సాక్షి, అనంతపురం : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు, రైతులు, ఆటో కార్మికులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులు... ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
బుధవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనం.. తదితర నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో దాదాపు పది వేల మందితో అనంతపురం నగరంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ తెలుగుతల్లి కూడలి వరకు కొనసాగింది. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. దాదాపు ఐదు వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి.. మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రోడ్డుపై సహపంక్తి భోజనాలు చేశారు. జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
వీరి బాటలోనే సమైక్యాంధ్ర జేఏసీ, వడ్డెర సంక్షేమ సంఘం, అవే ఆధ్వర్యంలో వేర్వేరుగా టవర్‌క్లాక్ సర్కిల్‌లో రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు ఎమ్మెల్యే గురునాథరెడ్డి మద్దతు తెలిపారు. అనంతపురం రూరల్ పరిధిలోని కొడిమి గ్రామానికి చెందిన రైతులు ఎడ్లబండ్లతో టవర్‌క్లాక్ చుట్టూ అరగంట పాటు తిరిగి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆటో కార్మికులు, ఎల్‌పీజీ గ్యాస్ డెలివరీ బాయిస్, ట్రాన్స్‌కో, గృహ నిర్మాణశాఖ ఉద్యోగులు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. సప్తగిరి సర్కిల్‌లో కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు నగరంలో ర్యాలీ నిర్వహించారు.
రిలే దీక్షలు చేస్తున్న సమైక్యవాదులకు ఎర్రిస్వామిరెడ్డి సంఘీభావం తెలిపారు. నగరంలోని ప్రతి కాలనీ వాసులు ర్యాలీలు చేపట్టి.. సోనియా, కేసీఆర్, సీఎం దిష్టిబొమ్మలను తగులబెట్టారు. బుధవారం ఒక్కరోజే నగరంలో 200కు పైగా దిష్టిబొమ్మలను దహనం చేయడం గమనార్హం. ఎస్కేయూలో ఉద్యోగులు, విద్యార్థుల రిలే దీక్షలకు వైస్ చాన్స్‌లర్ రామకృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు. వర్సిటీ సమీపంలోని రాధాస్కూల్ ఆఫ్ లెర్నింగ్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇటుకలపల్లె వైఎస్సార్‌సీపీ సర్పంచ్ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున తరలి వచ్చి... విద్యార్థుల దీక్షలకు మద్దతు తెలిపారు. ఇటుకలపల్లి మహిళలతో పాటు టిప్పర్ల అసోసియేషన్ కార్మికులు ఎస్కేయూ వద్ద సోనియా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఇక కళ్యాణదుర్గంలో న్యాయవాదుల రిలేదీక్షలు మూడోరోజుకు చేరాయి. జేఏసీ నాయకులు వెనక్కు నడుస్తూ నిరసన తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీలో కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. మంత్రులు కనిపించడం లేదని బత్తలపల్లిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంతకల్లులో రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను సమైక్యవాదులు దహనం చేశారు. గుత్తిలో జాక్టో దీక్షలు ఏడోరోజుకు చేరాయి. గుత్తికి చెందిన కిశోర్ అనే యువకుడు బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రాష్ట్ర విభజనతో మనస్తాపం చెంది ఉరవకొండకు చెందిన రంగప్ప (45), రాయదుర్గం మండలంలోని జుంజరంపల్లికి చెందిన అచ్చెల్లి మాబు(35) బుధవారం టీవీ చూస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఒక్క అనంతపురం నగరంలోనే బుధవారం 200 పైగా దిష్టిబొమ్మలను సమైక్యవాదులు దహనం చేశారు.
హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గేదెలతో ర్యాలీ నిర్వహించి వినూత్న నిరసన తెలిపారు. పది మంది యువకులు శిరోముండనం చేయించుకున్నారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో కేబుల్ ఆపరేటర్లు ప్రసారాలను నిలిపివేసి.. రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. కోడూరులోని జాతీయరహదారిపై ఐకేపీ మహిళలు రాస్తారోకో చేశారు. కదిరిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల ర్యాలీలో ఓ ఉద్యోగి నృసింహుని వేషధారణతో అలరించారు. సోనియా, కేసీఆర్, తెలుగుతల్లి వేషధారులతో కలిసి ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల టీచర్లు, మున్సిపల్ ఉద్యోగులు వేర్వేరుగా ర్యాలీలు చేశా రు. పట్టు, చేనేత ఉద్యోగులు, కార్మికులు 4 కిలోమీటర్లు వెనక్కు నడిచి నిరసన తెలిపారు.
ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అందరూ తెల్ల పంచె, తెల్ల చొక్కా ధరించి ఆలయంలో పూజలు, చర్చి, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. మడకశిర, పుట్టపర్తి, పెనుకొండ, రాయదుర్గం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తాడిపత్రిలో గ్రానైట్, స్లాబ్ పరిశ్రమల యజమానులు, కార్మికులు ఫ్యాక్టరీలకు తాళాలు వేసి.. నిరసన తెలిపారు. ఉరవకొండలో ఉద్యోగులు విధులను బహిష్కరించి ర్యాలీ చేపట్టారు. ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు స్థానిక అనంతపురం-బళ్లారి బైపాస్ రోడ్డును దిగ్బంధించారు. విడపనకల్లు తహశీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు రాస్తారోకో చేపట్టారు. బెళుగుప్పలో సమైక్యవాదులు దీక్షలు చేపట్టారు.
రగులుతున్న జ్వాల
Published Thu, Aug 8 2013 3:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement