అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన ప్రకటనతో ప్రజల మనోభావాలు దెబ్బ తీసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిండ ప్రదానం చేశారు. బుధవారం స్థానిక సప్తగిరి సర్కిల్ నుంచి సుభాష్‌రోడ్డు మీదుగా టవర్ క్లాక్ వరకు ర్యాలీగా వెళ్లి, తిరిగి సప్తగిరి సర్కిల్‌కు చేరుకున్నారు. ర్యాలీ సందర్భంగా సోనియాగాంధీ అమర్ రహే.. సోనియాగాంధీ మర్ గయా.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం సప్తగిరి సర్కిల్‌లో వేద బ్రాహ్మణుడి వేషధారి చింతకుంట మధు మంత్రోచ్ఛారణల నడుమ పిండ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నేత ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ... సోనియాగాంధీ తన ఇష్టమొచ్చిన రీతిలో రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంటే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగితే నష్ట పోయేది రాయలసీమ వాసులేనని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు నీకు పట్టవా? అంటూ ప్రశ్నించారు. విభజనపై వెనక్కు తగ్గక పోతే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
చిన్న రాష్ట్రాలుగా చీలిపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, తెలంగాణ వాసులు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. ఉద్యోగులకు చిన్న హాని జరిగినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బండి పరుశురాం, షెక్షావలి, మైనూద్దీన్, మహానందరెడ్డి, మారుతీనాయుడు, పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.
సోనియాకు పిండ ప్రదానం
Published Thu, Aug 8 2013 3:09 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement