UPA chairperson
-
సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్(యూపీఏ) ఛైర్పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం 76వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు మంచి ఆరోగ్యంతో కూడిన సుదీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తో పాటు పలువురు నేతలు సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టిన రోజు సందర్భంగా యూపీఏ ఛైర్పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శుభాకాంక్షలు. ఆమెకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్ ట్వీట్ చేశారు. యూత్ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ బీవీ సైతం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్‌కు సోనియా.. భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో కొనసాగుతున్న క్రమంలో గురువారం జైపూర్‌కు చేరుకున్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రెండు రోజుల పాటు రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. గురువారం జైపూర్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో సవాయ్ మాధాపుర్కు చేరుకున్నారు. షేర్ బాఘ్ హోటల్లో శుక్రవారం సోనియా జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సోనియా కూతురు ప్రియాంక గాంధీ సైతం సవాయ్ మాధాపూర్‌కు చేరుకున్నారని చెప్పారు. ‘వారు రంథాంభోర్లో ఉంటారు. డిసెంబర్ 9న అక్కడే సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఉంటాయి. ’ అని తెలిపారు. ఇదీ చదవండి: ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం -
ఓటర్లకు సోనియా కృతజ్ఞతలు
రాయ్‌బరేలీ: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ రాయ్‌బరేలీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఆమె రాయ్‌బరేలీ వెళ్లారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తనను ఎన్నుకున్న ప్రజలకు సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రానున్న ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దని కార్యకర్తలు సోనియాను కోరినట్లు కాంగ్రెస్ నేత సంజయ్ సిన్హ్ తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సొంత నియోజకవర్గంలో సోనియా పర్యటించడం ఇదే ప్రథమం. -
మళ్లీ తెరపైకి సోనియా గాంధీ!
న్యూఢిల్లీ: కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న 23న మహా కూటమిలోని భాగస్వాములతో పాటు పాత మిత్రులతో సమావేశం నిర్వహించేందుకు ఆమె సిద్ధమవుతున్నట్టు సమాచారం. మహా కూటమిలోని ప్రధాన భాగస్వాములు మాయావతి, అఖిలేశ్ యాదవ్‌లతో పాటు.. తటస్థులు నవీన్ పట్నాయక్, కె. చంద్రశేఖర్‌రావులతో ఆమె సంప్రదింపులు జరపనున్నారని కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 23న సమావేశానికి హాజరుకావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేశ్ యాదవ్‌లకు లేఖలు పంపించినట్టు తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన వెంటనే అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పాత మిత్రులకు సోనియా కబురు పంపినట్టు ప్రచారం జరుగుతోంది. డీఎంకే, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు కూడా ఉత్తరాలు వెళ్లినట్టు సమాచారం. ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ రాకపోతే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కూడగట్టేందుకు స్వయంగా సోనియా కల్పించుకుని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటికి హాజరయ్యేందుకు ఎంకే స్టాలిన్, శరద్ పవార్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత దాదాపు వెనుక సీటుకే ఆమె పరిమితమయ్యారు. సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా జరుగుతుండటంతో ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తీసుకువచ్చి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలన్న వ్యూహంతో సోనియా పావులు కదుపుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే పాత మిత్రులను యూపీఏ కూటమిలోని తీసుకురావాలన్న ఉద్దేశంతో సోనియా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మాయావతి, అఖిలేశ్‌లతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతోనూ సోనియా టచ్‌లో ఉన్నారని తెలిపాయి. తటస్థ వైఖరితో ఉన్న బీజేడీ నేత నవీట్ పట్నాయక్, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావులను తమ కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వెల్లడించాయి. వీరిద్దరితో అహ్మద్ పటేల్ టచ్‌లో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ తెర వెనుక శక్తి
సాక్షి వెబ్ ప్రత్యేకం : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. అసలు పేరు సోనియా మైనో. ఆమె 1946, డిసెంబర్ 9వ తేదీన ఇటలీలోని టూరిన్ పట్టణానికి సమీపంలో ఉన్న ఒర్బసానో గ్రామంలో సంప్రదాయ రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఇంగ్లీషు, ఫ్రెంచ్, రష్యన్ భాషలను అభ్యసించారు. ఇంగ్లీషు భాషను అధ్యయనం చేస్తున్నప్పుడే ఆమెకు రాహుల్ గాంధీ పరిచయం అయ్యారు. వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 1968, ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో వసంత పంచమి రోజున పెళ్లి చేసుకున్నారు. రాజీవ్ గాంధీ తల్లి ఇందిరాగాంధీ–ఫిరోజ్ గాంధీని కూడా అదే రోజు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ మరణానంతరం అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సోనియా గాంధీ ‘నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్’ చైర్మన్‌గా యూపీఏ ప్రభుత్వాన్ని నడిపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పార్టీకి దశ దిశ నిర్దేశించారు. ఆమె ‘రాజీవ్’, ‘రాజీవ్స్ వరల్డ్’ రెండు పుస్తకాలను రచించారు. 1922 నుంచి 1964 మధ్య పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలను ‘ఫ్రీడమ్స్ డాటర్’, ‘టు ఎలోన్, టు టుగెదర్’ అనే రెండు సంపుటాలను ఎడిట్ చేసి ప్రచురించారు. ఆమెకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లతో ఇద్దరు పిల్లలున్న విషయం తెల్సిందే. తొలిచూపులోనే ప్రేమలో సోనియా గాంధీ 1965లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో అడుగు పెట్టారు. అప్పటికి మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న రాజీవ్ గాంధీ ఆమెకు అనుకోకుండా తారసపడ్డారట. తొలిచూపులోనే వారు ప్రేమించుకున్నారట. అలా వారి ప్రేమాయణం మూడేళ్లపాటు సాగింది. రాజీవ్ గాంధీ హిందూ మతానికి చెందిన వారే కాకుండా పలుకుబడి, అధికారంగల రాజకీయ కుటుంబానికి చెందిన వారవడం వల్ల ముందుగా సోనియా కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అసలు ఒప్పుకోలేదట. అంతకన్నా పెళ్లి ప్రతిపాదనను ఇందిరా గాంధీ వరకు తీసుకెళ్లాలంటే సోనియా కుటుంబ సభ్యులు భయపడి చచ్చారట. రాజీవ్ గాంధీ అన్నింటికి ధైర్యంగా నిలబడి తల్లిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. పెళ్లి రోజు అత్తగారు ఇందిరాగాంధీ ఇచ్చిన ఆమె పెళ్లి నాటి గులాబీ రంగు చీరనే సోనియా గాంధీ ధరించారట. రాజీవ్ గాంధీ మరణానంతరం 1984–1991 (కొద్ది కాలం లోక్‌సభ నాయకుడిగా) మధ్య రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెంట సోనియా గాంధీ దేశ, విదేశాలు తిరిగారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన పనులు చూసుకునేవారు. ఆరోగ్య శిబిరాలు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేవారు. రాజీవ్ హత్యానంతరం ఆమె రాజీవ్ గాంధీ పేరిట ఓ స్వచ్ఛందంగా ఓ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ‘రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ స్టడీస్’కు చైర్‌పర్సన్‌గా, పలు స్వచ్ఛంద సంస్థలకు హెడ్‌గా బిజీ బిజీగా గడిపారు. రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఒత్తిడి 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు కొంతకాలం ముందు నుంచి ప్రత్యక్ష క్రియాశీలక రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆమెపై ఒత్తిడి వచ్చింది. 1998, ఏప్రిల్‌లో పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1999లో అమేథి నుంచి పోటీచేసి మొదటి సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోయినప్పటికీ అత్యధిక సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆమెనే తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఆమెనే ప్రధాన మంత్రి అవుతారని అనుకున్నారు. ఇటలీలో జన్మించి, అక్కడి పౌరసత్వాన్ని కలిగిన సోనియాకు ఆ అర్హత లేదంటూ బీజేపీ, దాని మిత్రపక్షాలు పెద్ద ఎత్తున వివాదం లేవదీయడంతో ఆమె అనూహ్యంగా ప్రధాని పదవికి మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారు. యూపీఏ సంకీర్ణ కూటమి చైర్మన్‌గా, పార్లమెంట్లో పార్టీ నాయకురాలిగా ఆమె తన సేవలందించారు. ముఖ్యమైన విధాన నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కనీసం వంద రోజులపాటు ఉపాధి కల్పించడం కోసం సోనియా గాంధీ ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాథి గ్యారంటీ చట్టం’ను 2005లో తీసుకొచ్చారు. ఈ పథకాన్ని 2006 నుంచి అమలు చేశారు. ప్రభుత్వ పాలనలో అవినీతిని అరికట్టేందుకు 2009లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. 2004 నుంచి 2014 వరకు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ‘రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ స్టడీస్’ చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడే సోనియా గాంధీ, పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ద్వారా దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకరావడానికి కషి చేశారని రాజకీయ పరిశీలకులు చెబుతారు. ఆసక్తికరమైన అంశాలు సోనియా గాంధీ పాఠశాల రోజుల్లో మంచి ఫుట్‌బాల్ ప్లేయర్. పెళ్లికి ముందు వెల్లింఘ్టన్ క్రిసెంట్ హౌజ్‌లో బచ్చన్ కుటుంబంతో కొద్దికాలం కలిసి ఉన్నారు. 1968, జనవరి 26వ రోజు, దేశ రిపబ్లిక్ దినోత్సవం నాడు రాజీవ్ గాంధీతో సోనియాకు నిశ్చితార్థం జరిగింది. ఆమె మెహంది పండుగ కూడా బచ్చన్ల ఇంటిలోనే జరిగింది. పెళ్లి నాటికి సోనియాకు హిందీ రాదు. ఇంట్లో హిందీ టీచర్‌ను పెట్టుకొని హిందీ నేర్చుకొని, ఆ తర్వాత ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి నేర్చుకున్నారు. భారతీయ చేనేత, చేతి వత్తుల అధ్యయనంపై ఆసక్తి. జానపద, శాస్త్రీయ సంగీతాలను ఇష్టపడతారు. ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఆయిల్ పెయింటింగ్స్‌ను ఎలా సంరక్షించాలన్న అంశంపై డిప్లమో చేశారు. - వి. నరేందర్ రెడ్డి -
రాఫెల్‌పై విపక్షాల ధర్నా
న్యూఢిల్లీ/రాయ్‌పూర్: రాఫెల్ ఒప్పందంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ యూపీఏ చైర్పర్సన్ సోనియా నాయకత్వంలో విపక్ష ఎంపీలు పార్లమెంటు ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు ఆజాద్, ఆంటోనీ, ఇతర కాంగ్రెస్ ముఖ్యులు, తృణమూల్, సీపీఐ, ఆప్ సహా పలు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. అటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ ఎంపీలు సభా కార్యక్రమాలు ఆటంకం కలిగించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. రాఫెల్ ఒప్పందంపై ప్రభుత్వం జేపీసీని ఏర్పాటుచేయాలి’ అని నినదించారు. రాఫెల్ ఒప్పందం చర్చల దశలోనే ముగిసిపోతుందని కాంగ్రెస్ ఎంపీ సునీల్ జాఖడ్ అభిప్రాయపడ్డారు. భోపాల్ గ్యాస్ ఉదంతం తర్వాత ఇది అతిపెద్ద మధ్యవర్తిత్వ కేసుగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. తనకు చాన్సిస్తే ఇంతకన్నా గొప్పగా రాఫెల్ ఒప్పందాన్ని సిద్ధం చేస్తానన్నారు. అతిపెద్ద కుంభకోణం భారత రక్షణ రంగ చరిత్రలో రాఫెల్ కుంభకోణం అతిపెద్దదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే బాధ్యుడని ఆయన ఆరోపించారు. ‘మోదీ ఫ్రాన్స్‌కు వెళ్లి, పాత ఒప్పందాన్ని రద్దుచేశారు. భారీ మొత్తంతో కొత్త ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం రక్షణ మంత్రి, కేబినెట్ మంత్రులకు కూడా తెలియదు’ అని చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆరోపించారు. -
అంబులెన్స్ వచ్చేలోగా కారులో బయల్దేరిన సోనియా
షిమ్లా : యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అస్వస్థతకు లోనయ్యారు. ఉన్నపలంగా ఆమె షిమ్లా నుంచి ఢిల్లీకి వచ్చారు. సోనియాకు ఒంట్లో కొంత వ్యాకులతగా అనిపించడంతో అంబులెన్స్ రావడానికంటే ముందే తన సొంతకారులో బయల్దేరారు. షిమ్లాలోని చరబ్రాలో సోనియాగాంధీ నివాసం నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ పనులు పర్యవేక్షించేందుకు సోనియా అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో ఆమెతో కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. అయితే, ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ) సీనియర్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ రమేశ్ చంద్ తెలిపిన ప్రకారం సోనియాకు కొంత నీరసంగా ఉందని, ఆమె వెంటనే ఢిల్లీ బయలుదేరి రావాల్సిన అవసరం ఉందని, అందుకోసం అంబులెన్స్ పంపించాలని ఆమె పక్కన ఉన్న వైద్యుడు ఫోన్ చేశారు. అయితే, కొందరు వైద్యుల బృందంతో కూడిన అంబులెన్స్ వచ్చేలోగానే ఆమె కారులో బయలుదేరారు. దీంతో ఆమెకోసం వచ్చిన అంబులెన్స్ కూడా కారు వెనుకే వెళ్లింది. కాగా, మార్గం మధ్యలో ఆమె ఓసారి పంచకులలో ఆగినట్లు డాక్టర్ చంద్ వెల్లడించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చెప్పారు. -
రాహుల్‌కు మరో రెండు ప్రమోషన్లు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి మరో రెండు ప్రమోషన్లు లభించే అవకాశముంది. ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఏ) చైర్‌పర్సన్‌గా, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నాయకుడిగా ఆయనకు పట్టం కట్టేందుకు రంగం సిద్ధమైనట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయని ‘న్యూస్ 18’ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష స్థానంలో ఉన్నవారే సీపీపీ నాయకుడిగా వ్యవహరిస్తారు. ‘సోనియా గాంధీ గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో ప్రసంగాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధ్యక్షుడే సీపీపీ నాయకుడిగా వ్యవహరించడం ఇందిరా గాంధీ హయాం నుంచి మొదలైంద’ని కాంగ్రెస్ నాయకుడొకరు వెల్లడించారు. రెండు పదవుల మధ్య ఎటువంటి శత్రుత్వం లేకుండా చూసేందుకే ఈ నిబంధన పాటిస్తున్నట్టు వివరించారు. యూపీఏ చైర్‌పర్సన్‌గా రాహుల్ ఎన్నికైతే భాగస్వామ్య పార్టీలతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు వీలుంటుంది. మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, సీతారాం ఏచూరి లాంటి పాత మిత్రులను కలుపుకునిపోవడంలో ఇంతకాలం సోనియా గాంధీ సమర్థవంతంగా వ్యవహరించారు. రాహుల్ గాంధీ ఒకవేళ ఎన్డీఏ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తే పాతమిత్రులను కలుపుకుని వెళ్లడం ఆయనకు సవాల్‌గా నిలుస్తుంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని ముందుగా దారికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆగస్టులో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటు వేయకుండా ఎన్సీపీ మోసం చేయడంతో రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో యూపీఏ భాగస్వాములను ఎన్నుకోవడంలో రాహుల్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సివుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఓటుతో సోనియా రుణం తీర్చుకోవాలి
