
అబ్బిగెరిలో ‘ముష్టి ధాన్య సంగ్రాహ అభియాన్’లో భిక్షాటన చేస్తున్న అమిత్ షా
న్యూఢిల్లీ: మలి దశ పార్లమెంట్ బడ్జెట్ కార్యకలాపాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి నిరసనగా అధికార బీజేపీ ఎంపీలంతా దేశవ్యాప్తంగా గురువారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రధాని మోదీ తన రోజూవారీ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండానే దీక్షలో పాల్గొన్నారు.
పార్టీ అధ్యక్షుడు అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోని ధార్వాడ్‌లో సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పతో కలసి పాల్గొన్నారు. డిఫెన్స్ ఎక్స్‌పోకు హాజరైన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీక్ష పాటించారు. కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, సురేశ్ ప్రభు, ఎంపీలు మీనాక్షి లేఖి, ప్రవేశ్ వర్మ, ఉదిత్ రాజ్, మనోజ్ తివారీ తదితరులు ఢిల్లీలోని తమతమ నియోజకవర్గాల్లోనే దీక్ష పాటించారు. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ముగిసింది.