Member Legislative Assembly (MLA)
-
వారిపై అనర్హత సబబే
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలోని టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ అనర్హులుగా ప్రకటించటాన్ని మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్ సత్యనారాయణన్ గురువారం ఈ తీర్పు వెలువరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లుగా గత ఏడాది గవర్నర్‌కు 19 మంది ఎమ్మెల్యేలు లేఖ అందజేశారు. అయితే వారిలో ఒకరు తిరిగి పళనిస్వామి పక్షాన చేరగా మిగతా 18 మందిపై స్పీకర్ గత ఏడాది సెప్టెంబర్‌లో అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేటుపడిన ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. స్పీకర్ నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోజాలదని జూన్ 14వ తేదీన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరాబెనర్జీ తీర్పు చెప్పగా, జస్టిస్ సుందర్ మాత్రం స్పీకర్ నిర్ణయం చెల్లదని పేర్కొన్నారు. భిన్నమైన తీర్పులు వెలువడడంతో ఈ కేసు జస్టిస్ సత్యనారాయణన్ ముందుకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్ సత్యనారాయణన్ స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. స్పీకర్ తీసుకునే నిర్ణయాలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. దినకరన్ వర్గానికి షాక్ కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వెలువడటంతో అధికార అన్నాడీఎంకే శ్రేణులు ఆనందంలో మునిగిపోగా, టీటీవీ దినకరన్ వర్గం షాక్‌కు గురైంది. హైకోర్టు తీర్పు వెలువడగానే ఏఐఏడీఎంకే పార్టీ నేతలు మిఠాయిలు పంచుకుని సందడి చేశారు. పలువురు నేతలు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి అభినందించారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం, గెలుపు ఖాయమని సీఎం పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, మరో ఎమ్మెల్యే మరణంతో ఏర్పడిన రెండు అసెంబ్లీ స్థానాలను కలుపుకుని మొత్తం 20 నియోజకవర్గాల్లో వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుచేసే విషయం, తదుపరి కార్యాచరణపై 18 మంది ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని టీటీవీ దినకరన్ తెలిపారు. ఉప ఎన్నికలు వస్తే పోటీకీ తాము సిద్ధమని దినకరన్ ప్రకటించారు. 2019లోనే అసెంబ్లీకి ఎన్నికలా? మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో కీలక మార్పులు జరగనున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 234 కాగా, జయలలిత, కరుణానిధి మరణంతో సభ్యుల సంఖ్య 232కి పడిపోయింది. ఒక సభ్యుడిని స్పీకర్‌గా పక్కనపెడితే 231 అవుతుంది. 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను కోర్టు అనర్హులుగా ప్రకటించడంతో మిగిలింది 213 మంది. 20 సీట్లకు ఎన్నికలు జరిగే వరకు బలనిరూపణకు కావాల్సిన ఎమ్మెల్యేలు 107 మంది. పళనిస్వామికి కచ్చితంగా మద్దతు పలికేది 102 మంది ఎమ్మెల్యేలే అని పరిశీలకుల అంచనా. ఏఐఏడీఎంకేలో ఎంతమంది తిరుగుబాటుదారులున్నారో స్పష్టత లేదు. ఇప్పటికిప్పుడు బలపరీక్ష జరిగితే పాలకపక్షం నెగ్గడంపైనా అనుమానాలున్నాయంటున్నారు. బలపరీక్షలో స్పష్టత రాని పరిస్థితుల్లో అసెంబ్లీ రద్దు ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలోని చాలామంది నేతలు ఆశిస్తున్న విధంగా 2019 లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే, తక్షణం బలనిరూపణలో పళని స్వామి ప్రభుత్వం నెగ్గినా ఖాళీ అయిన 20 అసెంబ్లీ స్థానాల ఎన్నికల తర్వాత బలాబలాలు మళ్లీ మారే అవకాశం ఉంది. ఉప ఎన్నికల అనంతరం అసెంబ్లీలో స్పీకర్‌ను మినహాయిస్తే 233 మంది సభ్యులుంటారు. అప్పుడు మెజారిటీకి 117 సీట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం 97 మంది సభ్యుల బలమున్న డీఎంకే.. ఉప ఎన్నికల్లో అన్ని సీట్లనూ గెలుచుకోగలిగితే మెజారిటీ రావచ్చు. లేదంటే మెజారిటీకి దగ్గరిగా వెళ్లొచ్చు. ఆర్కే నగర్లో దినకరన్ విజయం ద్వారా జయలలితకు బలమైన వారసుడిగా ప్రజలు గుర్తించినట్టయింది. డీఎంకే గెలవకపోయినా లేదం టే దినకరన్, అతని అనుచరులు తమ సీట్లను దక్కించుకోగలిగినా పళని ప్రభుత్వం ప్రమాదంలో పడ్డట్టే. ఉప ఎన్నికలు జరిగే 20 సీట్లు అన్ని పార్టీల మధ్య చీలినా కూడా రాజకీయ అనిశ్చితి వెంటాడే ప్రమాదముంది. ఇది కూడా తమిళనాట సత్వర ఎన్నికలకు దారితీస్తుంది. 20 సీట్లకు జరిగే ఉప ఎన్నికలను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్, కమల్‌హాసన్‌లు కూడా ప్రభావితం చేయనున్నారు. -
ఆ 27 మంది ఆప్ ఎమ్మెల్యేలు అర్హులే
న్యూఢిల్లీ: లాభదాయక పదవుల వివాదం నేపథ్యంలో ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేలు అర్హులేనని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం ఢిల్లీలోని అధికార ఆప్‌కి ఊరట లభించినట్లయింది. లాభదాయక పదవుల్లో ఉన్న కారణంగా ఆప్‌కి చెందిన 27 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ అందిన దరఖాస్తును రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించారు. 27 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఢిల్లీలోని సర్కారు దవాఖానల్లో ‘రోగి కల్యాణ్ సమితి’ చైర్మన్లుగా నియమిస్తూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం..ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటయ్యే ‘రోగి కల్యాణ్ సమితి’కి ఆప్రాంత ఎమ్మెల్యే చైర్మన్‌గా ఉంటారు. ప్రతి సమితికి ఏడాదికి రూ.3 లక్షల వరకు గ్రాంట్‌ను ప్రభుత్వం ఇస్తుంది. -
ఎమ్మెల్యేల అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత కేసులో పళనిస్వామి ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విధించిన అనర్హత వేటును మద్రాస్ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 232 మంది సభ్యులు ఉండగా.. తాజా హైకోర్టు తీర్పుతో సభ్యుల సంఖ్య 214కు పడిపోయింది. ప్రస్తుతం పళనిస్వామి ప్రభుత్వానికి 110 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో ప్రభుత్వ మనుగడకు కావాల్సిన మెజారిటీ పళని ప్రభుత్వానికి దక్కినట్టు అయింది. అయితే, ఈ 18 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే.. వాటి ఫలితాల ఆధారంగా సమీకరణాలు మారిపోయే అవకాశముంది. తన మద్దతుదారులైన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. అన్నాడీఎంకే పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించటంతోపాటు.. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ఉద్దేశంతో గవర్నర్‌ను కలిశారన్న కారణంగా తమిళనాడు స్పీకర్ ధన్పాల్ గతేడాది 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. అయితే, వీరిపై అనర్హత వేటు కేసులో గతంలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించింది. దీంతో విచారణను మూడో న్యాయమూర్తికి బదలాయించారు. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం తీర్పు వెలువరించారు. దీంతో మూడో న్యాయమూర్తి ఈ కేసును విచారించి.. అనర్హత వేటును సమర్థించడంతో ఎమ్మెల్యేల బహిష్కరణ ఖాయమైంది. -
కాంగ్రెస్.. ఫస్ట్ బ్యాచ్
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఎన్నికల సంగ్రామం ఊపందుకుంటోంది.. అధికార టీఆర్ఎస్కు దీటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తోంది. రొటీన్‌కు భిన్నంగా ఆ పార్టీ ఢిల్లీ పైరవీలను పక్కనపెట్టి గెలుపు గుర్రాల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గడిచిన మూడు, నాలుగేళ్లుగా ప్రజలతో కలిసి ఉంటున్న వారికి టికెట్లు ఖరారు చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి తొలి జాబితాలో 8 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదిత జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ తీసుకెళ్లారు. ఈ జాబితాపై ఈనెల 12న ఏఐ సీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించనున్నట్లు తెలిసింది. అనంతరం ఒక టి, రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షతో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో భారీగా దెబ్బతింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ స్థాయి నుంచి దిగువ శ్రేణి నాయకత్వం వరకు కాంగ్రెస్ కండువాను పక్కన పడేసి గులాబీ దళంతో చేరిపోయారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని నడిపించే నాయకులు లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో అంపశయ్య మీదున్న పార్టీకి జీవిగంజి పోస్తూ కొంతమంది నేతలు ప్రజ ల మధ్యే ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే గతంతో పోలిస్తే జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్ తగాదాలు తక్కువగానే ఉండటంతో ఏకాభిప్రాయం ఉన్న నియోజ వర్గాల అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తూ తొలి జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ సారి దొంతికే అవకాశం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి టికెట్ ఖారారు చేసినట్లు తెలిసింది. నర్సంపేట నుంచి గత సాధారణ ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మొదటి నుంచి కాంగ్రెస్‌వాదిగా ఉన్న దొంతికి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చి జేఏసీ నాయకుడు కత్తి వెంకటస్వామికి టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యేలకు మరో అవకాశం.. ములుగు నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ నుంచి రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్కకు టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కోయ సామాజిక వర్గానికి చెంది న సీతక్కకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టుం ది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటీకీ ఆమె మొదటి నుంచి ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇక భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి పేరు ఖరారైనట్లే తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2014 ఎన్నికల్లో మధుసూదనాచారి చేతిలో ఓటమిపాలయ్యా రు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. ఆయన ఇదే నియోజకవర్గం నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అరూరి రమేష్ చేతిలో ఓడిపోయారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌కు మాజీ మంత్రులు జనగామ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తొలుత ఆయన కోడలు వైశాలి పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో పొన్నాల పేరు ఖరారు చేసినట్లు సమాచారం. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం టికెట్ మాజీ మంత్రి గుండె విజయరామారావుకు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో సిద్ధిపేట ఎంపీగా పనిచేసిన ఆయన 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున స్టేషన్ ఘన్పూర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దివంగత సీఎం వైఎస్ ప్రభుత్వంలో పౌర సరఫరా శాఖా మంత్రిగా పని చేశారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఒకరు తొలిసారి.. ఇంకొకరు మలిసారి.. పాలకుర్తి నియోజకవర్గం నుంచి జంగా రాఘవరెడ్డి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. జంగా రాఘవరెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్నారు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి డాక్టర్ రామచంద్రునాయక్ మరోసారి ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ఆయన సూర్యాపేటలో ఒక ప్రైవేటు నర్సింంగ్ హోం నిర్వహిస్తున్నారు. 2014లో టీడీపీ తరఫున ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. -
గజ్వేల్ నుంచి కేసీఆర్.. 105 మంది అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్ : 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు... భద్రాద్రి కొత్తగూడెం: 1) భద్రాచలం : డా: తెల్లం వెంకట రావ్ 2) పినపాక : పాయమ్ వెంకటేశ్వర్లు 3) అశ్వారావు పేట : తాటి వెంకటేశ్వర్లు 4) ఇల్లెందు : కోరమ్ వెంకయ్య 5) కొత్తగూడెం : జలగం వెంకట్ రావు ఖమ్మం : 6) ఖమ్మం: పువ్వాడ అజయ్ కుమార్ 7) పాలేరు : తుమ్మల నాగేశ్వర్ రావు 8) వైరా : బానోత్ మదన్ లాల్ 9)మధిర : లింగాల కమల్‌రాజ్ 10) సత్తుపల్లి : పిడమర్తి రవి మహబూబాబాద్ : 11) మహబూబాబాద్ : బానోత్ శంకర్ నాయక్ 12) దోర్నకల్ : డీఎస్ రెడ్య నాయక్ వరంగల్ (రూరల్) : 13) పరకాల : చల్లా ధర్మా రెడ్డి 14) నర్సంపేట్ : పెద్ది సుదర్శన్ రెడ్డి 15) వర్థన్నపేట : అరూరి రమేష్ వరంగల్ ( అర్బన్) : 16) వరంగల్ వెస్ట్ : దాస్యం వినయ్ భాస్కర్ జయశంకర్ భూపాలపల్లి : 17) భూపాలపల్లి : ఎస్. మధుసూదనాచారి 18) ములుగు : అజ్మీరా చందులాల్ జనగాం : 19) జనగాం : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి 20) స్టేషన్ ఘన్పూర్ : డా. తాటికొండ రాజయ్య 21) పాలకుర్తి : ఎర్రబెల్లి దయాకర్ రావ్ నల్గొండ : 22) నల్గొండ : కంచర్ల భూపాల్ రెడ్డి 23) మిర్యాలగూడ : ఎన్. భాస్కర్ రావ్ 24) నాగార్జున సాగర్ : నోముల నర్సింమయ్య 25) దేవరకొండ : రమావత్ రవీంద్ర కుమార్ 26) మునుగోడు : కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 27)నక్కిరేకల్ : వేముల వీరేశం సూర్యాపేట్ : 28) సూర్యాపేట్ : గుంతకండ్ల జగదీష్ రెడ్డి 29) తుంగతుర్తి : గ్యాదారి కిషోర్ కుమార్ యాదాద్రి భువనగిరి : 30) ఆలేరు : గొంగిడి సునీత 31) భువనగిరి : పైల్ల శేఖర్ రెడ్డి నిజామాబాద్ : 32) నిజామాబాద్ అర్బన్ : గణేష్ బీగాల 33) నిజామాబాద్ రూరల్ : బాజిరెడ్డి గోవర్థన్ 34) ఆర్మూర్ : ఆశన్నగరి జీవన్ రెడ్డి 35) బాల్కొండ : వేముల ప్రశాంత్ రెడ్డి 36) బోదన్ : షకీల్ అహ్మద్ కామారెడ్డి : 37) బాన్స్వాడా : పోచారం శ్రీనివాస రెడ్డి 38) కామారెడ్డి : గంప గోవర్థన్ 39) జుక్కల్ : హనుమంతు షిండే 40) యాల్లారెడ్డి : ఏనుగు రవీందర్ రెడ్డి అదిలాబాద్ : 41) అదిలాబాద్ : జోగు రామన్న 42) బోధ్ : రాథోడ్ బాబు రావ్ 43)ఖానాపూర్ : రేఖా నాయక్ అసిఫాబాద్ : 44) అసిఫాబాద్ : కోవ లక్ష్మీ 45) సిర్పూర్ కాగజ్ నగర్ : కోనేరు కోనప్ప నిర్మల్ : 46) నిర్మల్ : అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి 47) ముధోల్ : జి. విట్టల్ రెడ్డి మంచిర్యాల : 48) మంచిర్యాల : నాదిపెల్లి దివాకర్ రావ్ 49) బెల్లంపల్లి : దుర్గం చిన్నయ్య 50 ) చెన్నూర్ : బాల్క సుమన్ కరీంనగర్ : 51) కరీంనగర్ : గంగుల కమలాకర్ 52) హుజూరాబాద్ : ఈటెల రాజేందర్ 53) మానకొండూర్ : రసమయి బాలక్రిష్ణ సిరిసిల్ల : 54) సిరిసిల్ల : కేటీ రామారావ్ 55) వేములవాడ : చెన్నమనేని రమేష్ జగిత్యాల : 56) జగిత్యాల : డా. ఎమ్. సంజయ్ కుమార్ 57) కోరుట్ల : కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్ 58) ధర్మపురి : కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి : 59) పెద్దపల్లి : దాసరి మనోహర్ రెడ్డి 60) మంథని : పుట్ట మధుకర్ 61) రామగుండం : సోమారపు సత్యనారాయణ సిద్దిపేట : 62) సిద్దిపేట : హరీశ్‌రావు 63) దుబ్బాక : సోలిపేట రామాలింగారెడ్డి 64) గజ్వేల్ : కేసీఆర్ 65) హుస్నాబాద్ : సతీష్‌కుమార్ మెదక్ : 66) మెదక్ : పద్మాదేవేందర్ రెడ్డి 67) నర్సాపూర్ : చిలుముల మదన్ రెడ్డి సంగారెడ్డి : 68) సంగారెడ్డి : చింతా ప్రభాకర్ 69) నారాయణఖేడ్ : భూపాల్‌రెడ్డి 70) ఆందోల్ : చంటి క్రాంతి కిరణ్ 71) పటాన్చెరు : గూడెం మహిపాల్ రెడ్డి మహబూబ్‌నగర్ : 72) మహబూబ్‌నగర్ : శ్రీనివాస్‌గౌడ్ 73) జడ్చెర్ల : లక్ష్మారెడ్డి 74) దేవరకద్ర : ఆలే వెంకటేశ్వర్‌రెడ్డి 75) నారాయణపేట్ : రాజేందర్‌రెడ్డి 76) మక్తల్ : చిట్టం రామ్ మోహన్ రెడ్డి నాగర్‌కర్నూల్ : 77) నాగర్‌కర్నూల్ : మర్రి జనార్ధన్‌రెడ్డి 78) కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు 79) అచ్చంపేట : గువ్వల బాలరాజ్ 80) కల్వకుర్తి : జి. జైపాల్ యాదవ్ వనపర్తి : 81) వనపర్తి : సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి గద్వాల్ : 82) గద్వాల్ : బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి 83) ఆలమూర్ : వల్లూర్ మల్లెపోగు అబ్రహం వికారాబాద్ : 84) పరిగి : కోప్పుల మహేష్ రెడ్డి 85) తాండూర్ : పట్నం మహేందర్ రెడ్డి 86) కొడంగల్ : పట్నం నరేందర్ రెడ్డి రంగారెడ్డి : 87) షాద్‌నగర్ : అంజయ్య యాదవ్ 88) రాజేంద్రనగర్ : ప్రకాష్ గౌడ్ 89) మహేశ్వరం : తీగల కృష్ణారెడ్డి 90) ఇబ్రహింపట్నం : మంచిరెడ్డి కిషన్ రెడ్డి 91)శేరిలింగంపల్లి: అరికెపూడి గాంధీ 92) ఎల్బీనగర్ : మద్దగోని రామ్మోహన్ గౌడ్ 93) చేవెళ్ల : కాలె యాదయ్య మల్కాజ్గిరి : 94) కుత్బుల్లాపూర్: వివేకానంద 95) కూకట్పల్లి : మాధవరం కృష్ణారావు 96) ఉప్పల్ : సుభాష్ రెడ్డి హైదరాబాద్ : 97) సికింద్రాబాద్ : పద్మారావు 98) సనత్ నగర్ : తలసాని శ్రీనివాస్ యాదవ్ 99) కంటోన్మెంట్ : సాయన్న 100) జూబ్లీహిల్స్ : మాగంటి గోపినాథ్ 101) యాకత్‌పూరా: సామ సుందర్ రెడ్డి 102) చాంద్రాయణగుట్ట : ఎం. సీతారాం రెడ్డి 103) కార్వాన్ : జీవన్ సింగ్ 104) బహదూర్‌పురా : ఇయాకత్ అలీ 105) నాంపల్లి : మునుకుంట్ల ఆనంద్ గౌడ్ -
ముందస్తు హడావుడి
సాక్షి, వరంగల్ రూరల్: అసెంబ్లీ రద్దు వార్తల నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యేలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ నెల 6న అసెంబ్లీని రద్దు చేస్తే బుధవారం చివరి రోజు కావడంతో అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలవంటి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడిపారు. బుధవారం రాత్రి వరకు పాల్గొని అధికార కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు జోరుగా శంకుస్థాపనలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్మించిన పలు భవనాలను సైతం ప్రారంభించారు. రూ.111 కోట్ల పనులకు శంకుస్థాపనలు.. జిల్లాలో పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో ఒకే రోజు రూ.111.04 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేలు అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ కార్యకర్తలను సమయాత్తం చేశారు. పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి బుధవారం ఒక్కరోజే రూ.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరకాలలో శంకుస్థాపనలు.. దామెర మండలంలో రూ.12 కోట్లతో దామెర క్రాస్ రోడ్డు నుంచి పరకాల రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు రూ.1.25 కోట్లతో నూతన తహసీల్దార్ భవన నిర్మాణం ఆత్మకూరు మండలంలో రూ.20 లక్షలతో కమ్యూనిటీ భవనాలు గీసుకొండ మండలం మచ్చాపుర్ నుంచి లక్ష్మీపురం వయా ఎలుకుర్తి రోడ్డు విస్తరణ పనులు. పరకాల మండలంలో రూ.1.25 కోట్లతో నూతన ఆర్డీఓ కార్యాలయ నిర్మాణం. రూ.1.25 కోట్లతో పరకాల తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం నడికూడ మండలంలో రూ.1.25 కోట్లతో తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం. వర్ధన్నపేటలో.. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ బుధవారం ఒక్కరోజే రూ.75.04 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.11.5 కోట్లతో పర్వతగిరి, నందనం, ఇల్లందలో చెక్‌డ్యాం పనులు. వర్ధన్నపేట మండలంలో రూ.2.60 కోట్లతో కోనారెడ్డి చెరువు పునరుద్ధరణ పనులు. పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు, హసన్‌పర్తిలో ఎస్సీ, ఎస్టీ కాలనీలో రూ.44 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు.. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో రూ.1.30 కోట్లతో మజీదుల అభివృద్ధి పనులు. వర్ధన్నపేట మండలంలో రూ.15 కోట్లతో కట్య్రాల నుంచి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన. ప్రారంభోత్సవాలు.. రూ.1 కోటితో నిర్మించిన వర్ధన్నపేట మండల ప్రజా పరిషత్ నూతన భవనంను ప్రారంభించారు. నర్సంపేటలో.. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బుధవారం ఖానాపురం మండలంలో రూ.15 లక్షలతో నిర్మించిన మూడు కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించారు. ప్రతిపాదనలు ఆయా నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో మిగిలిన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను చీఫ్ ప్లానింగ్ కార్యాలయంలో అందించారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన పీఏలు ప్రతిపాదనలను సీపీఓకు అందించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు కలెక్టర్ హరితకు అందించారు. -
కదిలింది గులాబీ దండు
నిజామాబాద్‌అర్బన్: దారులన్నీ అటు వైపే.. వాహనాలన్నీ ‘ప్రగతి’ సభ వైపే.. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ బిజీబిజీగా కనిపించాయి. గులాబీ జెండాల రెపరెపలతో సందడిగా మారాయి. టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కంగరకొలాన్లో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారు. వందలాది వాహనాల్లో వారంతా తరలి వెళ్లడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. 1.10 లక్షల మంది తరలింపు.. ప్రగతి నివేదన సభకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 1.10 లక్షల మంది తరలి వెళ్లినట్లు అంచనా. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 53 వేల మంది సభకు వెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులతో పాటు ఇతర వాహనాల్లో ఉదయం నుంచే బయల్దేరి వెళ్లారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యలు, రాష్ట్ర నాయకులు జన సమీకరణ చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి 88 ఆర్టీసీ బస్సులు, 90 ప్రైవేట్ బస్సులు, 240 వరకు కార్లలో 8,700 మంది వరకు తరలివెళ్లారు. బాల్కొండ నుంచి 687 వాహనాల్లో 12,465 మంది, బోధన్ నుంచి 450 వాహనాల్లో 9,700 మంది, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో 425 వాహనాల్లో 11,400 మంది, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో 750 వాహనాల్లో 12,500 మందిని తరలించారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి 16 వేలు, బాన్సువాడ నుంచి 12 వేలు, ఎల్లారెడ్డి నుంచి 12 వేలు, జుక్కల్ నుంచి 11 వేల మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులతో పాటు అద్దె వాహనాల్లో తరలి వెళ్లారు. మొత్తం కామారెడ్డి జిల్లా నుంచి 51 వేల మంది వరకు ప్రగతి నివేదన సభకు బయల్దేరి వెళ్లారు. రహదారులన్నీ గులాబీమయం.. జన సమీకరణ బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో ఎమ్మెల్యేలు రెండు, మూడ్రోజులుగా తమ నియోజకవర్గాల్లోనే తిష్టవేసి జన సమీకరణకు సర్వశక్తులు ఒడ్డారు. జనాన్ని తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 508 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. అలాగే, ప్రైవేట్ వాహనాలు, ట్రాక్టర్లు, సుమోలు అద్దెకు తీసుకుని జనాలను తరలించారు. 44వ జాతీయ రహదారి గులాబీమయంగా మారింది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వాహనాలతో హైవే కిక్కిరిసింది. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రధాన ప్రాంతాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద సీపీ కార్తికేయ ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షించారు. హైవేతో పాటు జిల్లాకు అనుసంధామున్న రాష్ట్ర రహదారులు, వివిధ మండలాల నుంచి జిల్లాకు.. అక్కడి నుంచి జాతీయ రహదారికి వెళ్లేందుకు రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. ఒక్కో ప్రధాన ప్రాంతం వద్ద సీఐ స్థాయి అధికారి, ట్రాఫిక్ పోలీసులను నియమించారు. -
ప్రగతి నివేదన సభకు తరలిన టీఆర్ఎస్ శ్రేణులు
భూపాలపల్లి (వరంగల్): జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రగతి నివేదన సభకు భారీగా తరలి వెళ్లారు. శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి పరోక్షంగా, మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే పుట్ట మధు వాహనాలను పంపించి జనాల తరలింపులో సఫలీకృతమయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి సుమారు 100 ఆర్టీసీ బస్సుల్లో 6 వేల మంది, 90 డీసీఎంలలో 5 వేలు, 75 స్కూల్ బస్సుల్లో 3 వేలు, 60 ట్రాక్టర్లలో 1,500, వంద కార్లలో 700 మందిని ప్రగతి నివేదన సభకు తరలించారు. అలాగే మంత్రి చందూలాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను భారీ మొత్తంలోనే తరలించారు. నియోజకవర్గం నుంచి 100 ఆర్టీసీ బస్సులు, 64 ప్రైవేట్ బస్సులు, 25 మినీ బస్సులు, 50 స్కూల్ బస్సులు, 49 డీసీఎంలు, 50 టెంపో టాక్సీలు, 151 టవేరా వాహనాల్లో సుమారు 18 వేల మందిని తరలించారు. అలాగే మంథని నియోజకవర్గంలోని కాటారం, మహముత్తారం, మల్హర్, మహదేవ్పూర్, పలిమెల మండలాల నుంచి 190 ప్రైవేట్ వాహనాలు, 20 స్కూల్, ప్రైవేట్ బస్సులతోపాటు ఇతర వాహనాల్లో సుమారు 3,500 మందిని ఎమ్మెల్యే పుట్ట మధు తరలించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 37,500 మంది ప్రగతి నివేదన సభకు తరలివెళ్లినట్లు సమాచారం. పోటాపోటీగా.. పనితీరు ఆధారంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందనే ప్రచారం టీఆర్ఎస్లో ఊపందుకోవడంతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రగతి నివేదన సభను సవాల్‌గా తీసుకున్నారు. ఒకరి కంటే ఒకరు పోటీగా వాహనాలను సమకూర్చి జనాలను తరలించారు. ప్రజాప్రతినిధులతో పాటు టికెట్లు ఆశిస్తున్న వారు సైతం తమ బలాన్ని చూపించుకోవడం కోసం తాపత్రయపడ్డారు. అనుకూలంగా ఉన్న మండలాలు, గ్రామాలకు వాహనాలను పంపించి టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలను తరలించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో శాసన సభాపతి మధుసూదనాచారితోపాటు గండ్ర సత్యనారాయణరావు కూడా సభకు ప్రజలను తరలించినట్లు తెలిసింది. ఇబ్బందుల్లో ప్రయాణికులు.. సభ కారణంగా సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జిల్లాలో ఏకైక భూపాలపల్లి బస్‌డిపోలో 81 బస్సులు ఉండగా అందులో 71 బస్సులు సభకు వెళ్లాయి. -
అసమ్మతి సెగ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అధికార టీఆర్ఎస్లో అసంతృప్తులు భగ్గుమంటున్నారు. కొద్ది రోజులుగా రగులుతున్న అసమ్మతి సెగ తిరుగుబాటుకు దారి తీసింది. తెలంగాణ ఉద్యమానికి, గులాబీ దళపతి కేసీఆర్‌కు సెంటిమెంట్ జిల్లాలో మంగళవారం ఒకేరోజు మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతుండగా.. మరోవైపు ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమనడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణపై ప్రత్యర్థులు బాహాటంగా తిరుగుబాటు చేసి నిరసనలు తెలపగా, వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్ రమేష్‌బాబుపై ఆయన వ్యతిరేకవర్గం వె య్యి మందితో సమావేశం నిర్వహించింది. చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శం కుస్థాపన సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త, సింగిల్‌విండో డైరెక్టర్ గడ్డం చుక్కారెడ్డి కొబ్బ రికాయ కొట్టేందుకు సిద్ధం కాగా ఎమ్మెల్యే బొడిగె శోభ ఆయనను అడ్డుకుని వెనక్కి నెట్టేయడం వివాదాస్పదమైంది. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్‌ల సమక్షంలో జరిగిన ఈ ఘటన పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రామగుండంలో ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం భేటీ.. రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ వ్యతిరేకులు ఏకమయ్యారు. ఎన్టీపీసీ రామగుండం కృష్ణానగర్‌లోని టీవీ గార్డెన్లో సోమారపు అసమ్మతి నేతలంతా మంగళవారం సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ గ్రూప్ రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవల తనపై అవిశ్వాసం పెట్టించి పదవి నుంచి దింపేసిన ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ వ్యతిరేక శక్తులను ఏకంగా చేసే పనిలో మాజీ మేయర్ కొంకటి లక్ష్మినారాయణ ఉన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న కోరుకంటి చందర్, కందుల సంధ్యారాణితోపాటు మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, పార్టీ నాయకులు పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సోమారపు సత్యనారాయణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నేరవేర్చలేదని, ఉద్యమ సమయంలో పార్టీలో పని చేసిన నాయకులను, కార్యకర్తలను పూర్తిగా విస్మరించి, తన చెప్పు చేతల్లో ఉన్న కొంతమందితోనే రాజకీయం చేస్తున్నారని ఈ సందర్భంగా సోమారపుపై ధ్వజమెత్తారు. ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించడంతోపాటు డివిజన్ల వారీగా సమావేశాల నిర్వహణకు, కార్యాచరణకు సిద్ధం కావడం టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. వేములవాడలో ఎమ్మెల్యే రమేశ్‌కు వ్యతిరేకంగా.. వేములవాడ నియోజకవర్గంలో అధికార పార్టీలో అసమ్మతి సెగ పతాక స్థాయికి చేరుకుంది. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు వ్యతిరేక వర్గం వెయ్యి మంది కార్యకర్తలతో మంగళవారం సమావేశమైంది. ఎమ్మెల్యే రమేశ్‌బాబును తప్పించడమే లక్ష్యంగా ఆపార్టీకి చెందిన దాదాపు వెయ్యి మందికిపైగా కార్యకర్తలు కలసి అదే వేదిక నుంచి బాహాటంగా ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని, జెండాలు మోసి, పార్టీ కోసమే పనిచేస్తున్న తమపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే బరి నుంచి రమేశ్‌బాబును తప్పించాలని భీష్మ ప్రతిజ్ఙ చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే రమేశ్ బాబు స్వచ్ఛందంగా వైదొలగాలని కూడా డిమాండ్ చేశారు. వేములవాడలో పార్టీ నాయకత్వం మార్పు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. మంత్రి, ఎంపీల సమక్షంలో చొప్పదండిలో గలాటా.. చొప్పదండిలో సీనియర్ నేతల సమక్షంలోనే పార్టీ నాయకులు వాదులాడుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మంగళవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ ముందే ఎమ్మెల్యే శోభ, మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త చుక్కారెడ్డి వాగ్వాదానికి దిగారు. ఎంపీ వినోద్ సూచన మేరకు ఫైర్ స్టేషన్ భవన ప్రారంభోత్సవం వద్ద చుక్కారెడ్డి టెంకాయ కొడుతుండగా ఎమ్మెల్యే శోభ అడ్డుకుని వెనక్కి నెట్టారు. దీంతో అక్కడ కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి రాజేందర్, ఎంపీ వినోద్ వారించడంతో ఎమ్మెల్యే తమ అనచరులతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని మంత్రితో చుక్కారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. -
రైతుల కోసం ఆత్మాహుతికైనా సిద్ధం
కడప కార్పొరేషన్: జిల్లాలోని రైతులకు ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్, పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రత్యక్ష ఆందోళనను ఉధృతం చేస్తామని, అవసరమైతే ఆత్మాహుతికైనా సిద్ధపడతామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్నా, రైతాంగాన్ని ప్రభుత్వం ఏ రకంగానూ ఆదుకోవడం లేదన్నారు.దీనివల్ల బాబు వస్తే కరువు మామూలే అన్న పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్, పంట నష్టపరిహా రం ఇవ్వాలని అధికారులు లెక్కలు వేసి పంపిస్తే ప్రభుత్వం ఇంతవరకూ మంజూరు చేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ఎందుకు మొండి బకాయిలుగా మార్చుతున్నారు, రైతులు ఏం పాపం చేశారని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విలాసాలు, జల్సాలకు చార్టెడ్ ఫ్లైట్లు, ఎయిర్క్రాఫ్టŠస్లో విదేశీ టూర్లకు ఉన్న డబ్బులు రైతులకు ఇవ్వడానికి లేవా అని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ ఇన్సూరెన్స్ కార్యాల యం ఎదుట వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నా చేస్తే కొంత బీమా ఇచ్చారని, మిగిలిందంతా పెండింగ్‌లో ఉంచారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం వారు కలెక్టర్ హరికిరణ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి న్యా యం చేయాలని కోరారు.ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మాసీమబాబు, అఫ్జల్ఖాన్, తుమ్మలకుంట శివశంకర్, రాచమల్లు రవిశంకర్‌రెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డి, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, రైతు విభాగం కడప మండల అధ్యక్షుడు ఎం. రాజగోపాల్‌రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు చల్లా రాజశేఖర్, నా గేంద్రారెడ్డి, సీహెచ్ వినోద్, వేణుగోపాల్‌నాయక్,నారుమాధవ్, గురుమోహన్, విజయ్‌ప్రతాప్‌రెడ్డి, షఫీ, ఖాజా, బోలా పద్మావతి, పత్తిరాజేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, రత్నకుమారి, క్రిష్ణవేణి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాతలపై కరుణ లేకపోవడం దారుణం జిల్లాలో తీవ్ర కరువుకాటకాల వల్ల 3లక్షలకు పైబడి ఎకరాల్లో పంట సాగుచేయలేదు. జిల్లాలోని 51 మండలాను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం అన్నదాతలకు ఎలాంటి సాయం చేయలేదు. కోస్తాలో వరదల వల్ల పంట నష్టపోయిన వారికి హెక్టారుకు 26వేల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించిన సీఎం, కరవు వల్ల నష్టపోయిన రైతులకు ఎలాంటి సాయం ప్రకటించకపోవడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి వల్లే 2012–13 రబీ శనగ పంటకు సంబంధించి 3వ విడతగా రావాల్సిన రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ రాలేదు. 2014 రబీలో రుణాలు రీషెడ్యూల్ చేసుకొని రైతులకు రూ.13.69కోట్ల బీమా పెండింగ్‌లో ఉంటే ఇందులో కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5.50కోట్లు చెల్లించాలి. 2015 నాటి ఇన్పుట్ సబ్సిడీ ఈనాటికీ రాలేదు. 2010లో అరటి పంట నష్టపోతే ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు నుంచి జిల్లాలోని ప్రాజెక్టులకు నీరివ్వాలంటే ఎస్ఆర్బీసీకి 12వేల క్యూసెక్కులు విడుదల చేయాలి. – వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప మాజీ ఎంపీ రైతుల కష్టాలు సీఎం, మంత్రులకు పట్టలేదు జిల్లాలో లక్షలాదిమంది రైతులు కరువు బారిన పడ్డారు. ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టకుండా లంచాలు, కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తోంది. వైఎస్ ఐదున్నర సంవత్సరాల్లోనే లక్షా యాభైవేలకోట్లతో జలయజ్ఞం చేపట్టి కోటి ఎకరాలకు నీరందించాలని కలలుగన్నారు. ఎక్కడ కృష్ణానీరు, ఎక్కడ తుంగభద్ర ఆ నీటితో జిల్లాలో 8లక్షల ఎకరాల పారుదల జరగాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు దగ్గరా ఒక్క ఇటుక పేర్చలేదు. కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకోవడం తప్పా చేసిందేమీ లేదు. 2015, 2016 సంవత్సరాల్లో రుణాలు రీషెడ్యూల్ చేసుకోని రైతులకు ఇన్సూరెన్స్ రాలేదు. ఈ సమస్యలపై వందలసార్లు కలెక్టర్‌ను కలిశాం. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ వారితో సమావేశం ఏర్పాటు చేస్తామని ఇప్పటికి చేయలేదు. అధికార యంత్రాగం సీఎం సభలకు జనం తోలడానికే తప్పా మరెందుకూ పనికి రావడం లేదు. – పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పట్టెడన్నం పెట్టలేని స్థితిలో అన్నదాత అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత పట్టెడన్నం పెట్టలేని స్థితిలో ఉన్నాడు. ఇందుకు కారణం చంద్రబాబు ప్రభుత్వమే. గతంలో ఆయన 9ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు జిల్లా రైతులు వరినారు చూడలేదు. ఇన్సూరెన్స్ గూర్చి పార్లమెంటులో లేవనెత్తినా, హైదరాబాద్ ఏఐసీ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ ధర్నా చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. శ్రీశైలంలో నీరున్నా జిల్లాలోని ప్రాజెక్టులకు నీరు విడుదల చేయడం లేదు. ఎన్నికల కోసమే రూ.1000 నిరుద్యోగ భృతి ప్రకటించారు.– కె. సురేష్‌బాబు, వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కరవు పోవాలంటే బాబు దిగిపోవాలి నలభై ఏళ్లలో ఇలాంటి కరవు చూడలేదు. ధాతు కరువును మించిన కరువుగా ఉంది. ఐదు నియోజకవర్గాల్లో విత్తనమే పడలేదు. చెనిక్కాయ వేయడానికి అదును పోయింది. మనుషులకే తినడానికి తిండి లేదు, ఇక పశువులకు పశుగ్రాసం ఎక్కడినుంచి వస్తుంది. పాల ఉత్పత్తి 75 శాతం తగ్గిపోయింది. కుందూలో 24వేల క్యూసెక్కుల నీరు నెల్లూరుకు పోతోంది. ఆ నీటిని తెలుగుగంగకు మళ్లిస్తే 1.75లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు. నెల్లూరుపై ఉన్న ప్రేమ కడపపై లేదు. జిల్లాపై ఎందుకింత కక్షసాధిస్తున్నారో ఆర్థం కావడం లేదు. ముళ్లు కట్టె తీసుకొని పొడిస్తే తప్పా ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు.– ఎస్. రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే -
కేరళకు విరాళంగా వైఎస్సార్సీపీ శాసనసభ్యుల నెల వేతనం
సాక్షి, అమరావతి: వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ ప్రజలను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగస్టు నెల వేతనంతో పాటు అలవెన్సులను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. కేరళ రాష్ట్ర సీఎం సహాయ నిధి కోసం ఆ మొత్తం అందేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ డ్రాఫ్ట్ (డి.డి) తీసి దానిని వైఎస్సార్సీపీ శాసనసభ కార్యాలయం ఇన్చార్జి ఎస్.శివప్రసాద్‌కు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. చదవండి: కేరళకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం -
ఉత్తమ ఎమ్మెల్యేలకు పురస్కారాలు
భువనేశ్వర్ : ప్రజా సేవలో నిర్విరామ కృషి చేసిన పలువురు శాసనసభ్యులను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందించారు. రాష్ట్ర శాసనసభ సమావేశ మందిరంలో సన్మాన సభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల ప్రజలకు విశేష సేవలందించిన ఆయా శాసనసభ్యులను పలు పురస్కారాలతో ముఖ్యమంత్రి సత్కరించారు. మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, నూతనంగా ఎన్నికైన ఆయా శాసనసభ్యులకు మొత్తం మూడు విభాగాల్లో ఈ పురస్కారాలను ముఖ్యమంత్రి అందజేశారు. రాష్ట్రంలోని సుమారు 24 మంది శాసనసభ్యులకు ఈ గౌరవం దక్కడం విశేషం. ఉత్తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పండిత నీలకంఠ పురస్కారం, మాజీ ఎమ్మెల్యేలకు ఉత్కళ గౌరవ్ మధుసూదనదాస్ అవార్డు,కొత్త ఎమ్మెల్యేలకు ఉత్కళమణి గోపబంధు ప్రతిభా పురస్కారం ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ 3 విభాగాల కింద ఏటా ముగ్గురు చొప్పున 2009 నుంచి 2016 సంవత్సరం వరకు పనిచేసిన సుమారు 24 మంది ఉన్నత ఎమ్మెల్యేలను ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు పురస్కార కమిటీ తెలిపింది.పండిత నీలకంఠ పురస్కారం పొందిన వారిలోవిష్ణుచరణ్ దాస్(2009), డాక్టర్ అరుణ్‌కుమార్ సాహు(2010), ప్రభాత్‌రంజన్ బిశ్వాల్(2011), డాక్టర్ ప్రపుల్లమఝి(2012), అమరప్రసాద్ శత్పతి(2013), ప్రమీల మల్లిక్(2014), రణేంద్ర ప్రతాప్ స్వంయి(2015), డాక్టర్ రమేష్‌చంద్ర చౌ పట్నాయక్(2016) ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉత్కళ గౌరవ మధుసూదన్ దాస్ పురస్కారాన్ని మాజీ ఎమ్మెల్యేలు సురేంద్రనాథ్ నాయక్(2009), బింబాధర్ కుంవర్(2010), నిత్యానంద ప్రదాన్(2011), ఉమేష్‌చంద్ర స్వంయి(2012), విక్రమ్ కేశరి వర్మ(2013), రాజేంద్ర డొలాకియా(2014), సురేంద్రప్రసాద్ పరమాణిక్(2015), చక్రధర్ పాయిక్(2016)లు అందుకున్నారు. ఉత్కళ మణి గోపబంధు ప్రతిభా పురస్కారాన్ని కొత్త ఎమ్మెల్యేలు అయిన సంజయ్‌కుమార్‌దాస్ వర్మ(2009), ప్రీతిరంజన్ ఘొడై( 2010), సమీర్‌రంజన్ దాస్(2011), ప్రశాంత్‌కుమార్ ముదులి( 2012), విజయ్‌కుమార్ మహంతి(2013), డాక్టర్ రాజేశ్వరి పాణిగ్రాహి(2014), కెప్టెన్ దివ్యశంకర్ మిశ్రా(2015), ప్రదీప్ పురోహిత్(2016)లు అందుకున్నా రు.కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ప్రతిç ³క్ష నాయకుడు నరసింగ మిశ్రా, అసెంబ్లీ స్పీకర్ ప్రదీప్‌కుమార్ అమత్, శాసనసభ వ్యవహారాల విభాగం మంత్రి విక్రమ్‌కేశరి అరూఖ్, శాసనసభ్యులు, మంత్రులు పాల్గొన్నారు. -
నోటి దూల తగ్గించుకుంటే బాగుంటుంది
సాక్షి ప్రతినిధి, వరంగల్: వచ్చే సార్వత్రిక ఎన్నికల టికెట్ల వేట లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఆ ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. మరోసారి కూడా సీట్లు దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కచ్చితంగా టికెట్లు ఇస్తామని, సెప్టెంబర్‌లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఊగిసలాటలో ఉన్న జనగామ, మహబూబాబాద్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, తాటికొండ రాజయ్య కు టికెట్లు ఖాయమైనట్లేనని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కేసీఆర్‌కు సన్నిహితులుగా పేరున్న భూపాలపల్లి ఎమ్మెల్యే శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ములుగు ఎమ్మెల్యే, గిరిజన పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ భవిష్యత్ నిర్ణయాన్ని వారికే వదిలేసినట్లు సమాచారం. సిట్టింగ్‌లను పక్కనపెట్టి కొత్త వారికి టికెట్లు ఇస్తే... ఓటర్లకు తప్పుడు సంకేతాలు పో యే ప్రమాదం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సొంత బలం ఉంటుందని, ఆ బలానికి పార్టీ క్యాడర్ కలిస్తేనే సునాయాస విజయం దక్కుతుందని కేసీఆర్ యో చిస్తున్నారు. సిట్టింగ్‌లను కాదని కొత్తవారికి అవకాశం ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేల బలాన్ని వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమా దం ఉందనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. స్వయంకృతాపరాధమే.. నియోజవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరు, వారికి ఉన్న ప్రజాదరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వివిధ సంస్థల ద్వారా ఆరు సార్లు› సర్వే చేయి ంచారు. ఇవి కాకుండా పోలీస్ ఇంటెలిజెన్స్‌తో ఎమ్మెల్యేల వ్యక్తిగత ప్రవర్తన, ప్రజలతో మమే కం అవుతున్న తీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తొలి సర్వేలో కొంత వెనుకబడిన జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తర్వాత సర్వేలో పుంజుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు తేలింది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నోటి దురుసుతనంతోనే వెనుకబడుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికా రులు నివేదించారు. ముఖ్యంగా శంకర్‌నాయక్ గత హరితహారం సమయంలో మహిళా కలెక్టర్ చెయ్యి పట్టుకోవడం వివాదాస్పదమైంది. ఈ సంఘటన సాధారణ ప్రజలు, మహిళలను ఆగ్రహానికి గురి చేసింది. వెంటనే సీఎం కల్పించుకుని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని పంపించి శంకర్‌నాయక్‌తో కలెక్టర్‌కు క్షమాపణ చెప్పించడంతో ప్రజాగ్రహం కొంత మేరకు చల్లబడింది. ఆ వెంటనే మళ్లీ ఆయనపై కేసు నమోదు చేశారు. గిరిజన నాయకుడు కాబట్టే ఇందంతా చేస్తున్నారంటూ ప్రజలు కొంత మేరకు ఆయనపై సానుభూతి వ్యక్తం చేశారు. దీనికి తోడు నియోజకవర్గంలో ఆయనకు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానా యక్ కూతురు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత, ఎక్సైజ్ మాజీ అధికారి మోహన్‌లాల్ ప్రధాన పోటీగా ఉన్నారు. వారినుద్దేశించి శంకర్‌నాయక్ అక్కడక్కడ ఇషమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారనే సమాచారం ముఖ్యమంత్రి వద్ద ఉంది. నోరు అదుపులో పెట్టుకుంటే ఢోకా లేదు ! జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిది ఇదే తరహా వ్యవహారం. ఆయనకు నియోకవర్గంతో చెప్పుకోదగిన పోటీదారుడు లేడు. కానీ, ఆయన స్వయం కృతాపరాధంతోనే టికెట్‌కు ఎసరు తెచ్చుకున్నాడనే ప్రచారం ఉంది. మొదటి నుంచి భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నా రు. బతుకమ్మ కుంట ఆక్రమణ విషయంపై కలెక్టర్‌తో ఘర్షణ పడడంతో టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బ ందిగా మారింది. అంతకంటే ముందు కొమురవెల్లి మల్లన్న విగ్రహం మార్పు, వార్తలు రాశారనే కక్షతో ఓ జర్నలిస్టు ప్లాట్‌లో అడ్డంగా రోడ్డు వేసుకుంటూ వెళ్లడం తదితర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఓ భూమి గొడవ విషయంలో మహిళా వీఆర్వో ఇంటికి రాత్రి వేళ వెళ్లి తమకు అనుకూలంగా రికార్డులు చేయాలని అడగడం కూడా వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత వెంటనే ఆమెకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఇద్దరు నియోజకవర్గంలో బలమైన నాయకులే. కానీ, నోటి దురుసుతనం ముంచుతోందని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే వారికి ఢోకా లేదని ఇంటెలిజెన్స్ అధికారులు నివేదించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాజయ్యపై అంతుపట్టని సీఎం అంతరంగం స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భవిష్యత్‌పై ముఖ్యమంత్రి అంతరంగం ఇప్పటి వరకు ఎక్కడా బయటపడలేదు. భూపాలపల్లి ఎమ్మెల్యే, శాసన సభ స్పీకర్ మధుసుదనాచారిని పెద్దల సభకు పంపిస్తారనే ప్రచారం ఉంది. అయితే తుది నిర్ణయం ఆయన మీదనే ఆధారపడి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకే ఆయన మొగ్గు చూపుతున్నారు. కొండా దంపతుల కూతురు సుష్మితపటేల్, గండ్ర సత్యనారాయణరావు ఇక్కడి నుంచి ప్రధానంగా టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుసుదనాచారి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. విమర్శల నేపథ్యంలో నియోజకవర్గానికి తన కొడుకులను కొంతదూరం పెట్టి, అభివృద్ధి పనులను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వివాద రహితుడిగా ఆయనకు మంచి పేరే ఉంది. వేలాది మంది తన నియోజకవర్గ ప్రజలను అసెంబ్లీ సమావేశాలను చూపించడం ఆయనకు కొంత కలిసి వచ్చింది. ములుగుపై సీతారాం కన్ను ? ములుగు ఎమ్మెల్యే, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కొడుకు అజ్మీరా ప్రహ్లాద్‌కు టికెట్ అడిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీటుపై మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిస్తే ఎస్టీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలో చందూలాల్ సలహాలు, సూచనలను స్వీకరించి..కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
అత్యంత గోప్యంగా చంద్రబాబు చేయించిన సర్వే.. లీక్
‘అనంత’ టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేయించిన సర్వే నాయకుల్లో గుబులు రేపుతోంది. అత్యంత గోప్యంగా గత జూలైలో చేయించిన ఈ సర్వే రిపోర్టు లీక్ కావడంతో నాయకుల్లో కలవరం మొదలైంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో టిక్కెట్టు దక్కుతుందా? లేదా? అనే ఆలోచన మొదలైంది. 14 అసెంబ్లీ స్థానాల్లో మూడు మినహా తక్కిన చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో కంగుతినడం చంద్రబాబు వంతయింది. మొత్తంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురంలోనే ఈ పరిస్థితి ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీలో గతంలో లేని కొత్త సంప్రదాయాలు, పద్ధతులను చంద్రబాబు అవలంబిస్తున్నారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లోనే టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించి, ర్యాంకులను ప్రకటించారు. నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించి, ప్రజలను మరిచిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణకు అప్పట్లో మొదటి ర్యాంకు ప్రకటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారధికి చివరి ర్యాంకు ఇచ్చారు. ఆ తర్వాత 2016లోనూ సర్వే చేయించారు. సర్వే రిపోర్టులు బహిర్గతం చేయడాన్ని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోయారు. వాస్తవ పరిస్థితికి, ర్యాంకుల ప్రకటనకు చాలా వ్యత్యాసం ఉందని, కొంతమందికి టిక్కెట్టు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ర్యాంకులు ప్రకటిస్తున్నట్లుందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పార్టీ వివరణ ఇచ్చుకుని పార్టీ కార్యవర్గం, సమావేశాల నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చామని ప్రకటించింది. ఆ తర్వాత సర్వేలు చేయించినా.. ర్యాంకులు ప్రకటించకుండా గోప్యత పాటిస్తూ వచ్చారు. ‘అనంత’లో పార్టీ పరిస్థితిపై 2016లోనే ఆందోళన టీడీపీ బలంగా ఉన్న జిల్లాలలో అనంతపురానికి మంచిస్థానం ఉందని చంద్రబాబు భావిస్తూ వచ్చారు. 2016లో సర్వే రిపోర్ట్ చూసి కలవరపాటుకు గురయ్యారు. వెంటనే ‘అనంత’ ప్రజాప్రతినిధులతో పాటు సమన్వయకమిటీ సభ్యులను అమరావతికి పిలిచి సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితిపై 13 జిల్లాల్లో సర్వే చేయించానని, రాజధాని ప్రాంత పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాలలో పార్టీ బలపడిందని భావిస్తే సర్వే రిపోర్ట్‌లో 56, 61శాతం పార్టీ పరిస్థితి బాగోలేదని వచ్చి అవాక్కయ్యానని జిల్లా నేతలతో అప్పట్లో చంద్రబాబు చెప్పారు. కానీ అనంతపురం రిపోర్ట్ చూస్తే 90శాతం పైగా పార్టీ దిగజారిపోయిందని రిపోర్ట్ వచ్చిందని అప్పట్లో జిల్లా నేతలను హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీలో నేతల మధ్య విభేదాలతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని, తరచూ సర్వేలు చేయించి, పనితీరు బాగోలేని వారికి టిక్కెట్లు ఇవ్వనని బాహాటంగానే హెచ్చరికలు జారీ చేశారు. తాజా సర్వేతో మరింత దిగజారిన పార్టీ పరిస్థితి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత జూలైలో సీఎం స్వయంగా సర్వే చేయించినట్లు తెలిసింది. అయితే ఈ రిపోర్ట్ తాజాగా లీక్ అయింది. పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలకు సర్వే ఫలితాలు తెలిసిపోయాయి. 14 నియోజకవర్గాల్లో 11 చోట్ల పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని, 2016లోని సర్వేకు, ఇప్పటికి పోలిస్తే పార్టీతో పాటు నేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడైనట్లు తెలుస్తోంది. అనంతపురం పార్లమెంట్లో ఒక స్థానం మినహా తక్కిన ఆరు చోట్ల పార్టీకి ఓటమి తప్పదని తేలినట్లు సమాచారం. ఈ ఆరు స్థానాల్లో ఇప్పటికే నలుగురికి టిక్కెట్లు దక్కవని పార్టీ లీకులు కూడా ఇచ్చింది. ఆ జాబితాలో గుంతకల్లు, అనంతపురం, శింగనమల, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పుడు తక్కిన రెండు స్థానాల్లో ఎవరున్నారనే చర్చ జరుగుతోంది. మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి కాకుండా గుంతకల్లు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీతో పాటు జిల్లాలో కూడా చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి కూడా కాలవను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీపక్‌రెడ్డి నేరుగా విమర్శలు సంధిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తే రాయదుర్గం కూడా ఈ జాబితాలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పాటు మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్‌కు కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వరనే ప్రచారం ఉంది. ఇదే క్రమంలో తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు నియోజకవర్గంలో మునుపటి పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా పెద్దారెడ్డి నియామకం వారికి ప్రతికూలంగా మారింది. టీడీపీ జెండా మోసిన కాకర్ల రంగనాథ్, జగదీశ్వర్‌రెడ్డి, ఫయాజ్ లాంటి నేతలు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా పరిస్థితి గడ్డుగా ఉంది. ఈక్రమంలో జాబితాలో ఉరవకొండ, తాడిపత్రిలో ఏది ఉందనేది స్పష్టత రావాల్సి ఉంది. -
ఓటుపై వేటు
ఓటు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు. అలాంటి హక్కును అధికారులు, అధికార పార్టీ హననం చేస్తోన్నాయి. ఓటు వజ్రాయుధం అని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ప్రచారం చేస్తున్న అధికారులు నమోదైన ఓట్లను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారు. జిల్లాలో ఓట్ల తొలగింపు ప్రక్రియను చూస్తే అధికార యంత్రాంగం టీడీపీ ప్రభుత్వానికి సాగిలపడి తమవంతు సహకారం అందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అధికార టీడీపీ రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అన్ని అడ్డదార్లు తొక్కుతోంది. ఓటుపై వేటుతో కుటిల నీతికి పాల్పడుతోంది. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో పనిచేసే అధికారులను ఉపయోగించుకుంటోంది. జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపుతో టీడీపీ రాజకీయ అవినీతికి పాల్పడుతోంది. అది కూడా ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉండి 2014 ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లోనే అత్యధిక ఓట్లు తొలగించారు. ఒకటి కాదు రెండు కాదు జిల్లాలో ఏకంగా 2.50 లక్షల పైచిలుకు ఓట్లు తొలగించి అధికార పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపింది. ముఖ్యంగా నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లోనే 1.73 లక్షల ఓట్లు తొలగించడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఓటర్ల నమోదు, చేర్పులు, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా సాగింది. 2015 నాటికి సిద్ధం చేసిన తుది ఓట్లర్ల జాబితాతో పోలిస్తే 2018 మార్చిలో ప్రకటించిన తుది జాబితాకు భారీగా వ్యత్యాసం ఉంది. డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓట్లు, స్థానికంగా ఉండటం లేదనే రకరకాల సాకులతో జిల్లాలో భారీగా ఓట్లు తగ్గించారు. గతంలో వైఎస్సార్సీపీకి చెందిన నెల్లూరు నగర ఎమ్మెల్యే పి. అనీల్ కుమార్ యాదవ్, పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వామపక్షాల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యంతో సహా పదుల సంఖ్యలో ప్రముఖల ఓట్లు గల్లంతు అయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చిన క్రమంలో ప్రముఖుల ఓట్లు తిరిగి జాబితాలో చేరాయి. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు గానూ 7 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందింది. తాజాగా ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన తుది జాబితాలో కోవూరు, కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో స్వల్పంగా ఓట్లు పెరగ్గా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వేలల్లో తగ్గిపోయాయి. దీనిపై గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. 9 లక్షల జనాభాకు 3.33 లక్షల ఓటర్లు వాస్తవానికి నెల్లూరు నగరం, నెల్లూరురూరల్ నియోజకవర్గ పరిధిలో కలుపుకుని జనాభా 9 లక్షల పైచిలుకే ఉంటుంది. ఇది అధికారిక లెక్క. ఈ క్రమంలో 9 లక్షల జనాభా ఉంటే సగటున 60 శాతం జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే 5 లక్షల ఓట్లు ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా రెండు నియోజకవర్గాల్లో కలిపి 3.33 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నారు. 2015 నాటి తుది జాబితాలో నెల్లూరు నగరంలో 2,44,563 మంది ఓటర్లు ఉండగా, 2018 మార్చి తుది జాబితాలో 1,54,920 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 89,643 ఓట్లను తొలగించారు. అది కూడా వైఎస్సార్సీపీకి పట్టు ఉన్న డివిజన్లలోనే భారీగా ఓట్లు పోవటం గమనార్హం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2015లో 2,62,743 ఓట్లు ఉండగా 2018 మార్చి నాటికి 1,78,503 ఓట్లు మాత్రమే ఉన్నట్లు తుది జాబితా ప్రకటించారు. ఇక్కడ 84,240 ఓట్లు తొలగించారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నుంచి ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ నిర్వహించి ఈ ఏడాది మార్చి నాటికి తుది జాబితా ప్రకటించారు. ఈ క్రమంలో బూత్‌లెవల్ ఆఫీసర్లకు సమగ్ర అవగాహన లేకపోవటం, నగరంలో కొన్ని డోర్ నంబర్లు చిరునామాలు సక్రమంగా లేక గందరగోళంగా ఉండటం, అద్దె ఇల్లు మారే వారు ఉండటం తదితర కారణాలతో భారీగా ఓటర్లను తొలగించారు. అధికారులకు చిరునామా లభించకపోతే ఓటు గల్లంతయినట్లే. నగరంలో, రూరల్‌లో బీఎల్ఓలకు ప్రాంతాలు కేటాయించారు. బీఎల్ఓలకు కేటాయించిన ప్రాంతాలపై అవగాహన లేకపోవడంతో ఇది మా ప్రాంతం కిందకు రాదని, ఆ ప్రాంతం మా పరిధిలో లేదని ఇంటింటికి పరిశీలన సరిగా నిర్వహించలేదు. ప్రాంతాలపై అవగాహన లేని కారణంగా లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఆధార్, ఫోన్ నంబర్లతో ఓట్ల అనుసంధానం డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓట్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ ప్రతి ఓటును ఆధార్, ఫోన్ నంబర్లతో అనుసంధానం చేసింది. ఈ ప్రక్రియతో వీటికి చె క్ పెట్టే అవకాశం ఉంది. అడ్రస్‌ల మార్పులతో ఓట్ల ను తొలగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఓట్లను ఆధార్, ఫోన్ నంబర్లతో అనుసంధానం చేసినప్పుడు అందులోనే ఫోన్ నంబర్లు ఉంటాయి. అడ్రస్‌లు మారినప్పుడు ఆ ఓటును ఎక్కడికి మార్పు చేయాలనేది బీఎల్ఓలు గుర్తించి, మార్పులు చేర్పులు చేయొచ్చు. ఇందుకు భిన్నంగా అడ్రస్ మారితే.. ఓట్లు అడ్రస్ లేకుండా తొలగిస్తున్నారు. టార్గెట్ వైఎస్సార్ సీపీ కక్ష కట్టి తొలగిస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను కక్ష కట్టి తొలగించారు. గడిచిన కాలంలో ఎన్నడూ లేని విధంగా మా నియోజకవర్గంలో 84 వేల ఓట్లు తొలగించారు. ఇది దేనికి సంకేతం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి నీచ రాజకీయాలు సరికావు. అధికారులు మరోసారి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలి. నియోజకవర్గంలోని ఓటర్లు అందరూ కూడా ఒక్కసారి మీ ఓటు హక్కు నమోదు వివరాలను సరిచూసుకోవాలి. – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపు రాజకీయాలు సరికాదు ఓటు అనేది ప్రజాస్వామ్యం ద్వారా 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికీ లభించే హక్కు. దానిని కూడా రాజకీయం చేసి భారీగా ఓట్లు తొలగించటం దారుణం. 2014 ఎన్నికల సమయంలో నగర నియోజకవర్గంలో 2.41 లక్షల ఓట్లు ఉంటే ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన జాబితాలో 1.54 లక్షలు ఉన్నాయి. మా నియోజకవర్గంలో అత్యధికంగా 89 వేల పైచిలుకు ఓట్లు తొలగించారు. ముఖ్యంగా పార్టీకి బలం ఉన్న డివిజన్లలో ఓట్లు తొలగించారు. దీనిపై పోరాటం చేస్తాం. – డాక్టర్ పి.అనిల్ కుమార్‌యాదవ్, నగర ఎమ్మెల్యే ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం గ్రామాల్లో లేని వారు, డబుల్ ఎంట్రీలు ఉన్న ఓట్లు తొలగించడం జరిగింది. ఓటు నమోదుకు త్వరలో అవకాశం కల్పిస్తాం. అర్హులైన వారి ఓట్లు నమోదు చేస్తాం. 18 ఏళ్లు నిండిన అందరు ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెలలో ఓటర్ల జాబితా ప్రచురిస్తాం. అ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నుంచి ఓటు నమోదు చేపడతాం. ఓటు హక్కు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదా బీఎల్ఓ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు హక్కు నమోదు ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ప్రజలందరూ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకుని లేకపోతే దరఖాస్తులు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, డీఆర్ఓ -
దేశంలో అసమ్మతి సెగ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ రోజు రోజుకూ పెరుగుతోంది. పార్టీలో వర్గ విభేదాలు సమసిపోయేలా చేయాలని సీఎం ఎంత ప్రయత్నించినా సెగ రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఏం చేయాలో పాలుపోక సీఎం తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పశ్చిమ ప్రకాశంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఫార్ములాను అమలు చేయాలనుకున్న సీఎంకు ఇక్కట్లు తప్పడం లేదు. యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు సీఎంకు మరింత తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇక అద్దంకిలో తాజా రాజకీయ పరిణామాలు ప్రధానంగా కరణం బలరాం దూకుడుగా వ్యవహరిస్తుండడం సీఎంను మరింత ఇరుకును పెడుతోంది. పది రోజులుగా ఎమ్మెల్సీ కరణం బలరాం అద్దంకి రాజకీయాల్లో దూకుడు పెంచారు. నియోజకవర్గంలోని సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి, జే పంగులూరు మండలాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో జరిగిన సిమెంటు రోడ్లకు వరుస పెట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అద్దంకి నుంచి రాబోయే ఎన్నికల్లో తామే పోటీలో ఉంటామంటూ కరణం, ఆయన తనయుడు వెంకటేష్‌లు ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బలరాం తనదైన శైలిలో తాను పార్టీ మారినప్పుడు పదవికి రాజీనామా చేసి వచ్చానని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పదవికి రాజీనామా చేయకుండా పార్టీలు మారడం సరైన సంస్కృతి కాదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై పరోక్ష విమర్శలకు దిగుతున్నారు. కరణం, ఆయన తనయుడు వెంకటేష్‌ల దూకుడుతో సంతమాగలూరు, బల్లికురవ, అద్దంకి, జే పంగులూరు మండలాల్లో వారి అనుచరవర్గం తిరిగి బలరాం చెంతకు చేరుతోంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిన తర్వాత నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు ఆయనకే అప్పగించినట్లు సీఎం ప్రకటించారు. కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి అద్దంకి రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ పరిణామంతో బలరాం వర్గంలో చాలా మటుకు ఎమ్మెల్యే గొట్టిపాటి వైపు వెళ్లింది. ఆ తర్వాత బలరాం కుటుంబం కొద్ది రోజులు అద్దంకి రాజకీయాలకు దూరంగానే ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా బలరాం కుటుంబం అద్దంకి రాజకీయాల్లో జోక్యం పెంచి ఏకంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు దిగడం జిల్లా అధికార పార్టీతో పాటు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలరాం స్పీడు పెంచినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు కరణం వెంకటేష్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించేందుకు బలరాం సిద్ధమయ్యారు. తాము అద్దంకి నుంచి బరిలో దిగుతామని ఇప్పటికే వారు క్యాడర్‌కు సంకేతాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే పాత వర్గాన్ని మొత్తం తిరిగి తమవైపు తెచ్చుకునేందుకు దూకుడు పెంచినట్లు తెలు స్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అద్దంకి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గొట్టిపాటి ఉంటారా..? లేక లేక కరణం వెంకటేష్ ఉంటారా..? అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. అధికార పార్టీ క్యాడర్‌లోనూ ఇదే అనుమానం నెలకొంది. బలరాం దూకుడుతో పాత వర్గాలు తిరిగి ఆయన చెంత చేరుతోంది. అద్దంకిలో బలరాం తిరిగి జోక్యాన్ని పెంచడంపై గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌ల దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే బలరాం విషయంలో తెగేదాక లాగడం సరికాదని ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదే అదునుగా బలరాం కుటుంబం సైతం అమీ తుమీకి సిద్ధపడే పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థి గొట్టిపాటా... లేక తామా ... అన్నది తేల్చుకునేందుకు వారు వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ఎవరో ఒకరు పార్టీని వీడతారన్న ప్రచారమూ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎటువైపు మొగ్గుతారన్నది వేచి చూడాల్సిందే. చీరాల నియోజకవర్గంలో అసమ్మతి చాపకింద నీరులా కమ్ముకుంది. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను మాజీ మంత్రి పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆమంచి అవసరం రీత్యా ముఖ్యమంత్రి ఆయనకు ఇటీవల కాలంలో మరింత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే సునీత, పాలేటి రామారావులు ఆమంచికి పూర్తి స్థాయిలో మద్దతు పలికే పరిస్థితి లేదు. కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కదిరి బాబూరావు మార్పు తధ్యమని టీడీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదంటూ టీడీపీ అధిష్టానం ఇప్పటికే బాబూరావుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డికి టికెట్ ఇస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఇదే జరిగితే బాబూరావు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉందన్న ప్రచారమూ ఉంది. నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న కందుల నారాయణరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం టిక్కెట్టు ఇవ్వదన్న ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఈ నియోజకవర్గం నుంచి మరొక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం ఉంది. ఇదే జరిగితే కందుల వర్గం పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉందన్న ప్రచారమూ సాగుతోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన డేవిడ్‌రాజు అధికార పార్టీలోకి ఫిరాయించారు. టీడీపీ నేత మన్నే రవీంద్రతో పాటు పలువురు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ డేవిడ్‌రాజుకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని అధికార పార్టీ వర్గాలే పేర్కొంటుండడం గమనార్హం. దీంతో డేవిడ్‌రాజు సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ఇక సంతనూతలపాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన నేతలు మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ను వ్యతిరేకిస్తున్నారు. తమ కనుసన్నల్లో విజయకుమార్ నడవడం లేదన్న అక్కసుతో సదరు నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆయన తనయుడు లోకేషకు సైతం ఇక్కటి నేతలు విజయ్‌కుమార్‌ను మార్చాలంటూ పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఇక్కడి పరిణామాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. కొండపి నియోజకవర్గంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, ఆయన సమీప బంధువులు దామచర్ల పూర్ణచంద్రరావు, సత్యతోపాటు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ప్రభావం ఉంది. జనార్థన్ కొండపి ఎమ్మెల్యే స్వామిని వ్యతిరేకిస్తుండగా జనార్థన్ చిన్నాన్న, సోదరుడు స్వామికి మద్దతు పలుకుతున్నారు. దీంతో జనార్థన్ స్వామికి అడ్డుకట్ట వేసేందుకు జూపూడి ప్రభాకర్‌రావును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్టు ఇస్తారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. కందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు ఆ తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించడంతో పోతుల, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వర్గాల మధ్య సఖ్యత లేదు. ఇరువురు నేతలు బయటకు సఖ్యతగా ఉన్నా క్యాడర్ మధ్య విభేదాలు అలాగే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో పోతుల టీడీపీ టిక్కెట్ ఇస్తే దివి శివరాం వర్గం మనస్ఫూర్తిగా పనిచేసే పరిస్థితి లేదు. -
సీఎం రమేష్‌తో వేగలేం..!
సాక్షి ప్రతినిధి కడప: తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. ఎత్తుకు పైఎత్తులను కొనసాగిస్తున్నారు.ఎంపీ రమేష్‌ను నియంత్రించే ప్రక్రియ జోరందుకుంది. క్రమం తప్పకుండా ఫిర్యాదుల పరంపర చేపట్టారు. మొన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మంత్రి నారాలోకేష్ ఎదుట ఏకరువు పెట్టగా, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు రితీష్‌రెడ్డి కుండ బద్దలు కొట్టారు. ఇక సీఎం రమేష్‌తో వేగలేం.. కట్టడి చేయండి ..పార్టీ ఉన్నతి కోసం దశాబ్దాలుగా కృషి చేసిన కుటుంబాలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తినట్లు సమాచారం. జిల్లా టీడీపీలో రమేష్ ఓ వర్గానికి నాయకత్వం వహిస్తుండగా, మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మరో వర్గానికి అండగా నిలుస్తున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఈక్రమంలో ఒకరి కంటే మరొకరిది పైచేయి కావాలనే ఆరాటం అధికంగా కన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రాజ్యసభ సభ్యుడు రమేష్‌ను ఉద్దేశించి ‘పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’స్థాయి కల్గిన వ్యక్తిగా ఘాటుగా విమర్శించారు. వరద వాస్తవికతను బహిర్గతం చేయడంతో ‘తేలు కుట్టిన దొంగలా’మౌనం వహించాల్సిన పరిస్థితి రమేష్ వంతయింది. కాగా ఈ తతంగం వెనుక మంత్రి ఆది ఉన్నారని గ్రహించిన రమేష్ భారీ ఎత్తుగడ వేశారు. ఈక్రమంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఆమరణ దీక్ష తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఉక్కుదీక్షను సీఎం రమేష్ ఎంచుకొని రాష్ట్ర మంత్రి వర్గాన్ని తన దీక్షాశిబిరానికి రప్పించుకున్నారు. వెరసి ఆ దీక్షకు మంత్రి ఆది పడిగాపులు కాయాల్సిన పరిస్థితులను సృష్టించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రాజధానికి చేరిన ఫిర్యాదులు..ఎంపీ రమేష్ ఆమరణదీక్ష చేపట్టినంత కాలం జిల్లా టీడీపీ నాయకులు (మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మినహా) భుజకీర్తులు మిన్నంటాయి. ఆ కార్యక్రమం ముగియగానే యథావిధిగా ‘సిఎం రమేష్ స్థాయి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’నినాదం తెరపైకి వచ్చింది. మండలస్థాయిలో కూడా ప్రజా పరపతి లేని వ్యక్తి ఇష్టారాజ్యంగా చెలాయిస్తున్నారు, పార్టీని అడ్డుపెట్టుకొని ఆదాయం గడిస్తున్నారు, వర్గ విభేదాలు సృష్టిస్తున్నారంటూ పలువురు నాయకులు ఫిర్యాదు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇదే విషయమై అమరావతిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌కు కూలంకషంగా వివరించినట్లు సమాచారం. రమేష్‌ను కట్టడి చేయకపోతే జిల్లాలో టీడీపీకి పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సోమవారం సాయంత్రం అమరావతిలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు రితీష్‌రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. మా తాత బద్వేల్ వీరారెడ్డి చిత్తశుద్ధితో పార్టీ ఉన్నతి కోసం కష్టపడ్డారు. పార్టీ అడ్డుపెట్టుకొని ఆర్థికంగా సంపాదనపై దృష్టి పెట్టలేదు, వ్యక్తిగత పరపతి కోసం వర్గాలను సృష్టించలేదు, ఎంపీ రమేష్ జిల్లాలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారు, మాలాంటి వారు కూడా పార్టీలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొందని ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీని అడ్డుపెట్టుకొని లబ్ధిపొందుతూ పార్టీ కోసం పనిచేయడం లేదని, వ్యక్తిగతంగా జిల్లాలో రమేష్ ప్రజాపరపతి చాలా స్వల్పమని, కట్టడి చేయకపోతే కష్టమేనని తెలిపినట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడు సమక్షంలో ఎంపీపై ఫిర్యాదు చేయడంతో సీఎం ఆలకించినట్లు తెలుస్తోంది. గతంలో వాసుకు చెక్‌పెట్టిన ప్రతిఫలమే... టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిని మార్చాలంటూ గతంలో ఎంపీ రమేష్ దృష్టి సారించారు. ఆస్థానాన్ని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, లేదా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిలతో భర్తీ చేయాలనే దిశగా జోరుగా పావులు కదిపారు. ఈక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి కూటమిది పైచేయి కావడంతో రమేష్ ప్రతిపాదన తెరమరుగైందని పలువురు వెల్లడిస్తున్నారు. అందుకు ప్రతిగా రమేష్‌నాయుడు వైరి పక్షాన్ని ప్రోత్సహిస్తూ అధిష్టానం దృష్టికి నేరుగా ఫిర్యాదు వెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు పలువురు వివరిస్తున్నారు. పైగా సాగునీటి ప్రాజెక్టుల్లో రమేష్ దక్కించుకున్న కాంట్రాక్టుల వివరాలు చేపట్టిన పనులు, అందులో లభించిన ప్రతిఫలం రికార్డులతో సహా కొందరు మంత్రి నారా లోకేష్ దృష్టిలో పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి ఆది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎంపీ రమేష్‌నాయుడుకు చెక్పెట్టుతోన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలి
కడప కార్పొరేషన్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేసీ కెనాల్‌కు వెంటనే నీటిని విడుదల చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ . రఘురామిరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జురెడ్డిలతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 125ఏళ్ల చరిత్ర కలిగి బ్రిటిషు హయాంలో నిర్మించిన కేసీ కెనాల్‌కు నీరివ్వకపోవడం దురదృష్టకరమన్నారు. వర్షాలు లేక వేలాది ఎకరాలు బీళ్లుగా మారాయని, రైతులు నష్టాలపాలయ్యే సూచనలు కన్పిస్తున్నాయన్నారు. జిల్లాపై టీడీపీ ప్రభుత్వం ఎందుకింత కక్ష సాధిస్తోందో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలంలో 870 అడుగుల నీటిమట్టం ఉందని, అంటే సుమారు 150 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్‌కు నీరిస్తున్నామని చెప్పి టీడీపీ నాయకులు పది రోజుల క్రితం రాజోలి స్లూయిస్ వద్దకు వెళ్లి ఆర్భాటంగా నీటిని వదిలారన్నారు. టీడీపీ నాయకుల మాటలు విని రైతులు నారుమళ్లు వేసుకున్నారని, కుందూ పరివాహక ప్రాంతంలో నాట్లు నాటేందుకు సిద్దమవుతున్నారన్నారు. ఈలోపే ఉన్నట్టుండి నీరు ఆపేశారన్నారు. లక్ష ఎకరాల ఆయకట్టు ఉన్న కేసీ కెనాల్‌కు 2వేల క్యూసెక్కుల చొప్పున ఖరీఫ్ వరకు వదలాలని డిమాండ్ చేశారు. దీనిపై కర్నూలు సీఈకి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇరిగేషన్ మంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారన్నారు. పైర్లు ఎండిపోయాక నిర్ణయం తీసుకొని ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలంలో పుష్కలంగా నీరున్నప్పటికీ వదలకపోవడం సరికాదన్నారు. విద్యుదుత్పత్తి పేరుతో 40వేల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారని, నికర జలాలు కలిగిన కేసీకి ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఈ పరిస్థితి వస్తుందనే 2008లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2.95 టీఎంసీ సామర్థ్యంతో రాజోలి, 0.95టీఎంసీల సామర్థ్యంతో జొలదరాసి రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారన్నారు. వీటి నిర్మాణం పూర్తి చేయాలని ఎన్ని ఆందోళనలు చేసినా, దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెలుగోడు నుంచి 0–18 కీ.మీ వరకు కాలువలు సరిగా లేవని, ఆ పనులు పూర్తి చేస్తే తెలుగుగంగకు నీరు ఇవ్వచ్చన్నారు. దీనిపై తాము కర్నూలు ఐఓబీ సమావేశంలో చెప్పినా, అసెంబ్లీలో లేవనెత్తినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కడుపు కాలిన రైతులు ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. వెంటనే ఇరిగేషన్ మంత్రి సీఎంతో మాట్లాడి కేసీ కెనాల్‌కు 2వేల క్యూసెక్కులు, వెలుగోడు నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాలేరు నగరి, సర్వరాయసాగర్, వామికొండ, పైడిపాళెం రిజర్వాయర్లకు కూడా నీటిని విడుదల చేయాలన్నారు. వర్షాకాలం ఇంకా చాలా ఉందని, సాగునీటికి నీటిని వదలకుండా విద్యుత్ ఉత్పత్తికి తరలించడం ఎంతమాత్రం సరికాదన్నారు. పదివేల క్యూసెక్కులు విడుదల చేస్తే జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు నీరు వస్తాయన్నారు. నీటిని విడుదల చేయకపోతే రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. కేసీకి నీరిచ్చి రైతులను ఆదుకోవాలి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎస్ .రఘురామిరెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, నగర మేయర్ కె. సురేష్‌బాబు కోరారు. సోమవారం సాయంత్రం వారు జిల్లా కలెక్టర్ హరికిరణ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.అలాగే జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంపగుత్తగా తొలగించిన ఓట్లను మళ్లీ చేర్చాలని వారు కోరారు. ఈ విషయాలపై కలెక్టర్ స్పందిస్తూ ఇరిగేషన అ««ధికారులతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేస్తానని, ఓట్ల తొలగింపుపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
పార్టీ బలోపేతానికి పాటుపడండి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తిస్తే వైఎస్ఆర్ పాలనను వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో చూసుకోవచ్చని ఆ పార్టీ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. సోమవారం కర్నూలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి(ఎమ్మిగనూరు), నియోజకవర్గ సమన్వయకర్తలు మురళీకృష్ణ(కోడుమూరు), కాటసాని రామిరెడ్డి(బనగానపల్లె), కంగాటి శ్రీదేవి(పత్తికొండ), హఫీజ్‌ఖాన్(కర్నూలు), జగన్మోహన్రెడ్డి(ఎమ్మిగనూరు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌరు వెంకటరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నియోజకవర్గ నేతలు గంగుల బిజేంద్రారెడ్డి(ఆళ్లగడ్డ), ప్రదీప్‌రెడ్డి(పత్తికొండ), శిల్పా రవిచంద్రకిశోరరెడ్డి(నంద్యాల), పీఏసీ సభ్యుడు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేకపాటి గౌతంరెడ్డి హాజరై.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. భవిష్యత్‌లో పార్టీ అనుసరించాల్సి వ్యూహాలు, టీడీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ప్రణాళికలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పటిష్టం కోసం తీసుకోవాల్సిన చర్యలు, బూత్ కమిటీల నియామకాలు, జిల్లా, అనుబంధ కమిటీ పదవుల భర్తీపై సుదీర్ఘ చర్చ సాగింది. పార్టీ బలోపేతం కోసం ప్రజాప్రతినిధులు,ఇన్‌చార్జ్‌లు ఇచ్చే సలహాలు, సూచనలను అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని గౌతంరెడ్డి చెప్పారు. సమావేశం ప్రారంభానికి ముందు ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీ పేలుడులో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గౌతంరెడ్డి మాట్లాడుతూ..పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులకు తగు న్యాయం చేస్తామని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి నాయకులు, కార్యకర్తలు కీలకంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా బూత్ కమిటీలు పటిష్టంగా ఏర్పాటు చేసుకుంటే సగం విజయం వరించినట్లేనని చెప్పారు. బూత్ కమిటీల నియామకంలో నిర్లక్ష్యాన్ని పార్టీ అధినేత సహించరని, వారం, పది రోజుల్లో అన్ని బూత్ కమిటీలు, వాటికి కన్వీనర్లను ఎంపిక చేసి పార్టీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక్కో కార్యకర్త కనీసం 50 మందిని పార్టీ వైపు తీసుకొస్తే టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. హత్తిబెళగల్ క్వారీ ఘటనలో ప్రభుత్వ వైఫల్యాలే అధికంగా ఉన్నాయని, క్వారీని వెంటనే సీజ్ చేసి యజమాని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మరోసారి మోసం చేయలేరు
కడప కార్పొరేషన్: ఆరునెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాయిళాలు ప్రకటించి ప్రజలను మరోసారి మోసం చేయలేరని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు అన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం, రైల్వేకోడూరు, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎస్బి అంజద్‌బాషాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు 600లకు పైగా హామీలిచ్చారని,అందులో ఒక్క హామీ నెరవేర్చలేదని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు నిరుద్యోగ భృతి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ఒక కోటి 74లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, నెలకు రూ.2వేల చొప్పున 52 నెలలకు లక్షా 4వేల రూపాయలు ఒక్కో నిరుద్యోగికి ఈ ప్రభుత్వం బకాయి పడిందన్నారు. 52నెలలు పట్టించుకోకుండా రాబోయే నాలుగు నెలలు రూ.1000ల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తే హామీ నెరవేర్చినట్లు అవుతుందా అని సూటిగా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని రాష్ట్రంలో 87,500కోట్లు రైతు రుణాలు ఉంటే కేవలం 11వేల కోట్లు ఇచ్చి మాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో లక్షా 85వేల ఉద్యోగ ఖాళీలుంటే అందులో కేవలం 20వేల బ్యాక్లాగ్ ఔట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏడాది బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేశారని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక 5లక్షల మంది కడుపు కొట్టి వారిని ఇంటికి సాగనంపిందన్నారు. ఎన్నికల ముందు ఐదువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు కేవలం రూ.500కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెబుతున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు చేరువ అవుతూ తమ ప్రభుత్వం ఏర్పడితే ఆయా వర్గాలకు ఏమేం చేస్తుందో వివరిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. దీంతో జగన్ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారని, దీన్ని చూసి సీఎం చంద్రబాబు బెంబెలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌కు భయపడే ప్రభుత్వం తూతూమంత్రంగా ఎన్నికల తాయిళాలు ప్రకటించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తమను మోసం చేశారని ప్రజలంతా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారని, ఇలాంటి కంటితుడుపు చర్యలతో వారిని మరోసారి మోసం చేయలేరని హెచ్చరించారు. సీఎం కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి తన పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. అవి అన్నక్యాంటీన్లు కావని ఎన్నికల క్యాంటీన్లు అని, అది నిరుద్యోగ భృతి కాదు ఎన్నికల భృతి అని ఎద్దేవా చేశారు. ప్రజలు తిరస్కరిస్తారనే పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించలేదని విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యే అధికారుల్ని అసభ్య పదజాలంతో దూషించడం, మరో ఎమ్మెల్యే నియోజకవర్గంలో పాత నేతల్ని కలుపుకోకుండా పనిచేయడం వంటి ఘటనలపై జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గురువారం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్, తహసీల్దార్‌పై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఒక దశలో రాస్కెల్ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ ఘటనపై రెవెన్యూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో సీఎం చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నాం. ఇదే పద్ధతిలో ఉంటే ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. పద్ధతి మార్చుకోండి. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్న తరుణంలో వాటిని సరిదిద్దుకోకుండా కొత్త వివాదాలు తీసుకు వచ్చి పార్టీ ప్రతిష్టను దిగజారుస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీరుపైనా సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జెడ్పీటీసీ సభ్యుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డికి, పోలంరెడ్డికి మధ్య వివాదం నెలకొని ఉంది. కోవూరులో గ్రామదర్శిని కార్యక్రమంలో వీరిద్దరి మధ్య వివాదం ముదిరిపాకన పడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పోలంరెడ్డి చేజర్ల వర్గానికి చెందిన బూత్ కమిటీ కన్వీనర్లను తొలగించి ఆయన సొంత మనుషులను నియమించుకున్నారు. గ్రామదర్శిని కార్యక్రమానికి పాత నేతలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. దీనిపై చేజర్ల వెంకటేశ్వరరెడ్డి సీఎంతో పాటు పార్టీ ముఖ్యులు అందరికీ ఫిర్యాదు చేశారు. దీంతో బూత్ కమిటీలు అన్నింటిని రద్దు చేశారు. ఎమ్మెల్యే వ్యవహర శైలి సీఎం వద్ద చర్చ సాగిన క్రమంలో ఎమ్మెల్యే పోలంరెడ్డిని తీరు మార్చుకుని అందర్నీ కచ్చితంగా కలుపుకెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. ఆత్మకూరు రగడపై సీఎంకు నారాయణ ఫిర్యాదు మరో వైపు ఆత్మకూరు నియోజకవర్గ రగడపై మంత్రి పి. నారాయణ సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆత్మకూరు తాత్కాలిక ఇన్చార్జిగా ఆదాల ప్రభాకరరెడ్డిని పార్టీ నేతలు చర్చించుకుని సీఎం ఆమోద ముద్రతో ప్రకటించారు. మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఆత్మకూరులో పార్టీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించి ప్రకటించారు. అయితే అక్కడి స్థానిక నేత కన్నబాబు వీటితో నిమిత్తం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మద్దతుగా ఉన్నారు. కొందరు నేతలు ఆత్మకూరులో పార్టీ క్యాడర్‌ను గందరగోళానికి గురి చేస్తున్నారని నారాయణ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
స్పీకర్, డిప్యూటీ సీఎంలకు సుప్రీం నోటీసు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారంలో తమిళనాడు స్పీకర్ ధనపాల్, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సహా 11 మంది ఎమ్మెల్యేలకు సోమవారం సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు 4వారాల్లోగా బదులివ్వాలని ఆదేశించింది. పళనిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత విశ్వాస పరీక్ష తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వంతోపాటు ఆయనకు మద్దతుగా ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఆ 11 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద అనర్హతవేటు వేయాలని డీఎంకే విప్ చక్రపాణి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ నిర్ణయంలో తలదూర్చలేమని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో చక్రపాణి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సైతం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. -
అవిశ్వాసం ఆపేయండి!
సాక్షి, పెద్దపల్లి: రామగుండం అవిశ్వాస రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది. టీఆర్ఎస్ అధిష్టానం అవిశ్వాసాన్ని ఆపేయాలంటూ అల్టిమేటం జారీచేయగా, హైకమాండ్ ఆదేశానికి కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సూచించారు. అయితే అవిశ్వాసం నోటీసు ఇచ్చాక ఇప్పుడు వెనక్కి తగ్గేదిలేదని, ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గిస్తామని, లేదంటే తమ కార్పొరేటర్ పదవులకైనా రాజీనామా చేస్తామని టీఆర్ఎస్ కార్పొరేటర్లు తెగేసి చెప్పారు. దీంతో రామగుండం అవిశ్వాసం రాజకీయం రసకందాయంలో పడింది. ఎమ్మెల్యేకు కేటీఆర్ ఫోన్ రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై టీఆర్ఎస్ హైకమాండ్ మండిపడింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు ఫోన్‌చేసి అవిశ్వాసం నిలిపివేయాలని ఆదేశించారు. అవిశ్వాసం పెట్టడం పార్టీ విధానం కాదని, వెంటనే అవిశ్వాసం నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ సందర్భంగా రామగుండం పరిస్థితిని వివరించడానికి ఎమ్మెల్యే ప్రయత్నించినా కేటీఆర్ వినిపించుకోలేదని విశ్వసనీయంగా తెలిసింది. ‘‘అవిశ్వాసం ఆపేస్తారా...అవిశ్వాసం లేకుండా ఆర్డినెన్స్ తీసుకురమ్మంటారా’’ అని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎంకు మేయర్ల ఫిర్యాదు పార్టీ అధిష్టానం అకస్మాత్తుగా అవిశ్వాసం వ్యవహారంపై దృష్టిపెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు కారణమని సమాచారం. శనివారం హైదరాబాద్‌లో మేయర్లు, కమిషనర్ల సమావేశం జరిగింది. సమావేశానికి రామగుండం మేయర్ లక్ష్మీనారాయణ సహా, ఆరుగురు మేయర్లు హాజరయ్యారు. సమావేశం పూర్తయ్యాక, ఆరుగురు మేయర్లు సీఎం కేసీఆర్‌ను కలిసి రామగుండం మేయర్‌పై సొంత పార్టీయే అవిశ్వాసం పెట్టిందంటూ ఫిర్యాదు చేశారు. స్పందించిన కేసీఆర్ అవిశ్వాసం పెట్టడమేంటంటూ అసహనం వ్యక్తం చేశారని, వెంటనే తన రాజకీయ కార్యదర్శి నరసింహారావు, మంత్రి కేటీఆర్‌లకు ఈ విషయంపై పురమాయించినట్లు సమాచారం. ఈక్రమంలోనే కేటీఆర్, నరసింహారావులు ఎమ్మెల్యే సత్యనారాయణకు ఫోన్‌చేసి అవిశ్వాసాన్ని ఆపేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధిష్టానం చెప్పింది వినండి: ఎమ్మెల్యే అవిశ్వాసం నిలిపివేసి...కలిసి పనిచేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించింది..అధిష్టానం సూచనను కార్పొరేటర్లంతా పాటించాలి...అంటూ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో టీఆర్ఎస్కు చెందిన 30 మంది కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్ ఫోన్‌చేసిన విషయాన్ని వివరించారు. ఇంతటితో ఈ వ్యవహారాన్ని ఆపేయాలని కార్పొరేటర్లకు చెప్పారు. వెనక్కి తగ్గేది లేదు: కార్పొరేటర్లు అవిశ్వాసంపై వెనక్కి తగ్గేదిలేదు. నోటీసు ఇచ్చాక..ఇప్పుడు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.స్టాండింగ్ కమిటీ ఎన్నికలప్పుడు లేని హైకమాండ్ ఇప్పుడే వచ్చిందా? మేం అవిశ్వాసానికే కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గిస్తాం. లేదంటే మా కార్పొరేటర్ పదవులకే రాజీనామా చేస్తాం. అంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు తేల్చిచెప్పారు. పార్టీ అధిష్టానం వైఖరిని ఎమ్మెల్యే చెప్పినా.. కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. ఒకదశలో ఎమ్మెల్యేను సైతం ధిక్కరించారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాసాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. రాజకీయం రసవత్తరం అవిశ్వాసం ఆపేయాలని అధిష్టానం ఆదేశించడం...ఎమ్మెల్యే చెప్పినా...కార్పొరేటర్లు ససేమిరా అనడంతో రామగుండంలో రాజకీయం రసవత్తరంగా మారింది. నాటకీయ పరిణామాలతో అవిశ్వాసం రోజుకోమలుపు తిరుగుతోంది. పార్టీ వైరి వర్గాల ఎత్తులు, పై ఎత్తులతో రాజకీయ చదరంగం రక్తికడుతోంది. -
రేపు మూడో జడ్జీ ముందుకు ఎమ్మెల్యేల అనర్హత!
సాక్షి, చెన్నై : తమిళనాడులో దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసు బుధవారం మరోసారి విచారణకు రానుంది. ఈ కేసులో ఇద్దరు జడ్జీలు పరస్పరం వేర్వేరు తీర్పులు వెలువరించడంతో మూడో జడ్జి ముందుకు కేసు బదిలీ అయిన సంగతి తెలిసిందే. మూడో జడ్జి సత్యనారాయణ బుధవారం ఈ కేసును విచారించనున్నారు. దినకరన్ గూటికి ఫిరాయించిన 18మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత వేటు చెల్లుతుందా? లేదా అనే దానిపై న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ వెలువరించే తీర్పు కీలకం కానుంది. ఆయన తీర్పు ఆధారంగా తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారనున్నాయి. గతంలో ఈ కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం భిన్నాభిప్రాయాలతో వేర్వేరు తీర్పులను వెలువరించిన్న సంగతి తెలిసిందే. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో స్పష్టమైన తీర్పు వెలువరించకపోవడంతో ఈ కేసులో అనిశ్చితి తొలగిపోలేదు. దీంతో ఈ కేసు విచారణను మూడో జడ్జికి బదలాయించారు. ఇక గతంలో తీర్పు ఇచ్చిన జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ.. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని పేర్కొనగా.. స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం వేరుగా తీర్పునిచ్చారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టు అయింది. 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు పళనిస్వామి ప్రభుత్వ మనుగడకు విషమ పరీక్షగా మారిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు ఎలా వచ్చినా పళనిస్వామి ప్రభుత్వానికి సంకటం తప్పదన వాదన వినిపించింది. గత సెప్టెంబర్‌లో పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అధికార అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దుచేసిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే విప్‌కు వ్యతిరేకంగా శశికళ అక్క కొడుకైన దినకనర్‌కు మద్దతు తెలుపడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే, స్పీకర్ నిర్ణయంపై వేటు పడిన ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. -
నిత్య రాజకీయం!
పరిగి: పరిగి నియోజకవర్గం గత కొంతకాలంగా పొలిటికల్ వార్‌కు వేదికవుతోంది. పల్లెలో రాజకీయ వేడి రాజుకుంది. ఆకర్ష ఎన్నికల పేరుతో అధికార, ప్రతిపక్షాలు చేపడుతున్న చేరికల కోలాహలం సగటు మనిషికి వెగటు పుట్టిస్తోంది. ఎక్కడైనా కేవలం ఎన్నికల సమయంలోనే చేరికలు కనిపించేవి. కానీ ఇక్కడ మాత్రం నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, అధికార టీఆర్ఎస్ తరఫున రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ కొప్పుల మహేశ్‌రెడ్డి ఒకరితో ఒకరు పోటీ పడుతూ.. గ్రామాల్లో పర్యటిస్తూ రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. దీంతో పరిగి ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంటోంది. చేరిన వారే మళ్లీ మళ్లీ... గతంలో కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే ఆయా పార్టీల నాయకులు చేరికలను ప్రోత్సహించే వారు.. కానీ ఇక్కడ నెలకొన్న పోటీ కారణంగా నిత్యం ఏదో ఒక చోట ఆయా పార్టీల్లో చేరే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో కేవలం ఆయా గ్రామాల్లో, మండల స్థాయిలో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు మాత్రమే పార్టీలు మారుస్తుండేవారు. కానీ ప్రస్తుతం ఇది కార్యకర్తలు, ఓటర్ల వరకు వచ్చింది. నాయకులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే పార్టీ రంగు పరిమితమయ్యేది. ప్రస్తుతం మాత్రం గడపగడపకూ రాజకీయ రంగు పులుముతున్నారు. గ్రామంలోని ప్రతీ ఇంటికీ ఏదో ఓ పార్టీ రంగు రుద్దుతున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఏదో ఒక పార్టీ రంగు కనిపిస్తుంది.. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాలన్నీ పార్టీల ప్రాతిపదికన చీలిపోతున్నాయి. చాలా సందర్భాల్లో చేరిన వారే మళ్లీ మళ్లీ ఒక పార్టీని విడిచి మరో పార్టీలోకి మారుతున్నారు. పని కావాలంటే చేరండి.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలు మొదలుకుని స్థానిక ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీల వరకు తమ నియోజకవర్గ అధి నాయకత్వం మెప్పుకోసం చేరికలను ప్రోత్సహించే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్లు, ప్రజలు వారి వద్దకు వచ్చి ఏ చిన్న పని కావాలన్నా.. ముందు మా పార్టీలో చేరండి.. అప్పుడే పనులు చేస్తామని మెలిక పెడుతున్నారు. వారికి కావాల్సిన పని చేసి పెట్టడం దేవుడెరుగు కానీ... పని కావాలని వెళ్లిన మరుసటి రోజే వారి మెడలో కండువా వేసి పార్టీ రంగు పులుముతున్నారు. రోజురోజుకు సగటు మనిషి పై.. సాధారణ ఓటరుపై కూడా చేరికల కోసం ఒత్తిడి పెరుగుతోంది. గ్రామాల్లో ఉండే ప్ర తీ యువజన, కుల సంఘాలకు సైతం పార్టీ రం గు పులుముతూ తమ జెండాలకు జై కొట్టిస్తున్నారు. సంక్షేమం, చట్టాల అమలులోనూ.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా.. ఏదో ఒక పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సిందే. పార్టీల రంగు మరకలంటకుండా సంక్షేమ పథకాలు, కార్పొరేషన్ రుణాలు అందుతాయని కలలో కూడా ఊహించలేని పరిస్థితి నెలకొంది. చాలా వరకు రాయితీ ట్రాక్టర్ల పంపిణీ, ఇతర యంత్ర పరికరాల అందజేతలో అధికార, ప్రతిపక్షాలు ఫిఫ్టీ అనే తరహాలో తమ నాయకులు, కార్యకర్తలకు వీటిని కట్టబెట్టాయి.. తప్ప ఏ ఒక్క చోట పార్టీతో ప్రమేయం లేకుండా లబ్ధి చేకూరిన దాఖలాలు కనిపించటంలేదు. ఇక చట్టాల అమలు విషయంలోనూ ఇరు పార్టీల ఒత్తిడులు తప్పటంలేదు.. ప్రతీ కేసు విషయంలో చట్టాలను అమలు చేసే వ్యక్తులపై తీవ్ర ఇత్తిడి తెస్తున్నారు. ఈ తరుణంలో ప్రస్తుత పరిణామాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.