సాక్షి, అనంతపురం : ‘సమైక్య’ ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తున్న ప్రభుత్వం నాటి బ్రిటీష్ చీకటి పాలనను గుర్తుకు తెస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. కేసులకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, సమైక్యాంధ్ర కోసం జైలు కెళ్లడానికైనా సిద్ధమని వారు స్పష్టం చేశారు. బుధవారం వారు నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
గురునాథరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమం నాటి స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తుకు తెస్తోందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎక్కడికెళ్లినా ప్రజల ఛీత్కారాలకు గురవుతున్నారని తెలిపారు. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే దమ్మూ ధైర్యం లేని సోనియాగాంధీ.. ఆయనకు చెక్ పెట్టాలన్న ఆలోచనతో పాటు రాహుల్‌ను ప్రధాని చేయాలన్న కుటిల రాజకీయంతో రాష్ట్రాన్ని ముక్కలు చేశారని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేసే హక్కు సోనియాగాంధీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
సమైక్యాంధ్ర విషయంలో ప్రతి సందర్భంలోనూ వైఎస్సా ర్‌సీపీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించిందన్నారు. 2008లో టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాశారని, దాని వల్లే నేడు రాష్ట్ర విభజన జరిగిందని వివరించారు. ఇప్పుడు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తూ.. సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటుకు రూ.4 లక్షల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసి కొత్త డ్రామాకు తెరలేపారని దుయ్యబట్టారు. చంద్రబాబు అలా డ్రామాలు అడుతుంటే.. సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామాలతో హై‘డ్రామా’లకు తెరలేపారన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేదని సాక్షాత్తు దిగ్విజయ్‌సింగ్ చెబుతుంటే.. సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం రాజీనామాలతో లాభం లేదని.. అసెంబ్లీలో సమైక్య గళాన్ని విన్పిస్తామని చెబుతుండడం హాస్యాస్పదమన్నారు. వెంటనే పదవులకు రాజీనామా చేసి ఉద్యమబాట పట్టాలని, లేనిపక్షంలో ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ రోజు ఉద్యమానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభంజనం ముందు నిలబడే శక్తిలేని సోనియా ‘విభజించు-పాలించు’ అనే బ్రిటీష్ కుటిల రాజకీయ నీతిని ఒంటబట్టించుకున్నారని విమర్శించారు. సమైక్యవాణి వినిపించడానికి ఢిల్లీకి వెళ్తున్నామని చెబుతున్న మంత్రులంతా.. వారికి వారుగా వెళ్లడం లేదన్నారు. ఢిల్లీ నుంచి వస్తున్న పిలుపుతోనే వెళ్తున్నారన్నారు.
అక్కడ సోనియాగాంధీ పాదధూళిలో పునీతులై.. సమైక్యవాణిని పక్కనపెడుతున్నారని దుయ్యబట్టారు. సమైక్య ఉద్యమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొంటున్నాయని, దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్, టీడీపీ నాయకులు పోలీసులను ఉసిగొల్పుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ డెరైక్షన్ మేరకే జిల్లా పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఉద్యమకారులపై బైండోవర్ కేసులు పెడుతున్నారన్నారు. కొందరిని పోలీసుస్టేషన్లకు తీసుకెళ్లి చావబాదుతున్నారని తెలిపారు. ‘సమైక్యాంధ్ర కోసం మేము జైలుకెళ్లడమే కాదు.. ప్రాణత్యాగానికైనా సిద్ధమే. కేసులు, బైండోవర్లకు భయపడే ప్రసక్తే లేదు. జిల్లా పోలీసుల తీరు బ్రిటీష్ వారిని గుర్తుకు తెస్తోంది. అసలు వీరు పోలీసులా లేక కాంగ్రెస్ తొత్తులా?’ అని కాపు మండిపడ్డారు.
ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 12లోగా కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. శంకరనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాగా.. అందుకు తోడ్పాటు అందించింది టీడీపీ అని అన్నారు. సమైక్యాంధ్రపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రానికి వెంటనే లేఖ రాయాలని సూచించారు. పార్టీ సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత మాట్లాడుతూ ఇటలీ నుంచి వచ్చిన సోనియా రాష్ట్ర ప్రజలను విడదీసి పాపం మూటగట్టుకున్నారన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ సమైక్య ఉద్యమాన్ని చీలికలు, పేలికలు చేయడానికే అధికార పార్టీ నేతలు ప్రత్యేక రాయలసీమ వాదాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు.
ఇదంతా కాంగ్రెస్ పెద్దల డెరైక్షన్‌లోనే జరుగుతోందన్నారు. పార్టీ నేత తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ సమైకాంధ్రపై నోరుమెదపని చంద్రబాబు.. సీమాంధ్రలో కొత్త రాజధాని కోసం రూ.4 లక్షల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ రంగంపేట గోపాల్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగాల రమేష్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, జిల్లా ముఖ్య అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, నాయకులు షెక్షావలి, లింగాల శివశింకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కేసులతో ఉద్యమాన్ని అణచలేరు
Published Thu, Aug 8 2013 3:05 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement