ఎస్కేయూ, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేలా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నిర్ణయం తీసుకోవాలంటే విద్యార్థులు, యువకులు చేసే ఉద్యమంతోనే సాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఎస్కేయూలో ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారులకు మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ , సీమాంధ్రలో రెండుచోట్లా అధికారం చెలాయించాలనే దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. సోనియా తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు చిదంబరం, దిగ్విజయ్‌సింగ్‌తో కలిసి నాటకాలాడుతున్నారని విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలకని ఏ ప్రజాప్రతినిధినైనా నిలదీసే హక్కు ఉందని గుర్తుచేశారు. రాష్ర్ట విభజన నిర్ణయం వెనక్కు తీసుకుని, సమైక్యాంధ్రప్రదేశ్‌గానే కొనసాగించేలా విద్యార్థులు ఉద్యమం ద్వారా సోనియాపై ఒత్తిడి తేవాలన్నారు. రాష్ర్టపతి అవార్డు గ్రహీత, ఉపాధ్యాయుడు అలీఖాన్ మాట్లాడుతూ సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ రాజేశ్వరరావు. కన్వీనర్ డాక్టర్ సదాశివరెడ్డి పాల్గొన్నారు.
మిన్నంటిన ఉద్యమం
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సమైక్య ఉద్యమం మిన్నంటుతోంది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు అనంతపురం-చెన్నై రహదారిపై రాస్తారోకో చేశారు. అత్యవసర సేవలు మినహా లారీలు, జీపులు తదితర వాహనాలను పిలిపివేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, సోనియా, ఢిల్లీ పెద్దలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా కోరారు. అనంతరం సమైక్యవాదులు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ర్టంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం చేయాలని పన్నాగం పన్నుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందితే తమ రాష్ట్రాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్న భయంతోనే ఆజాద్, దిగ్విజయ్‌సింగ్, చిదంబరం విభజనకు కుట్ర పన్నారని ఆరోపించారు. తెలుగుతల్లిని చీల్చి పండుగ చేసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
సీమాంధ్ర ప్రజలు డబ్బులు దండుకుని ఉద్యమాలు చేస్తున్నారని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. డబ్బు తీసుకున్నట్లు నిరూపించగలరా అంటూ తెలంగాణవాదులను సవాల్ చేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతు తెలిపి.. సమైక్యాంధ్రను రక్షించుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోకు ముందు ఆకుతోటపల్లి నుంచి మహిళలు చిన్నారులతో కలిసి ర్యాలీగా వచ్చి మద్దతు ప్రకటించారు.
రోడ్డుపైనే వంటావార్పు
ఉదయం నుంచి సాయంత్రం వరకు రాస్తారోకోలో పాల్గొన్న సమైక్య వాదులు రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. ఉదయం దాదాపు వెయ్యిమందికిపైగా రోడ్డుపైనే భోజనం చేశారు. రాత్రి 7గంటల సమయంలో కూడా రోడ్డుపైనే భోజనం చేసి తమ నిరసన తెలియజేశారు.
రెండో రోజూ కొనసాగిన రిలే దీక్షలు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జేఏసీ నాయకులు ఎస్కేయూలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండో రోజు మంగళవారం కూడా కొనసాగాయి. తెలుగుజాతి ప్రజలు నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం కాకుండా చూస్తామని ఎస్కేయూ సమైక్యాంధ్ర జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఉన్నం రాజేశ్వరరావు అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా సోనియాగాంధీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని నిర్ణయం వెలువరించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిలేదీక్షల్లో సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మల్లెల నాగేంద్ర, లక్ష్మీనారాయణ, వెంకట్రాముడు, ఓబులపతి, పెద్దన్న పాల్గొన్నారు.
ఉద్యమంతోనే ‘సమైక్యం’
Published Wed, Aug 7 2013 2:09 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement