పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష నాయకులతో కలసి ఆందోళనచేస్తున్న సోనియా
న్యూఢిల్లీ/రాయ్‌పూర్: రాఫెల్ ఒప్పందంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ యూపీఏ చైర్‌పర్సన్ సోనియా నాయకత్వంలో విపక్ష ఎంపీలు పార్లమెంటు ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు ఆజాద్, ఆంటోనీ, ఇతర కాంగ్రెస్ ముఖ్యులు, తృణమూల్, సీపీఐ, ఆప్ సహా పలు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు.
అటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ ఎంపీలు సభా కార్యక్రమాలు ఆటంకం కలిగించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. రాఫెల్ ఒప్పందంపై ప్రభుత్వం జేపీసీని ఏర్పాటుచేయాలి’ అని నినదించారు. రాఫెల్ ఒప్పందం చర్చల దశలోనే ముగిసిపోతుందని కాంగ్రెస్ ఎంపీ సునీల్ జాఖడ్ అభిప్రాయపడ్డారు. భోపాల్ గ్యాస్ ఉదంతం తర్వాత ఇది అతిపెద్ద మధ్యవర్తిత్వ కేసుగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. తనకు చాన్సిస్తే ఇంతకన్నా గొప్పగా రాఫెల్ ఒప్పందాన్ని సిద్ధం చేస్తానన్నారు.
అతిపెద్ద కుంభకోణం
భారత రక్షణ రంగ చరిత్రలో రాఫెల్ కుంభకోణం అతిపెద్దదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే బాధ్యుడని ఆయన ఆరోపించారు. ‘మోదీ ఫ్రాన్స్‌కు వెళ్లి, పాత ఒప్పందాన్ని రద్దుచేశారు. భారీ మొత్తంతో కొత్త ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం రక్షణ మంత్రి, కేబినెట్ మంత్రులకు కూడా తెలియదు’ అని చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment