేల్ డీల్‌లో సుప్రీం కోర్టు క్లీన్చిట్ ఇవ్వడాన్ని ఆయుధంగా మలుచుకుంది. రఫేల్ ఒప్పందంపై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ క్షమాపణలు చెప్పాలని విదేశాంగ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. రఫేల్ ఒప్పందంపై చర్చకు పట్టుపడుతున్న నేపథ్యంలో ప్రశ్నోత్తరాలను నిలిపివేయాల్సిందిగా కోరారు. ‘కావేరీ’పై అన్నా డీఎంకే ఆందోళన రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ నిరసనలు చేపట్టగా, అన్నా డీఎంకే ఎంపీలు కావేరీ నదీ జలాల సమస్యపై ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. రఫేల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) వామపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఓ వ్యాపారికి మేలు చేసేలా రఫేల్ కొనుగోలు వ్యవహారం ఉందని, ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ విషయంలో నష్టపోయిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాల్సిందేనని కాంగ్రెస్ పట్టుపట్టింది. ప్రతిపక్షాలు ఆందోళనలు ఆపేయకపోవడంతో ఆఖరికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను సోమవారానికి వాయిదా వేశారు. -
ప్రజా ప్రయోజనాలపై చర్చిద్దాం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అన్ని విషయాల్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్ని ఆ దిశగా సద్వినియోగం చేసుకుందామని విపక్షాలకు పిలుపునిచ్చారు. కాగా, రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంట్ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని ఈ సమావేశాల్లో పట్టుపడుతామని కాంగ్రెస్ ప్రకటించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం తీసుకురావాలని ఎన్డీయే బాగస్వామి శివసేన డిమాండ్ చేసింది. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. లోక్‌సభ, రాజ్యసభల్లో వేర్వేరు పార్టీలకు చెందిన సభా నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రజా ప్రయోజనాల రీత్యా పార్లమెంట్ సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని ఈ సందర్భంగా మోదీ విజ్ఞప్తి చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలు ఇవే కావడం గమనార్హం. అయోధ్య..రఫేల్..సీబీఐ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బిల్లు తెచ్చే వరకూ పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటామని శివసేన సీనియర్ నాయకుడు చంద్రకాంత్ ఖైరే చెప్పారు. రఫేల్‌తో పాటు సీబీఐ, ఆర్బీఐ లాంటి సంస్థల దుర్వినియోగంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ హెచ్చరించారు. ఆప్ నాయకుడు సంజయ్‌సింగ్‌తో కలసి ఆజాద్ ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చన్న సందేహాల నేపథ్యంలో ఎన్నికల పవిత్రత ప్రశ్నార్థకమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలుచేయాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ పరిశీలించకుండా బిల్లుల్ని ఆమోదించొద్దని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు దోపిడీకి గురువుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు. సమావేశాలకు సహకరిస్తాం: పార్లమెంట్ సమావేశాల్ని ఫలవంతంగా నిర్వహించేందుకు పూర్తిగా సహకరిస్తామని అధికార, విపక్ష పార్టీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు హామీ ఇచ్చాయి. ముఖ్యమైన అంశాలు, బిల్లులపై చర్చ జరుగుతున్నప్పుడు ఇరు వర్గాలకు సమానంగా సమయం కేటాయించాలని కోరాయి. వేర్వేరు పార్టీల రాజ్యసభ నాయకులతో వెంకయ్య నాయుడు సోమవారం సమావేశం నిర్వహించారు. రాజ్యసభ కార్యకలాపా లు సజావుగా జరిగేలా తనకు అన్ని విధాలుగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేయగా, సభ్యులు సాను కూలంగా స్పందించారు. కేంద్ర మంత్రులు సహా మొత్తం 31 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
రాహుల్‌కే కీలకం!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ తొలగిపోయే సమయం వచ్చేసింది. అయితే, తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఫలితాలు ప్రధాని మోదీ కంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కే అత్యంత కీలకమనే భావన అంతటా వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలంటే కనీసం మూడు రాష్ట్రాల్లోనైనా నెగ్గాల్సి ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మోదీకి వచ్చేదీ లేదు.. పోయేదీ లేదు.. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను మోదీనే తీసుకున్నారు. కానీ, ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఇందుకు భిన్నం. తెలంగాణ, మిజోరంలలో బీజేపీకి పట్టులేదు. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీకి బలమైన ముఖ్యమంత్రులున్నారు. శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌ల పాలనా సామర్థ్యానికే ఈ ఎన్నికలు గీటురాయిగా మారాయి తప్ప మోదీ చరిష్మా ఎన్నికల్లో ఎక్కడా ప్రధాన అంశం కాలేదు. ఇక, రాజస్తాన్‌లో బీజేపీని ముంచినా తేల్చి నా దానికి ముఖ్యమంత్రి వసుంధరా రాజేదే బాధ్యత. పైగా, అయిదేళ్లకోసారి అధికార పగ్గాలు చేతులు మారడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు మోదీ ఇమేజ్‌పై ఏమంత ప్రభావం చూపించవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ రెండు అంశాలే ప్రధానం అగస్టా కుంభకోణం వర్సెస్ రఫేల్ ఒప్పందం ప్రధానాంశాలుగా ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోట్ల రద్దు, నిరుద్యోగం, వ్యవసాయ రంగ సంక్షోభం, ఆర్థిక రంగం, అమలు కాని హామీలు, పెట్రో ధరలు కూడా ప్రభావం చూపించనున్నాయి. అందుకే, అయిదు రాష్ట్రాల ఫలితాలతో సంబంధం లేకుండా బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టింది. ప్రస్తుత లోక్‌సభలో బీజేపీకి ఉన్న స్థానాల్లో 75 శాతం కేవలం ఎనిమిది రాష్ట్రాల నుంచే వచ్చాయి. ఈసారి అంతగా ఆ పార్టీ క్లీన్‌స్వీప్ చేసే అవకాశం లేదు. అందుకే, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. మిగతా రాష్ట్రాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలన్న పట్టుదలతో మోదీ–షా ద్వయం ఉన్నట్టు తెలుస్తోంది. గెలిస్తే ప్రాంతీయ పార్టీలకు నమ్మకం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు గత ఏడాదే తీసుకున్న రాహుల్‌గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడినా రాహుల్ గెలిచారన్న పేరు తెచ్చుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కకుండా తెరవెనుక వ్యూహాలను పకడ్బందీగానే రచించారు. ఇప్పుడు అయిదు రాష్ట్రాల్లో మెజార్టీ రాష్ట్రాలను కైవసం చేసుకుంటే రాహుల్ సమర్థుడనే పేరు వస్తుంది. ప్రాంతీయ పార్టీలకు కూడా రాహుల్ నాయకత్వంపై నమ్మకం కుదిరి బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. కాంగ్రెస్ ఓటమిపాలైతే రాహుల్‌ది ఐరన్ లెగ్ అన్న ముద్ర అలాగే ఉండిపోతుంది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కష్టంగా మారుతుంది. -
మిస్టర్ 36 సమర్పిస్తున్న..!
న్యూఢిల్లీ: ఒకే విషయాన్ని పదేపదే చెప్పేవారిని అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డుతో పోల్చే విషయం తెలుసు కదా. అదే ‘అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డు’ అంశం ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీల మధ్య వ్యంగ్య విమర్శలకు వేదికైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ‘గతంలో గ్రామ్‌ఫోన్ రికార్డులు ఉండేవి. కొన్నిసార్లు అవి చెడిపోయినా, అరిగిపోయినా ఒకే పదం పదేపదే వినిపించేది. ప్రస్తుతం ఇలాంటి వ్యక్తులు కొందరు(రాహుల్) ఒకే విషయాన్ని మాటిమాటికీ చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వాళ్లు చెబుతున్న అబద్ధాలను ప్రజలు నమ్మకపోగా, నవ్వుకుంటున్నారు’ అంటూ రఫేల్‌పై రాహుల్ విమర్శలను పరోక్షంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. మోదీ కామెంట్స్‌పై కొంచెం లేట్‌గా రాహుల్ స్పందించారు. ఓ వీడియోను ఆదివారం తన ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తొలుత అక్టోబర్‌లో మోదీ చేసిన కామెంట్స్ వస్తాయి. అనంతరం వేర్వేరు బహిరంగ సభలు, సమావేశాల్లో నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా గాంధీల పేర్లను మోదీ అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులా పదేపదే ప్రస్తావిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంటుంది. అలా, మోదీ వ్యంగ్యానికి టిట్ ఫర్ టాట్‌గా రాహుల్ స్పందించారు. వీడియోతో పాటు ‘ఈ వినోదభరితమైన వీడియోను మిస్టర్ 36(మోదీ) సమర్పిస్తున్నారు. దీన్ని మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా పంపండి. వాళ్లు కూడా సంతోషిస్తారు’ అని ట్వీట్ కూడా చేశారు. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఎన్డీయే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఆ వివాదాస్పద ఒప్పందాన్నే ‘మిస్టర్ 36’ అంటూ రాహుల్ వ్యంగ్యంగా ప్రస్తావించారు. -
మోదీ రెండు భారత్‌లను నిర్మిస్తున్నారు
న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రధాని మోదీ కారణమంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. మోదీ రెండు భారత్‌లను నిర్మిస్తున్నారని, ఒకటి అంబానీ కోసం, మరొకటి రైతుల కోసం అని సోమవారం ట్వీట్ చేశారు. ‘ఒక్క విమానాన్ని కూడా నిర్మించకుండా అంబానీ రూ.30,000 కోట్ల రఫేల్ కాంట్రాక్టును పొందారు. కానీ నాలుగు నెలలు కష్టపడ్డ రైతులకు మాత్రం 750 కిలోల ఉల్లిపాయలకు రూ.1,040 వచ్చాయి’ అని మహారాష్ట్ర ఘటనను ఉదహరించారు. మరోవైపు ప్రభుత్వం తన విధానాలతో రైతులను ఒత్తిడి గురిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
రఫేల్ 'వార్'.. రాజకీయ యుద్ధం!
ఎప్పటికప్పుడు కొత్త కోణాలు వెలుగులోకి వస్తూ ఉండటంతో కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయింది. రఫేల్ ఒప్పందం వివరాలు బయటకు తీసుకురావాలా ? వద్దా అనే అంశంపై త్వరలోనే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఆ వివరాలు బయటకు వస్తే పరిస్థితి ఎలా మారు తుంది ? సుప్రీంకోర్టు వాదనల సందర్భంగా కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశాలేంటి ? ఈ వ్యవహారం ఎందుకు రాజకీయ వేడిని రగులుస్తోంది? ధర.. దడ దడ రఫేల్ ఒప్పందానికి బీజం 2000 సంవత్సరం వాజ్‌పేయి హయాంలో పడినప్పటికీ యూపీఏ హయాంలోనే ఒక కొలిక్కి వచ్చింది. 2007లో యూపీఏ ఈ ఒప్పందంపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చివరికి 2011లో ఫ్రాన్స్ నుంచి 126 విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఒక్కో విమానానికి దాదాపుగా రూ.526 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. అయితే దీనిపై రెండు దేశాల ప్రభుత్వాలు ఒక అవగాహనకు రాకుండానే ఫ్రాన్స్‌లో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఒప్పందం ముందుకు సాగలేదు. ఆ తర్వాత భారత్‌లో కూడా ఎన్నికలు జరిగి మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ ఒప్పందం పరుగులు తీసింది. 126కి బదులుగా 36 విమానాల కొనుగోలుకే కేంద్రం ఒప్పందం ఖరారు చేసుకుంది. అయితే ధర విషయంలో గోప్యత పాటించింది. ఈ ఒప్పందం వివరాలు, విమానం ధరల్ని బయటపెడితే శత్రుదేశాలకు ఆయుధాలు, పరికరాల వివరాలు తెలిసిపోయి దేశ భద్రత ప్రమాదంలో పడుతుందంటూ వాటి వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది. యూపీఏతో పోల్చి చూస్తే తాము ఖజానాకు రూ.12,600 కోట్లు ఆదా చేశామని మోదీ సర్కార్ చెప్పుకుంది. కానీ 36 విమానాలకే రూ.59 వేల కోట్లు చెల్లించడానికి ఎన్డీయే ప్రభుత్వం అంగీకరించినట్టుగా వార్తలు వచ్చాయి. దీని ప్రకారం ఒక్కో విమానానికయ్యే ఖర్చు దాదాపు రూ.1,638 కోట్లు. రఫేల్ ఒప్పందంలో అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీని విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ.. 2016 విదేశీ మారకద్రవ్య మార్పిడి లెక్క ప్రకారం ఒక్కో యుద్ధ విమానం ధర రూ.670 కోట్లు అని, అయితే పూర్తిస్థాయి ఆయుధాలు, ఏవియానిక్స్‌తో కూడిన ధరను వెల్లడిస్తే దేశ భద్రతకే ప్రమాదం అంటూ దాటవేశారు. ఇక పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక్కో యుద్ధ విమానం ధర 15.5 కోట్ల యూరో(దాదాపు రూ.1275 కోట్లు)లు ఉండేదని, ఇప్పుడు ఏకంగా 40 శాతం పెరిగిపోయి 27 కోట్ల యూరోలకు (దాదాపు రూ.2,219 కోట్లు) చేరుకుందని వాదించారు. ఇలా ఇరుపక్షాల మ«ధ్య రఫేల్ ధరల యుద్ధం రాజకీయ వివాదాన్ని మరింత రాజేసింది. ఆఫ్సెట్ కంపెనీ చేతులెత్తేస్తే? అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీని గట్టెక్కించడానికే కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఆఫ్సెట్ ఒప్పందానికి అనుమతిచ్చిందనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 2008లో రిలయన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఆర్ఏటీఎల్) ఏర్పాటు చేశారు. ఆ కంపెనీకే రఫేల్ ఆఫ్సెట్ కాంట్రాక్ట్ అప్పగించాల్సి ఉంది. కానీ మోదీ హయాంలో సీన్ మారింది. ముఖేశ్ ఆర్ఏటీఎల్ కార్యకలాపాల్ని నిలిపివేశారు. అనిల్ రాత్రికి రాత్రి రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనంత భారీ ఆఫ్సెట్ కాంట్రాక్ట్ ఆర్డీఎల్ దక్కించుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ హాల్‌ను కాదని మరీ ఆర్‌డీఎల్‌కు కాంట్రాక్ట్ అప్పగించడమేంటని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి నిలదీస్తూ వచ్చింది. సుప్రీంకోర్టు వాదనల సమయంలో న్యాయమూర్తులు ఈ అంశంపైనే ప్రభుత్వ లాయర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. యుద్ధ విమానాల తయారీలో ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్ తమకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చలేకపోతే, విమానాల తయారీ చేపట్టలేకపోతే ఏం జరుగుతుంది? దేశ ప్రయోజనాల సంగతేంటి? అని న్యాయ మూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ ప్రశ్నించారు. నిజంగా ఆ పరిస్థితే వస్తే ఆఫ్సెట్ కంపెనీని ఒప్పందం నుంచి తప్పించవచ్చని దసో ఏవియేషన్‌కు జరిమానాలు కూడా విధించవచ్చని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ చేతుల్లో ఏమీ ఉండదా ? రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిందేనని ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. కానీ సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సమయంలో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం భారత్‌కు, రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ ‘దసో ఏవియేషన్’కు కుదిరిన ఒప్పందం మాత్రమే. యుద్ధ విమానాల సరఫరాలో ఏమైనా తేడాలొచ్చినా, దసో ఏవియేషన్ యుద్ధ విమానాల తయారీలో నాణ్యతాప్రమాణాలు పాటించకపోయినా ఫ్రాన్స్ ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు వహించదు. ఎందుకంటే ఒప్పందం సమయంలో ఇవ్వాల్సిన సార్వభౌమ హామీ(సావరీన్ గ్యారంటీ) ఫ్రాన్స్ ఇవ్వలేదు. అయినా కూడా రక్షణ శాఖ ఏమీ పట్టకుండా ఒప్పందంపై ముందుకు వెళితే న్యాయశాఖ అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో భారత్ ఒత్తిడి మేరకు ఫ్రాన్స్ సర్కార్ కంఫర్ట్ లేఖ ఇచ్చింది. ఆ లేఖ ఇంచుమించుగా సావరీన్ గ్యారంటీతో సమానమని కేంద్రం పేర్కొంటోంది. కానీ భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురైతే ఆ లేఖకు చట్టబద్ధత ఉండదని, అంతర్జాతీయ న్యాయస్థానాల్లో అది చెల్లుబాటుకాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా ఆత్మరక్షణలో కేంద్రం అదే ఒప్పందం, అవే విమానాలు కానీ యూపీఏ నుంచి ఎన్డీయే హయాం వచ్చేసరికి ఎన్నో తేడాలు. ధర రెట్టింపు అయిందంటూ ఆరోపణలు. ప్రభుత్వ రంగ సంస్థ హాల్‌ను పక్కన పెట్టారంటూ విమర్శలు. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చడానికే దేశ ప్రయోజనాలను కాలరాశారంటూ కాంగ్రెస్ గగ్గోలు పెడుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు దీటైన జవాబులివ్వలేక కేంద్ర మంత్రులు తడబడిపోతున్నారు. కేంద్ర మంత్రులు చేసిన వాదనలన్నీ తప్పుడువేనని ఎప్పటికప్పుడు తేలిపోతూ ఉండటంతో కేంద్రం ఇరుకున పడిపోతోంది. విమానం ధరలు వెల్లడిస్తామని తొలుత ప్రకటించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ తర్వాత మాటమార్చి దేశ ప్రయోజనాల దృష్ట్యా గోప్యత తప్పదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ హాల్‌ను కాదని, అప్పటికప్పుడు హడావుడిగా ఏర్పాటు చేసిన రిలయన్స్ డిఫెన్స్‌ను సర్వీసు ప్రొవైడర్లుగా ఎందుకు ఎంపిక చేశారన్నదానికి, అది తమ పరిధిలో లేదని దసో ఏవియేషనే ఆ నిర్ణయం తీసుకుందని కేంద్రం వాదిస్తోంది. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలన్ రిలయెన్స్‌ను ఎంపిక చేసుకోవాలని మోదీ ప్రభుత్వమే తమకు సూచించిందని బహిరంగంగానే చెప్పడంతో బీజేపీ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. హాల్‌కి యుద్ధ విమానాలు చేసే సామర్థ్యమే లేదంటూ నిర్మలా సీతారామన్ వాదించడంపై రాజకీయంగా రచ్చ జరిగింది. ఆ తర్వాత హాల్ మాజీ చైర్పర్సన్ సువర్ణ సుఖోయ్–30 వంటి యుద్ధ విమానాలనే తాము తయారు చేశామని ఈ బాధ్యతను అప్పగించినా చేసేవాళ్లమని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడంతో కేంద్రం జవాబు చెప్పలేక నీళ్లు నమిలింది. దీన్ని ఆయుధంగా చేసుకొని రాహుల్ హాల్ సిబ్బందితో సమావేశమై నైతిక మద్దతుని ప్రకటించి రాజకీయ వేడిని మరింత పెంచారు. ఆ తర్వాత కోర్టులో కూడా న్యాయమూర్తుల నుంచి కేంద్రం గట్టి ప్రశ్నల్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ఈ ఒప్పందానికి ఫ్రాన్స్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం లేదన్న విషయంపై కూడా ఇప్పడు తాజాగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తమ్మీద రఫేల్ ఒప్పందం అవకతవకలు కోర్టుకి చేరడంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ రేగుతోంది. ఒప్పందం వివరాలు బహిర్గతం చేయాలన్న నిర్ణయం కోర్టు తీసుకుంటే ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే రఫేల్ యుద్ధంలో కేంద్రంపై పైచేయి సాధించిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల సమయానికి ఈ ఒప్పందంలో లొసుగులన్నీ వెలుగులోకి వచ్చి తమకే లబ్ధి చేకూరుతుందనే ఆశతో ఉంది. యూపీఏ డీల్.. 2007 మధ్యతరహా బహుముఖ యుద్ధ విమానాలు(ఎంఎంఆర్సీఏ) కొను గోలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం 126 యుద్ధ విమానాలు కొనుగోలుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆగస్టు 28, 2007 ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ యుద్ధ విమానాల సంస్థ దసో ఏవియేషన్ బిడ్ వేసింది. దీంతో పాటు రష్యాకు చెందిన మిగ్–35, స్వీడన్సాబ్ జాస్–39 గ్రిపెన్, అమెరికా మార్టిన్ ఎఫ్–16, యూరో ఫైటర్ టైఫూన్ వంటి సంస్థలు కూడా బిడ్లు దాఖలు చేశాయి. సెప్టెంబర్ 4, 2008 రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఆర్ఏటీఎల్) పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేశారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరితే దసో ఏవియేషన్, ఆర్ఏటీఎల్ సంయుక్తంగా యుద్ధ విమానాల తయారీ చేపట్టాలని ఒక అవగాహనకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. మే 2011 భారత వాయుసేన చేసిన షార్ట్ లిస్ట్‌లో రఫేల్, యూరోఫైటర్ జెట్స్ నిలిచాయి. జనవరి 2012 బిడ్లను పరిశీలిస్తే దసో ఏవియేషన్ తక్కువ ధరని కోట్ చేసింది. మొత్తం 126 విమానాల్లో 18 విమానాలను అప్పటికప్పుడు పంపడానికి, మిగిలిన వాటిని దసో సహకారంతో హాల్ తయారు చేయాలని అంగీకారానికి వచ్చాయి. మార్చి 13, 2014 రఫేల్ ధరలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, దసో–హాల్ మధ్య పని విభజన వంటి అంశాలపై చర్చలు జరిగాయి. కానీ ఒక అవగాహనకు రాలేకపోవడంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కో యుద్ధ విమానాన్ని రూ. 526 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడానికి నిర్ణయించినట్లుగా చెబుతోంది. ఎన్డీయే డీల్.. మార్చి 28, 2015 అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ అనే కొత్త కంపెనీ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 10, 2015 ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌కు వెళ్లి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. జూన్ 2015 126 యుద్ధ విమానాల టెండర్లను రక్షణ శాఖ అధికారికంగా వెనక్కి తీసుకుంది. డిసెంబర్, 2015 అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలన్ సహచరి, నటి అయిన జూలీ గయె ప్రధాన పాత్రలో నటించే సినిమాల్లో రూ.1,300 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటించారు. రఫేల్ కాంట్రాక్ట్ తమకి దక్కడం కోసం క్విడ్‌ప్రోకో ఒప్పందంలో భాగంగానే ఈ పెట్టుబడులు పెట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. జనవరి 2016 ఫ్రాన్స్ అధ్యక్షుడి హోదాలో ఫ్రాన్సిస్ హోలన్ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రఫేల్ ఒప్పందంపై ఇరుపక్షాలు సంత కాలు చేశాయి. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విమానాలు సరఫరా చేయాల్సి ఉంది. అక్టోబర్ 3, 2016 అనిల్ అంబానీ ఆర్డీఎల్, దసో ఏవియేషన్ జాయింట్ వెంచర్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం దసో ఏవియేషన్ ఒప్పందం విలువలో 50% పెట్టుబడుల్ని భారత్‌లో తప్పనిసరిగా పెట్టవలసి ఉంటుంది. ఫిబ్రవరి 2017 దసో రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్ఎల్) అన్న పేరుతో సంయుక్త భాగస్వామ్య సంస్థ ఏర్పాటు. -
‘మోదీ, అంబానీ పేర్లు బయటకొస్తాయి’
కబీర్‌దాం/కోర్బా: రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగితే ప్రధాని మోదీ, వ్యాపారవేత్త అంబానీల పేర్లు త్వరలో బయటకు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండవ విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడారు. ‘రఫేల్ కుంభకోణంపై సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ దర్యాప్తు ప్రారంభించారు. అయితే అర్థరాత్రి 12 గంటలకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రధానమంత్రి ఆయనను తొలగించారు. ఒకరోజు తప్పకుండా ఆ రెండు పేర్లు బయటకు వస్తాయి. ఆ పేర్లు ప్రధాని నరేంద్రమోదీ, అనిల్ అంబానీ’’అని రాహుల్ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. -
రఫేల్ వివరాలు బయటపెడితేనే ధరలపై చర్చ సాధ్యం
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం వివరాలు బహిర్గతమైతేనే వాటి ధరలపై చర్చించడం సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్ కంపెనీ నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలంటూ వచ్చిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల ప్రభుత్వం సీల్డ్ కవర్లో అందించిన వివరాలను బహిర్గతం చేయాలా వద్దా అన్న విషయంపై తీర్పును ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ రిజర్వ్‌లో ఉంచింది. ‘రఫేల్ ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలా వద్దా అన్న దానిపై ఇప్పుడు మేం నిర్ణయం తీసుకోవాలి’ అని జడ్జీలు అన్నారు. ఒప్పందం వివరాలు బయటపెట్టకుండా ధరలపై విచారణ జరిపే అవకాశమే లేదని వారు కేంద్రానికి స్పష్టం చేశారు. అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్ కేంద్రం తరఫున వాదించారు. ధర, ఒప్పందం వివరాలు బహిర్గతమైతే శత్రు దేశాలకు ఇదో లాభించే అంశమవుతుందని ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వాయుసేన అవసరాలకు సంబంధించినది కాబట్టి.. ప్రభుత్వం పంపే రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి కాకుండా వాయుసేన అధికారిని తాము ప్రశ్నించాలనుకుంటున్నామని జడ్జీలు తెలిపారు. వాయుసేన ఉన్నతాధికారులను కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా జడ్జీలు ఆదేశించడంతో హుటాహుటిన అధికారులు కోర్టుకు వచ్చారు. దీంతో ఎయిర్ వైస్ మార్షల్ జొన్నలగడ్డ చలపతి, ఎయిర్ మార్షల్ అనిల్ ఖోస్లా, ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి తదితరులు కోర్టుకు హాజరయ్యారు. చలపతిని సీజేఐ వివరాలు అడిగారు. 40 శాతం పెరిగింది: ప్రశాంత్ భూషణ్ పిటిషనర్లలో ఒకరైన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఇతర పిటిషనర్లు, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీల తరఫున కూడా కలిపి వాదనలు వినిపించారు. యూపీఏ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో విమానం ధర 155 మిలియన్ యూరోలు కాగా, బీజేపీ ప్రభుత్వం ఆ ధరను 40 శాతం పెంచి, 270 మిలియన్ యూరోలకు ఒక్కో విమానాన్ని కొంటోందని భూషణ్ కోర్టుకు తెలిపారు. ఈ ఒప్పందానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేదన్నారు. ప్రభుత్వాల మధ్య ఒప్పందమే కాదు: కాంగ్రెస్ రఫేల్ ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం కానేకాదని కాంగ్రెస్ పేర్కొంది. విమానం నాణ్యత, ఒక్కో విమానం తయారీని ఎన్ని పనిగంటల్లో పూర్తి చేస్తారనే వాటిపై డసో ఏవియేషన్ ఏ విధమైన హామీ ఇవ్వనందున అది నిబంధనలను అతిక్రమించినట్లేననీ, కాబట్టి కేంద్రం ఆ కంపెనీతో ఈ ఒప్పందం చేసుకుని ఉండాల్సింది కాదని పేర్కొంది. కాంగ్రెస్ నేత, ప్రముఖ లాయరు కపిల్ సిబల్ మాట్లాడుతూ ‘ఫ్రాన్స్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ రక్షణ పరికరాల సరఫరాపై మరో దేశ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదు. ఈ రకమైన ఒప్పందాన్ని కేవలం అమెరికా ప్రభుత్వం మాత్రమే చేసుకుంటుంది. రఫేల్ రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం కానేకాదు. ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్ అనే కంపెనీతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ధ్రువీకరించింది అంతే’ అని తెలిపారు. నిపుణులు చర్చించాల్సిన విషయాలివి: ఏజీ ఒప్పందం వివరాలు నిపుణులు చర్చించాల్సినవనీ, ఒక్కో యుద్ధ విమానం ధర ఎంతనే పూర్తి వివరాలను ఇప్పటివరకు పార్లమెంటుకే కేంద్రం తెలియజేయలేదని ఏజీ వాదించారు. యూపీఏ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం విమానాల్లో ఆయుధాలను నింపే వ్యవస్థ లేదనీ, తాజా∙ఒప్పందం ప్రకారం ఆయుధాలను విమానంలోనే నింపి ఆకాశం నుంచి నేరుగా ప్రయోగించవచ్చన్నారు. ఇది అంతర ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ – ఇంటర్ గవర్న్మెంట్ అగ్రిమెంట్) అయినందున వివరాలను రహస్యంగా ఉంచాలని ఒప్పందంలో ఉందని ఏజీ కోర్టుకు చెప్పారు. కాబట్టి వివరాలను బహిర్గతం చేయడంలో కేంద్రానికి అభ్యంతరాలున్నాయన్నారు. -
రాఫెల్ డీల్ : రాహుల్ ఆరోపణలు తోసిపుచ్చిన దసాల్ట్
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను దసాల్ట్ ఏవియేషన్ సీఈవో ఎరిక్ తపిర్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ ఆరోపణలను ప్రస్తావించిన ఆయన తాను అసత్యాలు ఏమీ చెప్పలేదని అన్నారు.ఎరిక్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను రాఫెల్ డీల్ గురించి అసత్యాలు వెల్లడించలేదని, తాను ఇచ్చిన స్టేట్మెంట్లు వాస్తవమని, అబద్ధాలు చెప్పే అలవాటు తనకులేదని చెప్పుకొచ్చారు. దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలో 1953లో భారత్- ఫ్రాన్స్ మధ్య జరిగిన తొలి ఒప్పందాన్ని గుర్తు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో తమ కంపెనీకి అనుబంధం ఉందని పేర్కొన్నారు. తాము భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని, ఏ పార్టీతో కాదని స్పష్టం చేశారు. భారత వాయుసేనకు, ప్రభుత్వానికి తాము వ్యూహాత్మక ఉత్పత్తులను సరఫరా చేస్తామని, పార్టీలతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఆఫ్సెట్ భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకోవడంపై స్పందించారు. ఈ ఒప్పందం ద్వారా సమకూరే నిధులు నేరుగా రిలయన్స్‌కు వెళ్లబోవని, జాయింట్ వెంచర్‌కు చేరతాయని వెల్లడించారు. తొలివిడతగా దసాల్ట్ ఏవియేషన్ అనిల్ అంబానీ కంపెనీకి రూ 284 కోట్లను చెల్లించిందని ఇటీవల రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో దసాల్ట్ సీఈవో ఈ మేరకు వివరణ ఇచ్చారు. -
న్యాయంగానే ‘రఫేల్’ కొనుగోలు
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ జెట్ విమానాల కొనుగోలు ఒప్పందం వివరాలను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. 36 రఫేల్ విమానాల ధరల వివరాలను కూడా సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేసింది. ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలంటూ బీజేపీ మాజీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ వివరాలను సోమవారం సమర్పించింది. ‘తక్కువ ధర, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పొందేందుకు ఫ్రెంచి సంస్థతో ఏడాది కాలంలో 74 సార్లు సమావేశమయ్యాం. 2013 డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ నిబంధనల మేరకే విమానాలను కొనుగోలు చేశాం. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ఆమోదాన్నీ పొందాం. దేశానికి చెందిన ఏ సంస్థ పేరునూ ఒప్పందంలో భాగస్వామిగా సిఫారసు చేయలేదు’ అని కేంద్రం తెలిపింది. హెచ్ఏఎల్తో ఒప్పందం కుదరనిదెందుకు? రఫేల్ ఒప్పందంపై ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), ఫ్రెంచి సంస్థ డసో ఏవియేషన్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్రం పేర్కొంది. ‘ముఖ్యంగా 108 రఫేల్ విమానాలను దేశీయంగా తయారు చేసే విషయంలో డసో సూచించిన దాని కంటే హెచ్ఏఎల్ కోరిన సమయం 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. అందుకే డసో మరో సంస్థను ఎంపిక చేసుకుంది. విమానాలను దేశీయంగా తయారుచేసి అందజేసేందుకు భారత భాగస్వామిని ఎంపిక చేసుకునే వెసులుబాటు డీపీపీ ప్రకారం డసోకు ఉంది. విదేశీ సంస్థలకు చెల్లించే ప్రతి డాలరులో కనీసం 30 శాతం తిరిగి పెట్టుబడి, సేకరణ రూపంలో తిరిగి దేశానికి చేరుతుంది’ అని తెలిపింది. అనంతరం ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. -
మోదీకి నిద్రలేని రాత్రులు
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగొలులో జరిగిన భారీ అవినీతిపై దర్యాప్తు చేపడితే ప్రధాని మోదీకి మనుగడ ఉండదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై దర్యాప్తు జరిగితే తగిన శిక్ష తప్పదనే భయంతో మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పేర్కొన్నారు. అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు కట్టబెట్టేందుకే మోదీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ఆరోపించారు. ‘అనిల్ అంబానీకి నాగపూర్ ఎయిర్‌పోర్టు వద్ద భూములు ఉన్నందునే కాంట్రాక్టును ఇచ్చినట్లు డసో ఏవియేషన్ సీఈవో రిక్ ట్రాపీర్ చెబుతున్నారు. ఇదంతా అబద్ధం. డసో సంస్థ తొలి దఫాగా రూ.284 కోట్లు రిలయన్స్ డిఫెన్స్‌కు ముట్టజెప్పింది. ఈ ముడుపులతోనే రిలయన్స్ భూములు కొనుగొలు చేసింది’ అని రాహుల్ అన్నారు. తాజా ఆరోపణలపై మాత్రం ఇంకా బీజేపీ నోరుమెదపలేదు. కాగా, రఫేల్ ఒప్పందంపై రాహుల్ ఆరోపణలను అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఖండించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అనిల్‌పై, ఆయన కంపెనీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. -
‘రఫేల్’ ధర వివరాలివ్వండి
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ధర వివరాలను తమకు సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. రఫేల్ ధర విషయం వ్యూహాత్మకమనీ, దాన్ని రహస్యంగా ఉంచాలన్న కేంద్రం వాదనను అంగీకరించింది. ఈ ఒప్పందం వివరాలను 10 రోజుల్లోగా సమర్పించాలని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వాదిస్తూ.. రఫేల్ ఒప్పందం ధర వివరాలు చాలా రహస్యమైన సమాచారమనీ, దాన్ని దేశ పార్లమెంటుతో కూడా పంచుకోలేదని కోర్టుకు తెలిపారు. ఈ వివరాలు అధికారిక రహస్యాల చట్టం–1923 పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, రఫేల్ ఒప్పందం సందర్భంగా పాటించిన విధివిధానాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనీ, పిటిషనర్లకు అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఒప్పందంలోని వ్యూహాత్మక, రహస్య సమాచారాన్ని బయటపెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఒకవేళ రఫేల్ ధర వివరాలను అందజేయడం వీలుకాకపోతే అదే విషయాన్ని పిటిషన్ ద్వారా తెలియజేయాలని బెంచ్ తెలిపింది. పిటిషనర్లు రఫేల్ యుద్ధ విమానం పనితీరు, ఇతర సాంకేతిక అంశాలను కోరలేదనీ, కేవలం కొనుగోలు సందర్భంగా పాటించిన పద్ధతి, ధరపైనే స్పష్టత అడిగారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రఫేల్ కొనుగోలు ధర వివరాలను సీల్డ్ కవర్లో 10 రోజుల్లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. సీబీఐలో ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితి ముగిశాక రఫేల్‌పై ఆ సంస్థతో విచారణ జరిపే అంశాన్ని పరిశీలిస్తామని తేల్చిచెప్పింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌శౌరీ, యశ్వంత్ సిన్హా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. -
రాఫెల్ డీల్ : పదిరోజుల్లో వివరాలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ జెట్ కొనుగోళ్లు వివాదం మరింత ముదురుతోంది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్డు నేడు (అక్టోబర్ 31, బుధవారం) విచారించింది. ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ డీల్ పై పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా కోరింది. పదిరోజుల్లోగా నివేదికలను అందించాల్సిందిగా ఆదేవించింది. కాంగ్రెస్ నేతలు మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. రాఫెల్ ఒప్పందంలో భాగంగా అనిల్ అంబానీకి చెందిన డిఫెన్స్ సంస్థకు ఈ కాంట్రాక్టును ఎలా అందించారో చెప్పాలని కూడా అత్యున్నత న్యాయస్థానం కోరింది. ఒక్కొక్క రాఫెల్‌ను ఎంత ధర పెట్టి కొన్నారో స్పష్టం చేయాలని సుప్రీం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. మరో పది రోజుల్లోగా సీల్డు కవర్లో రాఫెల్ ఖరీదు వివరాలను పంపాలని సుప్రీం ఆదేశించింది. అలాగే ఈ ఒప్పందం కోసం జరిగిన వ్యూహాత్మక వివరాలు ఏమైనా ఉంటే వాటిని కూడా స్పష్టం చేయాలని కోర్టు పేర్కొంది. కాగా ప్రభుత్వ రంగ సంస్థ ను కాదని రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు రాఫెల్ డీల్‌ను అప్పగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్ గూటికి తారిఖ్ అన్వర్
న్యూఢిల్లీ: శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ తారిఖ్ అన్వర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో తారిఖ్ అన్వర్ తన అనుచరులతో కలసి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అన్వర్ మాట్లాడుతూ..రఫేల్ విమానాల కుంభకోణంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రధాని మోదీని వెనకేసుకుని రావటంతోనే తాను పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు. బిహార్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేసిన తారిఖ్ అన్వర్ ఎన్సీపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. సుమారు 19 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి సొంతగూటికి చేరారు. -
రఫేల్ భయంతోనే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటుచేసుకుంటున్న అవినీతి బయటపడుతున్నందున భయంతోనే అలోక్‌ను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రఫేల్ కుంభకోణానికి సంబంధించిన దస్త్రాలను అలోక్ సేకరిస్తున్నందునే ఆయనపై వేటు పడిందన్నారు. రాహుల్ ఓ ట్వీట్ చేస్తూ ‘ప్రధాని సందేశం చాలా స్పష్టంగా ఉంది. రఫేల్‌కు ఎవరు దగ్గరగా రావాలని ప్రయత్నించినా వారు పదవి కోల్పోతారు. తుడిచిపెట్టుకు పోతారు’ అని ఆరోపించారు. దేశం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ ‘రఫేల్‌లో ఫోబియా’ కారణంగానే అలోక్‌ను మోదీ తప్పించారన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ మాట్లాడుతూ.. మోదీకి ఇష్టుడైన అస్థానాను కాపాడటం కోసమే అలోక్‌ను కూడా కేంద్రం తప్పించిందని ఆరోపించారు. -
మా పార్టీని ఓడించండి: బీజేపీ ఎంపీ
ముజాఫర్‌నగర్(ఉత్తరప్రదేశ్) : రఫేల్ డీల్‌పై విపక్షాల ఎక్కుపెట్టే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్న మోదీ సర్కారుకు స్వపక్షం నుంచే సెగ తగులుతోంది. రఫేల్ డీల్‌పై బీజేపీ అసంతృప్తి నేత శత్రుఘ్నసిన్హా, సొంత ప్రభుత్వంపైనే మండిపడ్డారు. ఎంతో అనుభవపూర్వకమైన కంపెనీ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)ను పక్కనపెట్టి, కొత్త కంపెనీని రఫేల్ కాంట్రాక్ట్‌కు ఎంపిక చేయడమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం తవ్లి గ్రామంలో జరిగిన వ్యవసాయదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రఫేల్ డీల్‌కు ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం దస్సాల్ట్ ఏవియేషన్‌కు భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను కేంద్ర ప్రభుత్వమే ఎంపిక చేసిందని ఫ్రాన్స్ అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చెప్పినట్టు వెల్లడైన విషయాన్ని గుర్తు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆ సమావేశానికి మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా హాజరయ్యారు. కాగా, రూ.58 వేల కోట్లకు పైగా విలువైన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటున్నాయి. 2019 ఎన్నికలకు విపక్షాలకు ఇదే ప్రధాన అస్త్రంగా మారింది. -
రఫేల్.. హెచ్ఏఎల్ హక్కు
సాక్షి, బెంగళూరు: రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో మెట్టుకు తీసుకెళ్లారు. దేశానికి వ్యూహాత్మక సంపద అయిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) కంపెనీని ఎన్డీయే ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. రఫేల్ తయారీ ఒప్పందంలో అనిల్ అంబానీ కంపెనీకి భాగస్వామ్యం కల్పించడం సరికాదని, ఆ హక్కులు హెచ్‌ఏఎల్‌కే చెందుతాయని అన్నారు. రఫేల్ ఒప్పందంలో చోటుచేసుకున్న అవినీతిపై వీధివీధినా పోరాటం చేస్తామని చెప్పారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ప్రధాన కార్యాలయం సమీపంలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాహుల్.. ఆ సంస్థకు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులతో ముచ్చటించారు. రఫేల్ విమానాల్ని తయారుచేసేందుకు హెచ్ఏఎల్కు తగిన అనుభవం లేదనడం హాస్యాస్పదమన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రక్షణ మంత్రిని హుటాహుటిన ఫ్రాన్స్‌కు పంపారన్నారు. రూ. 30 వేల కోట్ల అవినీతి.. ‘హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సాధారణ కంపెనీ కాదు. అది ఏరోనాటిక్స్ రంగంలో భారత్‌కు వ్యూహాత్మక సంపద. హెచ్‌ఏఎల్‌కే రఫేల్ తయారీ హక్కులు దక్కుతాయి. మీ ప్రయోజనాలను సమాధిచేస్తూ వేరొకరు భవిష్యత్తు నిర్మించుకుంటామంటే ఊరుకోం. 78 ఏళ్ల క్రితం స్థాపించిన కంపెనీకి రఫేల్ విమానాల్ని తయారుచేసే సత్తా లేదనడం హాస్యాస్పదం. హెచ్ఏఎల్ను మరింత పటిష్టపరచడానికి ఏం చేయాలో ఆలోచించండి. మేము అధికారంలోకి వచ్చాక ఆ దిశగా దూకుడుగా సాగుతాం ’ అని రాహుల్ అన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రఫేల్ అవినీతిపై ఉద్యమాన్ని వీధుల్లోకి తీసుకెళ్తామని అన్నారు. హెచ్ఏఎల్కు మద్దతుగా నిలబడి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ‘ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందని స్పష్టంగా చెబుతున్నా. రూ.30 వేల కోట్లు చేతులుమారాయి. అనిల్ అంబానీ కంపెనీకి చేకూర్చిన లాభంతో హెచ్ఏఎల్ ఉద్యోగులు నష్టపోయారు. దేశానికి సేవచేస్తూ తమ జీవితాల్ని అంకితంచేసిన వారిని ప్రభుత్వం అవమానించింది. వారికి ప్రభుత్వం క్షమాపణ చెప్పదు. కానీ ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ అడుగుతున్నా’ అని అన్నారు. అనిల్ సంస్థపై విమర్శలు గుప్పిస్తూ..‘హెచ్ఏఎల్కు అనుభవం లేదన్న రక్షణమంత్రి ఇంత వరకూ ఒక్క విమానాన్నీ తయారుచేయని అనిల్ కంపెనీ అనుభవం గురించి మాట్లాడలేదు. హెచ్ఏఎల్కు ఒక్క రూపాయి రుణం లేదు. కానీ అనిల్ అంబానీ వేర్వేరు బ్యాంకులకు రూ.45 వేల కోట్లు రుణపడి ఉన్నారు. హెచ్ఏఎల్ 78 ఏళ్లుగా పనిచేస్తుంటే, ఆయన కంపెనీ 12 రోజుల నుంచే పనిచేస్తోంది’ అని అన్నారు. హెచ్ఏఎల్ విచారం.. తమ ఉద్యోగులు రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడంపై హెచ్ఏఎల్ విచారం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీతో సమావేశాన్ని నేరుగా ప్రస్తావించకుండానే అలాంటి పరిణామాలు జాతీయ భద్రతకు, సంస్థకు చేటుచేస్తాయని పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం లభిస్తోందని, 2014–18కాలంలో రూ.27,340 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చినట్లు ప్రకటించింది. కేంద్రం అవమానించింది: హెచ్ఏఎల్ ఉద్యోగులు సైకిల్ నుంచి యుద్ధ విమానాల వరకు తయారీ చేశామని, అలాంటి సంస్థకు రఫేల్ తయారీ ఒప్పందం అప్పగించకపోవడం తమని అవమానించడమేనని అన్నారు. తొలి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయాణించిన జెట్ విమానం కూడా తాము తయారు చేసిందేనని చెప్పారు. కానీ ఇప్పుడు ఆమే తమకు తగిన అనుభవం లేదనడం సరికాదన్నారు. -
మోదీ పెద్ద అవినీతిపరుడు
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి రఫేల్ ఫైటర్జెట్ల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఓ అవినీతిపరుడని ఆయన ఆరోపించారు. 36 రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ద్వారా తన స్నేహితుడు అనిల్ అంబానీకి మోదీ రూ.30,000 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చారని విమర్శించారు. ఆయన దేశ ప్రజలకు ప్రధాని కాదనీ, అనిల్ అంబానీకి మాత్రమే ప్రధానమంత్రి అని రాహుల్ ఎద్దేవా చేశారు. యుద్ధ విమానాల కాంట్రాక్టు దక్కాలంటే రిలయన్స్ డిఫెన్స్‌తో తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాలని నిబంధన ఉన్న పత్రాన్ని ఉటంకిస్తూ ఫ్రాన్స్‌కు చెందిన మీడియా సంస్థ ‘మీడియా పార్ట్’ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాహుల్.. ప్రధాని మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రక్షణ మంత్రి ఫ్రాన్స్ పర్యటనపై... రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాత్రి ఫ్రాన్స్ పర్యటనకు అకస్మాత్తుగా బయలుదేరి వెళ్లడంపై రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు. ‘రక్షణమంత్రి అత్యవసరంగా ఫ్రాన్స్‌కు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? మోదీ స్వయంగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలు నిజం ఏంటంటే భారత ప్రధాని మోదీ ఓ అవినీతిపరుడు. అవినీతిపై పోరాడతానని వాగ్దానమిచ్చి మోదీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రఫేల్ ఒప్పందం సందర్భంగా జరిగిన అవినీతిలో ఆయన భాగస్వామి అయ్యా రు. ఆయన ఈ దేశానికి ఎంతమాత్రం ప్రధాని కాదు. మోదీ అనిల్ అంబానీకి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారు’ అని ఆరోపించారు. మీడియా కథనంపై స్పందించిన డసో.. మీడియా పార్ట్ బుధవారం ప్రచురిం చిన కథనంపై డసో ఏవియేషన్ స్పందించింది. తమ భారత భాగస్వామిగా రిలయన్స్‌ను స్వతంత్రంగానే ఎంపిక చేసుకున్నామనీ, ఇందులో ఎవరి ఒత్తిడి లేదంది. ప్రస్తుతం తాము బీటీఎస్ఎల్, డీఈఎఫ్ఎస్వైఎస్, కెనిటిక్, మహీంద్రా, మైనీ, శామ్‌టెల్ వంటి భారతీయ కంపెనీలతోనూ ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించింది. మరో వంద కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేయడంపై చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొంది. మరోవైపు రఫేల్ ఆరోపణలతో రాహుల్ గాంధీ జాతీయ భద్రతను అపహాస్యం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. అబద్ధాలతో తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకునేందుకు రాహుల్ యత్నిస్తున్నారని ఆరోపించారు. -
రాఫెల్ కొనుగోలు వివరాలివ్వండి
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ ఫైటర్జెట్ల కొనుగోలుపై దేశంలో రగడ నడుస్తున్న వేళ సుప్రీంకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. రాఫెల్ ఫైటర్జెట్ల కొనుగోలు ఒప్పందం కోసం పాటించిన ప్రక్రియ వివరాలను సీల్డ్ కవర్లో ఈ నెల 29లోగా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఒప్పందంలోని ఫైటర్జెట్ల ధర, ఇతర సాంకేతిక అంశాలను వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. న్యాయవాదులు వినీత్ ధండ, ఎంఎల్ శర్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాల(పిల్స్)ను సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలను రాజకీయ దురుద్దేశాలతో దాఖలు చేశారనీ, వీటిని వెంటనే కొట్టివేయాలని కోరారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ..‘మేం రాఫెల్ ఫైటర్ జెట్ల ధర, అవి మన అవసరాలకు సరిపోతాయా? వంటి ప్రశ్నలు అడగడం లేదు. కేవలం ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు పాటించిన ప్రక్రియ చట్టబద్ధత గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ రాఫెల్ కొనుగోలు ఒప్పందం సందర్భంగా పాటించిన పద్ధతిని తెలపాలని కోరితే మీరు(కేంద్రం) ఏమంటారు?’ అని ప్రశ్నించింది. దీనికి వేణుగోపాల్ జవాబిస్తూ..‘ఫైటర్జెట్ల కొనుగోలు ఒప్పందంలోని నిబంధనలతో పాటు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ వివరాలను ఎవ్వరికీ వెల్లడించలేం’ అని చెప్పారు. ‘ఒకవేళ ఒప్పందంలోని సాంకేతిక అంశాలు లేకుండా వివరాలు సమర్పించమని మేం కోరితే మీరేం చేస్తారు?’ అని అత్యున్నత న్యాయస్థానం మరోసారి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ స్పందిస్తూ..‘రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దేశంలోని ఏ ఒక్క నిరుపేద ప్రయోజనాలను ప్రస్తావించలేదు. ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్లు. పార్లమెంటులో కేంద్రం రాఫెల్ ఒప్పందంపై వివరణ ఇచ్చినప్పటికీ అవే ప్రశ్నలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ ఒప్పందంపై దేశంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఈ పిటిషన్లపై విచారణకు అనుమతిస్తే వీటిని రాజకీయ అస్త్రాలుగా వాడుకునే వీలుంది. ప్రభుత్వం తీసుకునే ఇలాంటి విధానపరమైన నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదు. ఒకవేళ కోర్టు ఇప్పుడు నోటీసులు జారీచేస్తే అది నేరుగా ప్రధానమంత్రికి వెళుతుంది. కాబట్టి దయచేసి ఈ పిటిషన్లను కొట్టివేయండి’ అని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ ఎం.ఎల్.శర్మ వాదిస్తూ.. రాఫెల్ ఫైటర్ జెట్ల ధర సహా మిగిలిన ఒప్పంద వివరాలను ఫ్రాన్స్ ప్రభుత్వం ఇప్పటికే అక్కడి పార్లమెంటు ముందు ఉంచిందని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో దాచిపెట్టడం సరికాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. ఈ పిటిషన్లలో ప్రస్తావించిన అంశాల లోతుకు తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. అలాగే రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేయబోమని తేల్చిచెప్పింది. రాఫెల్ ఫైటర్జెట్ల కొనుగోలు చట్టబద్ధతపై తాము సంతృప్తి చెందేందుకే ఈ సమాచారాన్ని కోరుతున్నామని వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్న 36 రాఫెల్ జెట్లను రూ.58,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు కేంద్రం 2016, సెప్టెంబర్ 23న ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భారీ అవినీతి చోటుచేసుకుందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిర్మల పర్యటన అందుకే: రాహుల్ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సమర్థించేందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఇందులోభాగంగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ పర్యటనకు వెళుతున్నారన్నారు. రిలయన్స్ ఉంటేనే ఒప్పుకుంటాం! రాఫెల్ ఒప్పందం కుదరాలంటే ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్ తనకు భారత భాగస్వామిగా రిలయన్స్‌ను ఒప్పుకోవాల్సిందేనంటూ ఓ షరతు ఉన్న పత్రం తాజాగా తమకు లభించినట్లు ఓ ఫ్రెంచ్ మీడియా సంస్థ పేర్కొంది. రిలయన్స్‌ను డసోకు భారత భాగస్వామిగా మోదీ ప్రభుత్వమే ఎంపిక చేసిందనీ, మరో కంపెనీని తీసుకునే అవకాశం కూడా తమకు ఇవ్వలేదని గతంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ వెల్లడించడం.. ఆ తర్వాత రిలయన్స్‌ను తామే ఎంచుకున్నామని డసో వివరణ ఇవ్వడం తెలిసిందే. తాజాగా ఫ్రెంచ్ జర్నల్ ‘మీడియాపార్ట్’.. రాఫెల్ ఒప్పందంలో భారత భాగస్వామిగా రిలయన్స్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని ఓ షరతు ఉన్నట్లుగా తెలిపే పత్రం తమకు దొరికిందని వెల్లడించింది. -
రాఫెల్ డీల్ వివరాలు కోరిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాలపై రాజకీయ రాద్ధాంతం జరుగుతున్న క్రమంలో ఈ ఒప్పందం ఎలా చేసుకున్నారనే వివరాలను అందించాలని సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈనెల 29లోగా ఒప్పంద వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. యుద్ధవిమానాల ధర, వాటి ప్రమాణాల వివరాల్లోకి తాను వెళ్లబోనని సుప్రీం కోర్టు వివరణ ఇచ్చింది. రాఫెల్ డీల్‌పై తాము కేంద్రానికి ఎలాంటి నోటీసులు జారీ చేయడం లేదని, పిటిషనర్ చేసిన ఆరోపణలు సరైనవికానందున కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోబోదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. ఈ ఒప్పందంపై పిటిషన్లు దాఖలు చేసిన ఇద్దరు న్యాయవాదులు రాఫెల్ డీల్‌పై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. ఈ ఒప్పందంలోని వివరాలను కేంద్రం వెల్లడించాలని లేదా ఒప్పందాన్ని రద్దు చేయాలని పిటిషనర్లు తమ పిటిషన్లో కోరారు. కాగా పిటిషనర్లు రాజకీయ ప్రయోజనాలను ఆశించి కేసు వేశారని కేంద్రం తరపు న్యాయవాది అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు నివేదించారు. రాఫెల్ యుద్ధవిమానాలు జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. రూ 59,000 కోట్ల రాఫెల్ ఒప్పందంలో భారీగా అవినీతి చోటుచేసుకుందని పిటిషనర్ ఎంఎల్ శర్మ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2015లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్‌తో పారిస్‌లో చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పందాన్ని ప్రకటించారన్నారు. -
‘రాఫెల్’పై 10న సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు కోసం ఫ్రెంచి ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం వివరాలను ‘సీల్డు కవర్’లో అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రాఫెల్ ఒప్పందం అమలుపై స్టే విధించాలంటూ తాజాగా దాఖలైన మరో పిటిషన్‌తో కలిపి దీనిపై ఈ నెల 10న విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం నిర్ణయించింది. భారత్, ఫ్రెంచి కంపెనీ డసో మధ్య కుదిరిన రూ.58వేల కోట్ల రాఫెల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రధానిపై అవమానకరమైన, నీతిబాహ్యమైన రీతిలో ఆరోపణలు చేస్తున్నాయని పిటిషనర్ లాయర్ వినీత్ ధండా పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని వివాదానికి తెరదించాలని సుప్రీంకోర్టును కోరారు. -
రాఫెల్ మరో బోఫోర్స్ కానుందా?