ఆలేరు, న్యూస్‌లైన్,కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కోరారు. ఆలేరులో బుధవారం ఆయన ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌తో కలిసి ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.700 కోట్లతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశానని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని కోరాఉఉ. అంతకుముందు టీఆర్ఎస్ నాయకులు కొలుపుల హరనాథ్, మొరి గాడి వెంకటేశ్ ఆధ్వర్యంలో 250 మంది కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. కార్యక్రమంలో వరంగల్ డీసీసీబీ ైచైర్మన్ జంగ రాఘవరెడ్డి, స్థానిక మార్కెట్ చైర్మన్ శం కర్నాయక్, నాయకులు ఎంఎస్ విజయ్‌కుమార్, ఇల్లందుల మల్లేషం గౌడ్, ఎలుగల కృష్ణ, సర్పంచ్ కందగట్ల నిర్మల, నీలం పద్మ, నీలం వెంటస్వామి, గ్యాదపాక నాగరాజు, కందుల శంకర్, కె సాగర్‌రెడ్డి, యాదగిరి, మల్రెడ్డి నర్సింహారె డ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, ఎలుగల వెంకటేష్, ఎజాజ్, జూకంటి రవీందర్, జూకంటి ఉప్పలయ్య, సముద్రాల కల్పన పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి భువనగిరి : తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రజలను కోరారు. శుక్రవారం ఆయన వరంగల్ వెళ్తూ కొద్దిసేపు భువనగిరి బైపాస్ టీచర్స్ కాలనీ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను తీర్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోత్నక్ ప్రమోద్‌కుమార్, నాయకులు ఎంఎ మాజీద్ బాబా, చిందం మల్లిఖార్జున్, దొనకొండ వనిత, అలీకౌసర్ పాలొన్నారు. -
28న కాంగ్రెస్ కృతజ్ఞతా సభ
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: కాంగ్రెస్ కృతజ్ఞతా సభకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. పార్టీ వ్యవస్థాపక దినమైన ఈనెల 28న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపడం, అసెంబ్లీకి ముసాయిదా బిల్లు రావడానికి కారణమైన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఈ సభ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతామన్నారు. శనివారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినం సందర్భంగా 28న అన్ని గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ జెండావిష్కరణ చేపట్టాలని, మధ్యాహ్నం ఒంటిగంటకు కృతజ్ఞతా సభకు పార్టీ నాయకులు, శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కులసంఘాలు, తెలంగాణ సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, తెలంగాణ రాష్ట్ర సాధనకు వివిధ రూపాల్లో పోరాటం చేసిన ప్రతి ఒక్కరినీ సభకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ ఇప్పటికే మొదలైందని పునరుద్ఘాటించారు. జనవరి 3 నుంచి సమావేశాలు అని వెలువడిన బులిటెన్లోనే చర్చ మొదలైందని స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. డీసీసీ కార్యాలయంలో సన్నాహక సమావేశం కృతజ్ఞతా సభ విజయవంతానికి శనివారం డీసీసీ కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. కనీసం లక్ష మందికి తగ్గకుండా జనసమీకరణ చేయాలన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా సభలు నిర్వహించాలని అనుకున్నా, గతంలో వాయిదా వేసినందున ముందుగా జిల్లా కేంద్రంలో కృతజ్ఞతా సభను నిర్వహించడానికే నాయికులు మొగ్గుచూపారు. ఆ తరువాత నియోజకవర్గాల వారీగా సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సమావేశంలో ఎంపీ పొన్నం ప్రభాకర్, విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు కొండూరు రవీందర్రావు, మత్సపారిశ్రామిక సంస్థ చైర్మన్ చేతి ధర్మయ్య, వేములవాడ దేవస్థానం చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్, నగర అధ్యక్షుడు కన్న కృష్ణ, పీసీసీ ప్రధానకార్యదర్శి కోలేటి దామోదర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పనకంటి చంద్రశేఖర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డెరైక్టర్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ మేయర్ డి.శంకర్, పీసీసీ కార్యదర్శులు వై.సునీల్‌రావు, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, నేరెళ్ల శారద, అర్బన్బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆమ ఆనంద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ, నందెల్లి రమ, ఎస్సీసెల్ జిల్లా చైర్మన్ అర్ష మల్లేశం, వి.అంజన్‌కుమార్ పాల్గొన్నారు. -
అటార్నీ జనరల్‌కు సోనియా పేరుతో మహిళ ఫోన్!
న్యూఢిల్లీ: యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ గొంతును అనుకరిస్తూ అటార్నీజనరల్ జీఈ వాహనవతికి ఓ గుర్తుతెలియన మహిళ ఫోన్ చేయడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు కేంద్ర హోంమత్రి సుశీల్‌కుమార్ షిండే సోమవారం తెలిపారు. అటార్నీ జనరల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఈ ఫోన్‌కాల్‌పై ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టారన్నారు. ‘సోనియాగాంధీ గొంతును అనుకరిస్తూ గుర్తుతెలియని మహిళ సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత ముఖ్యమైన ఫైల్ల విషయమై అటార్నీ జనరల్‌తో మాట్లాడారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అంశం కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. దీనిపై అటార్నీ జనరల్ ఫిర్యాదు చేశారు’ అని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సోనియాగాంధీ ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన సమయంలోనే ఆమె పేరుతో ఫోన్ చేసిన మహిళ.. తాను న్యూయార్క్ నుంచి మాట్లాడుతున్నానని వాహనవతికి చెప్పినట్లు సమాచారం. అయితే ఆ ఫోన్ కాల్ ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసే మహిళ చేసిందని, కార్యాలయం నుంచే ఏడుసార్లు అటార్నీ జనరల్‌కు ఫోన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు -
పరిశోధన.. అపనింద కారాదు
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘మీడియాలో పరిశోధన స్ఫూర్తి అపనిందల ప్రచారంలా మారకూడదు. పరిశోధనాత్మక జర్నలిజానికి కక్ష సాధింపులు ప్రత్యామ్నాయం కాదు. ప్రజోపయోగం స్థానాన్ని వ్యక్తిగత పక్షపాతాలు ఆక్రమించకూడదు’’ అని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ హితవుపలికారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 75వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఢిల్లీలోని రాయ్‌సీనా రోడ్లో అరవై కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక జాతీయ మీడియా కేంద్రం (నేషనల్ మీడియా సెంటర్ )ను ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీలు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. మీడియా అనేది కేవలం కార్యక్రమాలకు అద్దంపట్టేది మాత్రమే కాదని.. మొత్తం సమాజాన్ని అది ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు, సరళీకరణలు తెచ్చిన గొప్ప సామాజిక మార్పుల ప్రక్రియను ప్రతిబింబించే క్రమంలో.. మీడియా కూడా ఆ మార్పుల ప్రభావానికి లోనయిందన్నారు. మార్పు అనేది సవాళ్లను కూడా తెస్తుందని.. మీడియా రంగంలోని వారు ఈ సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని చెప్పారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో పరిశోధన స్వేచ్ఛ, ప్రశ్నలకు సమాధానాల అన్వేషణ అనే బాధ్యతను నిర్వర్తించేటపుడు జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. పరిశోధనాత్మక జర్నలిజానికి కక్షసాధింపులు ప్రత్యామ్నాయం కాదని హితవు పలికారు. మీడియా చర్చలో ఒక్కోసారి హుందాతనం లోపిస్తోందని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. రెండెకరాల విస్తీర్ణం.. అత్యాధునిక హంగులు రాష్ట్రపతి భవన్‌కు, పార్లమెంటుకు సమీపంలో 1.95 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలతో నెలకొల్పిన ఈ కేంద్రం ప్రభుత్వ సమాచార కేంద్రంగా పనిచేస్తుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను కూడా ఈ భవనంలోనే ఏర్పాటుచేస్తారు. ఈ మీడియా సెంటర్లోని ప్రధాన ప్రెస్ కాన్ఫరెన్స్ ఆడిటోరియంలో దాదాపు 300 మంది విలేకరులు కూర్చోగల సదుపాయం ఉంది. మరో హాల్లో 60మందికి పైగా కూర్చోవచ్చు. మీడియా ప్రతినిధుల కోసం 24 వర్క్స్టేషన్లు ఉంటాయి. మీడియా ప్రతినిధులకు లైబ్రరీ, కెఫెటీరియా, లాంజ్ కూడా అందబాటులో ఉంటాయి. వివాదాస్పద వ్యాఖ్యలపై జస్టిస్ కట్జూ క్షమాపణ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మార్కండేయ కట్జూ ఇన్నాళ్లకు తన వ్యాఖ్యలపై సారీ చెప్పారు. 90 శాతం మంది భారతీయులు మూర్ఖులన్న ఆయన తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘నా వ్యాఖ్యలతో కొందరు బాధపడ్డారు. అవి నిర్దిష్టమైన సందర్భాన్ని ఉద్దేశించి చేసినవి తప్ప.. ఎవరినో బాధపెట్టడానికి కాదు’ అని శనివారమిక్కడ చెప్పారు. ‘ముందస్తు’పై ఏమీ చెప్పలేను: సోనియా న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ యూపీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుత యూపీఏ సర్కారు పూర్తికాలం కొనసాగటమే తమ లక్ష్యమని.. అయితే ముందస్తు ఎన్నికల గురించి ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో జాతీయ మీడియా కేంద్రం ప్రారంభోత్సవం తర్వాత తనను చుట్టుముట్టిన విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వెంటనే వెళ్లిపోగా.. సోనియాగాంధీ విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ‘ఎన్నికల తర్వాత యూపీఏ-3 సర్కారు ఏర్పాటవుతుందా?’ అన్న ప్రశ్నకు.. ‘‘నూటికి నూరు శాతం ఏర్పడుతుంది’’ అని ఆమె బదులిచ్చారు. ‘లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయా?’ అని ప్రశ్నించగా, సర్కారు పూర్తి కాలం కొనసాగించటమే తమ లక్ష్యమన్నారు. ‘లోక్‌సభలో ఆహారభద్రత, భూసేకరణ బిల్లుల ఆమోదం తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా?’ అని అడిగినపుడు, ‘‘నేనేమీ చెప్పలేను’’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ విజయాలుగా ప్రచారం చేయబోయే అంశాలపై ప్రశ్నించినపుడు.. దేశప్రజలకు ఇచ్చిన హక్కులను ప్రచారం చేస్తామన్నారు. ‘మేం చాలా హక్కులు అందించాం. సమాచార హక్కు, విద్యా హక్కు, ఇప్పుడు ఆహార హక్కు అందించబోతున్నాం’’ అని చెప్పారు. -
ఢిల్లీని అన్నపూర్ణగా మారుస్తాం
న్యూఢిల్లీ: ఆహార భద్రత పథకాన్ని సమర్థవంతగా అమలు చేసి రాజధాని నగరాన్ని అన్నపూర్ణగా మారుస్తామని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పునరుద్ఘాటించారు. నగరంలోని 73 లక్షల మందికి తక్కువ ధరకే నిత్యావసరాలు అందజేస్తామని, పథకం అమలును సవాలుగా తీసుకొని పనిచేస్తామన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ఢిల్లీలో ఈ నెల 20న యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించిన విషయం తెలిసిందే. నగరంలో 18వ ఆప్కీ రసోయి కేంద్రాన్ని శనివారం ప్రారంభించిన సందర్భంగా షీలాదీక్షిత్ మాట్లాడుతూ...‘నగరాన్ని ఆకలి రహిత నగరంగా మారుస్తామ’న్నారు. -
ఉద్యమంతోనే ‘సమైక్యం’
