♦ ఎమ్మెల్యేల చేరికతో టీడీపీలో ఇంటిపోరు
♦ కొత్తవారికే ప్రాధాన్యం అంటూ జోరుగా ప్రచారం
♦ అంగీకరించేది లేదంటున్న పాత నేతలు
♦ ఎటూ తేల్చని అధిష్టానం.. ఇన్‌చార్జిలెవరో చెప్పని వైనం
♦ నెలాఖరుకు క్లారిటీ ఇస్తామంటూ సంకేతాలు
♦ పాత నేతల్లో ఉత్కంఠ.. కార్యకర్తల్లో ఆందోళన
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొత్తగా అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యతనిస్తారని ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఆ పార్టీ పాత నేతలు అమీ..తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దశాబ్దాలుగా పార్టీ కోసం జెండాలు మోసిన వారిని కాదని కొత్త నేతలను అక్కున చేర్చుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో జిల్లా పచ్చ పార్టీలో విభేదాలు పతాకస్థాయికి చేరాయి. ఇరువర్గాలు క్లారిటీ కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచాయి. నెలాఖరు నాటికి స్పష్టత ఇస్తామని అధిష్టానం ఇప్పటికే సంకేతాలు పంపింది. ఈ పరిస్థితుల్లో అధిష్టానం పాత నేతలకు ప్రాధాన్యతనిస్తుందా... కొత్త ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేస్తుందా... అన్న అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
పెత్తనం కోసం పోరు..
రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టేందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు మొదట్లో చంద్రబాబు పాత నేతలకు నచ్చజెప్పారు. ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున ప్యాకేజీ ముట్టజెప్పిన నేపథ్యంలో వారిని అంత వరకే పరిమితం చేస్తారని పాత నేతలు భావించారు. మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యం ఉంటుందనుకున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జులుగా తమనే కొనసాగిస్తారని భావించారు. పెత్తనం తమదేననుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు అధికారుల బదిలీ వ్యవహారం తమ చేతుల మీదుగానే జరుగుతుందనుకున్నారు. 30 ఏళ్లుగా జెండాలు మోసిన వారికి బాబు అన్యాయం చేయడని నమ్మారు.
పాత నేతలకు మింగుడు పడని సీఎం తీరు..
కొత్తగా పార్టీలో చేరిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజుల రాకను ఆయా నియోజకవర్గాల పాత నేతలు బహిరంగంగానే వ్యతిరేకించారు. వారిపై బహిరంగ విమర్శలకు దిగారు. దీంతో ముఖ్యంగా గిద్దలూరు, అద్దంకిలలో వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరాయి. ఒంగోలులో జరిగిన జిల్లా మినీ మహానాడులో కరణం, గొట్టిపాటి వర్గాలు ఏకంగా దాడులకు దిగడం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే గిద్దలూరు నియోజకవర్గంలో అన్నా రాంబాబు, ముత్తుముల అశోక్‌రెడ్డి వర్గాలు పరస్పర దాడులకు దిగి కేసులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇరువర్గాలు అధిష్టానంకు ఫిర్యాదు సైతం చేసుకున్నారు. పచ్చ పార్టీ వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో రాబోయే కాలంలో పాత వారిని పక్కన పెట్టి చంద్రబాబు ఎమ్మెల్యేలకే ప్రాధాన్యతనిస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మద్ధతు పలుకుతున్న ఓ వర్గం దీనికి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు అధికారుల బదిలీల్లోనూ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. ఇది పాత నేతలకు మింగుడు పడటం లేదు. వారు దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు. ఇదే జరిగితే టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం అమీతుమీకి సిద్ధపడతారన్న ప్రచారం జరుగుతోంది. బలరాంకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టి గొట్టిపాటికి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతుంది. ఇదే జరిగితే ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కరణం వెంకటేష్‌ను పక్కన పెట్టినట్లే. దీనికి కరణం అంగీకరిస్తారా.. అన్నది ప్రశ్న.
సీఎం, చినబాబుపై ఒత్తిళ్లు..
ఇక గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును పూర్తిగా పక్కన పెట్టి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి అన్ని అధికారాలు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే అన్నా రాంబాబు సైతం అటు ఇటు తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు కందుకూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పోతుల రామారావుకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో సీనియర్ నేత దివి శివరాం చేతులు ముడుచుకొని కూర్చొనే పరిస్థితి కనిపించటం లేదు. శివరాం సైతం అమీతుమీకి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌చార్జులు ఎవరో.. అధికారాలు ఎవరివో.. తేల్చాలంటూ పాత, కొత్త నేతలు అటు ముఖ్యమంత్రి, ఇటు చినబాబు లోకేష్‌లపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి నాటికి క్లారిటీ ఇస్తామని అధిష్టానం చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే..!