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సాగిస్తున్న ప్రచారానికి అనేక పరిమితులున్నాయి. ఇక్కడ పాలకపక్షానికి వ్యతిరేకంగా పోరు సలుపుతూ, ప్రతిపక్షాలకు నాయకత్వం వహించడానికి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వంటి నాయకుడు లేరు. సింగ్ తెలివితేటలపై, సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ, ఆయన విషయం వివరించే విధానం ఆయన చెప్పే విషయంపై ప్రజలకు నమ్మకం కుదిరేలా చేసింది. బోఫోర్స్ వ్యవహారంలో మాదిరిగా కుంభకోణం జరిగిందనడానికి కొద్దిపాటి సాక్ష్యాధారాలు కూడా రాఫెల్ వివాదంలో కనపడటం లేదు. దీనిపై వివరణాత్మక కథనాలుగానీ, నినాదం గానీ ఇంకా వినిపించడం లేదు. రాఫెల్ వ్యవహారం నరేంద్రమోదీ పాలిటి బోఫోర్స్‌లా మారిందని ఆయనను తీవ్రంగా విమర్శించేవారు సైతం చెప్పడం లేదు. కానీ, తాము ఆ పనిలో ఉన్నామనీ, కొన్ని నెలల క్రితం వరకూ అజేయుడిగా కనిపించిన ప్రధానిని ఓడించడానికి బ్రహ్మాస్త్రంగా పనిచేసే శక్తి దీనికి ఉందని వారంటున్నారు. అయితే వెల్లడిస్తున్న విషయాల్లో పదునైన అంశాలేవీ లేవు. మొదటిది, గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి రాఫెల్ అంటే ఏమిటో తెలియదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం 21 శాతం మందికే రాఫెల్ అంటే ఏమిటో తెలుసని ఇటీవలి ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో తేలింది. దీనికి మా జర్నలిస్టులనే నిందించాలి. రెండోది, జనం నమ్మేరీతిలో ప్రతిపక్షాల సందేశాన్ని ఓటర్ల వద్దకు తీసుకెళ్లే వీపీ సింగ్ వంటి నైతిక బలమున్న నేత ఇప్పుడు లేడు. బోఫోర్స్‌తో పాటు ఇంకా అనేక ఇతర కుంభకోణాల నీడలు వెంటాడుతున్న కారణంగా కాంగ్రెస్, రాహుల్‌గాంధీS ఈ పనిచేయడానికి సరిపోరు. ప్రతిపక్షాలు, ప్రధానంగా రాహుల్‌గాంధీ రాఫెల్ వివా దాన్ని 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానాంశంగా చేయాలని నిర్ణయించారు. కేంద్రంలో పాలక కూటమి అవినీతి, ఆశ్రిత పెట్టుబడి దారీ పోకడలు వంటి విషయాలు దీనికి అవి జోడిస్తాయి. అనేక సొంత కంపెనీలు నష్టాలతో నడుస్తున్న అత్యంత వివాదాస్పదుడైన పారిశ్రామికవేత్తకు మోదీ అడ్డగోలుగా మేలు చేయగలిగితే, విజయవంతంగా కంపెనీలు నడిపే బడా వ్యాపారవేత్తలకు ఆయన ఎందుకు సాయం చేయడు? అనే వాదనను అవి ముందుకు తెస్తాయి. ఆరోపణలన్నీ రాఫెల్ చుట్టూనే! గతంలో వ్యాపారులకు మేలు చేస్తున్నారనే సందేశం ఇవ్వడానికి ‘‘సూట్ బూట్ సర్కార్’’ అనే నినాదం ఇచ్చిన కాంగ్రెస్ తన ఆరోపణలకు రాఫెల్ చుట్టూ నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని సమీకరించడానికి, పార్లమెంటును కుదిపేసే కథనాలు తీసుకు రావడానికి బోఫోర్స్ కుంభకోణం రోజుల్లో మాదిరిగా రామ్‌నాథ్ గోయెంకా నాయకత్వంలో నడిచిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి మీడియా సంస్థ లేదని ప్రతిపక్షాలు బాధపడుతున్నాయి. వాటికున్నదల్లా మచ్చలేని వ్యక్తి గత ప్రతిష్ట ఉన్న ఇద్దరు అరుణ్‌శౌరీ, ప్రశాంత్ భూషణ్ మాత్రమే. ఈ అశ్వమేధ యాగం ముందు నిలపడానికి తగిన అశ్వం రాహుల్ కాదు. అవినీతి విషయమై ఇంకా బీజేపీ లోపల ఏ పెద్ద నాయకుడూ తిరుగుబాటు చేయలేదు. ఒక్కసారి మన రాజకీయ చరిత్ర పరిశీలిద్దాం. 1977లో విధేయుడైన జగ్జీవన్ రామ్ ఇందిరాగాంధీపై, 1988–89లో నమ్మకస్తుడైన వీపీ సింగ్ రాజీవ్‌గాంధీపై చేసిన తిరుగుబాట్లే ఈ రెండు లోక్‌సభ ఎన్నికల ఫలితాలను మార్చేశాయి. తల్లీకొడుకుల ఓటమికి కారణ మయ్యాయి. మరో వీపీ సింగ్‌ను ఆశించడమా! ఇప్పుడు మరో వీపీ సింగ్‌ను ఆశించడం వాస్తవ విరుద్ధమే అవుతుంది. ఎందుకంటే, వీపీ సింగ్‌కు అవినీతి అంటని గొప్ప నిజాయితీపరుడిగా పేరుండ డమేగాక, ఆయన కేంద్ర కేబినెట్లో కీలకమైన (రక్షణ శాఖ) మంత్రి పదవిని త్యాగం చేశారు. రెండోది, ఆయన నరేంద్రమోదీ లేదా వాజ్‌పేయీ లాగా గొప్ప వక్త కాదు. కాని, 30 ఏళ్ల క్రితమే దేశంలో కేంద్రస్థానమైన హిందీ ప్రాంతాల్లో సంక్లిష్టమైన ఆయుధాల కొనుగోలు ఒప్పందంలో జరిగిన కుంభ కోణాన్ని సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలా ఆయన విడమరచి చెప్పగలిగారు. అంతటి గొప్ప మాంత్రికుడాయన. కుంభకోణాల వెల్లువలో రాజీవ్ గాంధీ ప్రతిష్ట తగ్గడం మొదలవ్వగానే 1987లో వీపీ సింగ్ మంత్రి పదవికి, పార్లమెంటుకు రాజీనామా చేశారు. అలహాబాద్ ఉప ఎన్నికలో పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. బోఫోర్స్ కుంభకోణంలో ముడుపుల ఆరోపణలకు సంబంధించి అప్పుడే అమితాబ్ బచ్చన్ ఈ సీటుకు రాజీనామా చేయడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. వాతావరణం వీపీ సింగ్‌కు అనుకూలంగానే ఉంది. కానీ, ఆయన బోఫోర్స్‌ను ఎన్నికల అంశంగా చేయలేరని ఆయన మిత్రులు, శత్రువులు కూడా నమ్మారు. తమకు సంబంధం లేని క్లిష్టతరమైన విషయంపై పేద గ్రామీణులు ఎలా స్పందించగలరని వారు అనుకున్నారు. సింగ్ చక్కటి పద్ధతిలో ప్రచారం చేసి గెలిచారు. మోటర్‌సైకిల్‌పై వెనుక సీట్లో కూర్చుని మండు వేసవిలో ఆయన ప్రచారం చేశారు. నేడు సామాజిక కార్యకర్త, రాజకీయ నేత యోగేంద్ర యాదవ్ మాదిరిగా మెడ చుట్టూ తువ్వాలు(గమ్చా) చుట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ, ఓ మామూలు ప్రశ్న అడిగే వారు. రాజీవ్‌గాంధీ మీ ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు తెలుసా? అనే ప్రశ్న సంధించేవారు. తర్వాత వెంటనే తన కుర్తా జేబు నుంచి అగ్గిపెట్టె తీసి పట్టుకునే వారు. ‘‘చూడండి, ఇది అగ్గిపెట్టె. మీ బీడీ లేదా హుక్కా లేదా మీ పొయ్యికి నిప్పు అంటించడానికి ఆరణాలు (25 పైసలు) పెట్టి అగ్గిపెట్టె కొంటారు. కాని, ఆరణాల్లో నాలుగోవంతు ప్రభుత్వానికి పన్ను రూపంలో పోతుంది. ఈ సొమ్ముతో ప్రభుత్వం మీకు స్కూళ్లు, ఆస్పత్రులు, రోడ్లు, కాలవలు నిర్మించడమే గాక, మీ సైన్యానికి తుపాకులు కొనుగోలు చేస్తుంది. ఇది మీ సొమ్ము. దీంట్లో కొంత ఎవరైనా దొంగిలిస్తే–అదీ సైన్యానికి తుపాకులు కొనేటప్పుడు ఆ పని చేస్తే–మీ ఇంట్లో దొంగలు పడినట్టు కాదా?’’ ఇలా వీపీ సింగ్ జనానికి బోఫోర్స్ గురించి వివరించేవారు. వాస్తవానికి కుంభకోణం వివరాలు, అంకెలతో కూడిన వివరాల కన్నా సింగ్ ప్రజలకు దీని గురించి కథలా చెప్పిన విధానమే బాగా పని చేసింది. ‘‘తనకు ముడుపులు ఏమీ చెల్లించలేదంటూ బోఫోర్స్ కంపెనీ తనకు సర్టిఫికెట్ ఇచ్చిందని రాజీవ్‌గాంధీ చెబుతున్నారు. ఇది ఎలా ఉందంటే, తాను మానసికంగా అంతా బాగానే ఉన్నానంటూ మానసిక రోగుల ఆస్పత్రి తనకు సర్టిఫికెట్ ఇచ్చిందని, మీకు కూడా ఇలాంటి పత్రం లేకుంటే మీరు మానసికంగా బాగున్నట్టు ఎలా భావించాలని ఓ పిచ్చివాడు చెబుతూ దాన్ని చూపిస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంది’’ అని వీపీ సింగ్ తన ప్రసంగాల్లో వివరించేవారు. బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్‌గాంధీ ఒక్కరే లంచాలు తీసుకున్నారని ప్రజలను నమ్మించడానికి ఇలా మరో కథ చెప్పేవారు. ‘ఓ సర్కస్‌లో ఓ సింహం, ఆబోతు, పిల్లి ఒకే చోట దగ్గర దగ్గరగా ఉండేవి. ఓ రాత్రి ఎవరో ఈ జంతువుల బోనులన్నీ తెరిచారు. మరుసటి ఉదయం గుర్రం, ఆబోతు మృతదేహాలను సర్కస్ యజమాని చూశారు. వాటిని ఎవరు తిన్నారో మీకేమైనా అను మానాలున్నాయా? సింహమా? పిల్లా? బోఫోర్స్‌లో అంత పెద్ద మొత్తంలో సొమ్ము తినేశారంటే, చిన్న పిల్లి వంటి జంతువు తిని ఉంటుందా? సింహం సైజులో ఉండే దొంగ రాజీవ్ మాత్రమే ఆ పనిచేయగలరు’’ అంటూ వీపీ సింగ్ చేసిన వాదనలు జనంలోకి వెళ్లి పోయాయి. అంతే కాదు, చిరునవ్వుతో ఉన్న రాజీవ్ బొమ్మతో కూడిన కాంగ్రెస్ హోర్డింగులను ఆయన చూపిస్తూ విసిరే మాటల తూటాలు కూడా బాగా పనిచేశాయి. ‘‘రాజీవ్ ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థంకావడం లేదు. ఆయన మోసంపైనా? మన అమాయకత్వంపైనా? లేదా స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో దాచిన సొమ్మును చూసుకునా? నేనైతే మీకు కాలవలు, గొట్టపు బావులు తెస్తానని వాగ్దానం చేయలేను. కానీ, మీ సంపదను దోచుకుంటున్న వారికి అడ్డుకట్ట మాత్రం వేయగలను’’ అంటూ ప్రజలను సింగ్ ఆకట్టుకునేవారు. సింగ్ తెలివితేటలపై, సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ, ఆయన విషయం వివరించే విధానం ఆయన చెప్పే విషయంపై ప్రజలకు నమ్మకం కుదిరేలా చేసింది. ఇప్పటి కాంగ్రెస్‌లో ఇలా విషయం జనానికి వివరించగల నేతలు కరువయ్యారు. నేడు ప్రతిపక్షాలకు వీపీ సింగ్ వంటి నాయకుడు లేడు. అలాగే, రాఫెల్ కూడా బోఫోర్స్ అంతటి శక్తిమంతమైన విషయం కాదు. బోఫోర్స్‌కూ, రాఫెల్‌కూ ఎంతో తేడా బోఫోర్స్‌కూ, రాఫెల్‌కూ మధ్య ఎంతో తేడా ఉంది. బోఫోర్స్ శతఘ్ని నాణ్యతపై భిన్నాభిప్రాయాలున్నాయిగాని, రాఫెల్ అత్యుత్తమ యుద్ధవిమానమని అందరూ అంగీకరిస్తారు. కాంగ్రెస్ దీన్ని ఎంపిక చేయడమే దీనికి కారణం. ముందుగా అనుకున్నట్టు 126కు బదులు మోదీ సర్కారు 36 విమానాలు మాత్రమే కొనుగోలు చేయడంపైనే ఆరోపణ. ‘బోఫోర్స్ మొదటి శతఘ్నిని భారత సైనికులు పేల్చినప్పుడు అది వెనక్కి పేలడంతో మనవాళ్లే పలువురు మరణించారు’ అని వీపీ సింగ్ అప్పట్లో చెప్పగలిగారు. ఇప్పుడు రాఫెల్ విమానం గురించి ఇలా ఎవరూ మాట్లాడలేరు. జర్నలిస్ట్ టీఎన్ నైనన్ చెప్పినట్టు రెండో విషయం ఏమంటే, బోఫోర్స్ కుంభకోణంలో మాదిరిగా ఆరోపణలకు అనుకూల మైన సాక్ష్యాధారాలేవీ ఇంతవరకు బయటకు రాలేదు. బోఫోర్స్ ముడుపులు లంచాలు భారతీ యులకు సంబంధమున్న మూడు స్విస్ బ్యాంక్ అకౌంట్లకు జమ అయ్యాయని స్వీడన్ జాతీయ ఆడిటర్ దర్యాప్తులో తేలింది. కానీ, రాఫెల్ విమానాల తయారీలో భారతీయ పార్టనర్ కంపెనీని భారత ప్రభుత్వమే సూచించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ చేసిన ప్రకటన స్వీడిష్ ఆడిటర్ చెప్పిన విషయానికి ఏమాత్రం సాటిరాదు. రక్షణ ఆయుధాల ఉత్పత్తిలో అనుభవం లేని కార్పొరేట్ సంస్థకు ఎలా రాఫెల్ విమాన తయారీలో భాగస్వామ్యం కల్పిస్తారని మాత్రమే అందరూ అడుగు తున్నారు. తమకు నచ్చినవారిపై పక్షపాతం చూపించే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం చెడ్డదేగాని నరేంద్ర మోదీ ఓటర్లను ఆయనకు వ్యతిరేకంగా తిప్పడానికి ఈ ఒక్క ప్రశ్న మాత్రమే సరిపోతుందా? ఇదే రాఫెల్ వ్యతిరేక ప్రచారానికి ఉన్న పరిమితి. గతంలో వీపీ సింగ్ బోఫోర్స్ వ్యవహారంపై అద్భుత రీతిలో పోరాడారు. ‘‘వీపీ సింగ్కా ఏక్ సవాల్, పైసా ఖాయా కౌన్ దలాల్? (సొమ్ము ఎవరో తినేశారు. ఆ బ్రోకర్ ఎవరన్నదే వీపీ సింగ్ ప్రశ్న)’’ అంటూ ఆయన ఇచ్చిన నినాదం సూటిగా దేశ ప్రజల్లో నాటు కుంది. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
రాఫెల్ డీల్ భారత్‌కు లాభదాయకం
న్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న వేళ వాయుసేన(ఐఏఎఫ్) అధిపతి బీఎస్ ధనోవా ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఫ్రాన్స్‌తో 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందం భారత్‌కు చాలా లాభదాయకమన్నారు. రాఫెల్ కొనుగోలుతో ఉపఖండంలో బలాబలాలు, సమీకరణాలు మారిపోతాయని ధనోవా అన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘భారత వాయుసేనలో యుద్ధ విమానాల సంఖ్య తగ్గిపోతున్న వేళ అత్యవసరంగా 36 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తన భారతీయ భాగస్వామి రిలయన్స్ డిఫెన్స్‌ను ఫ్రెంచ్ కంపెనీ డసో ఏవియేషన్ స్వచ్ఛందంగా ఎంచుకుంది. దీంట్లో కేంద్రం లేదా ఐఏఎఫ్ జోక్యం ఎంతమాత్రం లేదు. ఈ వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఎస్–400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలు ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేయనున్నాయి. ఎస్–400కు తోడు రాఫెల్ ఫైటర్ జెట్లతో భారత గగనతలం శత్రు దుర్భేద్యం అవుతుంది. సుఖోయ్–30, సుఖోయ్–25 యుద్ధవిమానాల అందజేతలో మూడేళ్లు, జాగ్వార్ అందజేతలో ఆరేళ్లు హాల్ వెనుకపడి ఉందని ధనోవా పేర్కొన్నారు. -
ఈ ప్రశ్నలకు బదులు లేదంటే రా‘ఫేల్’!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం 60 వేల కోట్ల రూపాయలకు మించిపోయిన రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కొనసాగుతున్న రగడకు సంబంధించి ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సమాధానానికి ఎక్కడ ఇసుమంత కూడా సంబంధం ఉండడం లేదు. ఈ విషయంలో ప్రజలకు స్పష్టత రావాలంటే కొన్ని ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే. మొదటి ప్రశ్న : ఈ రాఫెల్ యుద్ద విమానాల ఒప్పందం గురించి అప్పటి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు తెలుసా? తెలిస్తే ఆయన ఎందుకు క్యాబినెట్ సమావేశంలో ఇంత పెద్ద ఒప్పందం గురించి చర్చించలేదు ? చర్చించినట్లయితే ‘మినిట్స్’ ఉంటాయి గదా! ఎందుకు లేవు ? ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ వెళ్లి ఒప్పందం చేసుకున్నప్పుడు ఆయన వెంట పారికర్ ఎందుకు వెళ్లలేదు? 2015, ఏప్రిల్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ వెళ్లి అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండేతో చర్చలు జరిపారు. 126 రాఫెల్ యుద్ధ విమానాలకు గాను 36 యుద్ద విమానాల సరఫరాకు ఫ్రాన్స్‌తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఆదే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ఒప్పందానికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇక రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న డసౌ కంపెనీకి భారతీయ భాగస్వామి కంపెనీగా ఎంపికయిన అనిల్ అంబానీ నాయకత్వంలో రిలయెన్స్ గ్రూపు ‘రిలయెన్స్ డిఫెన్స్ ఫిక్సిడ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్’ సంస్థ మోదీ పర్యటనకు కేవలం 12 రోజుల ముందే 2015, మార్చి నెలలో ఏర్పాటయింది. అనిల్ అంబానీ గ్రూప్ 2015, జూన్ నెలలో మహారాష్ట్ర ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. నాగపూర్‌లో ఇంటర్నేషనల్ కార్గో హబ్, ఎయిర్ పోర్ట్ సెజ్ నుంచి 289 ఎకరాల స్థలాన్ని కోరింది. అదే సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఆ మేరకు స్థలాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అనిల్ అంబానీ గ్రూప్ సంస్థకు అప్పగించింది. 2016లో భారత్, ఫ్రాన్స్ మధ్య రాఫెల్ యుద్ధ విమానాల తుది ఒప్పందం కుదిరింది. ఆ తర్వాతనే అనిల్ అంబానీ రిలయెన్స్ పేరు బయటకు వచ్చింది. 2017, అక్టోబర్ 27వ తేదీన నాగపూర్‌లో ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతో అనిల్ అంబానీ. పక్కన డసౌ ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రాపియర్.... నాగపూర్‌లో 2017, అక్టోబర్ 27వ తేదీన ‘డసౌ రిలయెన్స్ ఎయిరోస్పేస్ లిమిటెడ్’ పేరిట సంయుక్త ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గడ్కారీ, డసౌ సీఈవో ఎరిక్ ట్రాపియర్, ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, అనిల్ అంబానీ హాజరయ్యారు. అయినా డసౌ భాగస్వామ్య కంపెనీ రిలయెన్స్ కంపెనీ అని తనకు తెలియదని మనోహర్ పారికర్ స్థానంలో సెప్టెంబర్‌లోనే కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ పలు సార్లు పదే పదే చెప్పడం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. 2016, జూన్ నెలలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పార్లమెంట్లో ఓ ప్రకటన చేస్తూ రాఫెల్ యుద్ధ విమానాల గురించి తనకు తెలయదనే చెప్పారు. పవర్ఫుల్ ప్రధాని ఉన్నప్పుడు కేబినెట్ డమ్మీగా ఉండడం సహజమేగానీ, ఏకంగా 60 వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన రక్షణ ఒప్పందం గురించి రక్షణ మంత్రికి చెప్పకుండా ఓ ప్రధాని ఒప్పందం చేసుకుంటారా? అన్నది రెండో ప్రశ్న. ఒప్పందం గురించి తనకు తెలియదన్నట్లుగా మాట్లాడినందుకే పారికర్‌ను మూడు నెలల్లోనే ఆ శాఖ నుంచి తప్పించారా? అనారోగ్య కారణాలే కారణమా? 2018, ఫిబ్రవరి నెలలో నిర్మలా సీతారామన్ రాజ్యసభలో మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందం విలువను వెల్లడించకపోవడానికి కారణం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలంటూ నాడు ఫ్రాన్స్, భారత్‌తో ఒప్పందం చేసుకోవడమేనని తెలిపారు. ఇందులో ఏ మాత్రమైన నిజముందా? భారత్‌కు సంబంధించిన భారీ మొత్తాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు భారతీయులకు జవాబుదారీగా ఉండాల్సిన భారత ప్రభుత్వం ఇలాంటి ఒప్పందానికి లొంగడం అంటే ఎంత అర్థరహితం. ఫ్రాన్స్‌కు చెందిన డసౌ ఏవియేషన్స్ కంపెనీ ప్రభుత్వ లిమిటెడ్ కంపెనీ, అలాంటప్పుడు రహస్య ఒప్పందాలకు ఆస్కారం ఉండదు. భారత్‌కు 36 రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి 8.139 బిలియన్ యూరోల విలువైన రక్షణ ఒప్పందం చేసుకున్నట్లు 2016 బ్యాలెన్స్ షీట్లో ఆ కంపెనీ పేర్కొంది. ఒప్పందం విలువలో రహస్యమేమి లేదని, 36 విమానాల్లోని ఫీచర్స్ ఏమీటన్నదే రహస్యమని ఫ్రాన్స్ అధ్యక్షుడే ఆ తర్వాత వివరణ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. నేటి రూపాయి విలువతో పోలిస్తే నాటి బిలియన్ యూరోల ఒప్పందం అక్షరాల 69 వేల కోట్ల రూపాయలు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు అనుభవం లేదా? రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థయిన ‘హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)’ కంపెనీ డసౌ భాగస్వామ్య కంపెనీగా ఉండాలని ప్రతిపాదించారు. ఆ కంపెనీని కాదని అనిల్ అంబానీ కంపెనీని తీసుకరావడానికి కారణం ఏమిటంటే హెచ్ఏఎల్కు అంత అనుభవం లేకపోవడమేనని నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. అనుభవాలిదుగో! అంతకుముందు సోవియట్, ఆ తర్వాత రష్యా నుంచి మిగ్, సుఖోయ్ రేంజ్ యుద్ధ విమానాల ఒప్పందంలోనూ, ఆ తర్వాత బ్రిటన్, ఫ్రెంచ్ జెట్ యుద్ధ విమానాల ఒప్పందంలోనూ, ఫొలాంగ్ గ్నాట్ నుంచి ఆంగ్లో-ఫ్రెంచ్ విమానాల ఒప్పందాల వరకు క్రియాశీలక భాగస్వామ్య కంపెనీగా ఉన్నది హెచ్ఏఎల్యే. అంతెందుకు ‘ఫ్రెంచ్ మిరేజ్-2000’ యుద్ధ విమానాల ప్రాజెక్టులో ప్రస్తుత డసౌ కంపెనీతోనే హెచ్ఏఎల్ గత 30 ఏళ్లుగా కలిసి పనిచేస్తోంది. అనిల్ కంపెనీకి జీరో అనుభవం యుద్ధ విమానాలను తయారు చేయడంలో అనిల్ అంబానీ కంపెనీకి ఎలాంటి అనుభవం లేదు. అయినా నౌకా కంపెనీలో ఎరోనాటిక్స్ అన్నది ఓ చిన్న విభాగం. ఆయన నౌకా కంపెనీ 2011లో భారతీయ నౌకాదళంలో ఐదు నౌకల తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. వాటిని 2016, నవంబర్ నాటికి అప్పగించాలి. గత నెల సెప్టెంబర్ నెలలో రెండో నౌకను సరఫరా చేసింది. ఇక మరో మూడు ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. 45 వేల కోట్ల అప్పులు అనిల్ అంబానీ నాయకత్వంలోని రిలయెన్స్ కమ్యూనికేషన్లకు 45 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఆ అప్పులను భరించలేకనే ఆయన ఇటీవల అధాని గ్రూపునకు తన పవర్ కంపెనీలను 18వేల కోట్ల రూపాయలకు విక్రయించారు. అప్పుల్లో ఉన్న కంపెనీకి ఓ భారీ ప్రాజెక్టును కట్టబెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో వివరించాలి? ఈ ప్రాజెక్ట్‌తో ఆ అప్పులన్నింటినీ తీర్చుకోమని చెప్పడమా? అనిల్ అంబానీ వేరు, ముకేష్ అంబానీ వేరు 2012, 2013లో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం గురించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో చర్చలు జరిపినప్పుడు రిలయెన్స్ కంపెనీని కూడా పరిగణలోకి తీసుకున్నారని, అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంటే వచ్చిందా? అని మోదీ ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ట్వీట్లు కూడా వదులుతున్నారు. ముకేష్ అంబానీ నాయకత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీ అప్పట్లో సంప్రతింపుల్లో పాల్గొన్న మాట నిజం. 2014లోనే అది పూర్తిగా తప్పుకొంది. ముకేష్ కంపెనీలు వేరు అనిల్ అంబానీ కంపెనీలు వేరన్న విషయం మోదీ ముఖ్యులకే తెలియకపోతే ఎలా? -
మేం వస్తే జీఎస్టీని తగ్గిస్తాం: రాహుల్
చిత్రకూట్: తాము అధికారంలోకి వస్తే వస్తు సేవల పన్ను(జీఎస్టీ)భారం తగ్గిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ హామీ ఇచ్చారు. కాపలాదారే చోరీకి పాల్పడ్డాడంటూ రాఫెల్ ఒప్పందంపై ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో రాహుల్ రెండు రోజుల పర్యటన గురువారం మొదలైంది. కమ్తానాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నాక ర్యాలీలో మాట్లాడారు. ‘నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా వ్యాపార రంగాన్నీ, ఉద్యోగితనూ మోదీ ప్రభుత్వం దెబ్బతీసింది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే గబ్బర్ సింగ్ ట్యాక్స్(జీఎస్టీ)ని వాస్తవ పన్నుగా మార్చుతాం. పన్ను రేట్లను తక్కువ స్థాయికి తెస్తాం. ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాం’ అని తెలిపారు. ‘భారత్ కాపలాదారు దొంగతనానికి పాల్పడ్డారు’ అంటూ రాఫెల్ డీల్‌పై ప్రధాని మోదీపై మండిపడ్డారు. ‘కాపలాదారుగా ఉంటానని చెప్పిన ఈ వ్యక్తి(మోదీ) పేద ప్రజలకు, యువతకు చెందాల్సిన రూ.30వేల కోట్ల ప్రజాధనాన్ని తన మిత్రుడు, పారిశ్రామిక వేత్త అయిన అనిల్ అంబానీ జేబులో పెట్టారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే రైతు రుణాలను రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు. -
రాఫెల్ రగడ..
-
రాఫెల్‌పై రచ్చ రచ్చ..!
ఆరోపణలు, ప్రత్యారోపణలు.. విమర్శలు, ప్రతివిమర్శలతో రాఫెల్ రాజుకుంటోంది. భారత ప్రభుత్వం సూచనమేరకే రిలయన్స్ డిఫెన్స్‌ని ఒప్పందంలో భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ తాజాగా పేల్చిన బాంబుతో రాజకీయ రచ్చ తారాస్థాయికి చేరుకుంది. మరోవైపు ఫ్రాన్స్ ప్రభుత్వం ఇలాంటి ఒప్పందాల్లో విమానాలు తయారు చేసే కంపెనీలకే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, డసో ఏవియేషన్ కంపెనీ ఇష్టం ప్రకారమే భాగస్వామి ఎంపిక ఉంటుందని అంటోంది. అసలు ఏమిటీ ఒప్పందం ? కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన ఆరోపణలు, లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్నలేంటి ? కేంద్రం చెబుతున్నదేంటి ? ఇరు పార్టీల మధ్య రాఫెల్ పరిణామాలు ఎందుకు వివాదాన్ని లేవనెత్తాయి ? యూపీఏ హయాంలో ఏం జరిగింది ? 126 మధ్య తరహా రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని 2007లో యూపీఏ ప్రభుత్వం భావించింది. కొన్నేళ్ల పాటు ఇరుపక్షాల మధ్య చర్చలు సాగాయి. చివరికి 18 విమానాలు ఫ్రాన్స్‌లో తయారు చేయాలని, మిగిలిన 108 విమానాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) భాగస్వామ్యంతో భారత్‌లో తయారు చేయాలని 2012లో కేంద్రప్రభుత్వం, విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్ ఒక అంగీకారానికి వచ్చాయి. ధర విషయంలో చర్చలు ఒక కొలిక్కి రాకుండానే ఇరు దేశాల్లో ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారాయి. దీంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే ఒక్కో యుద్ధవిమానానికి రూ. 526 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నామని కాంగ్రెస్ చెబుతోంది. ఎన్డీయే హయాంలో ఏం జరిగింది ? ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌తో చర్చలు జరిపారు.126కి బదులుగా 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని 2015లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ధర విషయంలో మాత్రం గోప్యత పాటించింది. ఎన్ని కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందో, ఒక్కో విమానాన్ని ఎన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేస్తోందో అధికారికంగా వెల్లడించలేదు. అయితే 59 వేల కోట్లకు రాఫెల్ ఒప్పందం కుదిరిందని, 2019 సెప్టెంబర్ నుంచి 2022 ఏప్రిల్ మధ్య 36 యుద్ధ విమానాలను భారత్‌కు సరఫరా చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించిందని వార్తలు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే ఒక్కో విమానం కొనుగోలుకయ్యే ఖర్చు 1670 కోట్లు. ఇక యుద్ధ విమానాల తయారీకి భారత్ భాగస్వామిగా హెచ్ఏఎల్కు బదులుగా అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ డిఫెన్స్‌ను సర్వీస్ ప్రొవైడర్లుగా చేర్చింది. హాల్‌ను తప్పించడం యూపీఏ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ను రాఫెల్ యుద్ధ విమానాల తయారీ భాగస్వామిగా నియమిస్తే, దానిని తప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది కాంగ్రెస్ ప్రధానంగా లేవనెత్తిన అంశం. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చడం కోసమే హెచ్ఏఎల్ను తప్పించారంటూ దాడికి దిగుతూ వచ్చింది. హాల్‌కి రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే సామర్థ్యం లేనే లేదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఎదురు దాడి చేశారు. అయితే హెచ్ఏఎల్ మాజీ చైర్ పర్సన్ టి. సువర్ణరాజు యుద్ధ విమానాలు చేసే సామర్థ్యం తమకు ఉందని స్పష్టం చేయడంతో ఎన్డీయే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. సుఖోయ్–30 విమానాలను తాము తయారు చేశామని, డసో ఏవియేషన్ తయారు చేసిన మిగ్–2000 విమానాల నిర్వహణ కూడా తామే చేస్తున్నామంటూ టి.ఎస్ రాజు మీడియా ఇంటర్వూ్యల్లో పేర్కొన్నారు. అయిదేళ్లుగా సాంకేతిక బృందానికి తాను నాయకత్వం వహించానని, రాఫెల్ విమానాలను కూడా తాము తయారు చేయగలిగి ఉండేవాళ్లమని రాజు వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలతో నిర్మలా సీతారామన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని రుజువైందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలకు దిగడంతో రాజకీయ వేడి పెరిగింది. వివాదం ఎలా ముదిరింది? రాఫెల్ ఒప్పందంలో భారీగా అవకతవకలు జరిగాయని, దేశ ప్రయోజనాలు కాలరాస్తూ అనిల్ అంబానీకి లబ్ధి చేకూరేలా మోదీ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుందని కాం గ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదట్నుంచీ ఆరో పణలు చేస్తున్నారు. రాఫెల్ ఒప్పందంలో అంశాలను రహస్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది ? విమానాల తయారీ భాగస్వామిగా హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)ను ఎందుకు తప్పించారు ? విమానాల తయారీ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేయాల్సిన అవసరమేంటి ? ఈ మూడు అంశాల చుట్టూ వివాదం తిరుగుతూ వస్తోంది. కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు బీజేపీ సూటిగా సమాధానాలు చెప్పకపోవడం, కొత్త కొత్త విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉండటంతో రాజకీయం రంగులు మారుతోంది. రాఫెల్ అంటే.. రెండు ఇంజిన్లు కలిగిన బహుముఖ యుద్ధవిమానాలను ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తుంది. రాఫెల్ పేరుతో తయారు చేసే ఈ యుద్ధవిమానాలు అత్యంత సమర్థంగా పనిచేస్తాయని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కాంగ్రెస్, కేంద్రం వాదప్రతివాదాలు జరిగిందిలా.. రాఫెల్ ఒప్పందంపై మొదట్నుంచి ఎన్డీయే ప్రభుత్వం గోప్యత పాటిస్తూ వస్తోంది. యూపీఏ చర్చించిన దాని కంటే తమ ఒప్పందమే ఉత్తమమైనదని యూపీఏతో పోల్చి చూస్తే తాము ఖజానాకు 12,600 కోట్లు ఆదా చేశామని మోదీ సర్కార్ చెబుతోంది. ఫ్రాన్స్, భారత్ మధ్య 2008లో కుదిరిన అవగాహన మేరకు ఈ ఒప్పందంలో అంశాలు బయటకు వెల్లడించలేమని అంటోంది. అయితే ఆ ఒప్పందం కుదిరిన సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న కాంగ్రెస్‌కు చెందిన ఏకే ఆంటోని బీజేపీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, ఆ ఒప్పందం ప్రకారం సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు వెల్లడి చేయకూడదనే ఉంది తప్ప, ధర కాదని అంటున్నారు. అలాంటప్పుడు రాఫెల్ యుద్ధ విమానం ధరలపై గోప్యత పాటించాల్సిన అవసరమేముందన్నది ఆయన వాదన. యూపీఏ ప్రభుత్వం ఒక్కో యుద్ధ విమానాన్ని రూ.526 కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధమైతే ఎన్డీయే ప్రభుత్వం ఒక్కో యుద్ధ విమానానికి రూ.1670 కోట్లు వెచ్చిస్తోందని, అందుకే బీజేపీ నోరు మెదపడం లేదన్నది కాంగ్రెస్ వాదన. రిలయన్స్ డిఫెన్స్ చేరడం ఒక వ్యాపారవేత్తకు లబ్ధి చేకూర్చడానికే మోదీ ప్రభుత్వం దేశ భద్రతనే పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2015, ఏప్రిల్ 10న రాఫెల్ ఒప్పందం కుదిరిందని మోదీ ప్రభుత్వం ప్రకటిస్తే, దానికి సరిగ్గా 12 రోజులు ముందే రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ ఏర్పాటైందన్నది కాంగ్రెస్ ఆరోపణ. రాఫెల్ ఒప్పందం కుదుర్చుకోవడానికి అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ భారత్‌కు వచ్చిన సమయంలోనే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ హోలన్ సహచరి, నటి జూలీ గయె ప్రధాన పాత్రలో రెండు సినిమాలు నిర్మించడానికి అంగీకరించింది. జూలీ గయె ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి తాము ఫ్రెంచ్ సినిమాలు తీస్తామంటూ అనిల్ అంబానీ అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. క్విడ్ ప్రో కో ఒప్పందంలో భాగంగా రాఫెల్ కాంట్రాక్ట్ తమకి దక్కడం కోసమే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సినీ రంగంలో పెట్టుబడులు పెట్టిందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. విమానాల తయారీ రంగంలో 70 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హాల్‌ను కాదని విమాన తయారీ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించడం వల్ల దేశ భద్రతే ముప్పులో పడిందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఆరోపణల్నింటినీ తిప్పికొట్టిన కేంద్రం రిలయన్స్ డిఫెన్స్‌ను సర్వీసు ప్రొవైడర్లుగా తాము ఎంపిక చేయలేదని, డసో ఏవియేషన్ కంపెనీయే ఎంపిక చేసుకుందని ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ రిలయన్స్‌ను ఎంపిక చేసుకోవాలని మోదీ ప్రభుత్వం తమకు సూచించిందని వెల్లడించడంతో కాంగ్రెస్ చేతికి ఒక పెద్ద ఆయుధం దొరికినట్టయింది. కాంగ్రెస్ లేవనెత్తిన సందేహాలకు ఎన్డీయే ప్రభుత్వం సూటిగా సమాధానాలు చెప్పకపోవడం, ఎన్టీయే మంత్రులు చెబుతున్నదానికి విరుద్ధమైన ప్రకటనలు అవతల పక్షం నుంచి వస్తూ ఉండడంతో రాఫెల్ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది. -
‘రాఫెల్ వివాదం’లో పారదర్శకత ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘గత ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా 126 రాఫెల్ యుద్ధ విమానాలకు బదులుగా 36 యుద్ధ విమానాలనే కొనుగోలు చేయాలని నిర్ణయించడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ఈ విషయంలో మా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగాను, నియమ నిబంధనల ప్రకారమే వ్యవహరించింది. గత యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పోల్చడానికే వీల్లేదు. ఎందుకంటే మా ఎన్డీయే ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు సరళంగా, సజావుగా, వేగంగా ఉండడమే కాకుండా అన్నింటికన్నా పారదర్శకంగా ఉంటాయి’ అని రాఫెల్ యుద్ధ విమానాల వివాదంపై కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 17, 2017 నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారత భాగస్వామి పార్టీగా అంబానీకి చెందిన రిలయెన్స్ డెఫెన్స్ను భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందని, రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే కంపెనీ డాస్సూకు తనకు ఇష్టమైన భాగస్వామిని ఎంపిక చేసుకునే అధికారం ఉన్నప్పటికీ భారత్ సూచించిన రిలయెన్స్ కంపెనీని ఎంపిక చేయక తప్పలేదని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండే చేసిన ఆరోపణలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు సూటిగా, పారదర్శకంగా సమాధానం ఇవ్వడం లేదు? రాఫెల్ ఒప్పందంపై సంతకం చేసిన హొలాండేనే స్వయంగా ఆరోపణలు చేసినప్పుడు, ఆ ఒప్పందంపై సంతకం చేసిన నరేంద్ర మోదీ ఎందుకు నోరు విప్పడం లేదు? ఆయన తరఫున ఆయన మంత్రులు ఒకదానికి ఒకటి పొంతనలేని డొంక తిరుగుడు సమాధానాలు ఎందుకు ఇస్తున్నారు? రాహుల్ గాంధీ, హొలాండే, పాకిస్థాన్‌ను కలిసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాయని, రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని రాహుల్ గాంధీ తన బావైన రాబర్ట్ వాద్రాకు ఇప్పించాలని చూస్తున్నారని సాక్షాత్తు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన ఆరోపణల్లో ఏమైనా అర్థం ఉందా? రాఫెల్ ఒప్పందానికి పాకిస్థాన్‌కు సంబంధం ఏమిటీ? ఆ ఒప్పందంలో రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీ తప్పుకుంటే, ఆ ఒప్పందంలో రాబర్ట్ వాద్రా కంపెనీని చేర్చే అవకాశం ఎలా ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఉంటుందనుకుంటే దీనిపై ఇంత రాద్ధాంతం చేస్తున్న రాహుల్ గాంధీ, వాద్రాకు ఎలా ఇప్పించుకుంటారు? హొలాండే ఆరోపణల బాంబు పేల్చిన దాదాపు 24 గంటల పాటు మౌనం పాటించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ మరుసటి రోజు హొలాండే ఇదే విషయమై మరోసారి చేసిన వ్యాఖ్యల్లో సగ భాగాన్నే తీసుకొనే అర్ధరహితంగా ఎందుకు స్పందించింది? ఆ రెండో భాగాన్నే తీసుకున్న ప్రభుత్వ అనుకూల మీడియాలోని ఓ భాగం మోదీ ప్రభుత్వానిది తప్పులేదని తేల్చగా మిగతా మీడియా ‘ఇది మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్’ అని పేర్కొన్నాయి. ఫ్రాన్స్‌లోని ‘మీడియా పార్ట్’ వెబ్‌సైట్‌తో శుక్రవారం హొలాండే మాట్లాడుతూ రిలయెన్స్ విషయంలో మోదీ ప్రభుత్వం ప్రమేయం గురించి వెల్లడించిన విషయం తెల్సిందే. ఆ మరుసటి రోజు ‘ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్ (ఏఎఫ్‌పీ) ప్రశ్నించినప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ‘రాఫెల్ ఒప్పందంపై జరిగిన చర్చల్లో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కొత్త ఫార్ములా కింద రిలయెన్స్ గ్రూపు పేరును తీసుకొచ్చింది’ అని హొలాండే అన్నారు. డాస్సూతో పనిచేసేందుకు రిలయెన్స్ గ్రూప్ విషయంలో భారత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని మీరు భావిస్తున్నారా? అని ఏఏఫ్‌పీ నొక్కి ప్రశ్నించగా ‘అది నా కంతగా తెలియదు. ఈ విషయంలో సమాధానం ఇవ్వగలిగిందీ డాస్సూ కంపెనీయే’ అంటూ హొలాండే వ్యాఖ్యానించారు. మొదటి ప్రశ్నకు మోదీ ప్రభుత్వమే రిలయెన్స్ గ్రూప్‌ను తీసుకొచ్చిందంటూ స్పష్టం చేసిన హొలాండే రెండో ప్రశ్నకు కొద్దిగా మార్చి తనకంటే డాస్సూకే ఎక్కువ తెలుసునని చెప్పారు. భారత వివాదంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే ఆయన అలా సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే భారత్‌లోని పాలకపక్ష మీడియా రెండో ప్రశ్నకు హొలాండే ఇచ్చిన సమాధానాన్నే ప్రచురించి మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చింది. 126 రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం కాస్త 36 విమానాలకే ఎందుకు పరిమితం అయింది? డాస్సూ కంపెనీకి భారత భాగస్వామ్య కంపెనీగా ప్రభుత్వ రంగ సంస్థ ‘హిందుస్థాన్ ఎరోనాటిక్స్ కంపెనీ’ స్థానంలో రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీ ఎలా వచ్చింది? 16 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్త 51వేల కోట్ల రూపాయలకు ఎందుకు చేరుకుంది? వీటిల్లో ఏ ప్రశ్నకు కూడా మోదీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు సరైన సమాధానం లేదు. ఇక పారదర్శకత ఎక్కడ? -
దేశ రక్షణపైనే మెరుపు దాడులు.. సిగ్గుచేటు
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంపై దేశ రాజకీయాల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. 1.30 లక్షల కోట్లతో దేశ రక్షణశాఖపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారని రాహుల్ మండిపడ్డారు. రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్ మరోసారి ట్విటర్లో స్పందించారు. ‘‘రాఫెల్ పేరుతో ప్రధాని మోదీ, అంబానీతో కలిసి దేశ రక్షణ దళంపైనే మెరుపు దాడులు చేశారు. ప్రధాని ప్రజలకు నమ్మకద్రోహం చేశారు. సైనికుల రక్తాన్ని ఆగౌరపరిచారు. ఇది దేశానికే సిగ్గుచేటు. సైనికులను, దేశ ప్రజలను మోసం చేశారు’’ అని రాహుల్ మండిపడ్డారు. రాఫెల్ ఒప్పందంలో జరిగిన భారీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సితారామన్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఫ్రాన్సోవో హూలెన్ వ్యాఖ్యలతో మోదీపై ప్రతిపక్షం విమర్శల వర్షం కురిపిస్తోంది. ప్రధాని రహస్య పద్దతుల్లో మంతనాలు జరిపి ఒప్పందాన్ని మార్చివేశారని రాహుల్ ఇదివరకే విమర్శించిన విషయం తెలిసిందే. The PM and Anil Ambani jointly carried out a One Hundred & Thirty Thousand Crore, SURGICAL STRIKE on the Indian Defence forces. Modi Ji you dishonoured the blood of our martyred soldiers. Shame on you. You betrayed India's soul. #Rafale — Rahul Gandhi (@RahulGandhi) September 22, 2018 -
రాఫెల్‌కు ‘రిలయన్స్’ భారత్ ఎంపికే
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌కు ఇండియాలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ బయటపెట్టారు. ఫ్రెంచి మీడియాతో హోలాండ్ మాట్లాడుతూ ‘డసాల్ట్ ఏవియేషన్‌కు భారత్‌లో భాగస్వామిగా అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే ఎంపిక చేసింది. మా ప్రమేయం ఏమీ లేదు. ఎంచుకోవడానికి మాకు మరో కంపెనీ కూడా లేదు. భారత్ నిర్ణయించిన భాగస్వామినే మేం అంగీకరించి చర్చలు ప్రారంభించాం’ అని తెలిపారు. దీంతో రాఫెల్ ఒప్పందం విషయంలో మోదీ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, హోలాండ్ వెల్లడించిన విషయాలకు పొంతన లేకుండా పోయింది. 2015 ఏప్రిల్‌లో నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌తో చర్చల తర్వాత 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయనున్నట్లు మోదీ చెప్పారు. ప్రాణమిత్రుడి కోసమే ఈ కుట్ర: కాంగ్రెస్ రాఫెల్ విషయంలో హోలాండ్ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని బీజేపీపై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. ప్రాణ స్నేహితుడికి లాభం చేకూర్చేందుకే ప్రధాని మోదీ ప్రభుత్వం కుట్ర, దగాకు పాల్పడిందనీ, ఇప్పుడు హోలాండ్ మాటలతో ఆ విషయం బట్టబయలైందని విమర్శించింది. ‘మోదీ భారత్‌ను వెన్నుపోటు పొడిచారు. మోదీ రహస్యంగా, వ్యక్తిగతంగా చర్చలు జరిపి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని మార్చారు. దివాలా తీసిన, రక్షణ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని అనిల్ అంబానీ కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రాజెక్టును మోదీనే∙ఇచ్చినట్లు ఇప్పుడందరికీ తెలిసింది. మన సైనికుల రక్తాన్ని మోదీ అగౌరవపరిచారు’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్వీట్‌చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేస్తూ ‘ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌ను కాదని 30 వేల కోట్ల ప్రాజెక్టును ప్రధాని తన స్నేహితుడి కంపెనీకి కట్టబెట్టడంలో ఉన్న మోసం, కుట్ర, దగా బయటపడింది’ అని అన్నారు. కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడుతూ ‘ఎన్డీయే కుదుర్చుకున్న రాఫెల్ ఒప్పందంలో మనకు విమానాలు రాలేదు. అబద్ధాలు మాత్రమే వచ్చాయి. హోలాండ్ చెప్పిన వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఏ కొత్త అబద్ధం చెబుతారో?’ అని అన్నారు. కాంగ్రెస్ మరో అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ట్వీట్ చేస్తూ 2012లో తాము ఒక్కో రాఫెల్ యుద్ధ విమానాన్ని రూ. 526 కోట్లకే కొనేందుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ 2015కు ఆ ధర రూ. 1,670 కోట్లకు ఎలా పెరిగిందో కూడా హోలాండ్ చెప్పాలని కోరారు. కీలక వాస్తవాలను దాచిపెట్టి దేశ భద్రతను మోదీ ప్రమాదంలో పడేస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి మాట్లడుతూ రాఫెల్ ఒప్పందం పెద్ద కుంభకోణమనీ, మోదీ ప్రభుత్వం అబద్ధాలతో భారతీయులను తప్పుదోవ పట్టించిందన్నారు. -
రక్షణ కొనుగోళ్లలో ‘సెల్ఫ్‌గోల్’
రక్షణరంగ ఏజెంట్లు, ఫిక్సర్లు, కార్పొరేట్ లాబీయిస్టులు, స్వయం ప్రకటిత జ్ఞానులతో కూడిన ఈ దయనీయ నగరంలో జరిగే ఏ కీలకమైన రక్షణ ఒప్పందాన్నయినా కుంభకోణం అనే చెప్పాల్సి ఉంటుంది. బోఫోర్స్ అనంతర దశాబ్దాల్లో ప్రతి ప్రభుత్వమూ అలాంటి అపనిందలనుంచి తప్పించుకోవడానికి అత్యంత సంక్లిష్ట నిబంధనలను చేరుస్తూ వచ్చింది. కానీ అలాంటి అవినీతి నిరోధక వ్యవస్థ సాధనలో ఎలాంటి పురోగతి కనిపించకుండా పోయింది. మోదీ ప్రభుత్వం పారదర్శకతతో ఈ పరిస్థితిని మార్చే అవకాశాన్ని దక్కించుకుంది కానీ మోదీ ప్రభుత్వమే దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా సెల్ఫ్‌గోల్ వేసుకుంది. రాఫెల్ ఒప్పందం కుంభకోణమే కాదు. బీజేపీ ప్రభుత్వం అతి జాగ్రత్తతో, పిరికితనంతో ఆయుధాల కొనుగోలు వ్యవహారాల్లో వ్యవహరిస్తోందనడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఈ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పం దంలో భారీ కుంభకోణం ఉందనడానికి తగినంత సాక్ష్యాధరాలు లభ్యమౌతున్నాయిగాని ‘కుంభ కోణం’ అనే మాట స్థానంలో ‘మూర్ఖత్వం’ అనే పదం వాడాలి. ‘మూర్ఖత్వం’ అనే మాట మరీ ఎక్కువవుతుందనుకుంటే మరో పదం వాడవచ్చు. ఎందుకంటే దాదాపు వేయి కోట్ల డాలర్ల ఈ కొను గోలు ఒప్పందంలో విమానాల ధర నిర్ణయంపై అడిగిన ఏ ప్రశ్నకూ జవాబు చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈ ఒప్పందం రెండు ప్రజాతంత్ర ప్రభుత్వాల మధ్య జరిగింది. కాని, ఒప్పందంలోని వివరాలను వెల్లడించకూడదనే (రహస్యంగా ఉంచాలనే) నిబంధన ఉందని చెప్పడం అడ్డగోలు వాదన. పార్లమెంటు నిశిత పరిశీలన తర్వాతే ఇంతటి భారీ కొనుగోలు ఒప్పందానికి ఆమోదముద్ర లభిస్తుంది. అందుకే సర్కారు వివరణ హాస్యాస్పదంగా ఉంది. నేటి అంతర్జాతీయ ఆయు ధాల విపణిలో ఆయుధాలు, వాటి రకాలు, ఉపకర ణాలకు సంబంధించి రహస్యా లేవీ ఉండవు. రాఫెల్ విమానాలతో ప్రయోగించే మిటియోర్ క్షిపణులు కూడా కొనే ఆలోచన మీకుంటే, వాటి గురించి స్మార్ట్‌ఫోన్ ఉండి, రక్షణ వ్యవహరాల నిపుణుడిగా భావించే ఏ కుర్రాడైనా ఉపన్యాసం దంచగలడు. ఈ విషయంలో రహ స్యంగా ఉంచాల్సింది సున్నితమైన ఎలక్ట్రానిక్స్, వ్యూహాలు మాత్రమే. మిటియోర్ క్షిపణి, పైలట్ ధరించే 360 డిగ్రీల ఇజ్రాయెలీ హెల్మెట్ అంచనా ధరల గురించి కూడా నేడు సులు వుగా దొరికే ఆయుధాల వివరాలు తెలిపే పుస్తకాలు, పత్రికల్లో బహిరంగంగానే చర్చిస్తున్నారు. కాబట్టి రాఫెల్ ఒప్పందంపై బహిరంగంగా చర్చించడంలో తప్పేమీ లేదు. దాచ డానికి కారణాలు కూడా లేవు. రక్షణ ఒప్పందంపై మమ్మల్ని ప్రశ్నించడానికి ఎవరి కైనా ఎంత ధైర్యం? బోఫోర్స్ శతఘ్నిల ఒప్పందం జరిగిన కాలం నాటి కాంగ్రెస్ పార్టీ అనుకుంటు న్నారా మమ్మల్ని? అనే అహంకారపూరిత ధోరణితో కేంద్ర సర్కారు మాట్లా డుతోంది. అయితే, ఇప్పుడు బీజేపీకి విషయం అర్థమౌతోంది. బోఫోర్స్ కుంభ కోణం తర్వాత, భారీ ఆయుధాల కొనుగోలు ఒప్పందం చేసుకునే ఏ ప్రభు త్వమైనా తనను దొంగ అని పిలుస్తారనే అంచనాతో ఉండక తప్పదు. ఇలాంటి సమస్యపై మూడు రకాలుగా వ్యవహరిం చవచ్చు. మొదటిది, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పద్ధతి. అంటే, ఏమీ కొనకుండా ఉండడమే గాక, అన్ని అంతర్జాతీయ ప్రైవేటు ఆయుధాల కంపెనీలను నిషేధించడం. ఆయన హయాంలో ప్రభుత్వాల మధ్యే ఆయుధాల కొనుగోళ్లు జరిగాయి. ఆయుధాల ధరల విషయంలో పారదర్శకత పాటిం చని రష్యా ప్రభుత్వం నుంచి ఆయుధాలు కొన్నారు. అలాగే, అమెరికా నుంచి ప్రాణాతకం కాని ఆయు ధాలను కొనుగోలు చేశారు. రెండో పద్ధతి, పార దర్శక విధానంతో ధైర్యంగా కొనుగోలు చేయడం. చివరికి ఎదురయ్యే ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం. ఇక మూడోది, రాజు లాగా ఆయుధాలు కొనడం. అంటే, భద్రతపై కేబినెట్ కమిటీ పరిశీలన వంటి అన్ని రకాల ‘విసుగు పుట్టించే’ ప్రక్రియలకు స్వస్తి పలకడం. ఇందులో భాగంగా విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు మీడి యాలో భారీ ప్రచారం వచ్చేలా చూసుకోవడమేగాక ఇలాంటి రక్షణ ఒప్పందాలపై అడిగే ప్రశ్నలకు సమా ధానం చెప్పడానికి మొండిగా నిరాకరించడం. ఈ పద్ధతిలో మోదీ ప్రభుత్వం అహంకారపూరితమైన మూర్ఖత్వంతో పదే పదే రాఫెల్ ఒప్పందంపై వ్యక్త మైన అనుమానాలు తీర్చడానికి నిరాకరిస్తూ పెద్ద తప్పు చేసింది. అనవసరంగా తనకు తాను గొయ్యి తవ్వుకుంది. లోతుగా గొయ్యి తవ్వుకుంటున్న ప్రభుత్వం! ఈ వ్యవహారంలో ప్రభుత్వం రోజు రోజుకూ తాను ఇరుక్కుపోయే ప్రమాదమున్న లోతైన గొయ్యి తవ్వు కుంటూనే ఉంది. మొదట అనుకున్న ఒప్పందం ప్రకారం 126 రాఫెల్ విమానాల్లో 108 విమానాలను ప్రభుత్వరంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) తయారు చేయాలి. అయితే, హెచ్ఏ ఎల్ వద్ద ఈ విమానాల ఉత్పత్తికి తగినంత మౌలిక సౌకర్యాలు లేని కారణంగా 126 విమానాలు కొనా లన్న నిర్ణయం మార్చుకున్నామని ప్రభుత్వం వివ రణ ఇచ్చింది. అత్యంత ఆధునిక విదేశీ యుద్ధ విమానాలకు ప్రపంచంలోని ఏ కంపెనీలోనూ తక్షణ ఉత్పత్తి–అమర్చే (అసెంబ్లీలైన్) సౌకర్యాలుండవు. ఏ కంపెనీ రూపొందించిన యుద్ధ విమానాలనైనా లైసె న్స్‌పై ఉత్పత్తి చేయడానికి అన్ని విధాలా మెరుగైన కంపెనీ హెచ్ఏఎల్ అని హేతుబద్ధంగా ఆలోచించే ఎవరైనా అంగీకరిస్తారు. ఈ సంస్థ తనకు ఎదురులేని గత కొన్ని దశాబ్దాల కాలంలో చేసిన పని ఇదే. అంత సమర్ధంగా చేయకపోయినా ఆయుధాలు ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ కంపెనీని ఎవరూ చులకనచేసి మాట్లాడరు. వాజ్‌పేయి పాలనాకాలంలో మిరాజ్– 2000 రకం విమానాలన్నింటినీ ఇండియాలోనే రూపొందించాలని భారత వైమానికిదళం(ఐఏఎఫ్) ప్రతిపాదించింది. అయితే, అప్పట్లో తెహెల్కా వ్యవ హారంతో భయపడిన రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్ అందుకు అంగీకరించలేదు. ఒకే కంపెనీ చేతిలో పెడితే అనుమానాలొస్తాయని భయపడ్డారు. ఒకేసారి 126 రాఫెల్ విమానాల భారీ కొనుగోలుకు అవస రమైన నిధులు సమకూర్చడం కష్టమనే వాస్తవాన్ని చెప్పడానికి ప్రభుత్వం ఏదో కారణం వల్ల సిద్ధంగా లేదు. నిజంగా ఇన్ని విమానాలు కొనాలంటే ఆర్మీ, నేవీ దళాల బడ్జెట్లకు కోత పెట్టాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతానికి రెండు స్క్వాడ్రన్ల విమా నాలు(36) చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, రాఫెల్ విమానాల తయారీకి వేరే ఇతర కంపెనీకి అవకాశం ఇవ్వడం కోసం హెచ్ఏఎల్ను వదిలేశారని నిందించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కాని, కొనుగోలు చేసే విమానాల సంఖ్య తగ్గిం చుకున్నారనీ, కలిసి ఉత్పత్తి చేసే అవకాశం పోగొ ట్టుకున్నారని మాత్రం విమర్శిస్తున్నారు. ఈ వ్యవహా రంలో వాస్తవాలు వెల్లడించి అనుమానాలు నివృత్తి చేసే అవకాశం ఉండగా ప్రభుత్వం అనవసరంగా అర్థం లేని వాదనలు వివరణలతో వివాదంలో చిక్కు కుంటోంది. యుద్ధ విమానాలు వైమానిక దళానికి తక్షణమే అత్యవసరమైనందునే రాఫెల్ విమానాల కొనుగోలు చేయాల్సివస్తోందనేది కేంద్ర సర్కారు చెప్పే మరో కారణం. తగినన్ని యుద్ధ విమానాలు లేవనేది 15 ఏళ్లుగా తెలిసిన విషయమే. 2001లోనే మొదటిసారి విమానాల అవసరం గుర్తించి, కొనుగో లుకు ప్రతిపాదించారు. రెండు దశాబ్దాల క్రితమే అవ సరమైన యుద్ధవిమానాలను కొనలేకపోవడం అగ్ర రాజ్యంగా అవరించాలనే కలలుగనే దేశం బలహీన తకు అద్దంపడుతోంది. ఈ 36 రాఫెల్ విమానాలు సైతం యుద్ధరంగంలో వినియోగించడానికి 2022 వరకూ పూర్తిగా సిద్ధం కావు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా వంటి అసమర్ధ ప్రభుత్వం గానీ, ప్రభుత్వ వ్యవస్థగానీ (ఏ పార్టీ అధికారంలో ఉన్నాగాని) తన జాతీయ భద్రత బాధ్యతను మరో అగ్రరాజ్యానికి అప్పగించడం లేదా కశ్మర్ను పాకిస్తాన్‌కు, అరుణా చల్ప్రదేశ్ను చైనాకు ఇచ్చేయడం మంచిది? అలా చేయగా మిగిలే సొమ్మును దేశ ప్రజల విద్య, ఆరో గ్యానికి ఖర్చు చేయవచ్చు! జాతీయ భద్రతపై హామీతోనే అధికారం 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీని అధికారంలోకి తీసు కొచ్చిన ప్రధాన వాగ్దాల్లో ఒకటి జాతీయ భద్ర తపై ఇచ్చిన హామీ. జాతీయ భద్రత విషయంలో నిర్ణ యాత్మకంగా, కఠినంగా వ్యవహరిస్తామని ఎన్డీఏ వాగ్దానం చేసింది. సైనిక దళాలకు కొత్త ఆయుధాలు కొనుగోలు చేసే ధైర్యం చేయలేని యూపీఏ సర్కారు వాటిని బలహీనపరిచిందని మోదీ ఆరోపించారు. ఆయన సరిగానే మాట్లాడారు కాబట్టి అప్పుడు ప్రజలు ఆయన మాటలు నమ్మారు. అందుకే, లోపాలు సరిదిద్దుకోవడానికి కొద్ది నెలలే ఉన్నందున ‘మీరేం చేశారు?’ అని ప్రధానిని అడగడంలో తప్పేమీ లేదు. రక్షణ ఆయుధాలకు సంబంధించి కొన్ని ఇండియాలోనే తయారు చేస్తున్నట్టు ప్రచారం చేయడం, కొన్ని వైమానిక ప్రదర్శనలు జరపడం మాత్రం ఈ ప్రశ్నకు జవాబు కాజాలదు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చాలా తక్కువ అనేది వాస్తవం. ఆ విషయం చెప్పడానికి కూడా ప్రభుత్వం వెనుకాడుతోంది. ఈ విషయంలో యూపీఏ ఎన్నడూ గొప్పలు చెప్పుకోలేదు. కాని, దాని కంటే మెరుగైన రీతిలో పనిచేస్తానని చెప్పిన బీజేపీ అందులో విఫలమైంది. వచ్చే ఏడాది రాఫెల్ విమనాలు భారత గగన తలంలో ఎగిరే మాట వాస్తవమే కావచ్చు. కానీ, ఈ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల భవిష్యత్తులో జరిగే ఆయుధాల కొనుగోళ్లపై దాని నీడ పడుతుంది. ఆయుధాలు దేశంలోనే ఉత్ప త్తిచేయాలనే లక్ష్యం ఘోరంగా దెబ్బతింది. కొన్ని దశాబ్దాల కాలంలో అతి పెద్దదిగా భావించే రక్షణ కొనుగోలు ఒప్పందంలో దేశంలోని అత్యంత వివా దాస్పదమైన కార్పొరేట్ సంస్థను లబ్ధిదారుగా చేయడం ద్వారా ప్రభుత్వం తప్పటడుగు వేసింది. ఇప్పటి వరకూ ప్రైవేటు రంగంలోని ఏ కంపెనీ కూడా సైన్యానికి అవసరమైన ప్రధాన ఆయుధాలను తయారు చేసి ఇవ్వలేదు. రక్షణరంగ ఏజెంట్లు, ఫిక్సర్లు, కార్పొరేట్ లాబీయిస్టులు, స్వయం ప్రకటిత జ్ఞానులతో కూడిన ఈ దయనీయ నగరంలో జరిగే ఏ కీలకమైన రక్షణ ఒప్పందాన్నయినా కుంభకోణం అనే చెప్పాల్సి ఉంటుంది. బోఫోర్స్ అనంతర దశాబ్దాల్లో ప్రతి ప్రభుత్వమూ అలాంటి అపనిందలనుంచి తప్పించుకోవడానికి అత్యంత సంక్లిష్ట నిబంధనలను తీసుకుంటూ వచ్చింది. కానీ అలాంటి అవినీతి నిరోధక వ్యవస్థ సాధనలో ఎలాంటి పురోగతి కనిపించకుండా పోయింది. ఎవరూ సాధించలేరు కూడా. మోదీ ప్రభుత్వం పారదర్శకతతో ఈ పరిస్థితిని మార్చే అవకాశాన్ని దక్కించుకుంది కానీ మోదీ ప్రభుత్వమే దాన్ని ధ్వంసం చేసి పడేసింది. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
రాఫెల్ డీల్ అవసరమే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ ఫైటర్ జెట్లను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సమర్థించారు. గతంలో కూడా ఇలా అత్యవసరంగా భారత్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిందని తెలిపారు. బుధవారమిక్కడ ధనోవా మాట్లాడుతూ.. ‘చైనా తన వాయుసేన సామ ర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. దేశ సరిహద్దులోని టిబెట్‌లో యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలను మోహరిస్తోంది. ఇండియా కూడా ఇందుకు తగ్గట్లు వాయుసేనలో ఆధునీకరణ చేపట్టాలి. పక్కనే రెండు అణ్వ స్త్ర దేశాలు (చైనా, పాక్) ఉన్నటువంటి విచిత్ర పరిస్థితిని భారత్ ఎదుర్కొంటోంది. వీరి ఉద్దేశాలు రాత్రికి రాత్రి మారిపోవచ్చు. చైనా దగ్గర 1,700 ఫైటర్ జెట్లు ఉండగా, వీటిలో 800 జెట్లు నాలుగో తరానికి చెందినవే. ఒకవేళ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే వీటిలో చాలామటుకు రంగంలోకి దిగుతాయి. ప్రస్తుతం భారత్ చాలా ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని మరే దేశానికి ఈ స్థాయిలో ప్రమాదం లేదు’ అని చెప్పారు. ఒకవేళ భారత్ 42 స్క్వాడ్రన్ జెట్లను సమకూర్చుకున్నా, చైనా–పాక్‌ల సామర్థ్యంకన్నా తక్కువగానే ఉంటుందన్నారు. -
‘రాఫెల్’పై విచారణకు సుప్రీం అంగీకారం
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే వారం ఈ పిటిషన్‌ను విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ప్రకటించింది. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న న్యాయవాది ఎంఎల్ శర్మ విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రాఫెల్ ఒప్పందంలో పలు లొసుగులు ఉన్నాయని, దాని అమలుపై స్టే విధించాలని శర్మ కోర్టును కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ, ఫ్రెంచ్ రక్షణ సంస్థ డసాల్ట్‌లపై కేసులు నమోదుచేసి విచారించాలని కోరారు. -
‘ఆమెను బలిపశువు చేశారు’