ఎస్కేయూ, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేలా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ నిర్ణయం తీసుకోవాలంటే విద్యార్థులు, యువకులు చేసే ఉద్యమంతోనే సాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఎస్కేయూలో ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారులకు మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ , సీమాంధ్రలో రెండుచోట్లా అధికారం చెలాయించాలనే దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. సోనియా తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు చిదంబరం, దిగ్విజయ్‌సింగ్‌తో కలిసి నాటకాలాడుతున్నారని విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలకని ఏ ప్రజాప్రతినిధినైనా నిలదీసే హక్కు ఉందని గుర్తుచేశారు. రాష్ర్ట విభజన నిర్ణయం వెనక్కు తీసుకుని, సమైక్యాంధ్రప్రదేశ్‌గానే కొనసాగించేలా విద్యార్థులు ఉద్యమం ద్వారా సోనియాపై ఒత్తిడి తేవాలన్నారు. రాష్ర్టపతి అవార్డు గ్రహీత, ఉపాధ్యాయుడు అలీఖాన్ మాట్లాడుతూ సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ రాజేశ్వరరావు. కన్వీనర్ డాక్టర్ సదాశివరెడ్డి పాల్గొన్నారు. మిన్నంటిన ఉద్యమం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సమైక్య ఉద్యమం మిన్నంటుతోంది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు అనంతపురం-చెన్నై రహదారిపై రాస్తారోకో చేశారు. అత్యవసర సేవలు మినహా లారీలు, జీపులు తదితర వాహనాలను పిలిపివేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, సోనియా, ఢిల్లీ పెద్దలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా కోరారు. అనంతరం సమైక్యవాదులు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ర్టంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం చేయాలని పన్నాగం పన్నుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందితే తమ రాష్ట్రాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్న భయంతోనే ఆజాద్, దిగ్విజయ్‌సింగ్, చిదంబరం విభజనకు కుట్ర పన్నారని ఆరోపించారు. తెలుగుతల్లిని చీల్చి పండుగ చేసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజలు డబ్బులు దండుకుని ఉద్యమాలు చేస్తున్నారని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. డబ్బు తీసుకున్నట్లు నిరూపించగలరా అంటూ తెలంగాణవాదులను సవాల్ చేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతు తెలిపి.. సమైక్యాంధ్రను రక్షించుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోకు ముందు ఆకుతోటపల్లి నుంచి మహిళలు చిన్నారులతో కలిసి ర్యాలీగా వచ్చి మద్దతు ప్రకటించారు. రోడ్డుపైనే వంటావార్పు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాస్తారోకోలో పాల్గొన్న సమైక్య వాదులు రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. ఉదయం దాదాపు వెయ్యిమందికిపైగా రోడ్డుపైనే భోజనం చేశారు. రాత్రి 7గంటల సమయంలో కూడా రోడ్డుపైనే భోజనం చేసి తమ నిరసన తెలియజేశారు. రెండో రోజూ కొనసాగిన రిలే దీక్షలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జేఏసీ నాయకులు ఎస్కేయూలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండో రోజు మంగళవారం కూడా కొనసాగాయి. తెలుగుజాతి ప్రజలు నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం కాకుండా చూస్తామని ఎస్కేయూ సమైక్యాంధ్ర జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఉన్నం రాజేశ్వరరావు అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా సోనియాగాంధీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని నిర్ణయం వెలువరించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిలేదీక్షల్లో సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మల్లెల నాగేంద్ర, లక్ష్మీనారాయణ, వెంకట్రాముడు, ఓబులపతి, పెద్దన్న పాల్గొన్నారు.