జైపూర్ : రాఫెల్ డీల్ అవినీతికి జేజమ్మ వంటిదని కాంగ్రెస్ అభివర్ణించింది. నరేంద్ర మోదీ డీఎన్ఏలో క్రోనీ క్యాపిటలిజం ముఖ్యమైన భాగంగా మారందని ఆ పార్టీ ప్రతినిధి శక్తి సింగ్ గోహిల్ పేర్కొన్నారు. మోదీ హయాంలో రాఫెల్ విమానం ధర రూ 526 కోట్ల నుంచి రూ 1670 కోట్లకు మూడు రెట్లు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. మోదీ కోట్లలోనే ముడుపులు స్వీకరిస్తారన్నారు. బీజేపీ ప్రభుత్వ నాలుగేళ్ల హయాంలో తొలిసారిగా ముగ్గురు రక్షణ మంత్రులు మారారన్నారు. అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్ రాఫెల్ డీల్‌లో అవినీతి మరకలను తప్పించుకుని నిర్మలా సీతారామన్‌ను బలిపశువును చేశారని ఆరోపించారు. బోఫోర్స్ ఒప్పందంలో అవినీతిపై రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ బురుదచల్లుతోందని ఆరోపించారు. రక్షణ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలకు చోటులేకుండా వీటిపై చర్చించేందుకు, బేరసారాలకు కమిటీలను నియమించాలని ఆయన కోరారు. రాఫెల్ ఒప్పందంలో అక్రమాలు చోటుచేసుకోలేదని మోదీ సర్కార్ భావిస్తే దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించేందుకు ఎందుకు వెనుకాడుతోందని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. -
రాఫెల్ డీల్ : కోర్ గ్రూప్‌తో రాహుల్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాఫెల్ డీల్‌పై పోరాటం ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం పార్టీ కోర్ గ్రూప్‌తో భేటీ కానున్నారు. గ్రేట్ రాఫెల్ రాబరీగా ఈ డీల్‌ను అభివర్ణిస్తున్న కాంగ్రెస్ పార్టీ దీనిపై మోదీ సర్కార్‌పై దాడిని తీవ్రతరం చేసే వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనుంది. భేటీ అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రధాని నివాసం వరకూ యూత్ కాంగ్రెస్ చేపట్టే నిరసన యాత్రలో నేతలు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాఫెల్ ఒప్పందంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు నూతనంగా ఏర్పాటైన పార్టీ కోర్ గ్రూప్ కమిటీ రాహుల్ నివాసంలో భేటీ కానుంది. రాఫెల్ అంశంపై గత కొంతకాలంగా రాహుల్ గాంధీ సహా పార్టీ ముఖ్య నేతలు మోదీ సర్కార్‌పై దాడిని పెంచారు. ఈ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని పట్టుబట్టారు. స్కామ్‌ను మరో స్కామ్‌తో కప్పిపుచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రాఫెల్ డీల్‌పై పార్లమెంటరీ కమిటీచే విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కాంగ్రెస్ నిలదీసింది. -
నేషనల్ హెరాల్డ్‌పై 5,000 కోట్ల దావా
అహ్మదాబాద్: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికపై రూ.5,000 కోట్ల పరువునష్టం దావాను దాఖలు చేసింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో నేషనల్ హెరాల్డ్‌లో ప్రచురితమైన ఓ కథనం తమ కంపెనీపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా, చైర్మన్ అనిల్ అంబానీ పరువుకు నష్టం కలిగించేలా ఉందని చెప్పింది. అలాగే రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు విషయంలో అసత్య ఆరోపణలు చేశారంటూ గుజరాత్ కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ గోహిల్‌పై మరో రూ.5,000 కోట్ల పరువునష్టం దావాను రిలయన్స్ గ్రూప్ వేసింది. ఈ సందర్భంగా కోర్టులో రిలయన్స్ న్యాయవాది మాట్లాడుతూ.. ‘రాఫెల్ ఒప్పందం ప్రకటించడానికి 10 రోజులకు ముందు అనిల్ కంపెనీ పెట్టారు’ అంటూ నేషనల్ హెరాల్డ్‌లో తప్పుడు, అసత్య కథనం రాశారని తెలిపారు. గోహిల్ కూడా పలుమార్లు తామేదో అక్రమంగా లాభపడినట్లు విమర్శలు చేశారన్నారు. -
‘రాఫెల్’పై కాంగ్రెస్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంలో రిలయన్స్ గ్రూప్ పాత్రపై పోటీ సంస్థలు, కొన్ని శక్తులు కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నాయని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఫ్రాన్స్ నుంచి భారత్ కొంటున్న 36 ఫైటర్ జెట్లకు సంబంధించి తాము ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందడం లేదని అనిల్ లేఖలో వెల్లడించారు. భారత్‌లో ఆయుధాలు అమ్మాలనుకునే సంస్థలు దేశీయ కంపెనీలతో జట్టుకట్టాలన్న నిబంధన నేపథ్యంలోనే డసాల్ట్ ఏవియేషన్ సంస్థ తమ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశామన్నారు. రాహుల్ వ్యక్తిగత విమర్శలతో తీవ్ర మనోవేదనకు లోనైనట్లు అనిల్ తెలిపారు. -
రాఫెల్ డీల్‌పై మోదీకి రాహుల్ సవాల్
సాక్షి, బెంగళూరు: రాఫెల్ జెట్ విమానాల కొనుగోలు ఒప్పందంపై చర్చకు రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానికి సవాల్ విసిరారు. తన ప్రశ్నలతో ఆయన ఒక్క సెకను కూడా నిలువలేరని చెప్పారు. సోమవారం కర్ణాటకలోని బీదర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ‘జన ధ్వని’ సభలో రాహుల్ ప్రసంగించారు. రూ.58వేల కోట్ల ‘రాఫెల్’ కాంట్రాక్టును అస్సలు అనుభవం లేని తన మిత్రుడు అనిల్ అంబానీకి చెందిన 10 రోజుల కంపెనీకి కట్టబెట్టారన్నారు. ఈ రంగంలో దిగ్గజమైన ప్రభుత్వరంగ హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌ను పక్కనబెట్టడంతో వేలాదిమంది యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారన్నారు. ‘ప్రధానికి దమ్ముంటే నా ముందుకు రమ్మనండి. నా కళ్లలోకి చూస్తూ ప్రశ్నలకు ఆయన ఎందుకు సమాధానం ఇవ్వరు?.. ఎందుకంటే ఆయన కాపలాదారు (చౌకీదార్) కాదు.. వాటాదారు(భాగీదార్)’ అని ఎద్దేవా చేశారు. నేషనల్ హెరాల్ట్ కేసులో ఐటీ దర్యాప్తును ఆదేశించినందుకే రాహుల్ ప్రధానిపై అసత్యారోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. -
అంబానీకి మేలు చేసేందుకే!
జైపూర్: వ్యాపారవేత్త, మిత్రుడు అయిన అనిల్ అంబానీకి మేలు చేసేందుకే ఆయనకు రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కాంట్రాక్టును ప్రధాని మోదీ ఇప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం జైపూర్‌లో ప్రారంభించిన రాహుల్.. కేంద్రంపై, ప్రధానిపై విమర్శలు గుప్పించారు. విదేశీ తయారీదారు.. రక్షణ ఒప్పందంలో ఓ భారతసంస్థతో డీల్ కుదుర్చుకోవడం వెనక మతలబేంటని ప్రశ్నించారు. యుద్ధ విమానం ధరను మోదీ సర్కారు మూడురెట్లు పెంచిందని ప్రభుత్వ అవినీతి త్వరలో బయటపడుతుందన్నారు. రైతుల కోసం రుణమాఫీ చేయని సర్కారు 15–20 మంది బడా వ్యాపారవేత్తలకు రూ.2.3లక్షల కోట్ల రుణాలు రద్దుచేసిందన్నారు. దేశంలో దళితులపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎస్సీలపై దాడుల కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. మోదీ దళిత వ్యతిరేక విధానాల వల్లే దేశంలో సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. కాగా, రాఫెల్ ఒప్పందం విషయంలో రాహుల్ ఆరోపణలను అనిల్ అంబానీ ఖండించారు. ఇందులో కేంద్రం పాత్రేమీ లేదన్నారు. పారాచ్యూట్ అభ్యర్థులకు టికెట్లివ్వం రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని నిర్ణయించే విషయంలో పార్టీ కార్యకర్తలకు అవకాశం ఉంటుందని రాహుల్ భరోసా ఇచ్చారు. చివరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి వచ్చే (పారాచ్యూట్) అభ్యర్థులకు ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీకి అవకాశం ఇవ్వబోమన్నారు. ‘బయటినుంచి వచ్చే ఏ ఒక్కరిటీ టికెట్ ఇవ్వం. కార్యకర్తలు చెప్పేది వింటాం’ అని అన్నారు. -
రాఫెల్‌పై విపక్షాల ధర్నా
న్యూఢిల్లీ/రాయ్‌పూర్: రాఫెల్ ఒప్పందంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ యూపీఏ చైర్పర్సన్ సోనియా నాయకత్వంలో విపక్ష ఎంపీలు పార్లమెంటు ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు ఆజాద్, ఆంటోనీ, ఇతర కాంగ్రెస్ ముఖ్యులు, తృణమూల్, సీపీఐ, ఆప్ సహా పలు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. అటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ ఎంపీలు సభా కార్యక్రమాలు ఆటంకం కలిగించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. రాఫెల్ ఒప్పందంపై ప్రభుత్వం జేపీసీని ఏర్పాటుచేయాలి’ అని నినదించారు. రాఫెల్ ఒప్పందం చర్చల దశలోనే ముగిసిపోతుందని కాంగ్రెస్ ఎంపీ సునీల్ జాఖడ్ అభిప్రాయపడ్డారు. భోపాల్ గ్యాస్ ఉదంతం తర్వాత ఇది అతిపెద్ద మధ్యవర్తిత్వ కేసుగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. తనకు చాన్సిస్తే ఇంతకన్నా గొప్పగా రాఫెల్ ఒప్పందాన్ని సిద్ధం చేస్తానన్నారు. అతిపెద్ద కుంభకోణం భారత రక్షణ రంగ చరిత్రలో రాఫెల్ కుంభకోణం అతిపెద్దదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే బాధ్యుడని ఆయన ఆరోపించారు. ‘మోదీ ఫ్రాన్స్‌కు వెళ్లి, పాత ఒప్పందాన్ని రద్దుచేశారు. భారీ మొత్తంతో కొత్త ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం రక్షణ మంత్రి, కేబినెట్ మంత్రులకు కూడా తెలియదు’ అని చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆరోపించారు. -
రాఫెల్ డీల్ : రాహుల్ తాజా ఆరోపణలు
సాక్షి,న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలకు దిగారు. మోదీ ప్రభుత్వం చేసుకున్న రాఫెల్ ఒప్పందంతో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి భారీగా మేలు చేశారని ధ్వజమెత్తారు. రాఫెల్ డీల్‌లో అప్పుల ఊబిలో కూరుకు పోయిన అడాగ్ కంపెనీకి పెద్ద ఎత్తున లబ్ది చేకూరిందని రాహుల్ ఆరోపించారు. 2015 ఏప్రిల్‌లో ప్రధాని ఫ్రాన్స్ పర్యటన, ఒప్పందానికి కేవలం పదిరోజుల ముందే అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారని విమర్శించారు. ఈ మేరకు ఆయన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డులను ఉదహరించారు. రూ. 35వేలకోట్ల రుణాలున్న కంపెనీకి 45వేలకోట్ల రూపాయల రాఫెల్ విమానాల తయారీ డీల్‌ను కట్టబెట్టడంపై ఆయన విమర్శలు గుప్పించారు. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ ఆరోపణలు చేశారు. ఆ డీల్‌లో భారీగా ముడుపులు చేతులు మారాయని, దీని వెనుక మోదీ హస్తం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే 35వేల కోట్ల రూపాయల రుణ ఊబిలో చిక్కుకున్న సంస్థకు రూ. 45,000 కోట్ల డీల్ దక్కిందన్నారు. వేలకోట్ల విలువైన ఈ ఒప్పందాన్ని ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) ను కాదని కార్పొరేట్ ఫ్రెండ్‌కు ఎందుకు కట్టబెట్టారని రాహుల్ ప్రశ్నించారు. ముఖ్యంగా 35వేలకోట్ల రుణ సంక్షోభంతో ఒక్క విమానాన్ని కూడా తయారు చేయలేని కంపెనీకి ఈ డీల్ ఎలా కట్టబెట్టారని రాహుల్ ప్రశ్నించారు. అలాగే రాఫెల్ విమానాల ధర భారీగా పెరగడంలో మోదీపాత్ర ఉందనీ, యూపీఏ ఆధ్వర్యంలోని ఒప్పందం ప్రకారం ఒక్కో యుద్ధవిమానం ఖర్చు సగటున రూ 526 కోట్లుగా ఉంటే.. అది ఇప్పుడు రూ 1670 కోట్లకు పెరిగిందనీ, మోదీ మ్యాజిక్ ఇదేనని రాహుల్ దుయ్యబట్టారు. కాగా ఫ్రాన్స్ నుండి దేశ రక్షణ కోసం 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్టు 2015 ఏప్రిల్ లో ప్రధాని ప్రకటించారు. ప్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ, అనిల్ అంబానీకిచెందిన అడాగ్‌తో ఒక జాయింట్ వెంచ్ర్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. వెబ్‌పైట్ అందించిన వివరాల ప్రకారం 5లక్షల రూపాయలతో అనిల్ అంబానీ ఆవిష్కరించిన కంపెనీకి ఇంత భారీ డీల్ దక్కడంపై విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది చాలా అసాధారణమైందనీ, నిబంధనల ఉల్లంఘనల అనుమానాలను పెంచుతోందని వ్యాఖ్యానించారు. మరోవైపు రాఫెల్ కుంభకోణం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. రాఫెల్ డీల్‌పై వివరాలను బహిర్గతం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, ఈ ఒప్పందంలోని దేశ భద్రతా విషయాలు బయటకు చెప్పకూడదని, అది అధికార రహస్యాల వెల్లడి నిషేధం కిందకు వస్తుందని వెల్లడించడం సెగను రగిలించింది. దేశం ఆస్తులకు తాను కాపలాదారుగా ఉంటానని చెప్పిన మోదీ దోపిడిదారుడిగా అవతరించారంటూ ఈ నెల 20న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా రాహుల్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. -
‘రాఫెల్’లో రాహుల్‌కు ఝలక్
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పంద వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో అధికారంలో ఉన్న బీజేపీ అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చేసిన ఆరోపణలను రక్షణ మంత్రి నిర్మల తిప్పికొట్టారు. ఆ ఒప్పందం రహస్య సమాచార పరిధిలోకే వస్తుందని, రాఫెల్ ఒప్పంద వివరాలను బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు. రహస్య సమాచార పరిరక్షణకు సంబంధించి ఫ్రాన్స్, భారత్‌ల మధ్య ఒక ఒప్పందం 2008లోనే కుదిరిందని గుర్తు చేశారు. రాఫెల్ ఒప్పందం ఆ పరిధిలోకే వస్తుందన్నారు. ‘ఇది గోప్యతా ఒప్పందం. సున్నిత సమాచారాన్ని పరిరక్షించాల్సి ఉంది. రాహుల్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ, భారత చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రన్ మాట్లాడుతూ ఒప్పంద వాణిజ్య విషయాలు బహిర్గతం చేయకూడదని అన్నారు. రాహుల్ చెప్పినదంతా అబద్ధం’ అని నిర్మల తిప్పికొట్టారు. రాఫెల్ ఒప్పందంలో అసలు గోప్యతా నిబంధనలే లేవన్న రాహుల్ ఆరోపణలు నిరాధారమన్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం రాహుల్ ఆరోపణలపై స్పందించింది. రాఫెల్ విమానాల కొనుగోలు వివరాలను బహిర్గతం చేయడానికి తమకేం అభ్యంతరం లేదని మేక్రన్ తనకు చెప్పారని లోక్‌సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఫ్రెంచ్ ప్రభుత్వం తప్పుబట్టింది. ‘2008లో చేసుకున్న భద్రతా ఒప్పందానికి రెండు దేశాలు కట్టుబడి ఉండాల్సిందే. రక్షణ రంగంపై ప్రభావం చూపే అంశాలను రహస్యంగా ఉంచాలన్న నిబంధన ఆ ఒప్పందంలో ఉంది’ అని పేర్కొంది. సున్నితమైన అంశాలతో కూడిన ఒప్పందం వివరాలను భారత్, ఫ్రాన్స్‌లలో ఎక్కడా బహిర్గతం చేయొద్దని 2018 మేలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతిని కూడా ఫ్రాన్స్ ఆ ప్రకటనలో గుర్తుచేసింది. బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు రాహుల్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని బీజేపీ ఆరోపించింది. రాఫెల్ జెట్ విమానాల కొనుగోలు ఒప్పందంపై రక్షణమంత్రి అబద్ధాలు చెబుతున్నారంటూ లోక్‌సభలో రాహుల్ ఆరోపించడంతో బీజేపీ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. పార్లమెంట్లో రాహుల్ పిల్లాడిలా ప్రవర్తించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాహుల్ అపరిపక్వతతో పిల్లాడిలా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎదగకపోవటం దురదృష్టకరం. సభలో సభ్యుడిపై ఎవరైనా ఆరోపణలు చేయాలనుకుంటే ముందుగా స్పీకర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆరోపణలకు సమర్ధనగా ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా ఆయన నిరాధార ఆరోపణలు చేశారు’ అని అన్నారు. అనంతరం బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి రాహుల్‌పై సభాహక్కుల నోటీసు ఇచ్చారు. రాఫెల్ ఒప్పందం నేపథ్యం ఫ్రెంచి కంపెనీ డసాల్ట్ నుంచి 36 రాఫెల్ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్ 2016 సెప్టెంబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.58 వేల కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. గత యూపీఏ ప్రభుత్వం 126 విమానాలను కొనుగోలు చేయాలనుకున్నా, తరువాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఆ సంఖ్యను 36కు తగ్గించింది. ఈ ఒప్పందం కింద డసాల్డ్.. భారత్‌కు చెందిన డీఆర్డీఓ, హెచ్ఏఎల్ తదితర సంస్థలతో విమానాల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఇంటర్ గవర్నమెంటల్ ఒప్పందాన్ని ‘రాఫెల్ డీల్’గా పేర్కొంటున్నారు. యూపీఏ సమయంలో కుదిరిన దాని కన్నా ఒక్కో విమానం ధర మూడు రెట్లు ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఒప్పందం వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తోంది. -
కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ప్రజలకు కాపలాదారుగా ఉంటానంటూ నాడు అధికారంలోకి వచ్చిన మోదీ నేడు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు సహా అనేక అంశాల్లో అవినీతిపరులతో చేతులు కలిపి భాగస్వామిగా మారారని రాహుల్ ఆరోపించారు. మోదీ గిమ్మిక్కులకు, అబద్ధాలకు ప్రజలు బలవుతున్నారన్న రాహుల్.. పెద్దనోట్ల రద్దుతో ఏం సాధించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనను బీజేపీ అవమానించినా, ‘పప్పు’ అని సంబోధించినా ఆ పార్టీపై, నాయకులపై తనకు ద్వేష భావం లేదనీ, ప్రేమను పంచడమే తన, కాంగ్రెస్ సిద్ధాంతం అని రాహుల్ చెప్పారు. ‘ఆరెస్సెస్, బీజేపీల అగ్రనేతలు కోపం, ద్వేషాలకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ‘కాంగ్రెస్ నేత, భారతీయుడు, శివుడు, హిందువు’ అనే పదాలకు అర్థాన్ని తెలిపినందుకు వారికి ధన్యవాదాలు’ అని అన్నారు. గంటకు పైగానే ప్రసంగించిన రాహుల్.. అనంతరం మోదీ వద్దకు వెళ్లి ఆయనను కౌగిలించుకున్నారు. మోదీ ఒత్తిడి వల్లే ఆమె మాట తప్పారు ఫ్రాన్స్‌తో భారత్ చేసుకున్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్ మాట్లాడుతూ.. ‘మోదీ ఒత్తిడి తెస్తుండటం వల్లే నిర్మలా సీతారామన్ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ ఒప్పందంతో ప్రభుత్వం ఎవరికి సాయం చేస్తోంది? మోదీ, నిర్మల.. దయచేసి దేశానికి చెప్పండి’ అని రాహుల్ కోరారు. దీంతో సభను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని నిర్మల పేర్కొనడంతో కొద్దిసేపు బీజేపీ, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. భారత్, ఫ్రాన్స్‌ల మధ్య రహస్య ఒప్పందం కారణంగా రాఫెల్ యుద్ధ విమానాల ధరలను బయటపెట్టలేమని ఇక్కడ ప్రభుత్వం అంటోందనీ, ఇదే విషయమై ఫ్రాన్స్ అధ్యక్షుడితో తాను మాట్లాడితే అలాంటి రహస్య ఒప్పందాలేవీ లేవని ఆయన తనకు చెప్పినట్లు రాహుల్ తెలిపారు. ‘కొంత మందితో మోదీకి ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. ప్రధాని తన ‘మార్కెటింగ్’ కోసం ఖర్చు చేస్తున్న డబ్బంతా ఎవరెవరు ఇస్తున్నారో కూడా అందరికీ తెలుసు. అలా ఇస్తున్న వారిలో ఓ వ్యక్తి చేతికే రాఫెల్ ఒప్పందం వెళ్లింది. వారికి ప్రస్తుతం రూ.35 వేల కోట్ల అప్పు ఉండగా ఈ ఒప్పందం వల్ల రూ. 45 వేల కోట్ల లాభం వస్తోంది’ అని రాహుల్ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఏఎల్ నుంచి తప్పించి ఈ ప్రాజెక్టును ప్రైవేటు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. మీ వాళ్లే ఓడిస్తారు.. ప్రతిపక్షాలవే కాకుండా బీజేపీలోని ఓ వర్గం నేతల ఆవేదనను కూడా తన ప్రసంగం ద్వారా తాను బయటకు తెస్తున్నాననీ, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసం ప్రతిపక్షాలే కాకుండా సొంత పార్టీ లోని వారు కూడా ప్రయత్నిస్తారని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఉన్నా లేకున్నా ఒకటేననీ, కానీ మోదీ, అమిత్ షా మాత్రం బీజే పీ అధికారంలో లేకపోతే జీర్ణిం చుకోలేరన్నారు. ‘మోదీ నవ్వుతుండటం నేను చూస్తున్నా. అయినా లోలోపల ఆయన గాభరా పడుతున్నారు. ఆయన నా కళ్లలోకి కాకుండా ఎక్కడెక్కడో చూస్తున్నారు’ అని అన్నారు. దీంతో బీజేపీ సభ్యులు తమ నిరసనను మరింత పెంచారు. సూటు వేసుకుంటేనే రుణమాఫీనా? 15–20 మంది బడా పారిశ్రామిక వేత్తలు తీసుకున్న రూ. 2.5 లక్షల కోట్ల అప్పులను గత నాలుగేళ్లలో మాఫీ చేసిన ప్రభుత్వం, రైతుల రుణాలను మాత్రం రద్దు చేయడం లేదని రాహుల్ విమర్శించారు. రైతులు సూటుబూటు వేసుకోకపోవడమే అందుకు కారణమా అని ప్రశ్నించారు. ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షల నగదును జమ చేస్తానని మోదీ ఇచ్చిన హామీ లాగానే తాజాగా పంటలకు మద్దతు ధర కూడా అబద్ధంగా మిగిలిపోతుందన్నారు. చరిత్రలో తొలిసారిగా, భారత్‌లో మహిళలకు రక్షణ లేదనే మాట ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోందన్నారు. అవాక్కైన మోదీ రాహుల్ తన ప్రసంగం అనంతరం మోదీ సీటు వద్దకు వెళ్లడంతో ఆయన కాస్త అయోమయానికి గురయ్యారు. లేచి నిలబడాల్సిందిగా రాహుల్ మోదీని కోరినా ఆయన అయోమయంలో ఉండటంతో స్పందించ లేదు. దీంతో మోదీ కూర్చొని ఉండగానే రాహుల్ ఆయనను కౌగిలించుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి మోదీ సహా సభలోని సభ్యులంతా ఆశ్చర్యపోయారు. అనంతరం తేరుకున్న మోదీ.. అప్పటికే రాహుల్ వెళ్లిపోతుండటంతో ఆయ నను వెనక్కు పిలిచి కరచాలనం చేసి భుజంపై తట్టి కొన్ని మాటలు చెప్పారు. తర్వాత తన సీటు వద్దకు వచ్చిన రాహుల్ ‘ఇదీ హిందుత్వం అంటే’ అని అన్నారు. కూర్చున్నాక పక్కన ఉన్న సహచరుడి వంక చూసి నవ్వుతూ కన్ను కూడా కొట్టారు. -
‘రాఫెల్’పై కాగ్ విచారణ
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌తో భారత్ కుదుర్చుకున్న రూ.58,000 కోట్ల విలువైన 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) పరిశీలిస్తున్నట్లు రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే లోక్‌సభకు తెలిపారు. 2019, సెప్టెంబర్ నుంచి భారత్‌కు ఈ యుద్ధ విమానాల అప్పగింత ప్రారంభమవుతుందన్నారు. రక్షణ రంగానికి సంబంధించి 2015 నుంచి ఇప్పటివరకూ సీబీఐ 4 కేసుల్ని నమోదు చేసిందన్నారు. రైల్వేశాఖపై నయాపైసా భారం లేకుండా దేశంలోని అన్ని రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ పార్లమెంటుకు రాతపూర్వకంగా తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 707 రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ది ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(సవరణ) బిల్లు–2018ను పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీనిప్రకారం ఏటా 35 లక్షల మంది ప్రయాణికుల రద్దీ ఉండే విమానాశ్రయాలనే మేజర్ ఎయిర్‌పోర్టులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ పరిమితి 15 లక్షలుగా ఉంది. అలాగే వేర్వేరు విమానాశ్రయాలు, ఎయిర్‌డ్రోమ్‌లకు మార్కెట్ ధరల ఆధారంగా వేర్వేరు టారీఫ్‌లు ఉండేలా ఈ చట్టంలో సవరణలు చేశారు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను మిగిలిన పట్టణాలతో అనుసంధానించేందుకు మరో వెర్షన్ ‘ఉడాన్’ పథకాన్ని తీసుకురానున్నట్లు పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభకు రాతపూర్వకంగా తెలిపారు. ఏ సందర్భంలో దేశ ద్రోహ చట్టాన్ని ప్రయోగించవచ్చన్న విషయమై సలహాలు అందించేందుకు జాతీయ న్యాయ కమిషన్ భారతీయ శిక్షా స్మృతిలోని ఆర్టికల్ 124(ఏ)ను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వర్షపాతంపై మరింత కచ్చితత్వంతో అంచనాలు అందించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సింగ్ లోక్‌సభకు తెలిపారు. పనితీరును మెరుగుపర్చుకోవడంలో భాగంగా ఐఎండీ దేశీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలతో కలసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.వివాదాస్పద ఎఫ్ఆర్డీఐ (ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్) బిల్లు–2017ను కేంద్రం పార్లమెంటు నుంచి వెనక్కు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులోని ‘బెయిల్ ఇన్’ నిబంధనపై విమర్శలు రావడంతో బిల్లును వెనక్కు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
‘రాఫెల్’ అవినీతిపై మోదీ బదులేది?
సాక్షి, బళ్లారి: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ విమర్శలను తీవ్రం చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణమనీ, ఎంతో అనుభవమున్న ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను రాఫెల్ కాంట్రాక్టు నుంచి తప్పించి తన సన్నిహితుడికి ఎందుకు అప్పగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా హొసపేటలో జరిగిన ఎన్నికల ‘జనాశీర్వాద్ యాత్ర’లో రాహుల్ మాట్లాడారు. ‘రాఫెల్’ వ్యవహారంపై తాను సంధించిన 3 ప్రశ్నలకు మోదీ జవాబివ్వలేకపోయారన్నారు. వెనుక నుంచి వచ్చే వాహనాలను అద్దంలో గమనిస్తూ నడిపే వాహనదారు మాదిరిగా.. ప్రధాని మోదీ గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ నోట్ల రద్దు, జీఎస్టీ వంటి తప్పిదాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వెనుక వాటిని చూస్తూ వాహనాన్ని ముందుకు నడిపితే ప్రమాదాలు తప్పవని వ్యాఖ్యానించారు. ముందు చూపుతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్యను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. కాగా, బళ్లారి, కొప్పాల్, రాయిచూర్, కలబురిగి, బీదర్ జిల్లాల్లో నాలుగు రోజుల ఎన్నికల ప్రచారంలో రాహుల్ బస్సులో ప్రయాణిస్తూ సభలు, ర్యాలీల ద్వారా ప్రజలను కలుసుకుంటున్నారు. కాగా, యూపీఏ హయాంలో 126 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందమే కుదరలేదని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి. -
ప్రణబ్ దగ్గర నేర్చుకోండి!
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. రాఫెల్ యుద్ధ విమానం, దీంతోపాటు కొనుగోలు చేసిన యుద్ధ సామగ్రి వివరాలన్నీ దేశ భద్రతకు సంబంధించిన అంశాలని దీనిపై వివరాలు కోరటం హాస్యాస్పదమన్నారు. ‘మాజీ రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ దగ్గర జాతీయ భద్రతపై పాఠాలు నేర్చుకోండ’ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కి సూచించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా విపక్షాలు రాఫెల్ వివరాలు వెల్లడించాలని పట్టుబడ్డటంపై జైట్లీ ఈ విధంగా స్పందించారు. ‘మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై మీరు రాజీ పడ్డారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంపైనా అవినీతి బురద చల్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా మోదీ స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అందుకే ఓ సంక్షోభాన్ని, ఓ వివాదాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే రాఫెల్ వివరాలు వెల్లడి చేయాలని వివాదం చేస్తున్నారు’ అని జైట్లీ రాజ్యసభలో పేర్కొన్నారు. 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి భారత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రామాయణ వ్యాఖ్యలపై దుమారం కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిపై ప్రధాని మోదీ చేసిన ‘రామాయణ’ వ్యాఖ్యలపై గురువారం రాజ్యసభలో దుమారం రేగింది. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన మోదీ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. దీనికి తోడు మోదీ తనపై వ్యంగ్యంగా మాట్లాడుతున్న వీడియో క్లిప్‌ను హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేయటంపై రేణుక మండిపడ్డారు. ప్రధాని హోదాకు తగ్గట్లుగా మోదీ వ్యవహరించలేదని.. ఆయన క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ నేత సుష్మితాదేవ్ డిమాండ్ చేశారు. రేణుక వ్యాఖ్యలపై దుమారం కారణంగా రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. మోసపూరిత ఆర్థిక విధానంతో.. అంతకుముందు, రాజ్యసభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత చిదంబరం కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభాన్ని పట్టించుకోవటం లేదని, ఉపాధికల్పనను పూర్తిగా విస్మరించిందని.. ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానం పూర్తిగా మోసపూరితమని.. దేశంలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోతోందని తీవ్రంగా దుయ్యబట్టారు. తాజా బడ్జెట్ ద్వారా వేతన జీవులు, వయోవృద్ధలుకు రూ.12వేల కోట్ల లబ్ధి చేకూరిందని ఆర్థిక మంత్రి జైట్లీ లోక్‌సభలో వెల్లడించారు. దీర్ఘకాల మూలధన రాబడి పన్ను పెంచటాన్ని సమర్థించుకున్న జైట్లీ.. దీని కారణంగా తలెత్తే సమస్యలను ఎలా ఎదుర్కొవాలో ప్రభుత్వానికి తెలుసన్నారు. ప్రణబ్, ఆంటోనీలూ చెప్పలేదు రూ.58వేల కోట్ల ఒప్పందాన్ని బహిర్గతం చేసేందుకు విముఖత చూపిన జైట్లీ.. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి రక్షణ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీలు 15 సందర్భాల్లో ఇలాంటి వివరాలు వెల్లడించలేదని గుర్తుచేశారు. అప్పుడు దేశ భద్రత, జాతి ప్రయోజనాలను వారు కారణంగా చూపించారని సభకు వెల్లడించారు. ‘ధరలు, ఇతర వివరాలను బయటపెట్టడం ద్వారా.. సదరు హెలికాప్టర్/ఆయుధానికి సంబంధించిన సాంకేతిక వివరాలన్నీ బయటకొస్తాయి. అది మన రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్నీ వెల్లడిస్తుంది. ఇది శత్రువుకు తెలియజేయటానికి రక్షణ వ్యవస్థ, ప్రభుత్వం ఒప్పుకోవు’ అని జైట్లీ వెల్లడించారు. అయితే జాతి భద్రతకు సంబంధించిన వివరాలను తాము అడగటం లేదని.. పారదర్శకతను మాత్రమే కోరుతున్నామని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు. -
‘రాఫెల్’పై మాటల యుద్ధం
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్ష కాంగ్రెస్, అధికార బీజేపీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓ వ్యాపారవేత్తకు ప్రయోజనం చేకూర్చేలా బీజేపీ మొత్తం ఒప్పందంలోనే మార్పులు చేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఆరోపించారు. వీటిని బీజేపీ అంతే దీటుగా తిప్పికొట్టింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఆ పార్టీ కీలక నేతలు విచారణ ఎదుర్కొనే అవకాశాలున్నందున ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసింది. ఇటీవలే ఏర్పాటైన అఖిల భారత అసంఘటిత రంగ కార్మికుల కాంగ్రెస్ (ఏఐయూడబ్ల్యూసీ) సమావేశం తరువాత రాహుల్ మాట్లాడుతూ... ఓ వ్యాపారవేత్తకు అనుకూలంగా వ్యవహరించేందుకే రాఫెల్ ఒప్పందంలో మార్పులు చేసిన ప్రధాని మోదీని నిలదీయాలని మీడియాను కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమిత్ షా కొడుకు జయ్ షా కంపెనీ లాభాలు అనూహ్యంగా పెరిగాయని ఈ విషయంపై కూడా ప్రశ్నించాలన్నారు. ‘మీరు నన్ను అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తా. రాఫెల్ ఒప్పందంపై మోదీని ఎందుకు ప్రశ్నించరు? జయ్ షా కంపెనీ గురించి ఎందుకు అడగరు?’ అని అన్నారు. ఏరోస్పేస్ రంగంలో ఎలాంటి అనుభవంలేని రిలయన్స్ కంపెనీని రఫేల్ ఒప్పందంలో భాగం చేయ డంపై ప్రధాని వివరణ ఇవ్వాలన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ...తమ పాలనలో ఒక్క అవినీతి కేసు కూడా నమోదుకాలేదన్న నిజాన్ని కాంగ్రెస్ అంగీకరించలేకపోతోందన్నారు. రిలయన్స్‌తో ఒప్పందం: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ప్రయోజనాలను దెబ్బతీశారని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ఇటీవలే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ హెచ్ఏఎల్కు సాంకేతికతను బదిలీచేయడానికి నిరాకరించి రిలయన్స్ డిఫెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ఫలితంగా రెండు సంస్థలు ఓ సంయుక్త సంస్థనూ ఏర్పాటుచేశాయి. యూపీఏ హయాంలో నిర్ధారించిన ధర కన్నా చాలా ఎక్కువకు విమానాలు కొనుగోలు చేస్తున్నారని సుర్జేవాలా ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమని రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ కొట్టిపారేసింది. ఇది రెండు ప్రైవేట్ కంపెనీల మధ్య ఒప్పందమని, ఇందులో ప్రభుత్వ పాత్ర లేదని వెల్లడించింది. -
ఫ్రాన్స్ తో భారత్ యుద్ధ విమానాల ఒప్పందం
-
ఫ్రాన్స్ తో భారత్ యుద్ధ విమానాల ఒప్పందం
న్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల కొనుగోలు పట్ల భారత్, ఫ్రాన్స్ లు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. ఫ్రాన్స్ నుంచి 36 జెట్ లను భారత్ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి రేపు ఫ్రాన్స్ రక్షణ మంత్రి భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో కీలక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. 36 జెట్ విమానాలకు 12 బిలియన్ యూరోలు చెల్లించాలని ఫ్రాన్స్ డిమాండ్ చేసింది. కానీ భారత్ వాటి ధరను తగ్గించి 8 బిలియన్ యూరోలుకే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పాత కాలం నాటి యుద్ధ విమానాలను మార్చాలని భారత్ ఎప్పటి నుంచే భావిస్తోంది. ఇందులో భాగంగా భారీ స్థాయిలో రాఫెల్ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 36 విమానాలు కొనుగోలు చేయనుంది.